ధార్మిక వ్రతములు వినాయక వ్రతము

ప్రారంభము
     శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్‌।
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే॥

సుముఖ శ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః॥
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః।
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః॥
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా।
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
సంధ్యావందనము
     ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణ స్వాహా, ఓం మాధవాయ స్వాహా,
గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః,
త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః,
హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః,
సంకర్షనాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అథోక్షజాయ నమః,
నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః.
ప్రాణానాయమ్య
     ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥
సంకల్పమ్‌
     మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే
శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ
కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యో ర్మధ్యదేశే శోభనగృహే
సమస్త దేవతా బ్రాహ్మణ సన్నిధౌ అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
-------- నామ సంవత్సరే దక్షిణాయనే వర్షర్తౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం
-------- వాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం
అస్యాం శుభతిధౌ -------- గోత్రస్య -------- నామధేయస్య అస్మాకం సహ
కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం,
సర్వాభీష్ట సిద్థ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం,
పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త
వరసిద్ధి వినాయక ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే.
కలశపూజ
     తదంగ కలశపూజాం కరిష్యే।
కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య
తస్యోపరి హస్తం నిధాయ
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాహితః
మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్థితాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరాః
ఋగ్వేదోఽధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు దేవపూజార్థం దురితక్షయ కారకాః
గంగేచ యమునేచైవ గోదావరీ సరస్వతీ నర్మదా
సింధు కావేరీ జలేఽస్మిన్‌ సన్నిధిం కురు।

కలశోదకేన పూజాద్రవ్యాణి దేవమ్‌ ఆత్మానం చ సంప్రోక్ష్య.
ధ్యానము - మహాగణాధిపతయే నమః
     భవసంచిత పా పౌఘ విధ్వంసన విచక్షణమ్‌।
విఘ్నాంధకార భాస్వం తం విఘ్నరాజ మహం భజే॥

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్‌।
పాశాంకుశ ధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకమ్‌॥

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్‌।
భక్తాభీష్ట ప్రదం తస్మా ద్ధ్యాయే త్తం విఘ్ననాయకమ్‌॥

ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభమ్‌।
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితమ్‌॥

శ్రీగణాధిపతయే నమః - ధ్యాయామి - ధ్యానం సమర్పయామి.
ఆవాహనము
     అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వరం।
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవం॥
విఘ్నేశ్వరాయనమః - ఆవాహయామి.
ఆసనము
     మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్న విరాజితమ్‌।
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌॥
ఆసనం సమర్పయామి.
అర్ఘ్యము
     గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన।
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్‌॥
అర్ఘ్యం సమర్పయామి.
పాద్యము
     గజవక్త్ర నమస్తే స్తు సర్వాభీష్ట ప్రదాయక।
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన॥
పాద్యం సమర్పయామి.
ఆచమనీయము
     అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత।
గృహా ణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో॥
ఆచమనీయం సమర్పయామి.
వస్త్రయుగ్మము
     రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్‌।
శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ॥
వస్త్రయుగ్మం సమర్పయామి.
పంచామృతస్నానము
     స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక।
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత॥
పంచామృతస్నానం సమర్పయామి.
శుద్ధోదకస్నానము
     గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతై రమలై ర్జలైః।
స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోస్తు తే॥
శుద్ధోదకస్నానం సమర్పయామి.
నీరాజనము
     ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా।
నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ॥
నీరాజనం సమర్పయామి.
ఉపవీతము
     రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చో త్తరీయకమ్‌।
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానా మిష్టదాయక॥
ఉపవీతం సమర్పయామి.
మధుపర్కములు
     దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్‌।
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తు తే॥
మధుపర్కం సమర్పయామి.
గంధము
     చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్‌।
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‌॥
గంధాన్‌ సమర్పయామి.
ధూపము
     దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరమ్‌।
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ॥
ధూప మాఘ్రాపయామి.
అక్షతలు
     అక్షతాన్‌ ధవళాన్‌ దివ్యాన్‌ శాలీయాం స్తండులాన్‌ శుభాన్‌।
గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే॥
అక్షతాన్‌ సమర్పయామి.
తాంబూలం
     పూగీఫలసమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్‌।
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌॥
తాంబూలం సమర్పయామి.
పునరాచమనమ్‌
     కేశవాయస్వాహ - నారాయణ స్వాహా - మాధవాయస్వాహా - ...
పుష్పైః పూజయామి - అథాంగపూజా
     గణేశాయ నమః - పాదౌపూజయామి
ఏకదంతాయ నమః - గుల్ఫౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - జానునీ పూజయామి
విఘ్నరాజాయ నమః - జంఘే పూజయామి
ఆఖువాహనాయ నమః - ఊరూ పూజయామి
హేరంబాయ నమః - కటిం పూజయామి
లంబోదరాయ నమః - ఉదరం పూజయామి
గణనాథాయ నమః - నాభిం పూజయామి
గణేశాయ నమః - హృదయం పూజయామి
స్థూలకంఠాయ నమః - కంఠం పూజయామి
స్కంధాగ్రజాయ నమః - స్కంధౌ పూజయామి
పాశహస్తాయ నమః - హస్తౌ పూజయామి
గజవక్త్రాయ నమః - వక్త్రం పూజయామి
విఘ్నహంత్రే నమః - నేత్రౌ పూజయామి
శూర్పకర్ణాయ నమః - కర్ణౌ పూజయామి
ఫాలచంద్రాయ నమః - లలాటం పూజయామి
సర్వేశ్వరాయ నమః - శిరం పూజయామి
విఘ్నరాజాయ నమః - సర్వాంణ్యంగాని పూజయామి

