ఇతిహాసములు అచ్చతెలుఁగు రామాయణము కిష్కింధాకాండము
అచ్చతెలుఁగు రామాయణము - కూచిమంచి తిమ్మకవి
కిష్కింధాకాండము
క.సిరుల నిడు మనికిపట్టా!
గరువపు రక్కసుల ప్రోళ్ళు కాల్చిన దిట్టా!
హరువు గొనమ్ముల తిట్టా!
పురుడెన్నఁగ రాని వేలుపుల తలకట్టా!
1
తే.వినుము వాల్మీకిఁ జూచి యవ్వేల్పు తపసి
పల్కె రాచందమామ యప్పగిదిఁ బంప
కడ మెలంగఁగ నద్దరి గట్టుమీఁద
నుండి కన్గొని ప్రొద్దు కుఱ్ఱండు దలఁకి
2
క.వీరలు రాకొమరులొ? జడ
దారులొ? తూపులును విండ్లు దాలిచి యున్నా
రారయ వాలి కతంబున
నీ రూపున వచ్చిరేమొ యిపుడిచ్చటికిన్‌
3
ఉ.వీరల చందమెల్ల సరవిం బరికింపక కాని యింక లో
నోరిమి కల్గదంచు నళుకొప్పఁగ నాడిన నాలకించి వి
న్గూరిమి మన్మఁడా సొబగు కుత్తుక కోఁతులఱేనిఁ జూచి యే
నారసి వత్తు వారి తెఱఁగంతయు నింతఁ దలంపనేటికిన్‌
4
తే.పున్నియపు మానుసులు గాని యెన్న దోస
కారి తీఱులు వీరిలోఁ గానబడవు
వంత యెంతయుఁ బూనఁగా వలవదిచట
నెలమితో నుండు మీవని పలుకుటయును
5
క.సంతసిలి యాతఁడా హను
మంతున కానతి యొసంగి మదిలో మిగులన్‌
వంత యొనర్పఁగ నపుడే
మంతులతోఁ గూడి చనియె మలయంబునకున్‌
6
ఆ.అంత నీఁదచూలి యమ్మన్నుఱేఁడుల
చెంత కరిగి బత్తిఁ జేయి దోయి
మొగిచి పలికె నరిది మొనగాండ్రురార! మీ
రెవ్వ రిందు మెలఁగ నేటి కిటుల
7
క.అనిన విని రాము తమ్ముఁడు
నెనరొదవఁగ నతనిఁ జూచి నేర్పునఁ బలికెన్‌
విను కొమ్మ మెకపు బలియుఁడ
గొనకొని మా చందమెల్ల గుఱు తెఱిగింతున్‌
8
సీ.పుడమి నయోధ్యయన్‌ బ్రోలి కేలికయైన
    బంతితేరుల ఱేని పట్ల మేము
తండ్రి పంపున బల్లిదపుఁ గానలకు వచ్చి
    మెలఁగుచో నీ ఱేని మెలఁత నొక్క
చెనఁటి రక్కసుఁ డెత్తుకొని పోవ నాపె కై
    వలగొని వెదకుచు వచ్చి వచ్చి
చెంచుముద్దియ నోర్తుఁ గాంచి యత్తెరఁగెల్ల
    వినిపింప నయ్యింతి నెఱవుమీర
 
తే.మంచిమెడ కోనద్రిమ్మరి మన్నెగాని
కత యెఱింగింప నాతనిఁ గనుగొనంగఁ
దలఁచి వచ్చితి మిచటికి బొలుపు మెఱయ
నతఁడు రాముఁడు లక్ష్మణుఁడండ్రు నన్ను
9
తే.ఒనర నిద్దొరచేఁ గాని పని యొకింత
లేదు జగమున నితనికి లెంకయైనఁ
బ్రొద్దు కొమరుని పనియెల్లఁ బొసఁగఁ జేయు
నింక నీ వెవ్వఁడవు మాకు నెఱుఁగఁ బలుకు
10
తే.అనిన నాతఁడు వల్కె నో యయ్య! చిన్కు
దారి దారి యనుఁగుఁ గూనఁగోరి కూర్మి
దనరఁ గేసరియను కోన మనికిపట్టు
కలికి యంజన యనునది గన్నవాడ
11
క.హనుమంతుండను పేరం
దనరారెడువాఁడఁ బచ్చ తత్తడుల వజీ
రుని కొమరుని కెంతయు న
మ్మిన బంటఁ గడింది తేజు మీఱినవాఁడన్‌
12
క.అక్కోన త్రిమ్మరుల దొర
యక్కజపుం జెలిమితోడ ననిచిన నిపుడీ
చక్కికి మీ తెఱఁగఱఁయగ
నక్కఱఁ బఱతెంచినాఁడ నయ్య! వలంతీ!
