దేశి సాహిత్యము యక్షగానములు గరుడాచలము - అహోబలమంత్రి
గరుడాచలము - యక్షగానము - అహోబలకవి
  శ్రీగరుడాచలదేవుం
డాగమవేద్యుండు దురితహరుఁడు నృసింహుం
డాగజవరదుం డనిశము
బాగుగ మముఁబ్రోచు సత్కృపామతి తోడన్‌.
వ. మఱియు దేవతాసార్వభౌము నేమని కొనియాడుచున్నాఁడు.
ఆట తాళం. పటులజగదాధార యగణిత భవవిధూరా - నరహరి
చటులదైత్యవిదార గరుడాచలవిహారా.
భూరికరుణాసార మతి విస్ఫుట విచారా - కేశవ
చారుసత్యవిహార గరుడాచలవిహారా.
ప్రకటమునిమందార విశ్వంభర శరీరా - మురహర
సకలలోకాధార గరుడాచలవిహారా.
వ. మఱియు నెటువలెను.
ఏక తాళం. భావములోపల దేవిని యమృతపు
తావిని మది సిరిదేవి నుతింతు\న్‌.
అతులితముగ మునితతులను బ్రోచిన
చతురుని గౌరీపతిని భజింతు\న్‌.
ఏణాక్షిని మృదుపాణిని పద్మజు
రాణిని చక్కని వాణిదలంతు\న్‌.
పాయక నవమతి సేయక మునిబల
దాయకుఁడయిన వినాయకు గొలుతు\న్‌.
ప్రవిమల సద్గుణభావోన్నతులను
గవులను యాదిమకవుల నుతింతు\న్‌.
వ. అని యిట్లు యిష్టదేవతా ప్రార్థనంబు జేసి కవీశ్వరుండు కృతికధీశ్వరుండైన గరుడాచలేశ్వరునకు షష్ఠ్యంతంబులు రచియించె నట యెటువలెను.
జంపె. సురరాజసన్నుతికి సురుచిరాధరమతికి
గరుణారసోన్నతికి గరుడాద్రి పతికిన్‌.
మదనమోహనసతికి మహనీయసత్కృతికి
గదనవిజయోద్ధతికి గరుడాద్రి పతికిన్‌.
విమల సింహాకృతికి వినుత ధర్మాకృతికి
గమలా మనోరతికి గరుడాద్రిపతికిన్‌.
వ. అంకితంబుగా నాయొనర్పంబూనిన గరుడాచలంబను యక్షగానంబునకు కథాప్రారంభంబెట్టిదనిన.
జంపె. రథగజాశ్వపదాతి రమణీయసంకులము
పృథులపుణ్యస్థలము పెద యహోబలము.
పాదుకొను సకలజనప్రతీత కుశలోజ్జ్వలము
పేదలకు జయబలము పెద యహోబలము.
మెరవడిగ నూటయెనిమిది తిరుపతులమేటి
బిరుదుపావనఫలము పెద యహోబలము.
ద్విపద. ఈరీతి విభవంబు లింపొంద నచట
జారు మోక్షద విరజానది యనఁగ
లలిమించు పెదయహోబలతలం బెలమి
వలనొప్పు భూలోకవైకుంఠమనఁగ
నలువొంద నట యాదినారాయణుండు
పొలుపుదలిర్ప నాపూర్వకాలమున
మలయుచు ప్రహ్లాదు మాట నిల్పుటకు
బలువిడి నుక్కుకంబంబున వెడలి
చెలరేగి నవనారసింహరూపమున
మెలఁగుచు లక్ష్మీసమేతుఁడై తాను
వేదాచలంబుపై విహరింతుననుచు
నాదట దలపోసి యతిముదంబునను
బరిచారకులును సంభ్రమములతోడ
గరమర్థివిడుదులు గావించిరెలమి
ఠవణించు కనక మేడలు గోపురములు
ప్రవిమల వైడూర్య పద్మరాగములు
మందిరములు పెక్కు మంజిష్ఠ తెరలు
కందువచుట్టు ప్రాకారకుడ్యములు
మాణిక్యవేదికా మంటపంబులును
యాణిముత్యంబుల నమరువాకిండ్లు
గిరిగొను నవరత్నకీలితం బైన
గరిమ చూపట్టు బంగారు తల్పులును
వలనొప్పు నుద్యానవనముల మంచి
కొలను లనేకము ల్కొమరు జెన్నొంద
సుముహూర్తమున దన సుదతియు దాను
కమలనాభుండు యక్కడ బ్రవేశించి
ప్రకటిత వైభవాస్పదలీలనమర
నకలంకగతినుండ నటనొక్కనాడు
బలుపైడి భూషణాంబరములు మెఱయ
గొలువుకూటంబున గూర్చున్న యంత
గాల వాత్రేయ మార్కండేయమంద
పాల ఋశ్యశృంగ భద్రమతంగ
సుపవిత్ర కౌండిన్య సురభిశాండిల్య
కపిల భారద్వాజ గార్గేయ కుత్స
గౌతమ మాండవ్య కౌశిక కుటజ
సూత వసిష్ఠర్షి శుక శంఖమౌని
నారద సనకసనందన వ్యాస
వారణకోష్టి దుర్వాస జాబాలి
వరకణ్వరుచిక శ్రీవత్స వాల్మీకి
హరిత శౌనక కశ్యపాది సన్మునులు
పారులు గొలువ సంభ్రమలీలమించ
నారూఢి పన్నిద్దరాళ్వార్లతోడ
పరమభాగవతులు ప్రస్తుతిసేయ
నురమున నిందిరయున్నతి నమర
నరుదైన రత్నసింహాసనంబునను
గరమర్థి పేరోలగంబుండె నంత.
తే. అపుడు హాటక గర్భుఁడింద్రాదిసురలు
వచ్చి భయభక్తు లొనరంగ వరుసతోడ
వందనంబులుచేసి శ్రీవరునిగాంచి
భాసురోన్నత సన్నుతుల్‌ చేసిరంత.
జంపె. శరణు దురితవిదూర శరణు మునిమందార
శరణు దైత్యవిదార శరణు గుణహారా.
శరణు కరుణాపాంగ శరణు శయన భుజంగ
శరణు గరుడతురంగ శరణు నీలాంగా.
శరణు కమలోల్లాస శరణు చంద్రికహాస
శర ణహోబలవాస శరణు సర్వేశా.
వ. అని యిట్లు వినుతించినఁ గరుణార్ద్ర చిత్తుండై యాబ్రహ్మాదిదేవముని సంఘంబుల మన్నించి వారివారి నిజనివాసంబులకుం బనిచి యంతఃపురంబున కేతెంచె నట యెటువలెను.
ఆట తాళం. కమలనాభుఁడు మోదమున జలకంబులాడె\న్‌ మెల్లన
రమణమీరఁగ నంబరంబులు రహిని గట్టె\న్‌.
అగరు గంధం బలది నామంబమరబెట్టె\న్‌ సొంపున
నిగమవేద్యుఁడు విరులు తన శిఖనిండజుట్టె\న్‌.
ముత్యముల హారములు సొమ్ములు ముదముతో ధరియించి సిరిదా
పొత్తులను మధురాన్నములు సొంపున భుజించెన్‌.
వ. మఱియు నెటువలెను.