సుగంధాని సుపుష్పాణి జాజీకుందముఖాని చ।
ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తు! తే॥
అథైక వింశతి పత్ర పూజా
     సుముఖాయ నమః - మాచీ పత్రం పూజయామి
గణాధిపాయ నమః - బృహతీ పత్రం పూజయామి
ఉమాపుత్రాయ నమః - బిల్వ పత్రం పూజయామి
గజాననాయ నమః - దూర్వాయుగ్మం పూజయామి
హరసూనవే నమః - దుత్తూర పత్రం పూజయామి
లంబోదరాయ నమః - బదరీ పత్రం పూజయామి
గుహాగ్రజాయ నమః - అపామార్గ పత్రం పూజయామి
గజకర్ణాయ నమః - తులసీ పత్రం పూజయామి
ఏకదంతాయ నమః - చూత పత్రం పూజయామి
వికటాయ నమః - కరవీర పత్రం పూజయామి
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంత పత్రం పూజయామి
వటవే నమః - దాడిమీ పత్రం పూజయామి
సర్వేశ్వరాయ నమః - దేవదారు పత్రం పూజయామి
ఫాలచంద్రాయ నమః - మరువక పత్రం పూజయామి
హేరంబాయ నమః - సింధువార పత్రం పూజయామి
శూర్పకర్ణాయ నమః - జాజీ పత్రం పూజయామి
సురాగ్రజాయ నమః - గండకీ పత్రం పూజయామి
ఇభవక్త్రాయ నమః - శమీ పత్రం పూజయామి
వినాయకాయ నమః - అశ్వత్థ పత్రం పూజయామి
సురసేవితాయ నమః - అర్జున పత్రం పూజయామి
కపిలాయ నమః - అర్క పత్రం పూజయామి
శ్రీగణేశ్వరాయ నమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.
దూర్వా పూజ (జంట గరికెలతో పూజ)
     ఓం సుముఖాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం హరసూనవే నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం లంబోదరాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం గుహాగ్రజాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం గజకర్ణాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం వికటాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం భిన్నదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం వటవే నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం హేరంబాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం సురాగ్రజాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం సురసేవితాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం కపిలాయ నమః దూర్వాయుగ్మం పూజయామి
ఓం శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి.
అష్టోత్తర శతనామ పూజ
    
