దేశి సాహిత్యము యక్షగానములు నౌకాచరిత్రము
- త్యాగరాజస్వామి
క. శ్రీగణనాథ పరాత్పర
వాగీశ సురేశవంద్య వరగుణసాంద్రా
వేగమె నినుగొల్చెద నను
బాగుగ బాలింపవయ్య పార్వతితనయా.
క. ఏణీలోచన పల్లవ
పాణీ యలినీలవేణి పావనసుత గీ
ర్వాణీ యనయము మ్రొక్కెద
వాణీ నా జిహ్వయందు వసియింపగదే.
క. మ్రొక్కెద దేశికవరునకు
మ్రొక్కెద ధర్మార్థ కామమోక్షదునకు నే
మ్రొక్కెద బదముల ననిశము
మ్రొక్కెద శ్రీరామకృష్ణ మోదాఖ్యునకున్‌.
క. ఇల సత్కవులకు మ్రొక్కెద
దెలియక పద్యములు కృష్ణదేవునిపై నే
లలితముగా రచియించితి
బలుకుల దప్పొప్పులున్న పాలింపరయా.
క. కాకర్లాంబుధి చంద్రుఁడు
శ్రీకరుఁడగు త్యాగరాజ జిత్తనివేశా
నౌకాచరిత మొనర్చెద
శ్రీకాంతా చిత్తగింపు శ్రీరఘురామా.
క. ధరలో హరికృత నౌకా
చరితంబును విన్నవారు సన్మార్గముచే
చిరజీవులై చెలంగుచు
వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే.
శా. లోకానుగ్రహకారియై మును రమాలోలుండు నందాత్మజుం
డాకాంతామణులన్‌ రమింప మదిలో నాహ్లాదసంయుక్తుఁడై
పాకారిప్రముఖుల్‌ మునీంద్రగణముల్‌ బ్రహ్మేశ్వరుల్‌ మెచ్చఁ దా
నౌకాక్రీడ నొనర్చె గోపికలతో నారాయణుండత్తరిన్‌.
శా. చిత్రంబేమని విన్నవింతు వినరే చిన్మాత్రుఁడౌ కృష్ణు చా
రిత్రంబెల్ల వినంగ నిండుసుఖముల్‌ వ్రేపల్లెలో దోచగా
పత్రాహారముచేత నిర్మమతులై బ్రహ్మజ్ఞులీరీతిగా
బుత్రాగార ధనంబులన్మఱచిరే పుణ్యాత్మలౌ గోపికల్‌.
వ. ఆ సమయంబున పరమాత్ముండైన శ్రీకృష్ణదేవుండు గోపికలయందు
ప్రేమగలవాఁడై వేణుగానము చేయు మార్గం బెట్టులనిన.
క. మురహరుఁ డానందముతో
మురళిని గొని సకలజనులు మోహింపగ దా
స రి గ మ ప ధ ని స యనుచును
గరుణను గరజములచేత గానము సల్పెన్‌.
వ. అంతట గోపికామణులు వేణుగానంబు విని యే మొనరించుచున్నా రనిన.
క. వీనుల వేణు రవామృత
పానంబును జేసి చేసి బలు విరహముచే
శ్రీనాథుని వెదకుచు గజ
యానలు మఱి వీధి వీధి దిరిగిరి మమతన్‌.
వ. ఆ సమయంబున శ్రీకృష్ణదేవుండు రేగుపండ్లు కొను వ్యాజంబున
కరములనిండ ముత్యము లిడుకొని నడచుచు వచ్చే మార్గమెటులనిన.
క. ముంగటగ్రమ్మిన మేఘపు
సంఘము లెడబాసినట్టి చందురు వగనే
ముంగురులను దొలగింప జె
లంగెడు శ్రీకృష్ణుమోము లలనలు వేడ్క\న్‌.
వ. కనుంగొని యంతట గోపికామణు లేమి చేయుచున్నారనిన.
శా. శ్రీరమ్యంబగు గోకులంబున జెలుల్‌ చెల్వొంద శృంగారులై
చారాచారుని జూడ జూడ మదిలో సంతోషముల్‌ మీఱగా
రారా కౌగిటికంచు వేడుచు మదిన్‌ రంజిల్లు శ్రీకృష్ణుతో
నారీరత్నములెల్ల గూడి చని రానందాంబుధిం దేలుచు\న్‌.
వ. అంతట గోపికామణులు కృష్ణదేవుని దోడ్కొని ఆటపాటలతో
వేంచేయు మార్గం బెట్టులనిన.
కీర్తన.
01. సురటి - ఆది
పల్లవి:శృంగారించుకొని వెడలిరి శ్రీకృష్ణునితోను
అను పల్లవి:అంగరంగ వైభోగముతో గో
 పాంగనామణులెంతో సొగసుగ
చరణ (1):నవ్వుచు గులుకుచు నొకతె కొప్పున
 బువ్వులు ముడుచుచు నొకతె
 దువ్వుచు గురులను నొకతె కృష్ణుని
 రవ్వజేయుచు నొకతె వేడ్కగ
చరణ (2):మగఁడు వీఁడనుచు నొకతె రవికె
 బిగువున జేర్చుచు నొకతె
 తగును తన కనుచు నొకతె పాద
 యుగముల నొత్తుచు నొకతె వేడ్కగ
చరణ (3):సొక్కుచు సోలుచు నొక్కతె కృష్ణుని
 గ్రక్కున ముద్దిడు నొకతె
 పక్కకు రమ్మనుచు నొకతె మడుపుల
 నక్కఱ నొసగుచు నొక్కతె వేడ్కగ
చరణ (4):పరిమళము లందుచు నొకతె శ్రీహరి
 హరి యనుచును నొకతె
 యురమున జేర్చుచు నొకతె పయ్యెద
 జరిపి వేడుకొనుచు నొకతె వేడ్కగ
చరణ (5):సారసాక్ష యనుచును నొకతె కను
 సైగను బిలుచుచు నొకతె
 రారా యనుచు నొకతె త్యాగ
 రాజ సఖుఁడనుచు నొకతె వేడ్కగ
వ. అంతట గోపికామణులు కృష్ణబ్రహ్మానందావేశంబు గలవారలై
యథేచ్ఛగా యమునాతీరమునకు వేంచేయు ముచ్చట యెట్టులనిన.
శా. వాలాయంబుగ నాటలాడుచు జెలుల్వర్ణించుచుం బోవుచున్‌
ఆలోలంబగు పుష్పవృక్షములతో హంసీసమూహంబుతో
గీలాలంబున భృంగనాద యుతమౌ కెందమ్మి బృందంబుతో
గాలాంభోధర దీప్తితోడ జెలగే గాళిందినిన్‌ గాంచుచున్‌.
