ఇతిహాసములు అచ్చతెలుఁగు రామాయణము ఆరణ్యకాండము
అచ్చతెలుఁగు రామాయణము - కూచిమంచి తిమ్మకవి
ఆరణ్యకాండము
క.సిరుల చెలి మగని యడుగునఁ
గర మరుదుగఁ బొడమి ముజ్జగంబుల యందున్‌
గరగరిక నెఱపు జక్కర
విరిఁబోడి బొజుంగ! ప్రాఁత వేల్పులగొంగా!
1
తే.వినుము కత వేల్పుజడదారి విన్ను చూలి
మేపరుల నట్టు పుట్టువు మేటి తపసిఁ
గాంచి యిట్లను నంత నగ్గట్టు మీఁదఁ
దరలి రాగవు లవలికి దాఁటి చనుచు
2
తే.దారిలో నత్రియను జడదారి ఱేని
నెలవునకుఁ బోయి యందు నబ్బలియుఁ డొసఁగు
పూజ లెల్లను గైకొని పొసఁగ నచటు
వెడలి దండక యనియెడు నడవి దరిసి
3
సీ.పులులు దోఁడేళ్ళు దుప్పులును జివ్వంగులు
    నెలుఁగులుఁ బందులు నేనుఁగులును
గురుపోతు లేఁదులుఁ గోఁతులు మనుఁబోతు
    లెనుబోతులును ఱేఁచు లిఱ్లు దచ్చి
కాళ్ళ మెకంబులుఁ గడతులు దప్పులుఁ
    గుందేళ్ళు నక్కలుఁ గొండముచ్చు
లెక్కుడు మెకపు సూళ్ళిరుదల గ్రుడ్డు కా
    నుపులుఁ బిల్లులు నడిదపు మెకములు
 
తే.మొదలుగాఁ గల కాఱ్మెకంబులకు నెల్లఁ
దానకంబగు నబ్బలు కానలోనఁ
జొచ్చి విచ్చలవిడిఁ జనుచో విరాధుఁ
డనెడు రక్కసుఁ డొకఁడు పెంపడరఁ జేరి
4
క.అప్పుడమి కాన్పు నెత్తుక
ఱిప్పునఁ జదలునకు నెగసి రేచిన కడఁకన్‌
గుప్పునఁ జను తఱి నొడయఁడు
తప్పక యొక కోల వాని తలఁ దెగనేసెన్‌
5
ఆ.ఏసి తలఁకుచున్న యెలనాగ వెఱపెల్లఁ
దీర్చి బుజ్జగించి తెఱువు వట్టి
చనుచు నెలమి నెదుర శరభంగుఁడను జడ
దారి యొసఁగు పూజఁ దనరఁ గాంచి
6
ఆ.మఱువ కందు జోగి తెఱవాయి మెకమున్న
చెంత కరిగి యతనిచేత విండ్లు
గత్తలములు దూపుగములును దద్దయుఁ
గొంచు నంతఁ జనిరి పంచవటికి
7
తే.చని వెఱవు మీఱ నొక యాకుఁ జవికె నచట
నిలుపుకొని పండ్లు దుంపలు నెలమిఁ దినుచు
నున్నచో నబ్బురం బొప్ప నొక్కనాడు
సుప్పనక యను రక్కస జోటి యొకతె
8
క.నీటొదవఁగ నయ్యొడయని
చోటికిఁ బరతెంచి వలపు సొంపెసలారన్‌
జోటి పనుల్‌ గోరిన న
జ్జోటిం గని పొలసుదిండి సూఁడిట్లనియెన్‌
9
క.మగువా! మగువం దగిలిన
మగవానిం గోరుకొనుట మంచిదె? నీకున్‌
దగువాఁడు లక్ష్మణుం డా
జగజెట్టిం గోరుకొనుము సరగ నటన్నన్
10
ఆ.సంతసించి యతివ చెంతకట్టులు వోవఁ
జేటగోళ్ళ బోటి బూటకంబు
దెలిసి యవ్వలంతి దిట మొప్పఁగా దాని
ముక్కు సెవులు నొకటఁ జెక్కివైచె
11
సీ.వైచినఁ గ్రొత్తగాఁ బూచిన మోదుగు
    కరణి నత్తెఱవ నెత్తురుల దోఁగి
నానయు నలుకయు లోనఁ బెనంగొన
    ఖరుఁడు దూషణుఁడు త్రిశిరుఁడు ననఁగఁ
బరగు రే ద్రిమ్మరి దొరల పాలికిఁ బోయి
    యత్తెఱం గెఱిఁగించి యలమటింప
నాలంబునకుఁ బదునాలుగు వేల ర
    క్కసులతో వాండ్రు రాగవుని మీదఁ
 
తే.దరలి వచ్చిన నవ్విలు దాల్పు గడిమి
నెదురుకొని పెక్కు నెఱదూపు లేసి యెల్ల
నల్ల ద్రావుడు మూఁకఁల ద్రెళ్ళఁ జేసి
యగ్గరాసుల పైని బిట్టార్చు కొనుచు
12
క.బలు నారసములు వఱపినఁ
దలఁకక యబ్బలియురుక్కు దళుకొత్తఁగ ని
ప్పులు గ్రక్కెడు బెడిదపు ము
ల్కులుఁ దఱచుగ నతనిమీదఁ గురిసిరి మరలన్‌
13
క.అక్కరణిఁ బోరు టక్కరి
రక్కసి గమికాండ్రు మువ్వురన్‌ మానిసిఱేఁ
డొక్కొక్క కఱకుటమ్మున
జిక్కంగా నీక తలలు చదిమెన్‌ గినుకన్‌
14
ఆ.అట్లు వాండ్రు మువ్వురడఁగిన నడలుచు
సుప్పనాతి మిగుల స్రుక్కి లంక
కరిగి తోడఁబుట్టువగు రావణునిఁ గాంచి
తన తెఱంగుఁ దెలియ వినుచుటయును
15
క.కలఁకయు నలుకయు నెదలో
మొలవఁగ నమ్మేటి సోఁకు మూఁకల ఱేఁడో
చెలియల! నిన్నిటు చేసిన
పలువల తెఱఁగెల్ల నేఱుపఱపు మటన్నన్‌
16
ఆ.అన్నెలంత పలికె ‘అన్న! నిన్నెఱుఁగక
చేటు కొఱకు నిట్లు చేసినట్టి
కూళ నేలవేల్పు కొమరుల తెఱఁగేమి
దెలుపవలయు? నొక్క పలుకు వినుము
17
క.ఆ రాముని నెడఁ బాయక
గారామున మెలఁగుచున్న కన్నియ నెఱయొ
య్యారం బెన్నిక సేయఁగ
నే రాకన్నియల యందు నెఱుఁగము సుమ్మీ!