జంపె. ఆవేళ దంపతుల కటుయూడిగపు సతులు
తావియగు కర్పూరతాంబూలములును.
వేవేగనొసఁగ నావేదండయానలును
ఠీవిపెనఁగొనఁగ సురటీలు వీవఁగను.
భావజ్ఞుఁ డగుచు సంభ్రమలీల నరసింహ
దేవుఁ డా శ్రీలక్ష్మిదేవి కిట్లనియెన్‌.
ఏక తాళం. వనరుహలోచన విను గరుడాచల
మును గనుగొని యిప్పుడెవచ్చెదను.
ఓగజగామిని యుండుము నీవని
యాగమవేద్యుం డాదర మొప్ప\న్‌.
భామను సమ్మతిపరచి వేగమున
ధీమతి గరుడాద్రికి నేతెంచెన్‌.
శ్రీనృసింహ దేవుండు చెంచువనితనుఁ జూచి మోహించుట
ఆట తాళం. అచటనుండిన భక్తజనముల నాదరించి వారలు
రచన దనకును సేయు నుపచారములు గాంచి.
నళిననాభుఁడు యందరిలో నున్నట్టె యుండి వారిని
గలయదాగను బ్రామి గ్రక్కున గదలెనపుడు.
విల్లునంబులు బూనితానొకవేటకాని వైఖరి
మెల్లమెల్లనె జనఁగ ముందర మేలిమిగను.
ద్విపద. అచటను ముందర నశ్వత్థనింబ
బటబిల్వతింత్రిణీ వకుళ కదంబ
తాళకింశుకహరీతకి మాతులుంగ
మాలూరకాంచన మన్మథతిలక
క్రముక సాల రసాల ఖర్జూరకుటజ
శమిచూతపున్నాగ జంబీర వకుళ
నారికేళార్జున నాగహింతాల
పారిజాతాదిక బహువృక్షతతులు
పొదలును గురువింద పొదలు సంపెంగ
పొదలు గేదగి మల్లెపొదలు నింపొదవ
బహుకొండ చరులు దిప్పలు సెలయేరు
గుహలు సోనలు బెక్కుకోనలు నొప్పు
గురుతరాండజమృగకోలాహలంబు
నిరుపమోద్ధురత ఘూర్ణిల్లుటఁజూచి
ఘోరాటవులఁజొచ్చి కుంభినీధవుఁడు
చారువినోదుఁడై సంచరించుచును
నొరపువైఖరిమించు నొకచెంచుపడుచు
యరుదైన విరిమొగ్గయమృతంపు బుగ్గ
గరిమనింపులగుల్కు కపురంపు బల్కు
నారీకులోత్తంస నడరాజహంస
కీరసల్లాప సత్కీర్తికలాప
యరవిందములగేరు నతులాంగతిలక
కలికి బిత్తరిహోంతకారి మిటారి
కులుకుగుబ్బల ముద్దుగుమ్మ పూగొమ్మ
పగడంపులతకూన పన్నీటిసోన
సొగసుగారుమెరుంగు సొబగు బెడంగు
యెనరు రత్నపుకాంతి యొరవైన యింతి
కనకాంబరునిరాణి ఘననీలవేణి
మరువంపుమొలక మన్మథు ముద్దుచిలుక
కరిరాజ గమన చక్కని చంద్రవదన
పారుటాకులచీరె బాగుగాగట్టి
పూరితంబైన కొప్పున పూలుజుట్టి
తళతళమనెడు దంతపు కమ్మలును
దళుకుచెక్కులమీఁద దగదువాళింప
గురువిందదండ గోరుసొమ్ములను
నురమున నందంద నుడువీథికెగయ
సంకుటుంగరములు జాతిసొమ్ములును
సంకుమదము మేనజాలువారగను
మలయుచు నుదుట గుమ్మడివిత్తురీతి
నలువొప్ప కస్తూరి నామంబు జెలఁగ
మునుకొని పొసఁగు ముమ్మొనలసూచకము
యనువొంద ఫాలాగ్రమందు జూపట్ట
విల్లునంబులు బెట్టి వేటాడుకొనుచు
మెల్లనెతాను వాల్మీకిచందమున
శైలాగ్రములు దాఁటి చరులపైకుఱికి
కేళిదిబ్బలకు లంఘించి దాటుచును
వచ్చుచెంచితఁ జూచి వాసుదేవుండు
యచ్చెరువంది రెప్పార్పకఁ జూచె.
ఆట తాళం. చూచి భామవిలాసమునకును చోద్యమొంది వారిజ
లోచనుఁడు మెచ్చుచును దనమదిలోన నపుడు.
ఎనసి యీలతాంగి రూపము నెటులఁ జేసె ననుచును
దన కుమారుండయిన బ్రహ్మను దానెబొగడె\న్‌.
చెంచుదానికి నీమిటారపు జెలువ మేలాగలుగును
చెంచుగోమలిగాదు యిది క్రొమ్మించుగాని.
కలయగను గ్రొమ్మించుగాదిది కలికిగాని కన్నుల
కలికి గాదిది మరుని క్రొన్నెల ములికిగాని.
ములికి గాదిది తేట కపురపు పలుకుగాని కపురపు
పలుకు గాదిది సొగసు ముద్దుల చిలక గాని.
క. అని యిట్టు లింతిరూపము
మనమునఁ దలపోసి మిగుల మమతదలిర్ప\న్‌
వనరుహ నాభుఁడు మెచ్చుచుఁ
జనువున నా చెంచువనిత సన్నిధి కరిగెన్‌.
వ. మఱియు నాచెంచితను వీక్షించి తానేమనుచున్నాఁడు.
శ్రీనృసింహదేవ కిరాతకాంతల సంవాదము
కురుచ జంపె. యెవరిపడుచవె నీవు కొమ్మ నాతో
వివరింపవే ముద్దుగుమ్మ.
ఘోరతరమైన వనభూమి లోన
నీరీతి దిరిగే వదేమి.
లలితాంగి సుదతీలలామ నీకు
తలిదండ్రు లెవ్వరే భామ.
కులుకు వెడవిలుతు విరికోల నాతోఁ
బలుకవే నీకు సిగ్గేల.
వ. అనిన విని యాచెంచుజవరాలు గరుడాచలేశ్వరునితో నేమనుచున్నది.
ఏక తాళం. చెంచు మల్లికుఁడు శిఖినాథుఁడు గని
పెంచిన ముద్దులబిడ్డనునేరా.
గుములు గుములు గూడెపు చెంచులు
యమితపు వేటలు యాడుచురాఁగ\న్‌.
కరిమృగముల నేగదుముక విడివడి
పరికలు దాఁటుచు వచ్చితి నిటకు\న్‌.
వ. అనిన నాయింతితో దంతివత్సలుం డేమనుచున్నాఁడు.
జంపె. శ్రీమించు మీతండ్రి చెంచుశిఖినాయకుఁడు
మామగావలె నాకు మరదలవు నీవు.
బావ రమ్మని నన్ను భక్తిసేయక యిటు
పోవఁదగునా యిపుడు పొదలు దాఁటుచును.
నావంక దయజూచి నన్నాదరించవే
తావి చక్కెర బొమ్మ తగు ముద్దుగుమ్మ.