వ. అంతట గోపికామణులు అత్యంత కుతూహలంబుచే నొకరొకరు
యమునా దేవిని వర్ణించు మార్గం బెట్టులనిన.
కీర్తన.
02. పంతువరాళి - చాపు (కోలాటదరువు)
పల్లవి:చూడరే చెలులార యమునాదేవి
 సొగసెల్ల సంతోషమున
చరణ (1):యెఱ్ఱని పంకే రుహములే అందు యిం
 పైన భృంగనాదములే
చరణ (2):ఇసుక దిన్నెలెంత తెలుపే మేను
 ఇంద్రనీలము వంటి నలుపే
చరణ (3):మేటికలు వజ్రంపుశిలలే అందు
 కుటిలమైన చిన్నయలలే
చరణ (4):హంసల రవళిచే జాల దేవి
 యదిగో చెలంగె నీ వేళ
చరణ (5):పొలతులార పొదరిండ్లే తేనె
 లొలుకు ఖర్జూరపు పండ్లే
చరణ (6):ఫలముచే ద్రాక్షలతలే అందు
 పచ్చని చిలుకల జతలే
చరణ (7):వింత వింత విరుల వానే మది
 కెంతెంతో మరులయ్యెనే
చరణ (8):కోకిలములు మ్రోసెనే మరుఁడు
 కుసుమ శరంబు వేసెనే
చరణ (9):చల్లని మలయమారుతమే కృష్ణ
 స్వామిని గూడునది సతమే
చరణ (10):రాజవదనలార గనరే త్యాగ
 రాజసఖునిఁ బాట వినరే
వ. అంతట గోపికామణులు ఆనందంబున యమునానది దర్శనము
సేయు సమయంబున నవరత్న ఖచిత రజతమయమౌ ఓడను
జూచి యేమనుచున్నారనిన.
క. నల్లని యమునా నదిలో
దెల్లని రంగైన యోడ దేలుచు మెరయన్‌
బల్లవ పాణులు పొడగని
సల్లాపముతోడ గ్రీడ సల్పదలచుచున్‌.
వ. ఒకరితోనొకరు శ్రీకృష్ణునిగూడి పల్లవక్రీడ సలుప
నాలోచనసేయు మార్గం బెటులనిన.
క. బాలుండది గాక మహీ
పాలుని తనయుండు మేన బంగరు సొమ్ముల్‌
చాల ధరించిన వాడే
యేలాగో వలదటంచు నెంచిరి తమలోన్‌.
కీర్తన.
03. యదుకుల కాంభోజి - చాపు
పల్లవి:ఆడవారమెల్ల గూడి మన
 మాడుదాము హరిని వేడి
అను పల్లవి:కృష్ణుఁడు సూడగ మనము జల
 క్రీడ సల్ప మంచిదినము
చరణ (1):కమలనేత్రుని బాసి సుఖమా ఓడ
 గట్టు జేర్ప మనతరమా
చరణ (2):రాజకుమారుఁడు వీఁడు నవ
 రత్నసొమ్ములు బెట్టినాఁడు
చరణ (3):పసిబిడ్డ గాదటవమ్మా వీఁడు
 భయపడునో తెలియదమ్మా
చరణ (4):తల్లితో చాడి బలుకుదురే మన
 తలలు వంచ దూరుదురే
చరణ (5):మాటకు జోటౌనుగాని మన
 యాటలు దెలియక పోని
చరణ (6):యువతులార మీలోనే మీరు
 యోచింప ప్రొద్దు బొయ్యేని
చరణ (7):చాలుచాలిటు రారమ్మ ఓడ
 సలిలమందు ద్రోయరమ్మ
చరణ (8):త్యాగరాజాప్తుఁడు వీఁడు వని
 తల మాటలు వినలేఁడు
వ. అనినంతట గోపికామణుల హృదయంబు లెఱింగి శ్రీకృష్ణుఁడు
బలుకు ముచ్చట యెటులనిన.
ద్వి.
(శ్రీకృష్ణ గోపికాసంవాదము)
కృ:పురుషుండు లేకనే పూబోణులార
 తరుణులకెపుడైన తగదు సాహసము
గో:భామలు సంతోషపడియుండువేళ
 కాముకుఁడచ్చోట కారాదు కృష్ణ
కృ:బలిమిని సరసంబు బాగుగాదు సుమి
 కలనైన సౌఖ్యంబు గలుగదెన్నటికి
గో:పరకాంతలను జూచి భయమింతలేక
 వెరపు మాటడెదవు వేడ్కగాకృష్ణ
కృ:మీకు సేమంబిందు మిక్కిలి గల్గ
 ప్రాకటంబుగ నేను బల్కితి సుమ్మి
గో:పసిబాలుఁడవు నీవు భారమౌ తెప్ప
 శశిముఖ జరిపింప శక్తియు గలదె
కృ:నినువినా తృణమైన నడుచునా యనుచు
 మును వేదశాస్త్రముల్‌ మొఱబెట్టవినరే
 జీవుల పాలించు శ్రీహరిరీతి
 గోవులు వేయైన గొల్లనేనొకఁడు
 పాలన సేతునే బాగుగా మనవి
 యాలింపుడు మీర లలివేణులార.
వ. అనిన విని గోపికామణులు పలికే మార్గం బెటు లనిన.
క. లోకములో నిను శిశువని
చేకొన రాదనెడి యది ప్రసిద్ధముగాదే
రాకా శశిముఖ వేడ్కగ
శ్రీకర సరివారు నవ్వజేతువె యనగాన్‌.
వ. ఇవ్విధంబున దనయెడ నమ్మికలేక పలికిన గోపికలను జూచి
కృష్ణపరమాత్మ యేమను చున్నాఁడనిన.
శా. సత్యంబౌ దన మాటలెల్ల జలసంచారుండ నే లేకనే
ప్రత్యేకంబుగ దెప్పలాడ నదిలో బథ్యంబుగా దెప్పుడున్‌
నిత్యంబౌ యపకీర్తి మీరలబలల్‌ నిర్వాహమా స్త్రీల కీ
కృత్యం బెవ్వరి బోధనో వలదనెన్‌ గృష్ణుండు పూబోండ్లతోన్‌.
వ. అనిన విని గోపికామణులు కృష్ణదేవునియందు
తప్పుల బలికే దెటు లనిన.
కీర్తన.