18
క.రక్కసి మగువల యందును
జక్కుల చెలులందు వేల్పు చానల యందున్‌
బక్కి దొర కొలపు నవలా
రొక్కమునందైన నట్టి రూపసి గలదే?
19
చ.నిలుకడ గన్న కాఱ్మెఱుఁగు నిద్దఁపుఁ బల్కులు నేర్చుకొన్న క్రొం
దళుకు పసిండి బొమ్మ మెయిఁదాల్చి మెలంగెడు గుజ్జుమావి పే
ర్వలపలఁ బడ్డ మానికము వాఁడఁగ నేరని పూవుబంతి నాఁ
జిలుకల కొల్కి యబ్బురపుఁ జెల్వమునం దనరారు సారెకున్‌
20
సీ.తమ్మికెంపులకు నెత్తావిఁ గూర్పని తప్పు
    చివురులఁ గార్కొనఁ జేయు ఱవ్వ
కలికి మించులకు నిల్కడ యీని యారడి
    కడలి వెన్నకు మచ్చ యిడిన యెగ్గు
జక్కవ పులుగుల జత విప్పు కొద పుట్ట
    పెద్దల మలకలఁ బెట్టు ఱట్టు
మబ్బుల యవయుట ల్మాన్పని యాడిక
    తొగల డాల్పగ లెల్ల త్రోచు వాదు
 
తే.మలపుకొనఁ బోలు నలువ యత్తలిరుఁ బోఁడి
మోవియును గేలు నొడలును ముద్దు మోముఁ
గులుకు గుబ్బల నూఁగారు క్రొమ్ముడియును
దళుకు నునుసోఁగ వెడఁద కన్నులు నొనర్చి
21
సీ.తాఁబేలు కడుపులోఁ దలగ్రుక్కు కొనియెఁ బో
    తెఱవ మీఁగాళ్ళతో దినుసు గాక
బలు రాజనంపుఁ బొట్టలు పీఁకె వాఱెఁబో
    ముద్దియ పిక్కల కుద్ది గాఁక
చెలువంపు టిసుక తిట్టలు మెత్తవడియెఁ బో
    జోటి పిఱుందులు దీటు గాక
పడగ తాలుపు మోము ముడుచుక యుండెఁబో
    బోఁటి నూఁగారుతో సాటి గాక
తే. తరఁగ చాల్పులు విచ్చెఁబో తరతరంబ
చేడియల మిన్న తరులతో నీడు గాక
చిందములు వెల్ల నయ్యెఁబో చిగురుటాకుఁ
బోఁడి నాడెంపుఁ గుత్తుక పురుడు గాక
22
ఆ.కలికి కురుల నిడుపు కన్నుల వెడలుపు
గుబ్బదోయి హెచ్చు గొనబుఁ గౌను
కొంచెదనము పిఱుఁదు గొబరును బొక్కిలి
లోఁతు నెన్న నెన గలుగుట యరిది
23
తే.బిత్తరపు గుబ్బ లేపునఁ బెరుఁగు నంచు
నెంచి మును నల్వ మొనలను నినుప మొనల
నించ నవి యంత నిలువక నెరయఁ బెరుఁగఁ
బొలఁతి నెఱిఁ గంచెల బిగించఁ బోలుఁ జుమ్మి
24
క.కన్నియల మిన్న పిఱుఁదుల
కన్నరొ! యిసుమంత లేసియగు నిద్దంపుం
దిన్నియలు సాటియగునని
యెన్నంగా రాదు చువ్వె యెచ్చో నైనన్‌
25
సీ.పాలతో నును మగరాలతో నలువ తే
    జీలతో బేడిస మీల తోడ
విండ్లతోఁ గ్రొన్నన చెండ్లతో విసదారి
    పిండ్లతోఁ దమ్మి లేఁదూండ్ల తోడ
లేళ్ళతో మావి యిగుళ్ళతోఁ గొదమ తా
    బేళ్ళతోఁ గాఱు మొగిళ్ళ తోడఁ
జవులతోఁ జెందొవ పువులతో నసలు పు
    ట్టువులతోఁ జిలుక కూటవల తోడ
 
తే.దొడరుఁ జెలి నవ్వుఁ బలుచాల్పు నడలుఁ గన్ను
లును బొమలు గుబ్బ చన్ను లారును బుజములు
చూపుఁ బెదవియు మీఁగాళ్ళు సొబగు తుఱుము
గోరు లడుగులు మొగముఁ బల్కులు చెలంగు
26
ఉ.కన్నుల చెన్ను పెన్నెఱుల కప్పు వెడంద పిఱుందు ముద్దులే
జన్నుల నీటు ముత్తరుల సౌరు మిటారపు టారు తీరు గౌన్‌
సన్నము మోము గోము మెయిజానును బూని మెలంగుచున్న య
య్యన్నుల మిన్న నెన్నఁదరమా? పెఱమాటలు వేయు నేటికిన్‌
27
తే.ముజ్జగంబుల యందు నమ్ముద్దుగుమ్మ
కరయ నెనలేరు చెలులు నీ యడుగులాన
యహహ! యో యన్న! దాని సోయగము గన్న
సోలి జడదారులైన విరాలి గొనరె?
