దేశి సాహిత్యము స్త్రీల పాటలు శ్రీపారుజాత పల్లవి
శ్రీపారుజాత పల్లవి
శ్రీకృష్ణుండొకనాడూ శృంగారాహారుండై
శ్రీకాంతామణి నగరుకువచ్చెను చెలువముతోడుతనూ
యేకాంతమ్ముననుండీ యింతులు తా నాడగనూ
ఆకస్మికముగ నారదుడను వక కుచ్చిత ఋషియు నేతెంచే
వచ్చిన నారదుజూచీ వనితలు తానూ మ్రొక్కి
అచ్యుతుడూ నారదుడూ ఉండిరి ఆసీనంబులనూ
కుచ్చితుడై నారదుడూ కృష్ణుడికొక కానుకగా
కుసుమపు పువు చిగురాకున పొదిగియిచ్చెను వేడుకను
అది స్వామీ అందుకు కన్నులనద్దుకు మ్రొక్కీ
కలహంబని మదితలచి - వెన్నుడు రుక్మిణికిచ్చెను వేడుకతో
ఆమగువా వేగముగా అందుకుని నవ్వుచు
వినయముతోడుత తనపతి కంత వినుతులుచేసెను
శరణు శరణు కృష్ణా శరణు శ్రీగోపాల హరీ
శరణు కనకాంబర గిరిధర శరణు శరణుదేవా
మిన్నందిన వేగమునా మేలుకై వొప్పెను
ఆమగువంతట కొప్పునముడుచుక అత్యాశ్చర్యముతోను
తనదేహం వక వింత చాయలు మెరయగను
చెల్వరు మెల్వరు యెంతచల్వమో కాంతా లోచనకూ
తలకురులూ వకవింతా మేలుగ నలుపులుయెక్కే
అరుదుగ కోమలి వడలికి వక వన్నధికమయ్యితోచె
శుకవాణీ యీపువ్వుచోద్యం అకలంకముగా వినుమీ
వికసించుండును వాడదు యెన్నడు విడి వాసనచెడదూ
వకయేడూ యీపూవు వనరుగ నీవద్దవుంటే
సకలమైన వస్తువులనూ సమకూర్చుకు వుండూ
అని నారదముని ఆడినవాక్యములన్నీ
వినయముతోడుత సత్యభామకు వినిపించిరి చెలులూ
యేమని చెప్పుదుమమ్మా యింతిరో నీ మగనికీ
నారదుడొచ్చి పారుజాతమ్ము వనరుగయిచ్చెగదే
సామజవరదుడు రుక్మిణికా పువు సరగునయిచ్చెగదే
ఆమగువా ఆపువ్వందుకు వేగమునా
నవ్వుచు తన కొప్పున ముడుచుకు సొంపుననుండె గదే
తరుణులు జెప్పినమాట నెలత సుగంధి విని
సరగున అపుడు కోపముతోటి తరుణుల కిట్లనెనూ
సరసిజాక్షులారా సర్వజ్ఞుండని యెరిగి
యెలమీ నడుపుకు వస్తీ యిందరి సవతులలోపలనూ
నాకంటెక్కువ అనితలచెన రుక్మిణినిపుడు
అని తలకాయను బిగియించి తరుణి మౌనముచేత
సొలయుచు నవరత్నమ్ములు కలసిన సొమ్ములు సళ్ళీంచె
చెదిరినకొప్పటువిడిచి - శిధిలముగా ముడుచుకొని
సొలయుచు నవరత్నమ్ములు కలసిన మందిరములు దాటీ
పూరింటిలో నొక్కా కీలడుగు మంచముపయి
చీరొక్కటి పరుచుకు పవళించెను శ్రీహరులనుదలచీ
వారిజలోచనుడంతా కోపందీర్చా భావకు
డయి చనుదెంచెను తనభామా గృహమునకూ
భక్తుల వాకిట నుంచీ సరగున లోపలి కేగీ
కనకపుమేడలు రంగస్తలములు కలసివెతుక దొడగే
మెత్తనిపానుపు వెదకే - మేడామడుగులు వెదకే
చిత్తరుచవుకెలు వీక్షింపుచు తనచిత్తము కిట్లనెనూ
కలహంసలు నడువవుగా కలియరు యింతులురారూ
అమర మృదంగము తంతులుబట్టరు హరుబాడగరారూ
యిన్నాళ్ళావలెలేదు సుదతీ మందిరమేమొ
చిలుకకు పద్యంజెప్పదు కోవెల కెలమియ్యదు ఫలమా
యెలమీవేళలా పనులూ శాయదు పంకజముఖి కేమీ
సిరిముఖమేమో చిన్నబోయున్నది చెలియతో టెవరయినా
పన్నుగముని దెచ్చినయా పారుజాతపూ మాట
విన్నపములు జేసిరి కాబోలు మావెన్నెల మొలకకునూ
అనుచూ మందరధరుడు అలసీవెతుకగ
కనకపుమేడలు రంగస్తలములు కలసివెతకిఅలసె
వనితలమాటలు చెవులావిని వూగ్రుండయిపోయీ