04. సౌరాష్ట్ర - చాపు
పల్లవి:ఏమని నెఱ నమ్ముకొందుము కృష్ణా - ఎందుకింతవాదు
అను పల్లవి:జలకమాఁడువేళ వలువలు దాచి మ - మ్మలయింపగలేదా
చరణ (1):ముదితల రమ్మని తిలకములిడి పంట - మోవి నొక్కలేదా
చరణ (2):మును నీవు వెన్ననారగించి తరుణుల - మోమున బూయలేదా
చరణ (3):వదినెగారి చందంబున వచ్చి పావడ - వదలించి పోలేదా
చరణ (4):దొరికితివని చాడి చెప్పబోతే దల్లి - యురమున నుండలేదా
చరణ (5):కామించి యజ్ఞపత్నులు వేడగ - వేణునాద మొనర్పలేదా
చరణ (6):ఆనాఁడు పొంగలి నీకిడి కొన్నాళ్ళు - వాన నుండలేదా
చరణ (7):ధరను త్యాగరాజవినుతుని పలుకులు - తప్పిపోదనలేదా
వ. అని గోపికామణులు తప్పులు బెట్టిన పలుకులు విని, శ్రీకృష్ణదేవుండు
తన సామర్థ్యంబు తెలియ నిట్లనియె.
క. ఈ నదినె కాదు జలనిధి
గాన నిభవవార్ధినిపుడు కడువేగమునన్‌
మానినులార సురాసుర
మానవుల దరింపజేయు మాధవుఁడ సుమీ.
వ. అని మఱియు నిట్లనియె.
కీర్తన.
05. సౌరాష్ట్ర - చాపు
పల్లవి:ఏమేమో తెలియక బలికెదరు చెలులార
 నామీద దయలేక
అను పల్లవి:మును మందరగిరి మునుగ గూర్మమై వీ
 పున దాల్చగ లేదా
చరణ (1):కరిరాజు మకరిచే గాసి చెందగ నేను
 గరుణ జూఁడలేదా
చరణ (2):వెఱువక నీట జొచ్చిన సోమకుని గొట్టి
 వేదము తేలేదా
చరణ (3):కాళిందిలోని కాళియుని మదంబును
 కాల నణచలేదా
చరణ (4):మకరము గొంపోయిన గురుపుత్రుని
 మఱిదెచ్చి యొసగలేదా
చరణ (5):త్యాగరాజునకు సఖుఁడైన నాదు
 ప్రతాపము వినలేదా
వ. అని కృష్ణుండు బలికిన పలుకులు విని, గోపికామణులు అత్యంత
ధైర్యంబు గల వారలై యిటులనిరి.
క. భావజ జనకుని పలుకులు
భావంబున సత్యమనుచు భయవిరహితలై
భావమున నుంచి కృష్ణుని
పావడలను బిగియగట్టి భామలు చనగన్‌.
కీర్తన.
06. సారంగ - ఆది
పల్లవి:ఓడను జరిపే ముచ్చట గనరే వనితలార నేడు
అను పల్లవి:ఆఁడువారు యమున కాడ కృష్ణుని గూఁడి
 యాఁడుచు బాఁడుచు నందఱు జూఁడగ
చరణ (1):కొందఱు హరికీర్తనములు బాఁడ
 కొందఱానందమున ముద్దులాఁడ
 కొందఱు యమునాదేవిని వేఁడ
 కొందఱి ముత్యపు సరు లసియాఁడ
చరణ (2):కొందఱు తడబడ బాలిండ్లు కదల
 కొందఱు బంగరువల్వలు వదల
 కొందఱ కుటిలాలకములు మెదల
 కొందఱు బల్కుచు కృష్ణుని కథల
చరణ (3):కొందఱు త్యాగరాజ సఖుఁడే యనగ
 కొందఱి కస్తూరిబొట్టు కరగగ
 కొందఱ కొప్పుల విరులు జారగ
 కొందఱ కంకణములు ఘల్లనగ
వ. అంతట తరుణీరత్నములెల్ల జలక్రీడ సేయు సమయంబున
శృంగారించు కొనిన దెటులనిన.
సీ. పన్నీరు గంధముల్‌ పణతులందఱు మేన - బాగుగా నలదిరి భావుకముగ
మల్లెల మొల్లల మరువంపు జాజుల - హారముల్‌ ధరియించి రబల లపుడు
వరమైన సాంబ్రాణి వత్తులు నిలిపిరి - దివ్యమౌ కస్తూరి దిద్దుకొనిరి
ఆకులువక్కలు తెల్లటాకులు జాపత్రి - జాజికాయల జేర్చి జాణలెల్ల
విడియములు సేసి వెలసిరి వేడ్కమీఱ - స్వర్గ భోగంబు లివియంచు స్వాంతమునను
పరగ నానందమున బాటపాడుకొనుచు - ఓడ నతిప్రేమ జరిపిరి యువిదలపుడు.
వ. అంతట గోపికామణులు కృష్ణ బ్రహ్మానందావేశంబు
గలవారలై యేమనుచున్నారు.
కీర్తన.
07. భైరవి - చాపు
పల్లవి:తనయందే ప్రేమ యనుచు విరిబోణులు
 తల తెలియక నాడెదరు
అను పల్లవి:అనయము మోహము మీఱగ కృష్ణుఁడు
 అందఱి కన్ని రూపము లెత్తి యాడగ
చరణ (1):కొందఱి బంగారు కొంగులు బట్ట
 కొందఱి పదములు బాగుగ నెట్ట
 కొందఱి సొగసును గనులార జూఁడ
 కొందఱి మనసు దెలిసి మాటలాడ
చరణ (2):కొందఱి యంకమునను బవ్వళింప
 కొందఱి పెదవుల బలుకెంపులుంచ
 కొందఱి తనువుల కరలీలసేయ
 కొందఱి వెనుక నిలిచి జడవేయ
చరణ (3):కొందఱి నుదుట కస్తూరి బొట్టుపెట్ట
 కొందఱి తళుకు చెక్కుల ముద్దుబెట్ట
 కొందఱి పాలిండ్ల బన్నీరు జిల్క
 కొందఱితో త్యాగరాజ నుతుఁడు బల్క
వ. ఆ సమయంబున బ్రహ్మేంద్రాది సురలెల్ల యేమి సేయుచున్నారనిన.
క. వనితల హృదయము గనుగొని
ఘన సరసక్రీడ సల్పు కరుణానిధిపై
కనకకుసుమ వర్షముల గ
గనవాసులు గురియజేసి గాంచిరి ప్రేమన్‌.