వ. అనిన శ్రీహరితో చెంచుకోమలి యేమనుచున్నది.
త్రిపుట. అవుర! యమ్మకచెల్ల యిటువలెనందురా నావంటి యింతిని
వివరమెఱుఁగక పలుకఁ దగునా వెఱ్ఱివాఁడ.
మంచివానివలెనెవచ్చి మరులుకొలువ జూచెదవు భళి
కొంచెగాఁడవు గావె నిన్నిఁక నెంచఁదగునా.
మేరతోఁ జనుమింక విను మావారు వచ్చిన నీవు పరువులు
బాఱ లేవిఁక నిపుడె గొబ్బునఁ బాఱిపొమ్ము.
వ. అనిన చెంచుజవరాలితో జక్రధరుం డేమనుచున్నాఁడు.
ఆట తాళం. వేడుకలరఁగ వేఁటవచ్చితి వేగ నిన్నుఁ జూచితి
చేడెరో నీకౌఁగిటను నను జేర్చుకొనవే.
పంచబాణుఁడు బలముగూర్చుక బారుదీర్చి వచ్చెను
యంచగమనరో మోవి తేనియలాననీవే.
భాసురాంబర భూషణంబు లపారముగ నీకిచ్చెద
వాసిగా నిన్నేలెదను కడువైభవమునా.
వ. అనిన నంగీకరింపక చిడిముడిపాటుచే నాచెంచుకోమలి చక్రధరునితో నేమనుచున్నది.
జంపె. మెరవళ్లు జూపెదవు మేరనుండగఁ లేవు
యరికట్టుకొని తెరువు కడ్డమయ్యెదవు.
విరసంబులాడెదవు విననేర నింతైన
బరువడిని వెనువెంటఁ బారివచ్చెదవు.
నీవెవ్వఁడవు మఱియు నీయూరి పేరేమి
భావించి నిజముగాఁ బలుకు నీవనియె.
వ. అనిన యాచక్రధరుం డాచెంచువనితతో నేమనుచున్నాఁడు.
ఆట తాళం. బాల వినవె ధారుణీ మాయేలుబడియు నెప్పుడు
మేలిమిగ గరుడాచలము మా పాళెపట్టు.
కంబుకంధరి వినవె లోకమునను దినంబు వేడ్కగ
డంబు మీఱఁగ నేలుబడియును గలదుమాకు.
వరుస విష్వక్సేనుఁడను దళవాయి గలఁడు రాణువ
మఱియు సురలును శంభుఁ డొగి సామంతదొరలు.
లలితముగ భైరవుఁడు జగము తలారి యజుఁడు బహులె
క్కలను వ్రాయఁగ మేమెయుంచిన కరణమతఁడు.
శమనుఁ డాదిగమాకు బహుపరిచారకులును బ్రేమను
యమరనాథుఁడు మేము నిల్పిన యమరగాఁడు.
భామ విను నావంటి బిరుదగు పాళెగాని\న్‌ గూడితె
రామ విను పట్టంపు నాయకురాల వీవె.
వ. అనిన విని మందహాసవదనారవిందయై యాకుందరదన కందర్పజనకునితో నేమనుచున్నది.
ఆట తాళం. ఇన్ని చిన్నెలుగలిగి దొరవైయున్న నీవు నాతోనున్న
తోన్నతిగలిసి మెలఁగుచునుండఁగలవా.
వెక్కసంబుగను ఘనగిరు లెక్కగలవా గ్రక్కున
నిక్కి మఱి యొకగిరికిఁ జివ్వున నిగుడఁగలవా.
మేటి పొదలకు దూరి దిబ్బలు దాటఁగలవా శరముల
సూటిదప్పక మృగములను బడ మీట గలవా.
ఇప్పపువ్వులు వెదురు బియ్యం బేరగలవా యాకలి
త్రిప్పటనకను దిరిగి ఫలములదేనుగలవా.
వారకను బహుజుంటితేనెలు వడచగలవా చల్లని
పారుటాకుల పచ్చడముపైఁ బఱచఁగలవా.
ఇన్నిపనులిటు సేయనోప సహించితెనె నాతో
నన్ని దెలుపుము మఱుఁగు బెట్టక వన్నె కాఁడా.
వ. అనిన చెంచు మించుఁబోఁడితోఁ బంచాయుథజనకుం డేమనుచున్నాఁడు.
జంపె. ఎలనాగ నను రతుల నేలినంతనె నీవు
మెలఁగినట్లనె నేను మెలఁగు నేరుతును.
దండిమెకముల నెల్లఁ జెండెదను యిటువంటి
కొండలెల్లను వ్రేలగొనియెత్తఁగలను.
జాలిబడి మీవారు చనుదెంచి నీకుఁగా
నోలిగట్టు మటన్న నోలిగట్టెదను.
మించుగా మీకులము చెంచులెల్లను గొల్వ
చెంచుహోబడనంగ సంచరించెదను.
యనుమాన మేటికే యంగీకరించవే
వనజాక్షి నీవడుగు బాస లిపు డిత్తు\న్‌.
వ. అనిన విని యర్ధాంగీకారంబున నా చెంచుగుబ్బెత యేమనుచున్నది.
కురుచ జంపె. వగకాఁడ వడిగండ్లమూట
నమ్మఁగ రాదు మగవారిమాట.
తగులుదాకను బ్రేమ ఘనము
కూర్మి తగిలితే మఱి చప్పఁదనము.
దొమ్మి సేయకురోరి చాల నిన్ను
నమ్మలేనుర చెంచు హోబ.
వ. అనిన యాచెంచుకోమలికి ఆశ్రితవత్సలుండు బాసలిచ్చె నట యెటువలెను.
శ్రీనృసింహదేవుండు చెంచితను గాంధర్వవివాహము చేసికొనుట
ఆట తాళం. నిర్మలాత్ములు సూర్యచంద్రులు నెరయ సాక్షి నిగమము
ధర్మ దేవతలెల్ల సాక్షి ధరణిసాక్షి.
వరపయోధులు సాక్షి ఘనగిరివరులు సాక్షి త్రిపుర సం
హరుఁడు బ్రహ్మాదులును సాక్షి యగ్ని సాక్షి.
నమ్ము సత్కృపతోడ నినువిడనాడ ననుచు మిక్కిలి
సమ్మతిగఁ దచ్చిరముపై హస్తంబు నిడియె\న్‌.