28
క.అడవుల నిడుమలఁ గుడుచుచుఁ
గడ బడలియుఁ గడిఁది సోయగము పూనెడు న
ప్పడఁతుక నగరుల నుండెడు
నెడఁ బొడ గనువారి చూడ్కి కెట్లుండునొకో?
29
తే.అడవిఁ గూరలు దుంపలు గుడుచుచుండు
కూళ మానిసి కమ్ముద్దరాలి నోలిఁ
దగులఁ గట్టిన వేఱిఁడి తమ్మిచూలి
చెయ్వులకుఁ నెద్ది యిఁక గుఱి సేయవచ్చు?
30
క.వినఁ బోల్పరాని సొగసుల
గనియగు నమ్మెఱుఁగుఁబోడి కౌఁగిట నెపుడుం
బెనఁగొన నొనగూడని మగ
తన మేటికి? నింక రాచతన మేమిటికిన్‌?
31
క.పొంగుచు మూఁడు జగంబులు
రంగెసఁగఁగ నేలుచుండి వ్రాలని బలు దీ
విం గేరెడు నీ కిపుడా
బంగరు చిటిపాప చెలిమి పాటిలవలదే!
32
తే.అనుచుఁ దెలిపిన డెందమునందు వలపు
పెనఁగొనఁగ రక్కసుల ఱేఁడు పని దలంచి
సరిగ మారీచు నింటికిఁ జనిన నతఁడు
బత్తి నెఱపుచు నిట్లని పలికె నపుడు
33
క.రాయఁడ! మీ రిచటికి వేం
చేయఁగఁ బనియేమి గల్గెఁ? జెచ్చెర నెఱుఁగం
జేయుము మఱి మీ యానతిఁ
ద్రోయక యొనరింతు వెరవు తోడుత ననినన్‌
34
ఆ.వానిఁ జూచి చెలిమి వరల నత్తొలివేల్పు
ఱేఁడు పలికె వినుము వాఁడి మగఁడ!
పంచవటికి రాచబంటు లిర్వురు నొక్క
యుగ్మలియును జేరియున్నవారు
35
క.అబ్బిత్తరి చెలువెంతయు
నబ్బురముగ నిపుడు చెవుల నాలించుటచే
నిబ్బరపు వలపు మదిలో
ప్రబ్బికొని యొకింత సైఁపరాదయ్యె చెలీ!
36
ఉ.కావున నీవు బంగరు మెకంబు తెఱంగున వేగ నేఁగి య
త్తీవియఁబోడి క్రేవలను ద్రిమ్మరు చుండిన నవ్వెలందికై
వావిరి నిన్నుఁ బట్టుకొనవచ్చిన రాయని గొంచు దవ్వుగాఁ
బోవుము నేను దానిఁగొని పొల్పుగ లంకకు వత్తు నర్మిలిన్‌
37
క.అనిన నగి వాఁడు పలికెన్‌
వినుమా! నీ కిట్టి కాని వెరవిఁడి కఱదల్‌
సనునే? పెఱ తెఱవలఁ గై
కొనఁ గోరెడువాని బ్రతుకు కొంచెము కాదే?
38
క.మున్నొక్క తపసి రాయని
జన్నము చెఱుఁపంగఁ బూని చనుదెంచినచో
నన్నేలఱేఁడు ననుఁ గడు
బన్నము వొందించె మరలఁ బఱవం జనునే?
39
ఆ.అనిన నులికి యతఁడు గనుగొనలను నిప్పు
లొలుక నలుకఁ జూచుచున్నచో నె
ఱింగి కినుక యేల? ఱేపె దొసంగుల
జెందఁ గలవటంచు సెలవుఁ గాంచి
40
క.బంగారు జింకయై పసఁ
బొంగారుచు నేఁగి పుడమి పుట్టువు మ్రోలన్‌
సింగారము నెఱపిన దా
నింగొని తెమ్మనుచు రామునిం జెలి పనిచెన్‌
41
క.పనిచిన నయ్యింతికిఁ ద
మ్ముని కావలి యునిచి విల్లు ములుకులు గొని మె
ల్లన నమ్మెకముం బట్టెద
నని మానిసిఱేఁడు దరియ నరుదెంచుటయున్‌
42
సీ.దట్టించి సంగున దాఁటి పేఱెము వెట్టు
    నీడల నంతంత నిలిచి చూచుఁ
జేతి కిచ్చిన యట్ల చేరువ నలయించుఁ
    గదిసి పట్టఁగఁబోవ బెదరి యుఱుకుఁ
బొద లడ్డమైనచోఁ బొడకట్టక యడంగు
    గడితంపు టడవుల నడుమఁ దూఱు
నొకచోట డాఁగు వేఱొకచోటఁ గనఁబడుఁ
    దన నీడ దానె కన్గొని కలంగు
 
తే.బడలి యెకిమీఁడు తనుఁ గూడఁబడఁగ నోడి
తడయు నెడలను మగుడ ముందఱకు వచ్చు
మచ్చికలు చేసి డాయుచో ఱెచ్చి పాఱుఁ
జెలఁగి యగ్గారడంపుఁ బసిండి జింక
43
తే.అట్లు త్రిప్పలఁ బెట్టుచుఁ జెట్లు గట్లు
పొదలు గడ్డలు వడి దాఁటి పోవుచున్నఁ
బట్ట నొదవక కినిసి యబ్బల్లిదుండు
దివిరి యొకకోల నయ్యిఱ్ఱిఁ ద్రెళ్ళనేసె
44
ఆ.ఏయ నేలఁ గూలు నెడల నో లక్ష్మణుఁ
డా యటంచు మెకము కూయుటయును
విని కలంగి పుడమి విరిఁబోడి కూరిమి
కాన్పు ముద్దుమఱఁదిఁ గాంచి పలికె
45
క.ఓ లక్ష్మణుఁడా! యను రొద
యాలింపంబడియె నిప్పు డడవిం జనుచో
నేలాటి చేటు వొందెనొ?
వైళమ మీ యన్న నరయ వెడలు మటన్నన్‌
46
క.నగి యతఁడు వదినె కనియెన్‌
మగువా! బెగడంగనేల? మా యన్నకుఁ జే
టగపడియెనేని జేజేల్‌
ముగురును గడలేని గోరముల పాల్గారే?