వ. ఆ సమయంబున మత్తకామినులు యౌవన మదాంధకారులై
యేమి సేయుచున్నారనిన.
చ. కుచములపై జెలంగెడి దుకూలములన్‌ బిగియించి పుష్పముల్‌
కుచములలో ధరించుచును గాంతలు కోలలబట్టి కృష్ణుతో
వచనము లాడుచున్మలయ వాతము వీవగ గర్వశైల మె
క్కుచు సుమబాణ లీలలను కూరిమి బాడుచు నోడ దోయగన్‌.
కీర్తన.
08. పున్నాగవరాళి - రూపకం
పల్లవి:ఏ నోము నోచితిమో చెలుల - మేదాన మొసగితిమో
అను పల్లవి:శ్రీనాథు కొలువమరే జెలుల - చెక్కిళ్ల నొత్తుచును
 మానక మోవానుచు చం - ద్రానను హృదయమున నుంచ
చరణ (1):శ్రీరత్నములు మనము చెలుల - శ్రీమించు యౌవనము
 వారిజలోచనుఁడు చెలుల - పాలాయె గదవమ్మ
 కోరిక లీడేరెను యదు - వీరుని కనులార జూడ
చరణ (2):బంగారు సొమ్ములను చెలులు - బాగుగా బెట్టుకొని
 శృంగారాంబరములను చెలులు - చెలువొంద గట్టుకొని
 సంగతిగా సంగములు శుభాంగునికి - నొసంగగ మన
చరణ (3):పొంగారు ఈ నదిలో చెలులు - పొందుగా గుమిగూఁడి
 మంగళాకారునితో చెలులు - మనసార గూడితిమి
 రంగపతి యుప్పొంగుచు మన - చెంగటను జెలంగగ మన
చరణ (4):వాగీశాద్యమరులకు చెలుల - వర్ణింప తరమౌనె
 త్యాగరాజాప్తునితో చెలులు - భోగములందుచును
 బాగుగ దమిరేగగను నయ - రాగము లీలాగుబాడ
వ. అంతట గోపికామణుల హృదయం బెఱుంగుటకై శ్రీకృష్ణదేవుండి ట్లనియె.
చ. కుసుమపు వాసనల్‌ విసర గోకిల నాదములిందు మ్రోయగా
గొసరుచు మిమ్ము వేడుచును గోర్కెలు దీర్చను నా సరెవ్వరే
యసదృశమైన మీ సొగసు లబ్జభవాదులకైన గల్గునే
మసలక చిల్కకోలలను మాటికి బశ్చిమ దిక్కునుంచరే.
వ. అంతట లలనామణులు కృష్ణుని వచనములు కపటంబుగా
నెంచుకొని బలికేదెటులనిన.
క. సొగసే గానిక నిను న
మ్మగ రాదపకీర్తి గాదె మహిలోపల నీ
వగలెల్ల గట్టిపెట్టుము
నగధర మావద్ద నింక నడువదు సుమ్మీ.
కీర్తన.
09. సావేరి - రూపకం
పల్లవి:చాలు చాలు నీ యుక్తులు నడువదు
 సారసాక్ష శ్రీకృష్ణా
అను పల్లవి:శూలధరాధుల కరుదైన మము గూడి
 సుఖము లనుభవింపవే శ్రీకృష్ణా
చరణ (1):అధర రదనముల గని సొక్కుచు మే
 మాశించి వచ్చితిమి
 బుధరక్షక శల్యసారథ్య మొనరించి
 బొంకు టెరుగమైతిమి శ్రీకృష్ణా
చరణ (2):కండ చక్కెరవంటి పలుకులు విని మేము
 కామించి వచ్చితిమి
 ఉండి యుండి బాలుని గిల్లి మరితొట్ల
 యూచున దెరుగమైతిమి శ్రీకృష్ణా
చరణ (3):త్యాగరాజ నుతుఁడని యతి ప్రేమచే
 తరుణులు వచ్చితిమి
 భోగిశయన మా మాటలు మీఱకు
 బుద్ధిశాలి వౌదుసుమీ శ్రీకృష్ణా
వ. అయ్యెడ.
క. లంజలు సురపతి సభలో
గుంజరదనుజారి సభలో కుతన గణంబుల్‌
కంజజు సభలో యతులని
మంజుల ముఖులాడుకొనిరి మాధవు సభలో.
వ. అంతట కృష్ణబ్రహ్మానందావేశముచే పరవశులై గోపికలు
క్రీడించు సమయమున దేవతాస్త్రీలు ఏమి చేయుచున్నారనిన.
కీర్తన.
10. కాపి - చాపు
పల్లవి:చూతాము రారే యీ వేడ్కను సుదతులార నేడు!
అను పల్లవి:పురుహూతాదుల కరుదైన యోడలో
 యువిదలెల్ల హరిని గూడి యాడెదరు!
చరణ (1):ఒకరి కొకరు గంధము నలదెదరు
 ఒకరి కొకరు తిలకము దిద్దెదరు
 ఒకరి కొకరు వీడెము లొసగెదరు
 ఒకరి కొకరు హారము వేసెదరు!
చరణ (2):ఒకరి కొకరు వలువలు గట్టెదరు
 ఒకరి కొకరు రవికెలు దొడిగెదరు
 ఒకరి కొకరు కౌగిట గూర్చెదరు
 ఒకరి కొకరు తమలో సొక్కెదరు!
చరణ (3):ఒకరి కొకరు పాటలు పాడెదరు
 ఒకరి కొకరు సరసము లాడెదరు
 ఒకరి కొకరు హరియని చూచెదరు
 ఒకరి కొకరు కానక భ్రమసెదరు!
వ. అని యిట్లు పలుకుచు, అప్సరస్త్రీలెల్ల నచ్చటికి వచ్చి
యుత్సవంబు గనుంగొనుచుండ గోపికామణు లత్యంత
సౌందర్యముచే తమకు సమాన మెవరులేరని బలుకుచున్నారు.
క. హరి హర కమల భవాదులు
నర సుర కింపురుషులెల్ల నమ్రులు గా కె
వ్వరు మన కుచకచ వదనా
ధరములగని తప్పువారు ధరలో ననుచున్‌.
వ. మఱియు నిట్టులనిరి.
కీర్తన.
11. దేవగాంధారి - ఆది
పల్లవి:ఎవరు మనకు సమాన మిలలో - నింతులార నేడు!
అను పల్లవి:అవని హరి హర బ్రహ్మాది సుర -
 లాసచే మోసపోయిరి గనుకను!