ద్విపద. ఆచక్రధరుఁ డిట్టు లచట బాసలను
యాచెంచితకు నియ్య నంగీకరించె
తమరిద్దఱును గాంధర్వవివాహ
మమరంగ నయ్యెడు నవసరంబునను
జెలువారఁగాచి పూచినవృక్షతతులు
దిలకింప బెండ్లిపందిళ్లును గాఁగ
పనివడి శుకపికపారావతముల
ధ్వను లతిమేటివాద్యధ్వనుల్‌గాఁగ
సరస సంగతితేంట్ల ఝంకారములును
స్వరయుక్తమగు శ్రుతిస్వరములుగాఁగ
గోరువ పలుకులు ఘూర్ణిల్లుటయును
గరమొప్ప వందిమాగధులును గాఁగ
రమణీయమగులీల రాజహంసలును
అమితంబులైన నృత్యాంగనల్‌ గాఁగ
రూఢిగా మలయ మారుత సంచయంబు
వేడుకఁ జదివించు వియ్యాలుగాఁగ
గోకిలశిఖియూథ ఘోషణంబులును
బ్రాకట ధవళశోభనములు గాఁగ
విదితంబుచిలుకలు వేదమంత్రములు
చదివెడు ద్విజకుల జాలంబుగాఁగ
నంచిత సుముహూర్తమాయత్తపరప
నించువిల్తుఁడు పురోహితుఁడును గాఁగ
వలపెసంగెడు వధూవరుల సిగ్గులును
సలలితంబగు తెరచాటులుగాఁగ
రమణ నిర్వురశిరోరత్న మాల్యములు
ప్రమదంబుతోఁ దలఁబ్రాలును గాఁగ
హరిసేయు సతికి గాఢాలింగనంబు
సురుచిరమంగళ సూత్రంబుగాఁగఁ
బలువిడి పూఁబాన్పుపై వసించుటయుఁ
దెలియ వివాహవేదికయును గాఁగ
తుదలేని తమకముల్‌ దొడరి హత్తుటయు
ముదముమీఱఁగ కొంగు ముళ్లును గాఁగ
మొత్తంబులైన కెమ్మోవులరుచులు
పొత్తుల భుజియించు బువ్వలు గాఁగ
నతిమోహమునఁగల లంటిగూడుటయు
నతులవివాహ సమాప్తియు గాఁగ
నిరువురు నెనరున నేకభావమున
నురువైభవంబులనుండి రంతటను.
శ్రీలక్ష్మీదేవి హరిఁ గానక చింతించుట
తే. అచట శ్రీలక్ష్మి విభుఁడు రాడాయె ననుచుఁ
జాల వగచుచుఁ దనప్రాణసఖులఁ గాంచి
నిందుముఖులార గరుడాద్రికేగిమీరు
హరిని దోడుక రం డని యనుపుటయును.
వ. ఇట్లు శ్రీలక్ష్మి పనిచిన దూతికలు గరుడాద్రి కేగి నానా ప్రదేశంబుల వీక్షించి శ్రీహరి నెందుం గానక మగుడివచ్చి శ్రీలక్ష్మీదేవితో నే మనుచున్నారు.
ఆట తాళం. మానినీమణి సుదతి సావధాన వినవే మదగజ
యాన కోకిలవాణి సుగుణనిధాన వినవే.
ఏమిచిత్రమొకాని గరుడగిరీశుఁ డెచటికి నరిగెనో
మేము చూచితి మమ్మ యెక్కడలేఁడు యతఁడు.
అనిన శ్రీహరిసతియుఁ గుందుచుననియె విరహానలమున
పనుపకను దనప్రాణసఖులతోఁ బలికెనపుడు
ఎన్నఁడును నాకౌఁగిలెడపకయున్నవిభుఁడు మనమున
నన్ను మరచియుఁ దాను నెటులనున్నవాఁడో.
ఇపుడెవచ్చెద ననుచు నాతో నెఱుకఁ జేసి నరిగెను
జపల చిత్తుఁడు గాన దానెచ్చటికిఁ జనెనో.
నారదుఁడు నృసింహదేవుని యొద్దకు వచ్చుట
వ. అని చింతించుచున్న సమయంబున బ్రహ్మలోకంబుననుండి నారదమునీంద్రుండు వచ్చి మందాకినీతీరంబున స్నాన సంధ్యాదికృత్యంబులు దీర్చుకొని విష్ణు దర్శనంబు సేయుటకుఁ గిరాతలతాంగీ సమేతుండై ఘోరాటవీమధ్యంబున నున్న యహోబలేశ్వరు సన్నిధానంబునకు వచ్చె నఁట యెటువలెను.
జంపె. తఱుచుగా రుద్రాక్షతావళంబులతోడ
మఱువకనునెన్ను జపమాలికలతోడ\న్‌.
పల్లజడలతోఁ గక్షపాలదండముతోడ
సలలితంబైన కృష్ణాజినముతోడ\న్‌.
సవరింపఁదనరు కాషాయ చేలముతోడ
ఠవణింపఁదగు కమండలమొప్పుతోడ\న్‌.
దనరారు భూతిపూతలమేని నిగ్గుతో
వనమాలికల యోగవాగముతోడ\న్‌.
ఆరూఢిగా మహతి యనెడు వీణియతోడ
నారదుండును వచ్చె నరసింహుకడకు.
వ. ఇట్లు వచ్చిన మునీంద్రునకుఁ జెంచుపడఁతియుఁ దానును దండప్రణామం బాచరించి యుచితాసనాసీనునిం గావింప శౌరితో నారదుండు యేమను చున్నాఁడు.
త్రిపుట. కలుషసంహార దీనరక్షక కామితార్థఫలప్రదాయక
నళినలోచన శ్రీయహోబలనారసింహా
క్రొత్తపెండ్లికుమారుఁ డార్యులకొనరదండము సేయఁదగుఁ గద
యుత్తరోత్తరముగను బ్రబలుమహోన్నతముగ\న్‌.
బట్టరానివధూటినిటు చేపట్టరా దిల ప్రేమతోఁ జే
పట్టుటయు నాపట్టువదలుటపాటిగాదు.
మంచిపరుసము సోకిలోహము మహిని బంగారైనకైవడిఁ
జెంచితయు నిను గూడివన్నె ప్రసిద్ధికెక్కె\న్‌.
పన్నుగా నే వచ్చి మిము దంపతుల నిచ్చటఁ జూచుటయు నా
కన్నులిప్పుడు చల్లనాయెను గమలనాభా.
ఆదుకొని చల్లడుగఁ జని తా నచట ముంతయు దాఁచనేటికి
వేదగిరికేతెమ్ము యెవరికి వెరువవలదు.
శ్రీలక్ష్మీదేవియొద్దకు నారదుఁడు వచ్చుట
వ. అని పలికి యావధూవరుల దీవించి యంతర్ధానుండై వేదాచలంబుపైనున్న శ్రీలక్ష్మీదేవిం బొడగాంచి నారదుఁడు యేమనుచున్నాఁడు.
జంపె. వెలది పుణ్యచరిత్రి విలసితాంబుజనేత్రి
చెలియ మోహనగాత్రి క్షీరాబ్ధిపుత్రి.
వరసైకతశ్రోణి వనిత పల్లవపాణి
సరసమంజులవాణి చక్రధరురాణి.
శశివదన గజయాన సతి చిగురుపూబోణి
లలన కుశలంబె సత్కులకుందరదన.
వ. అనిన విని లక్ష్మీదేవి నారదునితో నేమనుచున్నది.
త్రిపుట. వరతపోధన వినుము మరి మీవంటి హరిభక్తుల కృపామతి
గురుతరంబైయుండ మాకును కుశలమెపుడూ.
నిన్న రేపటివేళకడు నెరనీటుతో గరుడాద్రి కేగెను
వెన్నుఁడిచటికిరాక నెచ్చట నున్నవాఁడో.
మీకుఁ గనపడు యోగదృష్టి సమీపమౌటను శౌరికార్యము
నాకుఁ దెల్పుము వినియెదను మునినాథచంద్రా.
వ. అనిన నారదుండు యే మనుచున్నాఁడు.