అష్టోత్తర శతనామపూజాం సమర్పయామి
నానావిధ పత్ర పుష్పాణి సమర్పయామి
ధూపం
     దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం।
ఉమాపుత్ర నమస్తుభ్యం గృహాణ వరదోభవ॥
ధూప మాఘ్రాపయామి
దీపం
     సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా।
గృహాణ మంగళం దీప మీశపుత్ర నమోస్తుతే॥
దీపం దర్శయామి
నైవేద్యం
     సుగన్ధాన్సుకృతాం శ్చైవ మోదకాన్‌ ఘృత పాచితాన్‌
నైవేద్యం గృహ్యతాం దేవ చణ ముద్గైః ప్రకల్పితాన్‌॥
భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ।
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక॥
నైవేద్యం సమర్పయామి.
తాంబూలం
     పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం॥
తాంబూలం సమర్పయామి
సువర్ణ మంత్రపుష్పం
     సదానంద స విఘ్నేశ పుష్కలాని ధనానిచ
భూమ్యాం స్థితాని భగవన్‌ స్వీకురుష్వ వినాయక॥
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
నీరాజనం
     ఘృతవర్తిసహ స్రైశ్చ కర్పూర శకలై
నీరాజనం మయా దత్తం గృహాణ వరదోభవ॥
నీరాజనం సమర్పయామి
చత్రం
     చత్రం సమర్పయామి
చామరం
     చామరం సమర్పయామి - సర్వోపచారాన్‌ సమర్పయామి
మంత్రపుష్పం
     గణాధిప నమస్తేస్తు ఉమాపుత్ర గజానన!
వినాయ కీశ తనయ సర్వసిద్ధి ప్ర్దాయక!
ఏకదంతైకవదన తధా మూషికవాహన
కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలి,
మంత్రపుష్పం సమర్పయామి.
ప్రదక్షిణ నమస్కారము
     ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ
నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన
ప్రదక్షిణ నమస్కారాన్‌ సమర్పయామి.
పునరర్ఘ్యం
     అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక
గంధ పుష్పాక్ష తైర్యుక్య్తం పాత్రత్థం పాపనాశన,
పునరర్ఘ్యం సమర్పయామి.
ప్రసాదం
     యస్యస్మృత్యాచ నామోక్తా తపః పూజాక్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం
అనయా ధ్యాన ఆవాహనాది శోడశోపచార పూజయాచ భగావన్‌ సర్వాత్మకః
శ్రీగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నో వరదో భవతు.
గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి.
ప్రార్థన
     తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌
కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప! నీకు మ్రొక్కెదన్‌.

తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్‌
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా
వలపలిచేతి ఘంటమున వాక్కును నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప! లోకనాయకా!

తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్‌.

అటుకులు కొబ్బరి పలుకులు
చిటికెబెల్లము నానుబ్రాలు చెఱకురసంబున్‌
నిటలాక్షు నగ్రసుతునకు
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.