13
తే.లెక్క కెక్కువయగు మ్రానుటిక్కదొరలు
గలరు బలు జోదు లాతని గొలుచువార
లట్టి బలియుఁడు మీకు బంటయ్యె నేని
అరయ నీరేడు జగముల నడ్డు గలదె?
14
తే.అట్లు గావున మీ రిపు డతనితోడఁ
జెలిమిఁ గావింపఁ జెల్లు వేంచేయుఁ డనుచు
వారిఁ దోడ్కొని యక్కరువలి యనుంగుఁ
గొమరుఁ డెలమిని ఋష్యమూకమున కరిగె
15
ఆ.అచట వారి నునిచి యపుడె క్రోఁతుల ఱేని
సరస కేగి తాను జన్న తెఱఁగు
విన్నపం బొనర్చి వ్రేల్మిడి నతని న
ద్దొరల కడకు వేడ్కఁ దోడి తెచ్చె
16
క.తెచ్చిన నతఁడా ఱేఁడుల
కొచ్చెము గనరాని బత్తి యొదవఁగ మ్రొక్కుల్‌
చెచ్చెర నిడి రామునితో
మచ్చిక వెలయంగఁ దియ్య మాటలు పలికెన్‌
17
ఆ.రాచవేల్పు ఱేఁడ! మీ చొక్కటపు హజ్జ
దోయి గంటి వెఱఁగు దోఁప నిపుడు
దొలఁగె నెల్ల చెడుగు దొసఁగులు గడలేని
పున్నియంబు లెల్లఁ బొదలె మాకు
18
ఆ.కడిఁది బిరుద! నీవె కాక మా వ్రేఁగిఁకఁ
బొసఁగ నరుఁడొకండు పూనఁగలడె?
పుడమి పడఁతి వ్రేగుఁ బడగదాలుపు రాయఁ
డూనుఁ గాక లాతి యూనఁ గలఁడె
19
తే.నలువు మీఱంగ నన్ను మీ నలువురకును
దోడఁ బుట్టువునుగఁ జెల్మితోడఁ జూచి
కరము పెనుపొందు నా కనికరము నెఱపి
యిడుమ లెడఁబాపి కోరిక లిడుము మాకు
20
క.అని మును రక్కసుఁ డెత్తుక
చని నప్పుడు పుడమి కాన్పు జతనంబుగఁ గొం
గున ముడిచి గట్టుపై వై
చిన తొడవులు దెచ్చి ఱేని చేతి కొసంగెన్‌
21
క.ఒసఁగిన నవి గైకొని వె
క్కసమగు కన్నీరు దొరుఁగఁ గళవళమున లో
నసురుసు రనుచుం గడితపు
దెసలం బడి కొంత వడికిఁ దెలివి దలిర్పన్‌
22
క.ముచ్చౌకపు రూపులు పూ
న్వెచ్చని జేజే యనుంగు నిసుగుం గని లో
లొచ్చక యింతయు నొదవని
మచ్చిక నవ్వాసి రాచమానిసి పలికెన్‌
23
క.మల ద్రిమ్మరి రాయఁడ! దిట
మలరఁగ నీ పవతు పీఁచ మడఁచి పుడమి కి
మ్ముల నొడయనిఁ జేసెద నినుఁ
దలపున మా మాట నమ్ము దలఁకకు మింకన్‌
24
క.ఆ కొండసూడు పట్టికి
నీకును బగ యెట్టు లొదవె? నిక్కువ మొనరన్‌
మా కెఱిఁగింపుము దిగ్గన
నీ కర్జం బెల్లఁ బొదివి నెగడఁగఁ జేతున్‌
25
సీ.అనిన నాతఁడు వల్కె నయ్య మున్మాయావి
    యనెడు రక్కసుఁ డొక్కఁ డాము మీఱఁ
జేరి పోరొనరింపఁ జీఱిన నెన్నిక
    గను తోఁకగల కోన మనికిపట్టు
ననుఁ దోడు పిల్చుక మొనసి యచ్చెనఁటి పై
    నఱుఁగ నిద్దఱిఁ జూచి కరము వెఱచి
పఱచి వాఁడొక్క గుబ్బలి పెను బొరియలోఁ
    దూఱిన నాతఁడుఁ దోన తూఱి
 
తే.పెక్కులాగులఁ బైకొని పెనఁగుచున్న
తఱిని నెత్తురు వరదలై పఱచుటయును
బొలసు మేపరి బొబ్బలు సెలఁగుటయును
జూచి యవ్వాలి మడసె నంచుం దలంచి
26
క.కడు వడిఁ గలుగు మొగంబునఁ