47
చ.జగములు గ్రుంకవే? నెలయుఁ జాయ మగండును దేట దప్పరే?
పగులదె నేల? వే తలల పాము దలంకదె? తిప్ప లుర్లవే?
పగ లిరు లెల్లెడన్‌ గవియఁ బర్వవె? సంద్రము లింక బారవే?
రగులదె నల్వ గ్రుడ్డుగమి? రామున కించుక కీడు గల్గినన్‌
48
ఆ.గోల! యిట్టి కాఱుఁ గోనలో నిన్నొంటి
డించి చనఁగ జనునె? యించుకైన
నిడుమ కలుగ నేర దిపుడు మా యన్నకు
వింత కఱద లెల్ల విడువు మింక
49
తే.అనినఁ గనలుచు నయ్యింతి వినఁగరాని
మాటలాడిన నతఁడు వేమఱుఁ గలంగి
దయ్య మిఁక నేమి గావింపఁ దలఁచుకొనెనొ
కాని పనిఁ బూనె నీ వెఱ్ఱి కలికి యనుచు
50
క.ఉల్లమున నఱుజుఁ జూపని
తల్లడమున నడుగుదోయి తడఁబడ విల్లున్‌
బల్లెపుఁ గోలలు గైకొని
యల్లనఁ బఱతెంచె యన్న యరిగిన త్రోవన్‌
51
క.అంతట నెద గొద యొదవని
సంతసమునఁ బొంగి తలఁపు సాఁగెనటంచున్‌
బంతి మొగంబుల రక్కసుఁ
డెంతయు వైళంబ ఠవళి యేఱుపడంగన్‌
52
తే.పులి కళాసము కకపాల బూదిపూఁత
జడలుఁ బొత్తంబు రుదురుక్క సరులు కావి
పుట్టములు లాతమును జోగి పట్టియయును
దనర నయ్యింతిఁ జేరి దీవనలిడుటయు
53
క.ఎలదీవఁబోడి తద్దయు
నెలమిం జెయిదోయి మోడ్చి యెడలని బత్తిం
దలరుచు నున్నన్‌ గని య
త్తొలి వేలుపు పెద్ద ఆపెతో నిట్లనియెన్‌
54
క.పువ్వారుఁ బోడి నీ పే
రెవ్వరు? నీ తల్లిదండ్రు లెవ్వారు? మగం
డెవ్వఁడు? మీ ప్రో లెయ్యది?
యివ్వడువున నొంటి దిరుగనేఁటికి చెపుమా?
55
తే.అనినఁ దొయ్యలి తన తెఱఁ గతనితోడ
నంతయును జెప్పి పిదప నో యయ్య! మీర
లెవ్వ రెందుండి వచ్చితి రెఱుఁగ బలుకుఁ
డనినఁ జిరునవ్వు నిగుడ నచ్చెనఁటి పలికె
56
తే.ఇంతి! మున్నీటి నడు దీవి నేలు ఱేఁడ
నరయ రావణుఁడను పేరఁ బరఁగువాఁడఁ
దుద యెఱుంగని కలుములఁ బొదలు ప్రోడఁ
జెలఁగి జగములు మూఁడును గెలిచినాఁడ
57
సీ.గిబ్బ బాబాజోదు గుబ్బలి పెకలించి
    బంతి కైవడిఁ గేలఁ బట్టినాఁడఁ
గడయేలికల నెల్లఁ గడిమి మీఱఁగఁ బట్టి
    యిడి యూడిగములు సేయించినాఁడ
మేలు వన్నియ పొట్టవేలుపు మన్నిచేఁ
    గడలేని మెప్పులు గాంచినాఁడ
వేల్పురాయని ప్రోల వెలయు నాడెఁపు టచ్చ
    రల నెల్లఁ దమి గొల్పి కలసినాఁడఁ
 
తే.బులుగురా ముద్దుగుమ్మలఁ జిలువ చెలులఁ
జదలు ద్రిమ్మరు కొమ్మల జక్కి మోము
మెఱుఁగుఁబోఁడుల నెల్లను జెఱలు దెచ్చి
మనికి పట్టున ననయంబు నునిచినాఁడ
58
సీ.వేల్పురాయఁడు బత్తి వెలయఁ బుత్తెంచిన
    పుడుకు మ్రాన్వలితావి పూవు టెత్తు
లీఁద మేపరిసామి యిమ్ముగాఁ బంచిన
    మవ్వంపు బలు దమ్మి మానికములు
త్రాడు దాలుపు మెత్తదనమున నొసఁగిన
    క్రొత్తను న్గుట్టాణి ముత్తియంబు
లెద్దు తత్తడిజోదు నుద్దికాడిడిన హొం
    బట్టు నాడెపు జిల్గు పుట్టములును
 
తే.మరియుఁ దక్కిన కడల ఱేండ్లుఱక మంచి
సేయుటకుఁ బంచు నపరంజి యూయెలలును
గద్దియలు మేలి సెజ్జలు పెద్ద తొడవు
లెపుడు నా యింటఁ గొదలేక యెనసియుండు
59
క.త్రుంపుల గనివగు నీ వీ
సొంపెడలిన పేడమానుసుల వెంటఁ గటా!
దుంపలుఁ గూరలు నములుచుఁ
గంపలఁ బడి తిరుగనేల కైకొను నన్నున్‌
60
తే.అనుచుఁ దన తొంటిరూపు చూపిన వడంకి
యన్నుతలమిన్న బెబ్బులిఁ గన్న లేడి
జోటియుం బోలె నేలపై సొమ్మసిలినఁ
జూచి యబ్బేరజపు రక్కసుండు వేగ
61
క.పొంగుచు నరదముపైఁ బొల
తిం గూరిమి నునిచి వేల్పు తెఱవునఁ బఱచెం
బంగరు పిచ్చిక గొంచున్‌
నింగికి సాళువపు పులుఁగు నెగయు తెఱఁగునన్‌
62
తే.అత్తెఱంగునఁ గొనిపోవునపుడు గన్ను
విచ్చి కడలెల్లఁ జూచి యమ్మచ్చెకంటి
యురక విలపింపఁ దొడఁగె నయ్యో! మఱంది!