విఘ్నేశ్వరుని దండకము
     శ్రీపార్వతీపుత్ర! లోకత్రయస్తోత్ర! సత్పుణ్యచారిత్ర! భద్రేభవక్త్రా! మహాకాయ!
కాత్యాయనీనాథసంజాత స్వామీ! శివా సిద్ధివిఘ్నేశ! నీ పాదపద్మంబులున్
నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్
నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్
సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జురూపంబు
నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి
సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమం బక్షతల్ జాజులున్ చంపకంబుల్
తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచిచేమంతులున్ దెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులన్
మంచిదూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి సాష్టాంగముం జేసి
విఘ్నేశ్వరా! నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులున్
రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పున్గులున్
బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయున్ జున్ను బాలాజ్యమున్
నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముం
బంచనీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం
బ్రార్థనల్చేయుటల్ కాంచనంబొల్లకే యిన్ము దా గోరు చందంబు గాదే మహాదేవ యో భక్తమందార
యో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవచూడామణీ! లోకరక్షామణీ! బంధుచింతామణీ! స్వామి!
నిన్నెంచ నేనెంత? నీ దాసదాసానుదాసుండ, శ్రీ దొంతరాజాన్వవాయుండ రామాభిధానుండ,
నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మసింహాసనారూఢతన్ నిల్పి కాపాడుటే కాదు
నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్
పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా జేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా!
యివే వందనంబుల్ గణేశా! నమస్తే నమస్తే నమస్తే నమః!!
పంచ రత్నములు
     సామజానన నీ మాహాత్మ్యము సన్నుతింపగా విందురా
వేమరుల్‌ గొనియాడు నరులను వింతగా మదినెంతురా
ప్రేమమీరగ సాధుజనులను స్వామీ నీవనిగందురా
కామితార్థ ఫలప్రదాయక కంచుతేరు వినాయకా.

నీ మాహాత్మ్యములెల్ల ధరలో నిత్యమై వెలుగొందురా
ఓమహాత్మక భావపోషక ఒప్పుమూషికవాహనా
వామయంచన పుత్రతామర వాసవాది సురార్చిత
కామితార్థ ఫలప్రదాయక కంచుతేరు వినాయకా.

తూర్యములు మ్రోయంగ భక్తితో నీకొసంగెడి పువ్వులన్‌
ఆర్యులందరు దెత్తురపుడు అంబుజానన వారలన్‌
సూర్యకోటిప్రభల్‌ చెలంగగ సొబగుమీరెడు కాంతులన్‌
కామితార్థ ఫలప్రదాయక కంచుతేరు వినాయకా.

ఝాముఝాముకు నానుబియ్యము చాల కొబ్బరికాయలున్‌
కోమలాంగులు దెత్తురపుడు కుడుములున్‌ పూర్ణంబులున్‌
నా మనోహరమైన చక్కెర నీకు నే నెటులిత్తురా
కామితార్థ ఫలప్రదాయక కంచుతేరు వినాయకా.

రాజపూజిత రాజశేఖర రాజరాజమనోహర
భూమిపాలక విభూషణ బుధజనోన్నత కీర్తిదా
నామనోహర కరుణాసాగర నాథ నాథ వినాయక
కామితార్థ ఫలప్రదాయక కంచుతేరు వినాయకా.
మంగళ హారతులు
     శ్రీ శంభు తనయునకు - సిద్ధిగణనాథునకు - వాసిగల దేవతా వందితునకును
ఆ సరస విద్యలకు నాదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకు జయమంగళం.
నేరేడు మారేడు నెలవంకమామిడి - దూర్వార చెంగల్వ ఉత్తరేణు
వేఱువేఱుగ దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికినిపుడు జయమంగళం.
సురుచిరమ్ముగ భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశిచూడరాకున్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం.
పానకము వడపప్పు పనసమామిడిపండు దానిమ్మ కర్జూర ద్రాక్షపండ్లు
తేనెతోమాగిన తియ్యమామిడిపండ్లు మాకుబుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం.
ఓబొజ్జగణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళమీదికి దండుపంపు
కమ్మనినెయ్యియు కడుముద్దపప్పును బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు జయమంగళం.
వెండిపళ్లెరములో వేయివేలముత్యాలు కొండలుగ నీలములు కలియబోసి
మెండుగను హారమలు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి జయమంగళం.
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాన నినుగొల్తు కస్తూరిని
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం.
ఏకదంతంబును ఎల్లగజవదనంబు బాగయిన తొండంబు వలపు కడుపు
జోకయిన మూషికము సొరిది నెక్కాడుచును భవ్యుడగు దేవగణపతికినిపుడు జయమంగళం.
మంగళము మంగళము మార్తాండతేజునకు మంగళము సర్వజ్ఞవందితునకు
మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవగణపతికినిపుడు జయమంగళం.
బంగారుచెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శివునకు జలకమార్చి
మల్లెపువ్వుదెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం.
పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు హరులు
యిష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవగణపతికినిపుడు జయమంగళం.
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితిగూర్చి
నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజ లాలింపజేతు జయమంగళం.
మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములను ఉల్లమలరగ
మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ జయమంగళం.
దేవాది దేవునకు దేవతాద్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి
తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికినిపుడు జయమంగళం.
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి
పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం.
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను జయమంగళం.
ఓ బొజ్జగణపయ్య ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలు మీ కరుణతోను
మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర జయమంగళం.