వనజనాభుడు కూర్మితో సఖియ వెనుకతాను నిలచె
మాళవిదేవి విసరేటి మగువచేత సురటీ
మౌనముతోడుత మురవైరందుకు మత్స్యాక్షికి విసరే
ఆ నళినాక్షుండపుడూ ఆత్మలో నగుచునూ
పూబోణిమీదను పన్నీరప్పుడు చల్లంగాదొడగే
ఇందాకా లేనింట్లో యీవింతా వాసనలూ
యెందుండేతెంచెను లేకనుచును యింతి తా మేల్కనెనూ
పల్లవాధరులంత పయ్యెదలార్చుకొనుచూ
ఉల్లముబోవుట నయనము బల్కుట బుద్ధిగాదెచెలియా
పున్నమచంద్రునిబోలు మురిపెంపు నీమోము
చిన్నబోయున్నా కారణమేమే చిగురుబోడి చెపుమా
బంగారు తీగెకంటె బాగయిన నీమేను
కలికందులు కందిన కారణమేమే కాంతారో చెపుమా
తమలపాకులవంటి తరుణి నీహస్తములూ
చిరిచెమటలు బట్టిన విధమేమే చిగురుబోణీనీకూ
చిగురుటాకుల వంటి చెలువంపూ పాదములూ
వశిగాళ్ళాడేటీ కారణమేమే వనితరో నీకనెనూ
శింగిణి విల్లులబోలూ మురిపెంపు నీకనుబొమలూ
పొంగున్నవి తల నొప్పింతువుగదవే
లలితాంగి అప్పటివేళా బట్టి గొప్పా కన్నులనీరూ
కుప్పలుగా పూరించెను రెప్పలనద్దుకోవె
ఇంతాజేసీ విభునీ యేమిశాయగా గలవే
ఇంతులకింతేసి పంతము లేటికే - ఇందువదన చెప్పవే
కాంతరో పతితో కలహంబేటికి కంబుకంటి లేవే
వనితా లేలెమ్మనుచూ వూరడించి వక వనజగంధిలేపె
నాతులారామీరు నగధరునివారు గాదా
ఈ వగలెక్కడ నేర్చిరనుచూ వనితలదిట్టుచునూ
అకలంకీ నీదేహం అలయించుకునేవేమే
కమలాక్షుల మాటలువిని నాపయికరుణ దప్పనేలే
మదిరాక్షీ జనులాడే మాటలకూ వెరచీ యీపువ్వూ
మొఖమాటమ్మున ఇచ్చితిగానీ మోహమ్మునగాదే
నీవాణ్ణిగానటనే నీకూ తప్పితినయినా
నీపంపే వచ్చితినిపుడూ నీబంటను గానా
పద్మానాభుండపుడూ సత్యాభామపాదముపై
వరిగెను భామలు అప్పుడు సిగ్గులతోడుతనూ
ముఖచంద్రులేవురునూ మైదూలోపలదాగి
అతివలుజూడగ అప్పటివేళల అతిసంతోషముతోనూ
చిగురుటాకులవంటి చెలువగు పాదములా
నగమెట్లు దన్నితిరి మీరూ మందరగిరిధరా
నెట్టన మందరగిరి మోశినట్టి గట్టితలలూ
ఇంత మృదువగుటకు కారణమేమో మారజనక చెపుమా
అనుచూ పాదములొత్తి అతివలు సేవలుశాయా
మనసిజ గురుడూ సంతోషమ్మున కలియ నవ్వుచూనూ
వక్కాపువ్వూ యింతికి నీ వొసగితి గాకా యికనూ
చక్కని పారిజాతం కొనితెస్తును సరసవనములోదీ
యెక్కువతో నాటింతూ నీపూలవనములోనూ
అని హరిబల్కగ యింతీ గ్రక్కునా లేచీ
మక్కువతోడుత శాక పాకమ్ములు మరిసేయూమనెనూ
జలకమాడి వక్కా సన్నావలిపెంగట్టి
అలికులవేణి రత్నాభరణములన్నీ ధరియించె
చెదిరిన కొప్పును ముడిచీ సందిటి దండలు భుజముల
మెరయగ సందడి సేయుచు పంపులు పెట్టుకు జనులూ
పాకయత్నములు శాయా సంపెగతైలము కృష్ణునికంటెను సత్య
భామదేవీ అలరుచు గంధము అలదీ మలయుచు మేనునూలచే
జలకములార్చి వలిపెములిచ్చెను తన పతికంతటనూ
తెల్లని వస్త్రముచే తళ్ళువత్తుకొనుచూ
పీతాంబ్రమ్ములు ధరియించెను ఆ శ్రీకృష్ణుండపుడూ
వల్లెవాటుచెంగూ భామపయి వొప్పుగానువేసి
బంగరు కుర్చీలమీద బాగుగ గూర్చుండిరీ
సంధ్యావందనము వేళ లాయెనని సఖియలతో బలుకా
బంగారు కలశలతో బాగైన వుదకములు దెచ్చిచ్చిరీ
తిరుమణి శ్రీచూర్ణమ్ముల బాగాతీర్చిదిద్దుకొనిరి