ఏల పొమ్మంటి గొదకొని యెగ్గులాడి
63
క.కటకట! యిపు డద్దోసమె
తటుకునఁ దగులుకొనఁబోలుఁ దప్పక యిఁక నె
చ్చటఁ గలరు వీనిఁ దెరలిచి
దిటముగ ననుఁ గాచుకొనఁగఁ దివిరెడు వారల్‌
64
ఆ.కడలఱేఁడులార! జడదారులార! మె
కంబులార! గ్రుడ్డుకాన్పులార!
చెట్టులార! తోడఁబుట్టువులార! పె
న్గట్టులార! నన్నుఁ గావరయ్య
65
క.కల్లరి తొలివేలుపు ఱేఁ
డల్లనఁ జెఱపట్టుకొనుచు నరుగుచునున్నాఁ
డెల్ల తెఱంగుల నిపుడో
తల్లీ! విడిపింప రాగదవె! పంటచెలీ!
66
తే.జనకుఁడను ఱేని పట్టినిఁ జాల్పు తేర్ల
ఱేని కోడల రాముని చాన నిట్లు
రక్కసునిచేత ననదనై చిక్కువడితి
వేల్పుదొరలార! కావరే! వేగఁ జేరి
67
తే.అనుచుఁ బెక్కు తెఱంగుల నమ్మెలంత
మొఱ నొసంగిన నాలించి నెఱి జటాయు
వనెడి పులుఁగులదొర యొక్కఁ డడ్డుఁ దాకి
సోఁకుమూఁకల యెకిమీనిఁ జూచి పలికె
68
ఆ.ఓరి దోసకారి! యుడుగని క్రొవ్వునఁ
బెల్లుమీఱి జగము తల్లియైన
ప్రొద్దు కొలపుసామి ముద్దియ నిటు లేల
కొంచుఁ బోయె దిపుడు గొంకులేక
69
క.తాతకు మనుమఁడవై పొల
మేఁతరి తెగలందు వాసి మీఱి తనరు నీ
కీ తెఱఁగున గొదుగక పెఱ
నాతిం దమి నిగుడఁ దాకొనం దగవగునే!
70
క.వలదు ముడికాఁడ! రాముని
కలికిం దిగనాడి చనుము కాకుండిన న
బ్బలు మగని తూపు టగ్గిం
దొలివేలుపు పంగడంబు త్రుంగెడుఁ జుమ్మీ!
71
క.అని యదలించుచు వడిఁ బై
కొని యప్పాలసుని తలలఁ గొనబారెడు కుం
దనపుం బొమిడికములు పది
యును దటుకున నేలఁగూల నురువడిఁ దన్నెన్‌
72
ఉ.తన్నిన నాతఁ డల్గి బెడిదంబుగ ముమ్మొనవాలు వానిపైఁ
గ్రన్నన నేయ నప్పులుఁగురాయఁడు ముక్కున జక్కుసేసి యా
మన్నియ తేరి యక్కజఁపు మావులఁ గూల్చి కడంగుచున్నచోఁ
గన్నెఱఁ జేసి చాలుపు మొగంబుల రక్కసుఁ డుక్కు మీఱఁగన్‌
73
క.పది వాఁడి తూపులా పు
ల్గుదొరం గుఱిసేసి యేయ గొబ్బున నవి పైఁ
బొదువంగ నీక ఱెక్కలఁ
జదియంగా మోఁదె బలిమి సడలక యతఁడున్‌
74
తే.అట్టు లెడలేని కడిమిఁ గయ్యం బొనర్చు
జడ బ్రతుకు గూడు పుట్టువు సామి మీఁదఁ
గినిసి కైదువ కేల సంకించి రక్క
సుండు గాళ్ళును ఱెక్కలుఁ జెండివైచె
75
ఆ.వైచి నెమ్మితోడ వడిఁ జనుచున్నచోఁ
బుడమి కాన్పు చీఱ కడ చెఱంగు
సించి తొడవులెల్ల గొంచక ముడిచి యా
పజ్జనున్న కొండపైని వైచె
76
తే.వేల్పు గొంగయుఁ గడలేని వేడ్కతోడ
నపుడె తన దీవి కేఁగి నెయ్యమున నింటి
చెంతఁ బూఁదోఁటలోన నచ్చెలువ నునిచి
కఱకు రాకాసి కొమ్మలఁ గాపు వెట్టె
77
తే.అంత నచ్చట నడవిలో నమ్మెకంబు
నొఱలఁ బఱియలు చేసి తిత్తొలచి తెచ్చు
నెడలఁ దోఁబుట్టు వెదురైన నడలి రాముఁ
డతనిఁ గనుగొని కినుక నిట్లనుచుఁ బలికె
78
క.అక్కట! బలితఁపు టడవిన్‌
మొక్కలముగ గోలనునిచి మోమోడక నీ
విక్కడకు రాఁగ నెదలో
నక్కటికం బేల పొడమదయ్యెం జెపుమా!
79
క.తోడంబుట్టువ వనుచున్‌
నాడెంబుగ నెదను జాల నమ్మిక మీఱం
దోడిడి వచ్చిన నయ్యో!