బడు కొక్కటి ద్రోచి వెనుక పను లాతని కే
ర్పడఁ జేసి వీడు సేరినఁ
గడకం బజ లెల్ల నన్నుఁ గనుఁగొని యెలమిన్‌
27
తే.త్రిప్ప ద్రిమ్మరి నాడెల్లఁ దివిరి ప్రోవు
మనుచు నొడయనిఁ గావించి యునుచు నంత
రక్కసుని ద్రుంచి మిక్కిలి యుక్కు మెఱయ
వచ్చి నను జూచి కినిసి యవ్వాలి పలికె
28
ఆ.ఓరి! దోసకారి! కూరిమి సైదోడ
వనుచు నిన్ను నమ్మి యకట! పగతు
తోడఁ బోరొనర్పఁ దొడఁగినచోఁ గికు
రించి రాఁగఁ జనునె? కొంచులేక
29
తే.అనుచు నా కూర్మి గేస్తురాలైన రుమను
గొని పుడమి యెల్లఁ గొని తఱిమినఁ గరంబుఁ
దలఁకి యిక్కొండపైఁ జేరి మెలఁగుచుండి
తిచటి కాతఁడు రాలేమి యెద నెఱింగి
30
చ.అనవుడు నేలఱేఁడు వెఱఁగందుచుఁ గోఁతుల ఱేఁడ! మేటి తే
జున జగమంతయుం గెలువఁ జొప్పడు లావును గల్గు వాలికి
ప్పెనుమల కెక్కరామి వినిపింపుము నిక్కముగా నటన్న న
మ్మినుకుల యిక్క గుఱ్ఱఁ డెకిమీనిఁ గనుంగొని పల్కె వెండియున్‌
31
క.విను దేవర! మును దుందుభి
యను రక్కసుఁ డొకఁడు దుంతయై వేల్పులరా
యని కొమరునిఁ దనతో దుర
మునకుం బిలిచినఁ గడింది మురితో నతఁడున్‌
32
ఉత్సాహ.అలుక మీఱ నప్పిసాళి యాము దుంత రక్కసుం
దలఁ కొకింత లేక కూడఁ దఱిమి రెండు కొమ్ములుం
గలయఁ బట్టి యబ్బురంబుగాఁగఁ గ్రిందఁ ద్రోచి రే
వెలుఁగు జోదుబిడ్డఁ డేలు వీటి కంపె వ్రేల్మిడిన్‌
33
ఆ.అనిచి బలిమి నొక్క యామడ నరి వాని
యొడలు దన్నివైవ నురలి నల్ల
బొట్టు లివ్వెడంద గట్టుపైఁ బడిన మ
తంగుఁ డనెడు దొడ్డ తపసి కినిసి
34
క.ఇక్కొండ వాలి కెన్నఁడు
నెక్కఁగ రాకుండ మేరయిడె నటులా బల్‌
రక్కసుని మేను సిమ్మెడు
నుక్కతనికె కాక పుడమి నొరులకుఁ గలదే?
35
తే.అనిన రతనాల బొజ్జ ప్రోయాలి ముద్దు
పాప పెనిమిటి తొగదాయ పట్టి నపుడె
పలువ యెనుపోతు పొలదిండి పడ్డ చోటి
కెలమితోఁ దోడుకొని చని బలిమి మెఱయ
36
క.కొదుకక యా రక్కసు మెయి
వొదలుచుఁ దన నునుపు టజ్జ బొటమన వ్రేలన్‌
బదియామడ సనఁ జిమ్మిన
నెద నలరుచుఁ గొమ్మ మెగపుటేలిక యనియెన్‌
37
తే.అయ్య! మును వాలి వంకరయైన తాటి
చెట్టు లొక యేడు కౌఁగిటఁ బట్టి యాకు
లెల్లఁ గోయును నీ వవి యిప్పు డొక్క
యమ్మున నడంచు మనుటయు నట్ట యేసి
38
సీ.అడవి ద్రిమ్మరి ఱేఁడ! తడవేల కిష్కింధ
    కరిగి మీ యన్నతో దుర మొనర్చు
చుండుము మేము నీయండనే పఱతెంచి
    యక్కూళఁ బోనీక యుక్కడంచి
నిను దొరఁ జేయుదుమని ఱేఁడు వనిచిన
    నతఁ డట్లు చనివాని ననికిఁ బిలువఁ
గొఱకొరతోడ గ్రక్కున వాఁడు వెడలిన
    నిరువురుఁ గదిసి వావిరిఁ బెనంగు
 
తే.నెడలఁ దోడనఁ జని వారి వేఱుపఱప