త్రిపుట. అమ్మ యేమనిచెప్పుదును విను మబ్జనాభుఁడు జేసినందుకు
నమ్మరాదుగదమ్మ యతఁడు నీనాథుఁడనుచు.
బాసలొసఁగియు చెంచువనితను బరిణయము దానయ్యె చచ్చట
నీసమానము గాగ దగ మన్నింతు ననుచు.
పాలకడలిని బుట్టితివి నీ పాలవంటికులంబు మైలై
జాలువారెను చెంచితయు నీసవతిగాగ\న్‌.
హీనకులసతిదెచ్చిపతి నీయెదుట సన్మానింపనీమది
లోన నేగతినోర్చెదో గద లోలనయన.
చెంచుగుబ్బెతగూడుకొని హర్షించి యాసతి మాటమీరక
చెంచుహోబడనంగ పేరువహించినాఁడు.
పెద్దమలలో దూర్పుగట్టున బెనఁగి చెంచిత శౌరియుండఁగ
నొద్దికతో పొడగాంచి వచ్చితి యువిద యిపుడు.
వ. అని చెప్పి దీవించి మునీంద్రుం డరిగె నంత నా రమాదేవి నవరత్నకీలితంబైన గద్దియపయిం గూర్చుండి డెబ్బదిరెండువేల స్త్రీలుఁ గొలువ వదనారవిందంబు గరపల్లవంబులఁ జేర్చి తన ప్రాణసఖులతో నేమనుచున్నది.
జంపె. వింటిరాసఖులార విబుధ సంయమివచ్చి
గెంటకను యిచట బల్కిన వాక్యములను.
నా యెఱుకలేక నెన్నఁడు యేమిపనియైన
జేయవెఱచును మున్ను చిత్తభవగురుఁడు.
సలలితంబగు కులస్థానపౌరుషములను
దలపోయ కెంతరోఁతకుఁ జొచ్చెనితఁడు.
అలఘుఁడును దయమరచి యాచెంచుదానితో
గలసియున్నది నిజముగాబోలు దలఁప.
వరసత్యధనుఁడు పావనుఁడు నారదమౌని
పరికింప నేడు దబ్బరలాడ డతఁడు.
వ. అని తలపోయుచు మఱి న్నేమనుచున్నది.
త్రిపుట. మొదటికులమును రూపవిభ్రమములను మదిలో నెంచడాతఁడు
కదిసి తనపై బ్రేమబొడముట గారణంబు.
అడవిసింగము రూపమాతఁడు యడవిచెంచిత యాలతాంగియు
జెడెడుగంతకుఁ దగినబొంత జెలువమాయె\న్‌.
నాడు బోయతరాలు రుచిగొని నమలియిచ్చిన పండ్లు దినడా
నేడెక్రొత్తయటమ్మ యాతని నీచగుణము.
వ. అనిన విని యొక్క సఖియ యేమనుచున్నది.
ఏక తాళం. ఏమిటి కింతలో నిభరాజవరదుని
వేమారు నీవిటు విడనాడెదవు.
పతియేమి నేరనిపనిజేసిన స
మ్మతినుండుట ధర్మము కులసతికిన్‌.
నీమదికిఁ దెలియని నీతుయుఁ గలదా
కోమలాంగి మది కోపముమానుము.
వ. అనిన నాలక్ష్మీదేవి యావాక్యంబు విని వినన ట్లూరకుండిన మఱియు నొక్క పూర్ణేందువదన యేమనుచున్నది.
త్రిపుట. కులములేవడియైన నేమగు చెనుగు రాళ్లను బుట్టలేదా
విలువ జెప్పఁగలేని వజ్రంబులు లతాంగి.
కాన నీచపుచెంచు కులమున కన్యకామణి పుట్టుటయుఁగని
దానవాంతకుఁ డేర్చి చక్కఁగ దాని గొనియె\న్‌
నేర్పు నేరము లెంచవలదిక నీవు భామామణివి గావున
నేర్పుతో నడచినను ఘనతయు నొద్దికయును.
వ. అనిన విని మఱియొక కలహంసగమన యేమనుచున్నది.
జంపె. అతివ నీకోపమున కంతకంతేగాక
నతనికిని నీకు మరి యరమరలుగలవా.
మించు బోణిరో వలపుమించి నీవిభుఁడు దయ
యుంచి దనరొమ్ము డించడేవేళ\న్‌.
ఇటువంటి పెనుసుద్దు లెన్ని జెప్పిననేమి
యటువంటి పనులకును యతఁడేలజొచ్చున్‌.
వ. అని ప్రాణసఖులు పెక్కండ్రు పెక్కు విధంబుల బలుకుచున్న సమయంబున నెటువలెను.
నృసింహదేవుండు చెంచితతోడ లక్ష్మీదేవి యొద్దకు వచ్చుట
ద్విపద. అంత నక్కడ గరుడాచలాధిపుఁడు
సంతోషమున జెంచు జవరాలిజూచి
వేదాచలమునకు విమలాంగి మనము
పోదా మటన్న నాపొలతి యిట్లనియె
నీయాలు యేపాటి నీతిజ్ఞురాలో
గయ్యాళో నోటివెక్కసురాలో దలఁప
నీవెంబడినినమ్మి నేవచ్చి యచట
నీవామలోచన నిన్నునునన్ను
భావింపకున్నను భరమగునోర్వ
ననుటయు నవ్వి శ్రీహరి యిట్టులనియె
వినవె చక్కెరబొమ్మ వెసముద్దుగుమ్మ
యటువంటి పనులురాదైన నాయింతి
యటుయిటు మనలపై నాగ్రహించినను
సమ్మతిపఱచి నే సమముగా మిమ్ము
నెమ్మితోబ్రోచెద నీకేల వగవ
పదమని లాలించి పడతిఁ దోడ్కొనుచు
వదలక వేదాద్రిప్రాంతంబు జేరి
కందువ రాజమార్గమున కేతేర
నిందిరాదేవికి హితులయిన సఖులు
మెలఁగుచు బంగారు మేడపైనుండి
పొలయక హరిరాకఁ జూచి యిట్లనిరి
కదిసి వెన్నుఁడు దన కనకాంబరంబు
సుదతికి మేలు ముసుంగుగా గప్పి
లలిమించు నవరూప లావణ్యమహిమ
జెలువొప్ప నల్లన చెంచిత దాను
వచ్చుచున్నారని వనజాక్షి యనిన
నచ్చెరువందుచు యారమాదేవి
ద్వారపాలకులతో దైత్యారినిటకు
జేరనియ్యకుఁ డని చిగురాకుబోఁడి
దలఁచుచు గనక సౌధంబులోపలను
సలలితోన్నతి నున్న సమయంబునందు
హరి మహామహుఁడు నొయ్యారంపు నడల
బిరబిర జెంచుగుబ్బెతయు దారాగ
వలనొప్పఁజూచి యా ద్వారపాలకులు
బలిమి కవాటముల్‌ బంధించి రంత.
వ. అప్పుడు శ్రీహరి ద్వారపాలకులతో గవాటంబులు మూసిన కారణం బేమి కవాటంబులు దెరువుమటన్న నా ద్వారపాలకు లేమనుచున్నారు.