సిద్ధివిఘ్నేశ్వరా ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగా నిరువది యొక్క పత్రి
దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు
జాజి బలురక్కసి జమ్మి దాచినపువ్వు గరిక మాచిపత్రి మంచిమొలక
అగరు గంధాక్షతల్‌ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును
భాద్రపదశుద్ధచవితిని పగటివేళ కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు
పాయసము జున్ను తేనెను పంక్తి మీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కె లలర, జయమంగళం.
విఘ్నేశ్వరుని కథా ప్రారంభము
మున్ను నైమిశారణ్యమున సత్రయాగముచేయు శౌనకాదిమహర్షులకు సకలకళావిశారదుదగు సూత మహాముని విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్ర దర్శన దోషకారణమును, శాపమోక్ష ప్రకారమును చెప్పదొడగెను.

పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపముచేయగా, అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుమన, గజాసురుడు పరమేశ్వరుని స్తోత్రముచేసి "స్వామీ! నీవు యెల్లప్పుడు నా యుదరమున వసించి కాపాడు" మని కోరగా భక్తసులభుడగు నా మహేశ్వరు డాతని కోర్కెదీర్ప గజాసురుని యుదరమున ప్రవేశించి సుఖముగనుండె.

కైలాసమున పార్వతీదేవి భర్త జాడతెలియక పలుతెరంగుల వెదకుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థు డగుట తెలిసి రప్పించుకొను మార్గముగానక అడలుచు, విష్ణుమూర్తిని దర్శించి తన పతి వృత్తాంతమును తెలిపి, "ఓ మహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి నా పతిని రక్షించి నాకొసగితివి. ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు" మని వేడగా, హరి యా పార్వతీదేవి నోదార్చి కైలాసమున నుండుమని దెల్పి, అంత బ్రహ్మదేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని భావన చేసి పరమేశ్వరుని వాహనమగు నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాదిదేవతలను విచిత్రవేషముల ధరింపజేసి, తానును చిరుగంటలు సన్నాయినిదాల్చి, గజాసుర పురముజొచ్చి అచ్చటచ్చట జగన్మోహనముగా తిరుగాడుచుండ గజాసురుడువిని, వారల పిలిచి, తన భవనము యెదుట నాడింపుమని కోరగా బ్రహ్మాదిదేవతలు తమవాద్య విశేషముల భోరుగొల్ప జగన్నాటక సూత్రధారుడగు నాహరి చిత్రవిచిత్ర గతుల గంగిరెద్దు నాడించగా గజాసురుడు పరమానంద భరితుఁడై "మీ కేమి కావలయునో కోరుడొసగెద" నన, హరి దగ్గరకేగి "ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకు వచ్చెగాన శివునినొసంగు" మని పల్కె. ఆ మాటలకు గజాసురుఁడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెఱిఁగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తనగర్భస్థుడగు పరమేశ్వరుని దలంచి "నీవు నా శిరస్సు త్రిలోకపూజ్యముచేసి, నా చర్మము ధరింపవే" యని ప్రార్థించి విష్ణుమూర్తికి తన యంగీకారము దెలుపగా నాతండు నందిని ప్రేరేపింప, నందియు తన శృంగమ్ములచే గజాసురుని జీల్చి సంహరించెను. అంత మహేశ్వరుండు గజాసుర గర్భమునుండి వెలువడివచ్చి, విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు "దుష్టాత్ముల కిట్టి వరంబులీయ రాదు. ఇచ్చినచో పాముకు పాలుపోసినట్లగు" నని యుపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి, తాను వైకుంఠమ్మున కరిగె. అంత శివుండును నందినెక్కి కైలాసంబున కతి వేగంబున జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్తరాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుబిండిని నొక బాలునిగ జేసి ప్రాణంబొసగి వాకిలి ద్వారమున కావలియుంచె. పార్వతి స్నానానంతరము సర్వాభరణములు నలంకరించుకొనుచు పత్యాగమమును నిరీక్షించుచుండె. అంత పరమేశ్వరుండు వచ్చి, నంది నవరోహించి లోనికి బోవ వాకిలి ద్వారమందున్న బాలకు డడ్డగింప, కోపావేశుఁడై త్రిశూలంబుచే బాలకుని కంఠంబు దునిమి లోనికేగె.