చరణ (1):నలువ తనయపై మోహము జెంది
 నాడే తగిలిపోయె
 ముద్దులొలుకు శ్రీహరి వలచుచు
 బృందాలోలుడై పోయె
 చిలువ భూషణుడు దారుకావనపు
 చెలుల పాలాయె గో
 కులమున త్యాగరాజనుతుడు మన
 వలల దగిలిపోయె గనుకను!
వ. అంతట గోపికామణులు అత్యంత లావణ్య గర్వముచే మైమఱచి యేమనుచున్నారు.
సీ. బొంకులాడుచు లెస్స భోగింప నేర్చునే - ఓడను జరిపింప నొనరు లేదు
వనితల జూచిన వలపింప నేర్చునే - ఓడను జరిపింప నొనరు లేదు
మన రూపముల జూచి మన వెంట దిరుగునే - ఓడను జరిపింప నొనరు లేదు
సొగసుఁ జేసుకవచ్చి సొక్కింప నేర్చునే - ఓడను జరిపింప నొనరు లేదు
అనుచు భావింప మాధవుడది యెఱిగి - గొప్ప సుడిగాలి బలు మేఘ ఘోషణముల
గూడ వర్షము గురియింప నోడలోన - ద్వారమటు కల్గి నీరురా దొడగెనపుడు.
వ. అంతట గోపికామణుల మదగర్వంబు లణంచుటకై యెంచిన
శ్రీమత్‌ కృష్ణమూర్తి హృదయం బెరింగి ఇంద్రాదిసుర లేమి చేయుచున్నారు.
శా. పాకారి ప్రముఖుల్‌ వినోదములు సల్ప న్నాజ్ఞగావింపగా
నాకాశంబున నుండి వానవడగండ్లావేళ వ్రాలెన్‌ మరిన్‌
నౌకా రంధ్రములో జలంబుచొరగా నత్యంత వ్యాసంగలై
శ్రీకారుణ్యనిధే హరేయని చెలుల్చింతించి రయ్యోడలోన్‌.
వ. అంతట గోపికామణు లత్యంత భయాక్రాంతలై యేమనుచున్నారు.
కీర్తన.
12. ఘంటా - చాపు
పల్లవి:ఉన్నతావున నుండ నియ్యదు వాన
 యురుములైతే వెనుక తియ్యదు!
అను పల్లవి:సుడిగాలి యోడజుట్టి వడి
 వడిగా వానలైతె గొట్టి!
చరణ (1):ఓడలో రంధ్రము గలిగె యీ
 వనితల కెవ్వరు సలిగె!
చరణ (2):కనులకెందు గానరాదు
 గతి కాళింది మనకికమీదు!
చరణ (3):మతి పోవుదారి జనిరమ్మా అపుడె
 మదమింత వలదంటినమ్మా!
చరణ (4):మనమొక్కచో గూడరాదు ప్రళయ
 మన నిదిగా వేఱుగాదు!
చరణ (5):రాజవదనలు రారమ్మా త్యాగ
 రాజ సఖుని జూడరమ్మా!
వ. ఇవ్విధంబున జాలింజెందుచు కృష్ణదేవుని జుట్టుకొని గోపికామణు లేమనుచున్నారనిన
శా. ఈ రాజానను నాడికొన్న ఫలమో యే మానినీశాపమో
ఈ రామామణులేగువేళ గుణమో యే వేల్పుదుష్కృత్యమో
వేరేదారిక తోచదేయని మదిన్వేమారు చింతించుచున్‌
నారీ రత్నములెల్ల జాలిపడుచు న్నానావిలాపంబుల\న్‌.
వ. ఇవ్విధంబున గోపికామణులు వ్యసనాక్రాంతలై కృష్ణదేవునికి
క్షేమంబు గలుగు కొఱకు యమునా దేవిని ప్రార్థించిరి.
కీర్తన.
13. సౌరాష్ట్ర - ఆది
పల్లవి:అల్లకల్లోలమాయె నమ్మ యమునాదేవి మా
 యార్తులెల్లను దీర్చు మాయమ్మ
అను పల్లవి:మొల్లలచే బూజించి మ్రొక్కెదము బ్రోవుమమ్మ
చరణ (1):మారుబారికి దాళలేక యీ రాజకు
 మారుని దెచ్చితి మిందాక
 తారుమారాయె బ్రతుకు తత్తళించున దెందాక
చరణ (2):గాలివానలు నిండారాయె మాపనులెల్ల
 గేలి సేయుట కెడమాయె
 మాలిమితో మమ్మేలు మగని యెడబాయనాయె
చరణ (3):సొమ్ములెల్ల నీకొసగెదమమ్మ యమునాదేవి యీ
 సుముఖుని గట్టు జేర్పుమమ్మ
 యెమ్మెకాని బలిమిని యేల దెచ్చితిమమ్మ
చరణ (4):నళినభవుడు వ్రాసిన వ్రాలు ఎటులైన గాని
 నాథుడు బ్రతికి యుండిన జాలు
 ప్రళయము లయ్యెను యేపని చేసిన భామలు
చరణ (5):దేహములెల్ల నొసగెదమమ్మా ఓదేవి కృష్ణ
 దేవుని గట్టుజేర్చుమమ్మ
 మోహనాంగుని మేము మోసబుచ్చితిమమ్మ
చరణ (6):మేమొక్కటెంచ బోతిమమ్మా పాపాలిదేవు
 డేమేమో యెంచుకొన్నాడమ్మా
 రామరో శ్రీత్యాగరాజాప్తుని బాయమమ్మా
వ. ఇటువంటి సమయంబున విష్ణు పదధ్యానము
చేయుచు బ్రహ్మేంద్రాదిసురులెల్ల యేమి పలుకుచున్నారు.
క. పారము గానని యీ భవ
వారిధిని దరింపజేయు వరదుని కొఱకై
మూరెడు యమునానదిలో
సారెకు వర్ధిల్ల వేడు చందముగనరే.
వ. అంతట గోపికామణులు యమునాదేవివలన సౌఖ్యంబులేమియు లేక
మహావ్యసనము బొందిన వారలై యిట్లనిరి.