చేడియ నిటు డించి రాఁగఁ జెల్లునె నీకున్‌
80
ఆ.అనినఁ దల్లడిల్లి యతఁ డిట్టులను నింత
కినుక యేల? యన్న! విను మెకంబు
గూలుచున్న యెడల నో లక్ష్మణుఁడ యంచు
నఱచుటయు వెలంది యాలకించి
81
తే.కళవళించుచు నెన్నిలాగులఁ దెలిపిన
మాననొల్లక కొఱగాని మాటలాడి
పనిచె నటుఁ జేయకున్నచోఁ బడతి యలుగుఁ
జేయుటకు మీ రలుగ నేమి సేయువాడ
82
క.అని నుడివినఁ దమ్మునిపై
గినుక యొకించుకయు మదిని గీల్కొలుపక గొ
బ్బున ఱేఁ డాకుం జవికకుఁ
జని చెలి గనఁబడకయున్న సడలిన కడఁకన్‌
83
క.సందుల గొందులఁ బడుకుల
క్రిందుల యయ్యాకుటింటి క్రేవల నెల్లన్‌
సందడిగొని నెమకుచుఁ జెలి
నెందుం బొడఁగానలేక యెంతయు వంతన్‌
84
సీ.కటకట! సైదోడ! క్రాల్గంటి కార్మెకం
    బులచేతఁ బొలిసెనో? యలుకఁ జేసి
కానల డాఁగెనో? కఱకు రక్కసుల చేఁ
    జిక్కెనో? లోయలఁ జేరుకొనెనొ
పెను జక్కరలయందు మునిఁగెనో? చిఱుత గు
    బ్బలు లెక్కి మరల నోపక యడఁగెనొ?
పొదలలో నీఁగెనో? కొదుకక చెంచు దొ
    య్యలులతోఁ జేరిక నాడఁ జనెనొ?
 
తే.కాని కనఁబడదయ్యె నక్కలికి చంద
మరసి కొందము రమ్మంచుఁ దెరవు వట్టి
గుట్టు వీడంగ నెదఁగ్రాలు బెట్టిదంపు
వెతలఁ గుందుచు నందంద వెతకికొనుచు
85
సీ.చానల తలమిన్న కానరుగద గొర
    వంకలార! తుటారి జింకలార!
సోయగంబుల ప్రోకఁ జూడరుగద నెమ్మి
    దాటులార! పిసాళి తేటులార!
రతనంపు గని యిందు రాదుగదా చెంచు
    కల్కులార! యొయారి చిల్కలార!
పసిఁడి కీల్బొమ్మ మీ పజ్జ నేఁగదు గదా
    కొంచలార! కొలంక టంచలార!
 
తే.వన్నియల దొంతి మీ చెంత నున్నదేమొ?
కన్ను లలలార జూపరే పొన్నలార!
మిన్ను ముట్టిన యేనిక గున్నలార!
తిన్నెలార! నిరాబారి కన్నెలార!
86
క.తొవలార! కొదమ జక్కవ
కవలార! కడింది సోయగపుఁ దుమ్మెద కూ
టువులార! మీ రిపుడు మా
నవలా రతనంబుఁ జూచినారే? చెపుడా!
87
సీ.మీ కెంజివురుఁ బోలు మెఱుఁగు వాతెరగల
    ముగుదఁ గానరె? మావి మోకలార!
మీ క్రొన్ననలఁ బోలు మేలి పొక్కిలిగల
    కొమ్మఁ గానరె? పొన్నగున్నలార!
మీ పండ్ల చెలువూను మేటి గుబ్బలుగల
    చేడియఁ గానరే? యీడెలార!
మీ కంబములఁ గేరు మేలి తొడల్గల
    నాఁతి గానరే? లే యనంటులార!
 
తే.మీ యలరు రేకుగమి పోల్కి మిగుల నలరు
చికిలి కొనగోళ్ళు గల ముద్దు చిగురుఁబోఁడి
ఱాఁగతనమున నెచ్చోట దాఁగెనో క
నుంగొనరె? మీరు కమ్మ గేదంగులార!
88
తే.మొల్ల పొదలార! మీ తొలి మొగ్గచాల్పు
కరణి సొంపునఁ బొదలు పల్వరుస గలిగి
చెలఁగు నాడెంపు రాచ కెంజిగురుటాకు
బోఁడి నెందైనఁ బరికించి చూడరుగద?
89
క.నడలం దొడలం గుబ్బల
నడరఁగ నిన్నోట పఱచెనని డెందమునన్‌
గడు నలుగక యేనుంగురొ!
పడఁతుక తెఱఁగిప్పు డెఱుక పఱుపుము నాకున్‌
90
క.రంగున నెన్నడుమున ని
న్నుం గేరె నటంచుఁ గినుక నూల్కొన గరితన్‌
మ్రింగితివో? నిక్కంబుగ
సింగమ! కల చందమెల్లఁ జెపుమా? సరగన్‌
91
క.ఇదె మాటికిఁ బెనఁగొనియెడుఁ
గొదమాలిన వలపు తేఁటికొదమా! చెలిపై
నెద మానని యఱపూనుచుఁ
బొదమా! పరికింత మలరుఁ బొదమాటునకున్‌
92
క.పలుకుల తియ్యఁదనంబున
నలువుగ నీతోడ నీడనం జాలిన లేఁ
జిలుకల కొలికినిఁ జూచితె
చిలుకా! మాతోడ ముద్దు చిలుకం జెపుమా?