అంత పార్వతీదేవి భర్తనుగాంచి ఎదురేగి అర్ఘ్య పాద్యాదుల పూజించె. అంత పరమానందమున వారిరువురు ప్రియ భాషణలు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంత నమ్మహేశ్వరుడు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు నా బాలుని కతికించి బ్రాణఁ బొసంగి గజాననుండని నామంబొసంగి యాతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుండును సులభముగా నెక్కి తిరుగుటకు అనింద్యుఁడను నొక ఎలుకను వాహనముగ జేసికొనియె.

కొంత కాలమ్మునకు పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి జనియించె. ఇతడు మహా బలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచి యుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబున కేగి పరమేశ్వరుని సేవించి విఘ్నముల కొక్కని అధిపతిగా తమకొసంగుమని కోరగా, "తాను జ్యేష్ఠుడు గనుక ఆ యాధిపత్యమును తన కొసంగు" మని గజాననుడును, "మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గాన ఆ యాధిపత్యంబు తన కొసంగు" మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి.

అంత నక్కుమారులజూచి "మీలో నెవరు ముల్లోకము లందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికి యాధిపత్యం బొసంగుదు" నని మహేశ్వరుడు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబెక్కి వాయువేగంబున నేగె. అంత గజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి "అయ్యా! నా అసమర్థత తా మెఱిఁగియు నిట్లానతీయ దగునే? మీ పాద సేవకుడను. నా యందు కటాక్షముంచి తగు నుపాయంబు దెల్పి రక్షింపవే" యని ప్రార్థింప, మహేశ్వరుండు దయాళుడై
సకృత్‌ నారాయణేత్యుక్త్యా పుమాన్‌ గల్పశతత్రయం।
గంగాది సర్వతీర్థేషు స్నానో భవతి పుత్రక॥
"కుమారా! ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున మూడు వందల కల్పంబులు పుణ్య నదులలో స్నాన మొనర్చిన వాడగు" నని సమంత్రంబుగా నారాయణ మంత్రం బుపదేశింప గజాననుడు నత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసమున నుండె.

అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడా నదిలో, అమ్మంత్ర ప్రభావమున, స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కాన్పింప, నతఁడు మూడుకోట్ల ఏబదిలక్షల నదులలో గూడ నటులనే చూచి, ఆశ్చర్యపడుచు కైలాసమునకేగి యిచటగూడ తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకొని "తండ్రీ! అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుము. తమ నిర్ణయంబు ననుసరించి యీఆధిపత్యంబు అన్నగారికే యొసంగు" డని ప్రార్థించె.