రాకయుండినఁ గొంకుచు రాము డొక్క
యిక్క నూరకయున్న నియ్యివము సూడు
పట్టి వ్రేటులఁ బడి వేగఁ బాఱుతెంచి
39
క.ఒడయని యడుగునఁబడి కడు
నడలిన నూరార్చి మరల నరుగుమటంచున్‌
మెడ నొక పూలసరంబిడి
వడి ననిచిన నేఁగి పెనకువకుఁ బిల్చుటయున్‌
40
తే.పొసఁగఁ దోబుట్టువను కూర్మి వోవ విడిచి
బ్రతుకఁ జాలక మిక్కిలి బంటువోలెఁ
దిరుగ నరుదెంచుటకు వీనిఁ దేర్తు ననుచు
నొడలి చూపుల యొడయని కొడుకు వెడలి
41
క.ఉడివోవని కొఱకొఱతోఁ
గడువడిఁ బైగదిసి కడిమి గడలుకొనఁగ బల్‌
పిడుగున కెన యనఁదగు తన
పిడికిటన ప్రొద్దు కొడుకు పేరెదఁ బొడిచెన్‌
42
క.పొడిచిన నిలువక పుడమిం
బడి నెత్తురు గ్రక్కి లేచి పాయక యతఁడ
గ్గడుసరిపై బలితపు లా
వడరఁగ నొక మద్ది వెఱికి యార్చుచు వైచెన్‌
43
తే.వైచుటయు వాలి ముమ్మొన వాలు పూని
చీఁకటుల గొంగ కొడుకుపైఁ జెలఁగి యేయ
నతఁడు దాని నడంగించి యతని మీఁదఁ
దొడర క్రమ్మఱ నొక పెద్ద పడుకు వైచె
44
సీ.అటువలె వారు పేరలుక లిబ్బడిగాఁగఁ
    దొడరి యక్కజమొప్పఁ దొడయుఁ దొడయుఁ
బెనుచుక పెనగుచుఁ బిడికిళ్ళ నడఁచుచుఁ
    దాఁచుచుఁ జఱచుచుఁ దఱిమి బొబ్బ
లిడుచుఁ బెన్మ్రాకులఁ బడుకుల రువ్వుచుఁ
    దోఁకల మోదుచుఁ దొలఁగఁ జనుచు
గోళ్ళ వ్రచ్చుచుఁ బండ్ల గురుకొని కఱచుచు
    మెడలు నొక్కుచుఁ దూలి పుడమిఁ బడుచు
 
తే.బిట్టు పూఁచిన బూరుగు చెట్టులట్ల
నెత్తురులఁ దోగి పోరుచో నేలఱేఁడు
వేడి వేలుపు బిడ్డని వాఁడి చెడుట
తెలిసి సింగిణి నొక దొడ్డ చిలుకుఁ గూర్చి
45
తే.వేయు గన్నులు గల బలు వేల్పుకొడుకు
ఱొమ్ము గురిచేసి యేయ మెఱుంగు లెల్ల
కడల నింపుచు నది సని కాఁడుటయును
బుడమిపైఁ ద్రెళ్ళి యీల్గెఁ గొబ్బున నతండు
46
ఆ.అపుడు కోఁతిఱేని కమ్మానుసుల ఱేఁడు
రిక్కపేరి చెలిని దక్క నొసఁగి
కొమ్మ మెకపు ప్రోలి కిమ్ముగా నేలికఁ
జేసి యనుప బత్తిచే నతండు
47
క.తొడవులు మానికములు విడి
ముడియు న్నాడెంపుఁ బుట్టములుఁ బ్రోవులుఁగా
నుడుగరలు తెచ్చి యిడి య
య్యొడయని యడుగుల కెరంగి యొప్పుగఁ బలికెన్‌
48
ఆ.రాచ రేవెలుంగ! నీ చేత నిపుఁ డెల్ల
గొడవలునుఁ దొలంగెఁ జెడని మేలు
గలిగె మాకు నిన్నుఁ గొలిచిన వారల
కొకట ముత్తి బుత్తు లొదవుఁ గదవె
49
క.వేలుపులకైనఁ జిక్కని
వాలిం బొరిగంటి వొక్క వాల్తూపున నీ
మ్రోల నిఁక నిలిచి మగఁటిమి
నాలం బొనరింప నొరుల కలవియె పుడమిన్‌
50
క.పది మోముల రక్కసు నిఁక
సదమదమొనరించి కొఱలు సంతసమున న
మ్మిదిల దొర బోదఁ జేకొని
యెద వెదలో దిటము విడకు మింతయు తండ్రీ!
51
క.వాన తఱి వచ్చె నిదిగో!