పరిమెళములు స్వామి బాగా నలదుకొని
బంగారుపళ్ళేరములో పంచా బక్షాన్నములూ
పూర్ణముల మరగ వేడుకతో పరమాన్నము వడ్డించిరీ
పూర్ణేందులంతటనూ సంపూర్ణముగ వడ్డించిరీ
పరిపూర్ణముగా భుజియించి లేచిరీ పురుషోత్తములపుడూ
ఆకుమడుపులిచ్చె మంచీ అత్తరు జవ్వాదిచ్చె
మల్లెలు మొల్లలు విరజాజులు తానిచ్చె సత్యభామా
తన వాహనమయినా గరుడిని ముదముతో బిలువగనూ
కనకపు రెక్కలు విసరుచు చక్కని గరుడుడు వచ్చెనయా
గోవిందాకృష్ణ హరి గోపాలా గోవర్ధన
గిరిధర వామన కేశవ శ్రీధర శ్రీహరియనుచూనూ
తనవాహనంబయినా గరుడునిపై యెక్కి అమరులు
తమరూ అతివేడుకతో అమరావతికేగిరి
పలుకులు కర్పూరమును పాదొకటిగావించీ
పారుజాతం పెల్లగించుకు వచ్చెను పక్షీంద్రుని మీదా
పట్టుకురాగాను గట్టిగ యింద్రుడు సేనలతోనూ
కృష్ణుని మీదికి కయ్యానకు వచ్చె
మతిదప్పి వచ్చితివా మహిమీదను యీచెట్టు గయి
కొని మరల నీ పురికేగగలవా - చెడుగు మనుజులెల్లా
గర్వముతోనూ చెట్టుదెమ్మనంటే
మర్మముతోనూ మటు మాయముగా పారుజాతం పెల్లగించి తీవా
అంతట యింద్రుడు మహానుభావుడు వరదుడు అని తెలిసి
అడిగిననేనూ యిత్తుననుచునూ పాదములబడెనూ
అంతట అమరులు తమరూ అతి వేడుకతో అమరావతి కరిగిరీ
ఆ వేళను అట్టెవుండి మరునాడు ప్రొద్దున్న
అంతఃపురముల లోపలకొచ్చెనూ ఆనందముతోనూ
కర్పూరపు పలుకులతో పాదొకటి గావించీ
నెలతలు వేడుకతో పన్నీరు బోసిరపుడూ
చిగుళ్ళు ఆకులతోనూ మొగ్గలు పువ్వులుతోనూ
కాయలు పండ్లూ తోటిచెట్టూ వికసించీ యుండే
వట్టి మ్రానుక్రిందా పట్టె మంచంవేసీ చెలికత్తెలతో
సత్యభామ తా పవ్వళించి యుండే
అంతట కృష్ణుండపుడూ ఆనందమ్ములతోనూ
పట్టెమంచము పయి కూర్చుండెను సత్యభామతోటి
పూచిన పువులన్నీ రుక్మిణికడ కపుడూవెళ్ళే
తుమ్మెదలయి పువులు అన్నీ రుక్మిణిపయి వ్రాలే
వేశ్యకాంతవు గనుక నీవు పువులన్ని ముట్టరాదు
అంటరాదు అని కృష్ణుడు తాబలికే
అంతలోనె నారదుడు ఆనందముతో పాటపాడుచూ
సత్యభామతో దా నవ్వుచు బలికే
పూచిన పువులన్నీ రుక్మిణి కడకువెళ్ళే
తుమ్మెదలయి పువులు అన్నీ రుక్మిణిపై వ్రాలే
వట్టిమాను యీ రవ్వాయేలనీ నారదుడూ బలికే
అంతట కృష్ణుడపుడూ నారదు చెయ్యి బట్టుకూని
నారదుతోటీ కృష్ణుడు అప్పుడు నవ్వుచు తా బలికే
వక్క పువ్వూ దెచ్చీ వనితలకు నాకూను
జగడంబెడితివి అనుచూ కృష్ణుడు నారదుతోబలికే
నారదుడు కృష్ణుడుగలసి రుక్మిణీ మేడలకేగే
నారదుడప్పుడు రుక్మిణితోనూ నవ్వుచు తా బలికే
పారుజాతపు చెట్టు సత్యభామ పెరటా వేయుటగాని
పూచిన పువులు అన్నీ నీపైనే వ్రాలెగదే
అనుచూ నారదుడూ బలుకా - హస్తములు ముకుళించీ
నారదునికి కృష్ణునికీ మ్రొక్కెను రుక్మిణి తా నపుడూ
గోవిందా కృష్ణహరీ గోపాలా శ్రీధర
గోవర్ధన గిరిధర వామన కేశవ శ్రీధర హరియనుచూ
పారుజాతపూ పువ్వూ యెవరూ పాడిన విన్నాను
సతులకు సౌభాగ్యం గల్గును సంతోషమ్మున వుంద్రూ.
AndhraBharati AMdhra bhArati - dEshi sAhityamu - strIla pATalu - shrIpArujAta pallavi ( telugu andhra )