అంత నప్పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు గజాననునికి విఘ్నాధిపత్యంబొసంగబడియె. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు, ఆపూపములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప సంతుష్టుడై విఘ్నేశ్వరుండు కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేతధరించి మంద గమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబున కేగి తల్లిదండ్రులకు ప్రణామంబు జేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యె. బలవంతముగ చేతులానింప, చరణంబు లాకసంబు జూచె. ఇట్లు ప్రణామంబు సేయ గడు శ్రమ నొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటంబుగనవ్వె. అంతట "రాజదృష్టి సోకిన, రాలు గూడ నుగ్గగు" నను సామెత నిక్కమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి, అందున్న కుడుములు తత్ప్రదేశం బెల్లెడల దొర్లె. అతండు మృతుండయ్యె.

అంత పార్వతి శోకించుచు చంద్రుని జూచి "పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించె గాన, నిన్ను జూచినవారు పాపాత్ములై నీలాపనింద లొందుదురుగాక" యని శపించెను.
ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట
ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచుండిరి. అగ్ని దేవుడు ఆ ఋషిపత్నులను మోహించి శాప భయంబున అశక్తుడై క్షీణించుచుండ, నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముతప్ప తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు సేయ, ఋషులద్దానిని గనుగొని అగ్నిదేవునితో నున్నవారు దమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని జూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది.