మానుగ నీ నాల్గు నెలలు మక్కువ మీఱన్‌
మా నెలవుననుండి తుదిన్‌
జాన తెఱంగరసి దండు సాగింపఁ దగున్‌
52
క.కావున నా విన్నపమో
దేవర! నీ యెదను నిలిపి తేకువ మీఱం
గా వేంచేయుఁడు గొబ్బున
నావుడు నా రిక్కఱేఁడు నగుచుం బలికెన్‌
53
తే.కోఁతిరాయఁడ! మాపయిఁ గూర్మి నిలిపి
వాన తఱి యెల్ల నగళుల లోన నుండఁ
దపసి రూపులఁ బ్రోళ్ళకుఁ దవిలి రాఁగ
మాకుఁ బొసఁగదు పొమ్ము మఱాక రమ్ము
54
క.అని యతనికి సెలవిడి తలఁ
పునఁ బంట నెలంత కానుపు న్నిలిపి వెతం
గనలుచుఁ దమ్మునితో నొ
య్యనఁ గూడుక మాల్యవంతమన్‌ మల కరిగెన్‌
55
తే.అంతఁ దన పట్టియగు వాలి నడఁగఁ జేసె
నీ కొమరుఁ డంచు వేల్పుమన్నీఁడు ప్రొద్దు
నలమి ముట్టడి వేయించె ననఁగ మబ్బు
తెగలు వడిఁ బర్వుఁ జుక్కల తెరవునందు
56
క.తొలివేల్పు ఱేని సిరు లిఁక
నిలువక చను నిట్టులనుచు నెఱి జగములకుం
దెలుపు తెఱంగున నఱిముఱి
మెలఁగెం తెఱగంటి త్రోవ మించుం దుటముల్‌
57
క.పంటచెలి యల్లునకుఁ దెఱ
గంటిదొర ల్పగతు గట్టిగా గెల్చుటకై
యొంటెఱిఁగి యునుచు విండ్లన
వింటన్‌ వేలుపుల రాచవిండ్లు దనర్చెన్‌
58
ఆ.జగము లేఁచు చాల్పు మొగముల రక్కసుఁ
జిదిమి వైచి నెయ్య మొదవ మమ్ముఁ
బ్రోవు మనుచు వేలుపులు రాముని గురించి
మొఱలు పెట్టి రనఁగ నుఱుము లమరె
59
చ.పొల కవణంపు ఱేని నిఁకఁ బూనఁగఁ జాలనటంచు నేల తొ
య్యలి గఱి వేల్పు హజ్జఁ బడి యంగదతోఁ దన చందమంతయున్‌
బొలుపుగ విన్నవించుకొనఁ బోయెనొకో యన మబ్బుత్రోవకుం
బలుపుగఁ గ్రమ్మి దుమ్మెసఁగి పారె వడిన్‌ సుడిగాడ్పు పెంపునన్‌
60
క.మొఱకుదనంబునఁ బెఱ చెలిఁ
జెఱఁగొని నీ మనుమఁ డుఱకఁ జెడఁ బాల్పడె రూ
పఱియని నలువకుఁ దెలుఁపగఁ
బఱచెనన న్మింట నంచబారులు సనియెన్‌
61
తే.తన యనుఁగుఁ గూన చెఱనుంట దలఁచి వెతలఁ
దూలు నేలపొలంతుక దూప యడఁప
మొగిలు కడవల జేజేలు ముంచి నించు
వలి చదలు వాఁక నీరన వాన లెసగె
62
తే.రక్కసుని దోఁకఁగట్టి సంద్రముల నెల్ల
ముంచు వాలిని ద్రుంచి తౌనంచు వేల్పు
తెఱవ లా రాముమీఁద ముత్తియపుఁ బ్రాలు
గడకతోఁ జల్లిరన వడగండ్లు రాలె
63
చ.కలువల దాయ వంగడపు గామిడి చామను దెచ్చినట్టి మొ
క్కలపుఁ బిసాళి రక్కసుని గట్టిగ లోనిడుకొంటి వింక రా
నెల కడిమిం గలంచుఁ గన నిన్ననుచుం దమ ఱేని కేర్పడన్‌
దెలుపఁగ నేఁగెనాఁ బఱచెఁ దెల్లగ నేఱులు నీటి వామికిన్‌
64
తే.ఎఱచి మేపరి నెత్తురు టేఱు లిట్లు
పఱచునని తెల్పు వడువున వరద లెసఁగె
వాని నంజుడు మఱియ లివ్వరుసఁ బుడమి
బొరలు నంచన జేవురు పురువు లడరె
65
సీ.గాటంపు వలినాలిగాడ్పు లూర్పులు గాఁగ
    నిండారు వఱద కన్నీరు గాఁగఁ
గొమరొందు తెలినుర్వు లుమియు కళ్ళెలు గాఁగ