93
తే.అనుచుఁ దద్దయుఁ బలవించుకొనుచు ముందు
వచ్చి నిలిచిన చోటికి వచ్చి కొనుచుఁ
దొడరి యడిగిన దానినే యడిగికొనుచు
అంతకంతకు వెక్కసంబైన వెతల
94
సీ.పురివిచ్చి నట్టువ పుల్గు లాడెడుచోటఁ
    బడఁతి వేనలియంచుఁ బరువు వెట్టు
గవగూడి కొదమ జక్కవ లేఁగుచో నింతి
    పాలిండులని కేలఁ బట్టఁ దివురు
గుంపు గట్టుక గండుఁ గోయిలల్‌ గూయుచో
    నతివ యెలుంగని యాలకించుఁ
జెలరేఁగి రాయంచ చేరువ న్మెలఁగుచోఁ
    గలికి నెన్నడలని కలవరించుఁ
 
తే.జిలుక బోదలు గిరికొని పలుకుచోటఁ
జెలువ నును బల్కులని తమిఁ జేరఁబోవుఁ
దేఁటి దాటులు మొఱయుచో బోటి జిలుగు
పాటలని చొక్కు వలవంత ప్రబ్బికొనఁగ
95
ఉ.మా యనుఁగుం జెలిన్‌ వెదకుమా! యనువొప్పఁ దుటారి చిల్కలే
మా! యను గండుఁదేఁటికొదమా! యను నిద్దపు ముద్దులఁ జందమా
మా! యనుఁ జుట్టు పుల్గు తుటుమా! యను గ్రద్దఱి కారు చింక కూ
మా! యను నింక నోర్వఁదరమా! యను నక్కట దయ్యమా! యనున్‍
96
ఉ.పాయను నేరమేమి? బలుపాయపు నాడెపు ప్రోడరాచ పా
పా! యనుఁ గుందనంపు మెఱుపా! యనుఁ బూవిలుకాని వాలుఁ దూ
పా! యనుఁ బల్కవేమి విసుపా యనుఁ బంటవలంతి ముద్దుఁగా
న్పా! యను నిట్టులింత మఱపా యను నీకిది నేరుపా యనున్‌
97
క.అళుకేల లేదు మదిలో
బలు కానల నడుమ దాఁగి పలుకవు మరు పూ
ములికీ! కలికీ! చిలుకల
కొలికీ! చెలికిట్టి ములుక గూడునె యెందున్‌
98
క.వంతల పొంతలఁ బడి వల
వంతల గాసిలఁగఁ దగునె? వలిగొజ్జఁగి పూ
బంతీ! యింతీ! సొగసుల
దొంతీ! మము నింత గలఁప దోసము గాదే!
99
క.వలదని యెన్ని తెఱంగుల
మలపిన విన నొల్లఁబోక మక్కువతోఁ గా
నలకు న్నాతో వచ్చితి
వెలనాఁగరొ! నిన్నుఁ బాసి యిఁక నెటులోర్తున్‌
100
తే.మెలఁత! నిద్దంపుఁ బానుపు మీఁద నలరు
రేకు సోఁకినఁ గందఁ బాఱెడు నలంతి
మేను దీవియ యిబ్బలు కానలోన
నోలిఁ ద్రిమ్మరుచో నెట్టు లోర్చెఁ జెపుమ?
101
సీ.ఆకుటిక్కలు నాడెమైన మాడువులయ్యె
    మంటి దుంపలు పిండి వంటలయ్యె
నారచీరలు జిల్గు నలువుఁ బుట్టములయ్యెఁ
    బడుకు సెజ్జలు పూవుఁ బాన్పులయ్యె
వాఁకనీరులు తియ్యవలి పానకములయ్యె
    బిగువు నేలలు పైఁడి జగిలులయ్యెఁ
బొలము డొంకలు మేలి చలువ పందిరులయ్యెఁ
    బూదిపూఁతలు తావిపూఁతలయ్యెఁ
 
తే.దిప్ప లెల్లను గప్రంపుఁ దిప్పలయ్యెఁ
గార్మెకంబులుఁ దలగని కాపులయ్యె
నిన్నుఁ దగఁ గూడి యడవుల నున్నయపుడు
చాన యెడఁబాసి యిఁక నెట్టు సైచువాఁడ?
102
తే.అనుచుఁ బెక్కు తెఱంగుల నడలుచున్న
యన్నఁ గన్గొని లక్ష్మణుం డనియె నహహ!
తెఱవకై యిట్టు చెల్లఁబో దిటము దప్పి
యొఱల దగునయ్య? నీ వంటి యుఱియ దొరకు
103
క.మగఁటిమి విడనాడి యయో
నగువారల నెల్లఁ దలఁపునం బెట్టక ప
ల్వగలం బొగలం దగవా?
జగమెల్లం బ్రోదిసేయఁ జాలెడు నీకున్‌
104
ఉ.ఉల్లమునందు నీకు వెఱపూనఁగ నేఁటికిఁ? దమ్మిచూలి బల్‌
త్రుళ్ళడగింతుఁ బంతమున దుంత హుమాయి వజీరుఁ బట్టి యే
పెల్ల నడంతు వేలుపుల నేఁచి కలంతు జగంబు లన్నియుం
దల్లడ మందఁజేతుఁగద తామరకంటిని జూపకుండినన్‌
105
ఉ.ఇంత కొఱంత యేల విను మేచి జగంబులు తాఱుమాఱుగా
వింతునొ? ప్రొద్దువేఁడి యుడిగింతునొ? సంద్రము లొక్కమాటె యిం
కింతునొ? నల్వగ్రుడ్డు లుడికింతునొ? వేల్పులఁ బట్టి బిట్టు దూ
లింతునొ? కొండలెల్లఁ బెకలింతునొ? నిక్క మెఱుంగఁ జేయవే!
106
క.ఓ ఱేఁడ! నీకు మది వే
మాఱును గుందంగనేల? మానని కినుకన్‌
దేఱి కనుంగొనుచో మఱి
మాఱువడం గలరె? యెట్టి మన్నీలయినన్‌
107
తే.అనినఁ దమ్ముని పలుకుల కలరి కొంత
దిటము గైకొని వేగ నచ్చటను దరలి
దక్కినపు నేల కెదురుగా దారివట్టి
యోర్మి వెలయంగఁ జనిచని యొక్కచోట
108
క.స్రుక్కి తునిఁగిన కాళ్ళును
ఱెక్కలునై పడ్డ పక్కిఱేనిం గని యే
రక్కసి బూటకమో యిది
చక్కాడెదనంచుఁ దరియఁ జనుచున్న తఱిన్‌
109
తే.పుడమిఱేని గనుంగొని పుల్గురాయఁ
డనియె నో తండ్రి! మీ తండ్రి కనుఁగ నరుణుఁ
డనఁగఁ బరఁగిన గ్రుడ్డు కాన్పునకుఁ గూర్మి
బిడ్డఁడ జటాయు వనియెడు పేరివాఁడ
110
క.వినుమో! దేవఱ! రావణుఁ
డను రక్కస ఱేఁడు చెనఁటియై నీ పొలఁతిన్‌
గొని పోవఁగ వానిం బై
కొని యని యొనరింప నిట్టి గొడవలు సెందెన్‌
111
తే.పున్నెముల ప్రోవ! నా తొంటి పున్నియంబు
వలన వలనుగఁ గడుఁ దొలిపలుకు గొనలు
గాంచి మించిన జడదారి గములకైనఁ
గనఁబడఁగ రాక యుండు నిన్గంటి నేఁడు
112
క.తలఁగెం గడితపు దోసము
లలరెం డెందంబు పున్నియంబుల కెల్లన్‌
నెలవయ్యెఁ బుట్టు వింకను
గల పని మఱియేమి గలదు? కనికరపు గనీ!