త్రిపుట. అయ్యరో యెటుపోతిరిటుమాయమ్మతోడను నెఱుకసేయక
నెయ్యమున మీ రిట్లు పోవుట నీతియగునా.
ఇరువుగా వినవయ్య నగరికి నెవ్వరిని రానీయవలదని
గరిమతో శ్రీలక్ష్మీదేవియు కట్టుబఱచె\న్‌.
ఆవధూమణి సెలవులేకను అయ్య మిము రానీయ వెఱతుము
గావునను శ్రీదేవి యర్పణగాగవలెను.
వ. అనిన లోకపాలకుం డా ద్వారపాలకులతో నేమనుచున్నాఁడు.
జంపె. మాకుగా శ్రీసతికి మనువు లేర్పడదెల్పి
దెగువతో సెలవెవరు దెచ్చెదరు పూని.
మీకంటె నాప్తులును మిగుల నాకును గలరె
జోకతో దెల్పుఁడా సుదతితో ననిన\న్‌.
పని బూని యాద్వారపాలకులు వడినేగి
తనర నాక్షీరాబ్ధి తనయ కిట్లనిరి.
త్రిపుట. చెంచితయు హరిరాగ మేమిట జేరనీయక నున్న వాఁకిటి
పంచ నున్నారమ్మ యిద్దరు భయముతోడ\న్‌.
తలపనేరము తనదువల్లను తగిలియుండిన కతన గాదా
నిలువు రాకుమటన్న నంతట నిలిచెనతఁడు.
నీకుదెలపఁగ నెంతవారము నీకె దయ పుట్టంగవలయును
గాక నితరుల కేమి మదిలో గనికరంబు.
తే. లక్ష్మి యీవేళ ద్వారపాలకుల కనియె
నతని రానిండు యిక నేల నైన పనికి
ననిన వారేగి యప్పుడు యబ్జనాభు
జేరి నగరికి నికను వేంచేయు డనిన.
వ. అప్పుడు శ్రీహరి చెంచువనితను దోడ్కొని యిందిరాదేవిమందిరంబున కరుగుటయు నాయింతి కోపావేశంబుచే మృదుతల్పంబున శయనించియున్నంగనుంగొని యాశేషతల్పుండు యేమనుచున్నాఁడు.
లక్ష్మీ నరసింహుల సంవాదము
కురుచ జంపె. మత్తగజయాన దయతోనూ
నాకెదురు వత్తు విన్నాళ్లెదురుగాను.
నెయ్యంబు లేక నీవేళ నీవు
శయ్యపై బవళింపనేలా.
ఇంత చింతేమిటికి లేవే నా
యంతరంగంబెల్ల నీవే.
ఉసు రస్సు రన నేల నీవు
నిండుముసుకేల వడిబిగించెదవు
చపలాక్షి నీవాఁడ నేనే గాక
నిపుడు నీకైన కొదవేమె.
వ. అని యూరడిల్లంబలికిన మారుపలుకక యూరకున్న నారమాదేవితో నారాయణదేవుం డేమనుచున్నాఁడు.
జంపె. కుటిలకుంతల నీవు కోపంబుమానవే
పటుపద్మరాగముల పతకంబు లిత్తు\న్‌.
మురిపెంపుతోడ నెమ్మోముజూపిన నేను
కరమొప్ప వజ్రాల కడియంబులిత్తు\న్‌.
ఏణాక్షి నాతోడ నెనసిమాట్లాడవే
యాణిముత్యపుసరుల హారంబులిత్తు\న్‌.
ననుజూచి చిరునగవు నవ్విననుయింపుతో
ఘనకౌస్తుభాంగ భూషణము నీకిత్తు\న్‌.
సన్నుతాంగిరొ నీవు చనువిచ్చి మనిచితే
సన్నుతంబైన రొమ్మున నుండనిత్తు\న్‌.
వ. అని పెక్కు విధంబుల వేడిన వినక నిట్టూర్పులు నిగడించుచున్న యాలలితాంగితో బతంగవాహనుండు యేమనుచున్నాఁడు.
ఆట తాలం. ఘనతకెక్కిన యాసముద్రుని ఘనసుపుత్రీ నాతని
గుణము నీకును నుండవలదా కోమలాంగీ.
నెట్టుకొని మీయెఱుకలేకను నెలతనిటకు\న్‌ దెచ్చుట
గట్టిగా నావలన తప్పగు గమలనయన.
దండదాసరితప్పునకు నొక దండమనఁగా వినవా
దండమిదిగో నీకు మదవేదండగమన.
వ. ఇవ్విధంబున నారమాదేవి పాదపద్మంబులకు దండంబుపెట్టుటయు దిగ్గునలేచి యతనిశిరంబు గరంబుల గుచ్చియెత్తి యేమనుచున్నది.
త్రిపుట. మురుపుతోడుత బెండ్లిమ్రొక్కులు మ్రొక్కినందుకు దీవ నిదిగో
పరగకొడుకుల తండ్రివగచును బ్రబలుమింకా.
చిన్నెలును వేసాలుసుద్దులు చికిలిపించెవు కాని వగలును
యెన్ని నేర్చితి వింతలోనె మహేశనీవు.
ఏల నిఁక నినుదూరవలె నీ వెట్లుచేసిన నాకుసమ్మతి
నీలవర్ణపకీర్తికీర్తులు నీకేతెలుసు.
వ. అనుచున్నతరి వెన్నునిమోముఁ జూచి చెంచువన్నెలాడి యేమనుచున్నది.
త్రిపుట. ఆలికిటువలె వెఱచి పదముల కడ్డపడి మ్రొక్కేటివాఁడవు
యేల నన్నిటు వ్రతము చెఱిచితి వింతపనికి.
వరస్వతంత్రపు బుద్ధిగల మగవానివలెనే దోడితెచ్చితి
గరిమతోనీబయిసి యంతయు గానవచ్చె\న్‌.
స్వామి నిన్నననేల నిఁక నానోముఫల మిట్లుండగా మఱి
నేమి యనుకోబోవ రోఁతలు నింక నేలా.
వ. అనిన విని యిందిరానందకరుం డిందిరాదేవికి దెలియకుండ గనుసన్నలఁ జెంచుబోడి నూరడించిన పిదప నెటువలెను.
క. ఆదంతివత్సలుం డ
త్యాదరమున నింతిమనసు హర్షమొదవ దా
నాదటచెంచిత మెలఁతను
మోదమున రమాపదాబ్జములపై వైచె\న్‌.
వ. ఇట్లు చెంచువనితను కమలపాదకమలంబులపైవైచి యా కమలనాభుం డేమనుచున్నాఁడు.
ఆట తాలం. అబలయెన్నఁడు యేమియెఱుఁగదు యంబుజాక్షీ మిక్కిలి
సొబగురాలిది చెంచు భామినిశోభనాంగీ.
నేర్పు నేరములోనుగాగొని నియతమైనా నాటబుద్ధులు
నేర్పుకొని నడిపించుకొనినను నీకు ఘనమూ.
నెలత కేనిచ్చిన ప్రమాణము నీవునిచ్చి నట్లనే
తలఁప నాపంతంబు నీపంతంబుగాదా.
వ. అనిన సమ్మతించి శ్రీహరితో నేమనుచున్నది.