సీ. బాలభావముతోడ బణతుల పాలిండ్ల - పై బవ్వళించేటి పద్మనాభు
నింటింట జొరబడి యిల్లాండ్ల బట్టుచు - వేడ్కగా దిరిగేటి విమలహృదయు
ముద్దుగారగ నూరి ముదితల నేలుచు - నీడను శోభిల్లు నిర్మలాత్ము
స్త్రీబుద్ధివల్లను చెరుచు కొంటిమిగాక - యేలదెచ్చితిమమ్మ యేలు విభుని
తల్లడిల్లెడి కాళింది దాటి తల్లి చెంత - గృష్ణుని యేవేళ జేర్తుమమ్మ
యనుచు దారుణ్యవతులెల్ల నలరుచుండ - జూచి మదిలోన నగుచుండె సుముఖుడపుడు.
వ. అట్టి సమయమున శ్రీకృష్ణదేవుడు గోపికామణులనేచుటకై
జాలి చెందిన వానివలె నిట్లనియె.
ద్వి. భామలమ్మెడు రేగు పండ్లకై నేను
కామించి ముత్యముల్‌ కరములనిండ
నునుచుక నే రాగ నుప్పొంగి మీరు
కనుల ద్రిప్పుచు నెత్తికొని వేడ్కతోడ
మంజుళముఖులార మదవతులార
కొంజక ననుదేగ గొబ్బున నిటకు
అపుడు నే రానని యాడుకోలేక
యిపుడు శోకించుట హాసముగాదే
యింతకు వచ్చుట యెఱుగలేనైతి
యింతుల నమ్మరాదెంత వారికిని.
వ. వైద్యుడు వెసనపడు చందంబున కృష్ణదేవుండనిన విని
గోపికలు మిక్కిలి వెసనపడుచు యేమనుచున్నారు.
ఉ. మానున బెట్టు తేనియను మానకదెచ్చి మదించి మానినీ
తాను భుజింపలేక వసుధాస్థలి నొలకబోసుకొన్న చం
దాన పురంబున న్వెలయు దానవవైరిని గూడ లేకనే
మానము పోవనాయె మన మందరి బాపము బోసుకొంటిమే.
వ. అనుచు నంతట గోపికామణులు జన్మాంతర కృతపూజా ఫలముల
దలచి యేమని పలుకుచున్నారు.
కీర్తన.
14. ఘంటా - ఆది
పల్లవి:పెరుగు పాలు భుజియించి తనువుల
 బెంచిన దెల్ల నిందుకా
అను పల్లవి:నిరవధి సుఖదాయక మా వయసు
 నీటను గలయుటందుకా
చరణ (1):అత్తమామలతో నీకై మేమెదు - రాడిన దెల్ల నిందుకా
 సత్తగలిగి ఇకనైన నుందుమని - సంతసిల్లిన దిందుకా
చరణ (2):ఆసదీర నీసేవ వలయునని - అలసినదెల్ల నిందుకా
 పాసియుండనేరక పెద్దలచే - బాములు చెందిన దిందుకా
చరణ (3):స్నానపానములు జేయువేళ నిను - ధ్యానము చేసిన దిందుకా
 మేనుల నీ సొమ్ములు సేయుటకై - మేమల్లాడిన దిందుకా
చరణ (4):తలిరు బోణులై యమునానదిలో - తల్లడిల్లు టందుకా
 వలచుచు దొలిజన్మము రామునిచే - వరములు బడసిన దిందుకా
చరణ (5):కోటి జన్మములు తపములు జేసి - కోరినదెల్ల నిందుకా
 సాటిలేని నీ లీలలు మనసున - సైరించి యున్న దిందుకా
చరణ (6):ఆగమనిగమ పురాణాచారుడని - యనుసరించిన దిందుకా
 త్యాగరాజనుత తారకనామ నీ - తత్త్వము దెలిసిన దిందుకా
వ. ఈ విధంబున వ్యసనాక్రాంతలై కలవరించు గోపికాసుందరుల
జూచి శ్రీకృష్ణదేవుడు బ్రతుక నుపాయము బలికే దెటులనిన.
ఉత్సాహ. అంగలార్చరాదు ఓ భుజంగవేణులార యా
యంగజారికైన కర్మ మంతరానలంబు సా
రంగ నేత్రలార పంచరంగు కంచుకంబులన్‌
బొంగి వచ్చు నీటి కట్టె బొందుగాగ నుంచరే.
వ. ఆపత్కాలోపాయమైన వార్తలవిని గోపికామణు లేమి సేయుచున్నారనిన.
క. ఆ మనవిని విని సుదతులు
క్షేమము కొఱకై ముదాన శీఘ్రముగానే
యేమరక కంచుకమ్ములు
నేమముతో నునుప దాన నిల్వక పోయెన్‌.
వ. నవరత్నఖచిత కనకమయమైన కంచుకమ్ములు నౌకారంధ్రములో
నునుప నందు నిలువక నిమిషమున నీట బోజూచి గోపికామణు లిట్టులనిరి.
కీర్తన.
15. పున్నాగవరాళి - త్రిపుట
పల్లవి:కృష్ణా మాకేమి దోవ బల్కు
 కీర్తి గల్గును యాదవబాల
అను పల్లవి:సరిగె రవికె లెల్ల బోయె
 వెఱ్ఱి చలికి మేనోర్వనాయె శ్రీ
చరణ (1):సరివారిలో సిగ్గుబోయె
 నీరు జానులపై దాకనాయె శ్రీ
చరణ (2):సర్వము నేననుకొన్న నీదు
 సామర్థ్యము జూపు చిన్న శ్రీ
చరణ (3):పాయలేనిమమ్ము నీవు యే యు
 పాయమైన దెల్పి బ్రోవు శ్రీ
చరణ (4):మాతో చేరగ యింత బాధకల్గె
 మఱతుమా ఇక ప్రాణనాథ శ్రీ
చరణ (5):ఇందుకనుచు తల్లి సాకెనో లేక
 యే పాపులకండ్లు తాకెనో శ్రీ
చరణ (6):రాకేందు ముఖ దయరాదా త్యాగ
 రాజార్చిత బ్రోవరాదా శ్రీ
వ. ఇవ్విధంబున నత్యంత వ్యసనంబుతో కన్నీరొల్కగా కలవరించే
గోపికాసుందరులజూచి కృష్ణదేవు డేమనుచున్నాడు.
క. శోకింప వేళ గాదిది
రాకాశశివదనలార రజతమయంబౌ
నౌకారంధ్రములోపల
కోకలు వదలించి మీరు గొబ్బున నిడరే.
వ. అనినంతట గోపికామణులు లజ్జాక్రాంతలై యేమనుచున్నారు.
క. రాజముఖుం డాడగ విని
రాజీవదళాక్షు లంతరంగములో సం
కోచముతో వ్యధ జెందుచు
స్త్రీ జన్మంబేలకలిగె ఛీ ఛీ యనుచున్‌.