113
సీ.తొలిపలుకుఁ గొనలుఁ దెలియు తపసి చలి
    వెలుఁగులకు దొరకు చెలువులగని
తెలికడలిని కరువలి కుడుపరి దొర
    పఱపుపయి నిదుర గొఱలు నుఱియ
మలవిలుతుఁడు నలుదలల యొడయుఁడును
    బలియు రొగిఁ బెగడ నలరు వలఁతి
పలు దెఱఁగులు గల పొలుసు దినెడు గమి
    గడిమిమయి నడఁచు కడిది బిరుద
 
తే.వలమురి సుడి కయిదువయుఁ బులుఁగు సిడము
పసిఁడి నును వలువ కలిమి పడఁతుకయును
గలుగు మగఁడగు నిను మది దలఁచి నపుడె
విడిచి చనుఁగదె బలు కొల లిడుమ గములు
114
క.అని పొగడుచు నతఁడా సా
మిని డెందమునందు బత్తి మీఱఁగ నిడి చ
య్యన నొడలు విడిచి సంతస
మున నెన్నఁడుఁ జెడకయుండు బ్రోలికిఁ జనియెన్‌
115
తే.అపుడు రాచూలి దద్దయు నడలుకొనుచు
నప్పులుఁగు వంగడపు దొర కగ్గిపనులు
తొలిమినుకు జాడ నొనరిచి యలర నచట
వెడలి యరుగుచు నొక్కచో వెఱఁగు మీఱ
116
క.తల లేక నిడుపులగు చే
తులు గ్రాలఁగ నడవిలోన దొరకిన మే తా
ల్పుల నెల్లఁ బట్టి మ్రింగెడు
పొలమేపరి నొకనిఁ జూచి పొదవిన కినుకన్‌
117
క.రెండు మొనవాఁడి కోలల
రెండు బుజంబులును వావిరిం గూల్చి కడున్‌
గొండవలె నున్న యబ్బలు
మొండెపు రక్కసుని మేను ముఱియలు చేసెన్‌
118
క.చేసిన నాతఁడు తొల్లిటి
దోసంబులఁ బాసి మొగిలు త్రోవను జేజే
వేసంబున నరుగుచు రా
కాసుల దొర సన్నదారిఁ గ్రన్ననఁ దెలిపెన్‌
119
క.తెలిపినఁ జనుచో ముందఱ
వలనుగ నొక చెంచు తెఱవ వారలఁ దన యి
మ్ములకుం దోడ్కొని చని దుం
పలుఁ బండులు చాల నొసఁగి బలితపు టెలమిన్‌
120
క.ఒరిమికయు బత్తియు న్మది
గర మలరఁగఁ బూజఁ జేసెఁ గన్నియ యపుడా
గరువంపు తెఱచి దిండుల
నిరుసత పదినూర్ల దొరల నేసిన దొరలన్‌
121
ఆ.అట్లు పూజ సేసి ఆ లేమ రామునిఁ
గాంచి పలికె వినుము కడిఁది మగఁడ!
పంప యనెడు వాఁక పజ్జల ఋష్యమూ
కంబనంగ నొక్క గట్టు కలదు
122
తే.అందు సుగ్రీవుఁడను పేర నలరు నొక్క
చెట్టు ద్రిమ్మరి యెకిమీఁడు సెలఁగుచుండు
వానితోఁ జెల్మి యొనరించెదేని నీదు
కర్జమంతయు నెరవేరఁ గలదు సువ్వె
123
క.అని తెల్పి యమ్మెలంతుక
పనిఁ బూనిచి పంపఁ బంప పజ్జకు వారల్‌
చని యచట చెట్ల నీడల
నొనరారఁగ మెలఁగుచుండి రోరిమి వెలయన్‌
124
తే.అనుచు జేజే నిరాబారి యనువు మెఱయ
నెఱుఁగ జెప్పిన కత వినియెడు వలంతి
యవలి కతయును దెలుపవే! యనుచు నతనిఁ
గడఁక దైవార మెల్లన నడుగుటయును
125
చ.తొలికడరాయఁ డగ్గియును దుంత సిడంబు మగండు సోఁకుమూఁ
కల యొడయండు నీళ్ళదొర గాడుపు జక్కులఱేఁడుఁ జిల్వ సొ
మ్ముల యెకిమీఁడు నాల్గు బుజముల్‌ గల వేలుపుఁ దమ్మిచూలియున్‌
గొలువఁగు వెండికొండపయిఁ గూర్మి చెలంగు కడింది దయ్యమా!
126
క.కోఱల పాగయు గడితపుఁ
జాఱల దుప్పటియు సారెసారెకుఁ జలువల్‌
మీఱెడు క్రొంబువ్వును మి
న్నేఱును నెఱిఁ బూని వెలుఁగు నెక్కటి వేల్పా!
127
తోటకముపొలుపారు మగంటిమిఁ బూని జగం
బుల వేమఱు నేఁచుచుఁ బొంగెడు బ
ల్బొలమేపరి బంటుల ప్రోళ్ళొక యె
మ్మెల తూపునఁ గూల్చిన మేల్బిరుదా!
128
గద్యముఇది శ్రీమదుమారమణ కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర పవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబయిన యచ్చతెలుఁగురామాయణ మహాకావ్యమం దారణ్యకాండము సర్వ మేకాశ్వాసము. 
AndhraBharati AMdhra bhArati - Achcha Telugu Ramayanamu - AchchaTelugu Ramayanamu - Kuchimanchi Timmakavi - rAmAyaNamu - ( telugu andhra )