    నెఱయ సల్జీరాడు నెఱులు గాఁగ
మొగలిపూఁ బొదలు మోమునఁ జేర్చు చీరగాఁ
    బూరి మోసులు గగుర్పొడుపు గాఁగ
జిమ్మట రొదలు గాసిల యుస్సురనుటగా
    నలరు నెమలి కూఁత లార్పులుగను
 
తే.గడిఁది వేలుపు రాచ దాపుడు పురువులు
రాలు రవణంపు నునుఁ గెంపుఱాలు గాఁగ
నేల ప్రోయాలు దన ముద్దు చూలిఁ దలఁచి
తెఱపి గనరాని వంతలఁ గొఱలి యొఱలె
66
సీ.చిలువ దిండులకుఁ జెచ్చెర నాటతమి మీఱె
    వానకోయిలల నీర్వట్టు దీఱెఁ
దెఱువరి గములపై మరుఁడు గైదువ నూఱెఁ
    బొరిఁబొరి నేఱులు పొఱలి పాఱె
నడవులలో నెల్ల గడితంపుఁ జిచ్చారె
    మీఁదటి డిగ్గియ ల్మిగుల నూరెఁ
గొదగొని రాయంచ పదువు నింగికిఁ బాఱె
    మొల్లంపు టెండలు పెల్లు దీఱెఁ
 
తే.గాఱు దుంతలు వంతల కడకుఁ బాఱె
గ్రుడ్లఁ బెట్టుక పులుఁగులు గూండ్ల దూఱెఁ
బేద గేస్తుల కొంపలు బిట్టు కాఱె
బజల వెట్టలు వడి నింకబారె నపుడు
67
తే.అంత నవ్వాన తరువాతి యదను దోఁపఁ
బంట పూఁబోఁడి తన ముద్దుపట్టి కొఱకుఁ
బలు వగలఁ గుంద మేనెల్లఁ బచ్చవాఱె
ననఁగ బరవంపుఁ బైరులు గొనబు మీఱె
68
సీ.కప్పుకుత్తుక పుల్గుగముల పెల్లు దొలంగెఁ
    దెలిమొగుల్‌ సదల నేడ్తెరఁ జెలంగెఁ
గొలఁకులఁ దామరల్గలువలు నలరారె
    గిబ్బపోతులు దద్ద యుబ్బి పాఱె
నలువ బాబా పిండు నులివు లెంతయు హెచ్చెఁ
    బొలము పొంతల ఱెల్లు పూయఁజొచ్చె
బొదలెల్ల గార్కొని పొరిఁబొరిఁ బచరించెఁ
    బ్రాల్నిగ్గు వరిచేలఁ బసలు మించె
 
తే.రొంపు లెడవాసె నేఱుల పెంపుఁ దీసె
జగము లుప్పొంగె రేలెల్ల మిగులఁ దేట
వెన్నెలలు గాసెఁ గన్నుల విల్తునయ్య
నిదుర మేల్కాంచెఁ గడలి నయ్యదనునందు
69
తే.ముగుద నెడఁబాసి వంతలఁ బొగులుచున్న
రాగవుని మీఁద దండెత్త సాగె ననుచుఁ
జిలుక తుటుములఁ దోల జొచ్చిరి చెలంగి
పొలము కాపరి కాపులేఁ దలిరుఁబోండ్లు
70
తే.అపుడు కోఁతుల ఱేఁడు వాయని కడంక
నారెకుల చేత వడిఁ గమ్మ లనిచి యెల్ల
కోన త్రిమ్మరి మూఁకలఁ గూడఁ బెట్టి
ఠీవి మెఱయంగ బూర వట్టించి తరలి
71
క.అఱిముఱి నప్పొట్లెము దను
గిఱికొని కొలువంగ నరిగి కెరలెడు బత్తిన్‌
ముఱియుచు నడుగుల కెరఁగిన
నఱకడఁ బెట్టుకొని రాముఁ డాతని కనియెన్‌
72
ఆ.జగము విందుకంద! జాగేమిటికిఁ గ్రొమ్మె
ఱుంగుఁబోడి నింక రోయు కొఱకు
దంటలైన పోటు బంటులఁ గొందఱి
నేర్చి పనిచి జాడ లెఱుఁగ వలయు
73
తే.తెఱవ యున్నట్టి తెఱఁగెల్లఁ దెలిసి పిదప
దురము గావింపఁ బగఱపై నరుగవలయు
ననిన వల్లె యనుచు నాతఁ డక్కడింది
మగనిఁ గనుగొని యింపొంద మరల ననియె
74
క.ఱేఁడులరాయడ! విను మి
వ్వాఁడి మగల్‌ గయ్యమునకు వచ్చినచో న
వ్వేఁడిమి కన్దొర నైనన్‌
బోఁడిమితో గెలుచుటకును బోలుదురు సుమీ!