శ్రీదేవి చెంచువనితా సహితుండగు నారసింహునకు శోభనంబులు పాడుట
జంపె. భావింప నందరిని బాటుపడి సవరింప
భూవల్లభుండవయ్యు నీవెయుండఁగను
పోడిమిగ లోకముల బ్రోవనోపుచు నిద్ద
రాడ వారినిబ్రోచు టరుదేమి నీకు
మనసులో మాకు యోచనసేయ నేమిటికి
వనజాత సమనేత్ర వరమునిస్తోత్ర.
వ. అని మఱియు గేళికాగృహంబున సకల సామాగ్రు లొసంగి యాయిందిరాదేవి చెంచుకన్యా సమేతంబుగా శౌరికి మంగళస్నానంబు సేయించు సమయంబున కొందరు ముత్తయిదువలు ఏలలు బాడిరట యెటువలెను.
ఏలలు. చెంచుభామను గూడుకొని మించిన మోహముతోనూ
యెంచి లోకములా బ్రోవరా! యో నారసింహా! మించఁగా యేలితివవురా.
యెంత వాఁడ వైన నీవు యింత దుడుకులు సేయ
యంతరంగామున జెల్లునా! యో నారసింహా! సంచరించి యేలితివవురా.
వ. మఱియు బుణ్యాంగనలు శోభనంబులు పాడిరట యెటువలెను.
శోభనములు. కరిరాజవరదునకు గిరిరాజ ధీరునకు
గరుడాచలేంద్రునకు గాంతిచంద్రునకు। శోభనమే॥
నిరుపమాకారునకు నిర్మలాచారునకు
గరుడాచలేంద్రునకు గాంతిచంద్రునకు। శోభనమే॥
సరసిజనేత్రునకు సత్యచారిత్రునకు
గరుడాచలేంద్రునకు గాంతిచంద్రునకు। శోభనమే॥
వ. మఱియు గొందరు ధవళనేత్రలు ధవళంబులు పాడిరట యెటువలెను.
ధవళములు. జయజయ దురితవిదూరా
జయజయ చిత్తవిహారా
జయజయ దరమందహాసా
జయజయ దనుజనిరాసా
జయజయ సురమునిగేయా
జయజయ భక్తసహాయా
జయజయ జలధరకాయా
జయజయహోబలరాయా
వ. మఱియు గొందరు మంగళవతులు మంగళహారతు లిచ్చిరట యెటువలెను.
మంగళములు. శ్రీకరాకారునకు సింధుగంభీరునకు
బాకశాసనరుద్ర ప్రణతునకునూ
యాకనకకశ్యపుని నడచియా ప్రహ్లాదుఁ
జేకొనిన యా నారసింహునకునూ। జయమంగళం నిత్యశుభమంగళం॥
మంగళము సనకాదిమౌని మందారునకు
మంగళము దేవతామకుటమణికి
మంగళము నవకోటి మన్మథాకారునకు
మంగళము గరుడాద్రి మందిరునకూ। జయమంగళం నిత్యశుభమంగళం॥
బాయకను యెల్లపుడు భక్తవరులకుజాల
నాయతంబైన యిష్టార్థములనూ
ఆయురారోగ్యంబు లైశ్వర్యముల నిచ్చు
శ్రీయహోబల నారసింహునకునూ। జయమంగళం నిత్యశుభమంగళం॥
వ. మఱియు శోభనపరంపరాభివృద్ధి చెలంగ నాలక్ష్మీనారాయణులుంగూడి సుఖస్థితినుండి రంత.
చెంచువారు నృసింహదేవునివద్దకు వచ్చుట
జంపె. అంత నక్కడను ఘోరాటవిని చెలరేగి
పంతంబుతో జెంచుబలసమూహములు.
కొండలకు వడినెక్కి కోనలు లంఘించి
యండజశ్రేణులను జెండివైచుచునూ.
కరి మృగంబులను వ్యాఘ్రముల భల్లూకముల
హరిణంబులను వరాహముల మోదుచునూ.
వ. ఇట్లు చెంచుశిఖినాయకుండు తన రాణువయు దానును వేటాడుకొనుచు దమజాత్యాహారములను మాధుర్యఫలరసేక్షు సామాగ్రులను బట్టించుక తమతమ గూడెంబులకు జేరిరట యెటువలెను.
ద్విపద. చెంచులీగతి వీడు చేరిన పిదప
జెంచులకు దొరయైన శిఖినాయకుండు
దనబిడ్డలేదని తలఁచి చింతించి
కనలుచు జెంచుమూకల జూచిపలికె
బొడుగు ముత్తెలరామ బడుసులరామ
కుడుముల పెదముద్ద కుంపట్ల సిద్ద
పంతగద్దల నాగ బలికాలి మూగ
చింతకాయల యెఱ్ఱ చింతల బుఱ్ఱ
నక్కల జిన్నన నాగేళ్ల పెన్న
కక్కెల్లనలకేత కడుపుల పోత
కలివికాయల బీద కలగూరమాద
జింకెల పెదబొమ్మచీమల తిమ్మ
సంకు పూసల కామ సజ్జల రామ
వరిగొల్ల నరసాయ వాతకసాయ
వరువంక సోమయ్య వడుగు పిన్నయ్య
గురిగింజ లింగయ్య గుడ్ల సంగయ్య
మంగకాయల చిన్నమారువ పిన్న
యుంగరాలా ముత్త యుట్లపె\న్‌జింత
గాంగేయ చిన్నయ్య గంట్ల వీరయ్య
వంతగద్దల నాగ వరిగారి చిన్న
తుప్పువేదవిసాల దుడుకుల బాల
పప్పుల రామయ్య బడుగు పోతయ్య
కలిగిన చెంచుల బలములు మీరు
తొలుచూరు బిడ్డ ముద్దులకల్కి చిల్క
మనవెంట వేటాడి మనలోనదిరిగి
మనలను గానక మఱియెందు జనెనో
మనలోన నందంద మరువక వెదకి
కలకంఠి పొడగానగావలె మనము
అనుచు గూడెంబు తానంతలో వెడల
గనుఁగొని చెంచుమూకలు వెంటఁదగిలి
చనుదెంచి మనలోన సమకూడి వెదకి
కనుఁగొని నాచెంచు కోమలిఁజూచి
యువిదతో హరిఁగూడియున్న చోటరసి
వివరంబుగా జూచి వెస నిట్టులనిరి.
యెవ్వఁడో యిచటకి నేతెంచి నిలిచి
క్రొవ్వున పడుచుతో గూడి యిందుండి
దుడుకు పడుచునువాఁడు దోడ్కొనిచనిన
యడుగులు గనఁబడె నందరుమీరు
జాడవెంబడిరండు జక్కగా ననుచు
గూడిచెంచులు పెక్కుకుధరముల్‌ దాటి
లలిమించు వేదాచలప్రాంత్యమునకు
చలమున రాగ నచ్చట మురారాతి
పౌరులు గొలువ సంభ్రమలీలతోడ
బేరోలగంబున బెంపొందుచుండ
జెంచు లచ్చటికి వంచించకవచ్చి
యంచితంబుగ మ్రొక్కి హరి కిట్టులనిరి
అవునయ్య తగవుబాగాయెనో రాజ
అవనిలోనింత యన్యాయంబు గలదె
వినవయ్య నీకు నీవేహెచ్చుదలఁప
గినిసి దొరవైతే మ్రొక్కించుకొనవలయు
గాక మనువుపోవు కడుచిన్నిపడుచు
రాకున్న నెత్తుక రా నీకుఁ దగునె
యుబ్బు తేటయ్యెడు పడుచునొప్పగించు
గొబ్బున మేముఁ దోడ్కొని పోవవలయు.