కీర్తన.
16. వరాళి - త్రిపుట
పల్లవి:ఇందుకేమి సేతుమమ్మ కృష్ణుడెంతో మాటలాడెనమ్మ
అను పల్లవి:మగువలంటే ఇంతవాదా మాకు మానమే ప్రాణముగాదా
చరణ (1):కృ:గుసగుసలందేమి వచ్చు చెలువారు
 ఉసురుంటే ఊరుబోవచ్చు
చరణ (2):గో:వనితలగని యెవరైనా కృష్ణా
 వంచనగా బల్కదగునా
చరణ (3):కృ:హటము సేయ వేళగాదు ఆత్మ
 హత్యగాని వేరే లేదు
చరణ (4):గో:నగ్నముగా నిల్వవశమా కృష్ణా
 నలుగురిలో మాకు యశమా
చరణ (5):కృ:నా మాటలు విని మీరు వేగ
 నను గట్టుజేర్చ బోనీరు
చరణ (6):గో:లలనల పాపములేమో యీ
 లాగు వ్రాతలుండెనేమొ
చరణ (7):కృ:వెలకు దీసిన వలపురాదు
 వెలదుల ఇక నమ్మరాదు
చరణ (8):గో:రాజన్య యిటు యెంచవలదు త్యాగ
 రాజవినుత ప్రేమ గలదు
వ. అంతట గోపికామణులు కృష్ణదేవుని నమ్మవచ్చునని
యొకరితోనొకరు ఆలోచన చేసి యిటులనిరి.
క. అగణితలోకాధారుడు
నిగమాగమ సంచరుండు నిర్మల హృదయుం
డగధరు డనయము బ్రోచును
వగజూపడు వనితలార వరదుండనుచున్‌.
కీర్తన.
17. మోహన - చాపు
పల్లవి:వేద వాక్యమని యెంచిరి యీ - వెలదులెల్ల సమ్మతించిరి
చరణ (1):చీరలన్నియు వదలించిరి యెంతో
 సిగ్గుచేత నందుంచిరి
చరణ (2):అందున నిలువక పోయెను మేను
 లందఱికి దడవనాయెను
చరణ (3):కనుగొందురోయని సరగున బాలిండ్ల
 కరముల మూయమరుగునా
చరణ (4):మానములను మూసుకొందురో తమ
 ప్రాణములను గాచుకొందురో
చరణ (5):చెలుల నోరెండగనాయెను నీరు
 చిలుచిలుమని యెక్కువాయెను
చరణ (6):వల్వలు గానకపోయెను సతుల
 వదనములటు స్రుక్కనాయెను
చరణ (7):కరగి కరగి యంగలార్చిరి చెలులు
 కమలాక్షు నురమున జేర్చిరి
చరణ (8):కనుల గాటుక నీరు కారగా జూచి
 కాంతుడెంతో ముద్దుకారగా
చరణ (9):రమణుల మదమెల్ల జరిగెను త్యాగ
 రాజనుతుని మది కరగెను
వ. అంతట గోపికా మణులు వ్యసనాక్రాంతలై యేమను చున్నారనిన.
ఉ. లగ్నమ దెట్టిదో వనితలందఱు వచ్చిన వేళ దేవతల్‌
మగ్నుల జేసిరో కమల మందు జనించిన వాని వ్రాతయో
విఘ్నము వచ్చునా యనుచు వింటిమి వార్తలు విశ్వసింపుచున్‌
నగ్నలమైతి మేమిగతి నాథ దుకూలము లెందుగానమే.
వ. అని గోపికామణులు జన్మాంతర సుకృతంబుచే జ్ఞానోదయమంది ప్రపంచ
భోగ భాగ్యములన్నియు నశ్వరమని యెంచి శ్రీకృష్ణమూర్తి పాదారవిందంబు
చేరుటకై యోచించు మార్గం బెటులనిన.
చ. బ్రతుకను దారిగానమిక భారము తాళదు యోడ లోపలన్‌
కుతికను బట్టె నీరిపుడు గొబ్బున శ్రీహరి పాద పద్మముల్‌
మదిని దలంచుకొంచు వర మాధవ నామము నోట బల్కరే
పతితుల బ్రోచువాడు మన పాలిటకల్గి సుఖంబు లిచ్చునే.
వ. అని తలంప నా సమయంబున సర్వాధారుండును, నిర్వికారుండును,
నిరంజనుండును ఆదిమధ్యాంతరహితుండును, జగన్మోహనాకారుండునుగా,
దర్శనంబిచ్చిన శ్రీకృష్ణదేవుని జూచి గోపికలిట్లనిరి.
కీర్తన.
18. పున్నాగవరాళి - ఆది
పల్లవి:హరి హరి నీ దివ్య పా
 దారవింద మియ్యవే
అను పల్లవి:ధరను గల భోగభాగ్యమెల్లను
 తథ్యముగాదు సుమీ శ్రీకృష్ణా
చరణ (1):సనకసనందన శ్రీనారద శుకా
 ర్జున ఘనులెల్ల నుతించు
 వనజ నయన బ్రహ్మాది
 సంక్రందను లనయము సేవించ
చరణ (2):నిను వేద పురాణాగమ శాస్త్ర
 విద్యలనెల్ల చరించు
 ఘనసమనీల నిరంజన నిర్గుణ
 కనికరముగ త్యాగరాజు భావించు
వ. ఇవ్విధంబున కీర్తించుచున్న గోపికామణుల జూచి అత్యంత
పరమ దయాళువైన శ్రీకృష్ణ పరమాత్మ యేమనుచున్నారు.
చ. పరమ దయాకరుండు నిజ భక్త జనావను డప్రమేయుడా
సురగణ నీరదానిలుడు శంకరమిత్రుడు శాంతరూపుడీ
తరుణులు పొందునట్టి పరితాపము జూచి కరంగి వేగమే
కరుణ యొనర్ప దల్చుచును గాంతల కిట్లనియెన్‌ బ్రియంబునన్‌.
క. నన్నే ధ్యానము సేయుచు
గన్నీరుల నిలిపి మీరు కరయుగళముచే
గన్నులు మూసి భజింపుడు
పన్నుగ మీ పాలివేల్పు ఫలమిచ్చు దయన్‌.