75
తే.పుడమి వీరికిఁ జొరరాని యెడలు లేవు
మీఱి నిక్కపు జగమైనఁ దూఱి వాలు
గంటి చందంబుఁ దెలిసి రాఁగలరు మీరు
సెలవొసంగిన నంచుఁ జెచ్చెర నతండు
76
సీ.కరువలి కొమరుఁ డంగదుఁడు గవాక్షుండు
    నలుఁడు నీలుఁడు శతవలి గజుండు
గవయుఁడు మైందుఁడు గంథమాదనుఁడు ధూ
    మ్రుండును బావకాక్షుండు వాల
పాశుండు తారుండు పనసుండు వేగద
    ర్శియు వినతుఁడుఁ గేసరియు సుషేణుఁ
డెలుఁగుల యెకిమీఁడు వృషభుండు గిరిభేద
    నుఁడు కుముదుఁడు కరభుఁడును మొదలు
 
తే.గలుగు నాడెఁపు మొనగాండ్రఁ గదియఁ బిలిచి
కడఁకతో మీర లేఁగి యిప్పుడమి నెల్ల
కడల గుట్టలఁ బ్రోళ్ళఁ గాఱడవులందు
దీవులందునుఁ జెలి జాడఁ దెలిసి రండు
77
క.మీ మీ లావులు నెఱపుచు
వేమరుఁ జొరరాని చోట్ల వెదకి కడంకన్‌
జామ తెఱఁగరసి గొబ్బున
సేమంబున రండటంచు సెలవొనరించెన్‌
78
ఆ.అపుడు రాచూలి జింకవార్వపు వజీరు
గారవపుఁబట్టి నొయ్యనఁ జేరఁ బిలిచి
వ్రేలి యుంగర మొసఁగి కూరిమి దలిర్ప
నవ్వలంతినిఁ జూచి యిట్లనుచుఁ బలికె
79
క.క్రోతి తొగవింద! మాకుం
బ్రాఁతిగ దొరకిన యనుంగు బంటువగుట నీ
లోఁతెఱిగి యుంగరం బా
గోఁతికి నిమ్మనుచుఁ గోరుకొంటిమి నిన్నున్‌
80
క.ఓడక లంకకుఁ జని య
వ్వీ డెల్లను వెదకి యందు వెలఁదుకఁ గని యి
న్నాడెంపు రవణ మిడి యా
చేడియ తలమానికంబుఁ జేకొని రమ్మా!
81
చ.అనవుడు నాతఁ డుక్కుఁ దనరారఁగ నిట్లను నేలతాల్ప! యి
ప్పనిఁ దలఁ బూని రక్కసుని బాళెము వాలెముఁ జొచ్చి చేడియం
గనుగొని యుంగరం బొసఁగి క్రన్నన నౌదల మానికంబుఁ గై
కొని పఱతెంతు వెండియును, గోఁతి దొరల్గని సంతసిల్లఁగన్‌
82
చ.తెఱవను జూపకున్నఁ దొలిదేవర ప్రేవులు ప్రోవులై పడన్‌
బెఱికెద నౌదలల్‌ దలఁగ బెట్టెద జుట్టులు పట్టి నేలపై
జిఱ జిఱఁ ద్రిప్పికొట్టి మెయి జిప్పిలి నెత్తురులుబ్బి పాఱఁగా
జఱజఱ నీడ్చి వైచెద నెసంగ దొసంగుల నెల్ల ముంచెదన్‌
83
చ.తొవలయనుంగుఁ బ్రొద్దు నొక తూఁకున మ్రింగుదు, వేల్పు మూఁకలం
దవిలి కలంతు నజ్జముని దామరచూలినిఁ గ్రొవ్వడంతుఁ దేఁ
కువ మెఱయంగ రక్కసుల గుండియ లెల్లను జింతు నేలయుం
దివియును వ్రక్కలింతుఁగద! దేవర యానతి యింత గల్గినన్‌
84
క.రాకలువ ఱేఁడ! గట్టిగ
మీ కడకు జగంబు లెల్ల మేలిమి పొగడన్‌
రాకాసుల దొరఁ దెచ్చెదఁ
గాకుండిన లంక వెఱికి గడువడిఁ దెత్తున్‌
85
తే.అనిన సంతసిల్లి యద్దొర యెంతయు
గారవించి యనుప గట్లసూడు
కొడుకు కొడుకుఁ బుట్ట కూడు మేపరి ఱేఁడు
దోడుగాఁగ నెలమితోడఁ జనియె
86
క.మిగిలిన చెట్టుం ద్రిమ్మరి
జగబంటులు నందు నందుఁ జని రటువలెనా
మొగిలు పగవాని కూనయు
నొగిఁ గొందఱఁగూడి యరుగుచుండెడు నెడలన్‌
87
తే.అలర సంపాతి యనియెడు పులుఁగు రాయఁ
డొకఁడు బలు వేల్పు రామెట్టు నొద్ద వారిఁ
గాంచి యీరైదు మెడల రక్కసుని దీవి
కేరుపడఁ ద్రోవ యెఱిఁగించి యేఁగుటయును
88
క.అక్కొమ్మ మెకపు జోదులు
నిక్కుచు నక్కొండ యెక్కి విరి దేనియలం
జొక్కటపుఁ దీయ పండుల
జక్కర తెలినీళ్ళ నలుపు సడలించి తగన్‌
89
తే.మ్రుచ్చుఁదనమున రాకొమ్మఁ దెచ్చినట్టి
యుఱియ రక్కసుఁ డిదె దాఁగి యున్నవాడు
రండనుచుఁ దమ్ము నెమ్మిఁ జేరంగఁ బిలుచు
కరణిఁ గడు మ్రోయు నీర్వామిఁ గాంచి రెదుట
90
ఆ.కాంచి యబ్బురంబు గదుర నీ మున్నీరు
దాటి చనఁగ నేరి తరమటంచుఁ
గొంకు మీఱ గాడ్పు కొమరునిఁ గన్గొని
వలఁతి తనము వెలయఁ బలికి రపుడు
91
క.విను మనుమడ! మా నుడువులు
విను మనువు దలిర్ప నీవు వేఱొండు తలం
పున నుండిన నీ రతనపు
గని యిందిఁక నొరుఁడు దాఁటఁగలఁడే చెపుమా!