వ. అనిన నిందిరారమణుండు వికసితవదనారవిందుండై యా చెంచుశిఖినాయకునితో నేమనుచున్నాడు.
జంపె. మించి మీలో మీరె మించ నాడుకొనేరు
చెంచులారా పుణ్యసిద్ధిమీకబ్బె\న్‌.
జవరాలు నీపుత్రి సఖి రమాదేవికిని
సవతియైనను భాగ్యసంపదలుగలిగె\న్‌.
కామించి మీరిపుడు కరమర్థితో నన్ను
యేమియడిగిన మీకు నేనొసంగెదను.
వ. అనిన శ్రీహరితో నాశిఖినాయకుండు కోపావేశంబున మఱియు నేమను చున్నాఁడు.
త్రిపుట. ఏమియెఱుఁగని చిన్నిపడుచును ఎట్టు తలజడబట్టితెస్తివి
మాయురే భళి ముచ్చుమందులమాయకాఁడా
వచ్చి యిటువలె దుడుకు పనులకు జొచ్చినపుడే నీవు బలు ముని
మ్రుచ్చువింతేకాక దొరవా మురవిదారా.
ఊరకయె మాపడుచు నిప్పుడె యొప్పగించక నడుగు
తర్లగ నీకు నీపాదంబులానా నీరజాక్షా.
వ. అనిన నిందిరారమణుం డేమనఁ జాలక నూరకుండిన కొందరు సుదతు లిందిరాదేవి మందిరంబునకుం బోయి యేమనుచున్నారు.
జంపె. అలివేణి వినవమ్మ యాగడపు సుద్దులను
గలుగు యాచెంచుబలగము లిందు వచ్చెన్‌.
వచ్చి యందరు నిలిచి వాసుదేవునితోడ
రచ్చలోగదిసి బీరంబులాడుచును
కీడ్పరిచి చెలిఁ దొంగిలించి తెచ్చితివి మరల
నొప్పగించుమటంచు నుడువుచున్నారు.
వ. అనిన నారమాదేవి మనంబున గనికరంబునొంది యాచెంచుల యనుమతంబున శ్రీహరిని దనగృహంబు లోపలికి రావించి యేమనుచున్నది.
త్రిపుట. అచట చెంచులయనుమతిని బెండ్లాడి వచ్చితి ననుచు నంటివి
ప్రకటముగ నీ ముచ్చుతంటలు బయలుపడియె\న్‌.
మఱియు వినుసంసార్లయిండ్లను మనువు బోయెడి పిన్నపడుచుల
జెఱిచి మ్రుచ్చిలి తోడి తెచ్చుట చెల్లుగాదు.
స్వల్పమగుపనులకును జొచ్చియు జాలయారడిబొందెదవు నీ
యల్ప గుణములు మానవైతివి హరిముకుందా.
మునుపు విను మాతండ్రి వెఱ్ఱి సముద్రుఁడును గాబట్టి నీకును
యెనసి కన్యాదానముగ నన్నిచ్చెగాని
వూరకయె వారేల విడుతురు యోలికొడఁబడి వారలకు వి
స్తారముగ ధనమొసఁగి సమ్మతి పరచుకొమ్మా.
వ. అనిన విని శ్రీహరి మగుడి యాస్థానంబునకు వచ్చి యాచెంచు శిఖినాయకునిం బిలిచి మీపడుచుకు ఓలిచెల్లించుకొమ్మనిన యా శిఖినాయకుండు యేమనుచున్నాఁడు.
జంపె. మరుజనక వినవయ్య మాచెంచు కులములో
గరకుపడి యపకీర్తి గాకుండనీవు
వలపుచే పడుచు గావలసియుండితివేని
యెలమి మాకులములో గలసి మెలఁగుచును
అంతరంగమున నీయండ బాయక మమ్ము
సంతరించే మనసు చాలగలినను.
ఓలికొడఁ బడియెదను యోరి మాపడుచుకును
తాలిమితో దలపొడుగు ధనము బోయించూ.
వ. అనిన విని శ్రీహరి జెంచుకులములో గలసి మలఁగుటకు నంగీకరించి యాచెంచు కోమలికి వా రడిగినంత ధనంబు జెల్లించె నటు పిమ్మట యెటువలెను.
జంపె. చెంచు శిఖినాయకుఁడు చెలఁగితనపుత్రి లా
లించి బుద్ధులను మేలిమిగాగ జెప్పె\న్‌
ఆరమాదేవి పాదాబ్జములపైవైచి
కీరవాణిని యొప్పగించి యిట్లనియె\న్‌.
అమ్మయీకొమ్మ సద్గుణజాల
నెమ్మితో లాలించు నెలత యిదియబలా.
వ. అని యొప్పగించిన యారమాదేవి యుచిత సంభాషణంబుల వారల నాదరించె నట యెటువలెను.
ఆట తాలం. చెంచుబలగము నేలి వారితో జెలియతానూ మెలఁగుచు
చెంచహోబలపతి యనంగ బ్రసిద్ధికెక్కున్‌
ధరణిలో తను నమ్మికొలిచిన దాసులకును వరములు
కరుణతో నొసఁగుచును విశ్వాకారుఁడగుచూ
సత్యమూర్తియనంగ గరుడాచలమునందు బాయక
నిత్యనిరుపమ వైభవంబున నెగడుచుండెన్‌.
ద్విపద. అని యిట్లు సకలలోకాధీశుపేర
వనజ భవామర వందితుపేర
గరివరదునిపేర గమలాక్షుపేర
బరమాత్ముపేర విశ్వంబరుపేర
నిగమగోచరుపేర నిర్గుణుపేర
నగధరుపేర బన్నగతల్పుపేర
దురితారిపేర జతుర్భుజుపేర
గరుణాకటాక్షవీక్షణధన్యుపేర
విభవశీలునిపేర విమలాంగుపేర
శుభమూర్తిపేర భాసురకీర్తిపేర
మరుజనకునిపేర మాధవునిపేర
హరిపేర గరుడాచలాధీశుపేర
సన్నుతిమీరంగ సరసులౌననఁగ
వన్నెకెక్కిన నందవరశాసనుండు
చిన్నమాంబా గర్భసింధుచంద్రుండు
చెన్నొంద వెలయఁ జేసిన పుణ్యరతుఁడు
దినకరతేజుఁ డాదిమవిష్ణుభక్త
ఘనుఁడహోబలమంత్రి కవివరేణ్యుండు
పరమభక్తిని సమర్పణముగాఁ జేసి
వివరించె నీకథ విఖ్యాతి వెలయ
పరమభక్తులు దీని పాటించి వినుడి
ధరణిపై నాచంద్రతారార్కముగను.
గరుడాచలము - యక్షగానము - సంపూర్ణము.
AndhraBharati AMdhra bhArati - dESi sAhityamu - garuDAchalamu yakshagAnamu - ahObala maMtri - andhra telugu tenugu ( telugu andhra )