వ. అని పలికిన శ్రీకృష్ణదేవుని పలుకులు విని గోపికామణులు
సీ. వ్యాధులు గలవారు వైద్యుని మాటలు - విశ్వాసము తోడ వినిన యటుల
పూర్ణ గర్భిణులైన పొలతు లెల్లను మంత్ర - సాని చెప్పిన మాట సల్పినట్లు
పరిచారకాదులు భాగ్యవంతుని మాట - దప్పక విన్నట్లు తరుణు లెల్ల
పరమేశ్వరుని మాట భక్తితో విని కను - ల్మూసి భజించిరి వాసి మెరసి
తే. అంధకారంబు వర్షంబు నణగి పోయి - నోడ దరిచేరవచ్చెను పోడిమిగను
కనకమయ వస్త్రముల రమ్య కంచుకముల - జూచి యుప్పొంగి రావేళ సుదతు లెల్ల.
వ. అపుడు కోటిమన్మథాకారుడు కువలయ నేత్రుడైన శ్రీకృష్ణ
పరమాత్మను జూచి గోపికామణులేమి సేయు చున్నారనిన.
చ. కలువల రాజు చందమున గాంతి చెలంగెడి కృష్ణుమోమునన్‌
దిలకపు చాకచక్యమును దివ్య సువర్ణపు గుండలంబులన్‌
జెలగు కపోలయుగ్మమును జేడియలందరు చూచినంతనే
తొలుతటి దుఃఖముల్మరచి తోడుత పాడిరి సంతసిల్లుచున్‌
వ. మఱియు గోపికామణులేమి సేయు చున్నారనిన.
ఉ. మంజుళభాషు రూపజితమన్మథు జంద్రకులప్రదీపు స
త్కుంజరపోషు శోభననికుంజగృహాంతనివాసు మౌనిహృ
త్కంజవిహారు ధీరు వరకాంచనచేలుని జూచినంతనే
కంజదళాక్షులెల్ల హరి కౌగిట జేర్చిరి సంతసిల్లుచున్‌.
వ. గోపికామణులు కృష్ణమూర్తికి శృంగారించున దెట్టులనిన.
కీర్తన.
19. పున్నాగవరాళి - ఆది
పల్లవి:గంధము పుయ్యరుగా పన్నీరు
 గంధము పుయ్యరుగా
అను పల్లవి:అందమైన యదునందనుపై
 కుందరదన లిరవొందగ పరిమళ
చరణ (1):తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
 కలకలమను ముఖకళగని సొక్కుచు
 బలుకుల నమృతము లొలికెడు స్వామికి
చరణ (2):చేలము గట్టరుగా బంగరు చేలము గట్టరుగా
 మాలిమితో గోపాల బాలులతో
 నాల మేపిన విశాలనయనునికి
చరణ (3):హారతులెత్తరుగా ముత్యాల హారతు లెత్తరుగా
 నారీమణులకు వారము యౌవన
 వారక యొసగెడు వారిజాక్షునికి
చరణ (4):పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
 జాజులు మరి విరజాజులు దవనము
 రాజిత త్యాగరాజ నుతునికి
వ. ఆ సమయంబున గోపికారత్నముల మధ్యంబున కృష్ణ
పరమాత్మ ప్రకాశించే దెటులనిన.
సీ. ఋక్ష బృందము లోని రేరాజు చందాన - పక్షి వాహనుడందు బరగుచుండె
సురల బృందములోని సురరాజు చందాన - పరమాత్ముడావేళ బరగుచుండె
నవరత్న రాజిలో నాయకమణి రీతి - పావనుడావేళ బరగుచుండె
కరిణీ నిచయమున కరిరాజు చందాన - బాగుగా గృష్ణుండు బరగుచుండె
బ్రహ్మరుద్రాది వేల్పులు పద్మనాభు - చాక చక్యంబు గనుగొని సంతసిల్లి
కనకసుమ పూజ లొనరించి గాంచి హరిని - స్వస్వ భవనమ్ములకు నేగ సతులు జనిరి.
కీర్తన.
20. సౌరాష్ట్ర - చాపు
పల్లవి:ఘుమ ఘుమ ఘుమయని వాసనతో ముద్దు
 గుమ్మలు వెడలిరి చూడరే
అను పల్లవి:మమతతోను సురవరులెల్ల సురతరు
 సుమవాసనలు గురియింప వేడ్కగ
చరణ (1):నలువంక పగలు వత్తులు తేజరిల్లగ
 చెలగ సాంబ్రాణిపొగలు గ్రమ్మ గంధ పొ
 డులు చల్లుచు బయ్యెదల దీయుచు బన్నీ
 రులు చిలుకుచు యదుకుల వీరునితో
చరణ (2):బంగారు చీరలు రంగైన రవికలు
 నుంగరములు వెలయంగ సొగసుగ భు
 జంగశయనుడగు రంగపతిని జూచి
 పొంగుచు దనివార గౌగిలించుచును
చరణ (3):వరమైన కనక నూపురములు ఘల్లన
 యురమున ముత్యాలసరులెల్ల గదలగ
 కరమున సొగసైన విరిసురటులచే వి
 సరుచు త్యాగరాజ వరదుని బొగడుచు
వ. అంతట గోపికామణులు అత్యంత కుతూహలముచే కృష్ణదేవుని
దోడ్కొని విడిదిలో నుంచి మంగళము పాడేదెటులనిన.
కీర్తన.
21. సురటి - చాపు
పల్లవి:మా కులమున కిహపర మొసగిన నీకు
 మంగళం శుభమంగళం
అను పల్లవి:మౌనుల బ్రోచిన మదన జనక నీకు
 మంగళం శుభమంగళం
చరణ (1):మదగజగమన మానితసద్గుణ నీకు
 మంగళం శుభమంగళం
 మదమోహరహిత మంజుళరూపధర నీకు
 మంగళం శుభమంగళం
చరణ (2):మనసిజవైరి మానససదన నీకు
 మంగళం శుభమంగళం
 మనవిని విని మమ్మేలుకొన్న నీకు
 మంగళం శుభమంగళం
చరణ (3):మామనసున నెలకొన్న కృష్ణా నీకు
 మంగళం శుభమంగళం
 మా మనోరథపాలిత త్యాగరాజ
 మంగళం శుభమంగళం
ఫలశ్రుతి:
శ్లో. త్యాగరాజకృతాం పుణ్యకథాం సాధుమనోహరాం
యే శృణ్వంతి నరాలోకే తేషాం కృష్ణః ప్రసీదతి.
ఇతి త్యాగరాజ విరచిత నౌకాచరిత్రమ్‌ సమాప్తమ్‌.
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - naukAcharitramu - yaxagAnamu - naukA charitramu - yaxa gAnamu - naukA charitra - yaxagAna( telugu andhra )