దేవతలు, మునులును, ఋషిపత్నుల యాపద పరమేష్టికి దెల్ప నాతడు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుట దెల్పి సమస్త ఋషులను సమాధానపరచె. వారితో గూడ బ్రహ్మ కైలాసంబున కేతెంచి ఉమామహేశ్వరుల సేవించి, మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చె. అంత దేవాదులు "ఓ దేవీ! పార్వతీ! నీ వొసంగిన శాపంబుచే లోకముల కెల్ల కీడు వాటిల్లెగాన దాని నుపసంహరింపు" మని ప్రార్థింప, పార్వతి సంతుష్టాంతరంగయై కుమారుని జేరదీసి, ముద్దాడి, 'ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో, నాదినంబున చంద్రుని జూడరాదు' అని శాపావకాశంబొసంగె. అంత బ్రహ్మాది దేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసమున కేగి భాద్రపద శుద్ధ చతుర్థి యందు మాత్రము చంద్రునిం జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. ఇట్లు కొంత కాలంబు గడచె.
శమంతకోపాఖ్యానము
ద్వాపర యుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుండు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణము జరుపుచు "స్వామీ! సాయంసమయమయ్యె. ఈనాడు వినాయక చతుర్థిగాన, పార్వతీశాపంబుచే చంద్రుని జూడరాదు. గాన నిజ గృహంబున కేగెద సెలవిండు" అని పూర్వవృత్తాంతంబంతయు శ్రీకృష్ణునికిదెల్పి నారదుడు స్వర్గలోకమున కేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి నెవ్వరును చంద్రుని చూడరాదని పట్టణంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడగుటచే తాను మింటి వంక చూడక, గోష్ఠమునకు బోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతి బింబము జూచి 'ఆహా! ఇక నాకెట్టి యపనింద రానున్నదో?' యని సంశయమున నుండెను. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి, 'ఆ మణిని తన కి' మ్మని యడిగిన అతడు 'ఎనిమిది బారువుల బంగారము దినంబున కొసంగు నట్టి నీ మణి నెంతటి యాప్తున కేమందమతియైన యిచ్చునా?' యని పలికిన పోనిమ్మని కృష్ణు డూరకుండె. అంత నొకనా డా సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండా శమంతకమును కంఠమున ధరించి వేటాడ నడవికి జనిన, నొక సింహమా మణిని మాంస ఖండమని భ్రమించి వానిని జంపి యా మణిని కొనిపోవుచుండ నొక భల్లూక మా సింగమును దునిమి యామణింగొని తన కొండ బిలమున తొట్టెలో బవళించి యున్న తన కుమార్తెకు ఆటవస్తువుగ నొసంగెను. మఱునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడు మణి యివ్వలేదను కారణమున తన సోదరుని చంపి రత్న మపహరించె నని పట్టణమున చాటె. అది శ్రీకృష్ణుడు విని క్షీరమున చంద్ర బింబమును జూచిన దోషఫలంబిటుల కలిగినదని యెంచి దానిం బాపుకొన బంధుజన సేనాసమేతుడై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృతకళేబరంబును, సింగపు కాలిజాడలును, పిదప భల్లూక చరణ విన్యాసంబును గాన్పించెను. ఆ దారింబట్టి పోవుచు నొక పర్వత గుహ లోనికి చిహ్నములుండ, శ్రీ కృష్ణుఁడు గుహ లోని కేగి ఉయ్యాలపై కట్టబడియున్న మణిం జూచి దానిని గొనివచ్చుచుండ ఉయ్యలలోని బాలిక యేడ్వదొడంగెను. అది విని గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై చనుదెంచి శ్రీకృష్ణునితో ఘోరముగ యుద్ధముచేయ శ్రీకృష్ణుండు వానితో ఇరువది యెనిమిది దినంబులు యుద్ధమొనర్ప జాంబవంతుడు క్షీణబలుండై దేహంబెల్ల నొచ్చి, భీతి జెందుచు తన బలంబు హరించిన పురుషుండు రావణ సంహారియగు శ్రీరామ చంద్రునిగా తలంచి అంజలి ఘటించి "దేవాదిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్త జనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెఱింగితిని. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుమని ఆజ్ఞ యొసంగ నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలెనని కోరుకుంటిని. ఆ కోరిక నిప్పుడు నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిల మయ్యెను. నీకన్న వేఱు దిక్కు లే" దనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుఁడు దయాళుండై జాంబవంతుని శరీరమంతయు తన హస్తమున నిమిరి "భల్లూకేశ్వరా! శమంతక మణి నపహరించినట్లు నాపై నారోపించిన అపనింద బాపుకొన నిటు వచ్చితిని. కాన మణి నొసంగిన నేనేగెద" నని జాంబవంతునకు దెల్ప నతడు శ్రీకృష్ణునకు మణి సహితముగా తన కుమార్తె యగు జాంబవతిని కానుకగా నొసంగెను. శ్రీకృష్ణుడు గుహ వెల్వడి పురంబు జేరి సభాస్థలికి పిన్నపెద్దలను జేర్చి సత్రాజిత్తుని రావించి యా వృత్తాంతమును జెప్పె. సత్రాజిత్తు "అయ్యో! పరమాత్ముడగు శ్రీ కృష్ణునిపై లేనిపోని నిందలు మోపి దోషంబునకు పాల్పడితి" నని చాల విచారించి మణిసహితముగా తన కూతురగు సత్యభామను భార్యగా శ్రీ కృష్ణునకు సమర్పించెను. శ్రీకృష్ణుడును సత్యభామను గైకొని సంతోషించి సూర్య వర ప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము మాకు వలదనుచు మణిని సత్రాజిత్తున కొసంగెను. శ్రీకృష్ణుడు శుభ ముహూర్తమున జాంబవతీ సత్యభామలను పరిణయం బాడె. అచటికి వచ్చిన దేవాదులు, మునులు స్తుతించి మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకొంటిరి. మాకేమి గతి యని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధచతుర్థిని ప్రమాదంబున చంద్ర దర్శన మయ్యెనేని ఆనాడు గణపతిని యథావిధిని పూజించి యీ శమంతక మణి కథను విని ఆ అక్షతలు శిరంబున దాల్చువారు నీలాపనింద నొందకుండెదరుగాక అని యానతీయ, దేవాదులు తమతమ నివాసముల కేగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి యందు తమతమ విభవము కొలది గణపతిని పూజించి, అభీష్టసిద్ధి గాంచుచు సుఖంబుగా నుండిరని శాపమోక్ష ప్రకారంబును శౌనకాది మునులకు సూతుండు వినిపించి వారిని వీడ్కొలిపి నిజాశ్రమంబున కరిగె.


సర్వేజనాస్సుఖినో భవంతు.
AndhraBharati AMdhra bhArati - dhArmika - vratamulu - vinAyaka chaviti vratamu ( telugu andhra )