92
క.పిల్లారి జియ్య తేజుఁనఁ
దెల్లంబుగ జింక మావు దేవర కతనన్‌
బెల్లడరారఁగఁ బుట్టిన
బల్లిదుఁడవు నీకు గడ్డుపనులుం గలవే?
93
ఆ.పిన్ననాఁడె జగము లెన్న నబ్రమ్ము మీ
రెడు కడంకతోడ రేగుపండు
పగిది నిరులఁగొంగఁ బట్టుక మ్రింగిన
ప్రోడ నింక నిన్నుఁ బొగడనేల?
94
క.ముందటి బంటవటంచున్‌
డెందంబునఁ గూర్మి నివ్వటిల్లఁగ నపుడే
కుందనపు టుంగరము ఱేఁ
డిందఱలో నిన్నె పిలిచి యిచ్చెనొ? లేదో?
95
క.కావున నేలిక కర్జము
గావింపఁగఁ బూని కొంకఁగాఁ దగదింకన్‌
లావడరఁ గడలి దాఁటుము
వేవేగం దెరవఁ జూచి వెండియు రమ్మా!
96
ఆ.అనుడు వారిఁ జూచి యతఁడిట్టులనియె నో
కొలము సాములార! కొఱఁత లేని
యేపుతోడఁ జెలఁగి యిపుడ మీ యానతి
దాటఁబోక కడలి దాటువాఁడ
97
ఆ.దాటి లంకఁ జొచ్చి బోటియున్న తెఱగు
గాంచి మగిడి వత్తుఁ గాకయున్న
జెడుగు పొలసుదిండి యొడయని నిచటకుఁ
గడిమి మీఱ నంటఁగట్టి తెత్తు
98
క.వచ్చు నెడల నడ్డంబై
వచ్చిన రాయంచ వారువపు దొర నైనన్‌
గ్రచ్చఱ నిడుమలఁ బెట్టెద
నిచ్చలు నిప్పుడమిలోన నించెద నసముల్‌
99
ఆ.అనుచు జగము లెల్ల నడపఁ గడంగెడు
జముని కరణిఁ బొంగి చదలు చూలి
దలఁచి రాము నజ్జ దామర నెదలోన
నిలుపుకొని దిటంబు నివ్వటిలఁగ
100
ఆ.అడుగులూనఁ ద్రొక్కి మెడయుఁ జేతులు సాచి
తోఁక యూచి మేను వీఁకఁ బెంచి
చెవులు నిక్కఁజేసి చివ్వునఁ జుక్కల
దారి కెగసి కడలి దాఁటె వేగ
101
క.దాఁటుటయుఁ గొండగోపులు
బీటలు వాఱెం గడింది బీతున జేజే
దాఁటు వడంకం బాఱెను
గాటపుఁ బయ్యెరల మొగిలు గడలకుఁ బాఱెన్‌
102
ఆ.అపుడు మింటివేల్పు లాతని దిటమెల్ల
నరయు కొఱకు సురస యనెడు వేల్పు
పడఁతిఁ బనుప నదియుఁ గడు నబ్బురపు రూపు
దాల్చి యెదుట నడ్డు దాఁకుటయును
103
క.నరజు మెయి పూని యా ద
బ్బర పొలఁతుక లోనఁ దూఱి పరువిడి వెలికిన్‌
బఱచి తటాలున దానిం
బఱియలు గావించి యెలమి పరఁగన్‌ జనియెన్‌
104
క.చని యా మ్రోల సువేలం
బను గుబ్బలిన్‌ యెక్కె నప్పు డాతని కర్జం
బునకుం దోడను చందం
బున వేఁడి వెలుంగు గ్రుంకఁబోయెన్‌ గడలిన్‌
105
క.అని నారదుఁ డెఱిఁగించిన
విని యా వాల్మీకి మిగుల వేడుకతోడన్‌
దనరుచు నవ్వలి కతయున్‌
వినిపింపు మటంచు నతని వేఁడుకొనుటయున్‌
106
చ.పొడల వెడంత దుప్పటియుఁ బున్కల పేరులు గాడ్పు దిండి బ
ల్తొడవులు మిన్కు టందియలుఁ దోరపుఁ గ్రొన్నెల పూవు విన్ను క్రొ
మ్ముడియును జింక పిల్లయును ముమ్మొన వాలును బూది పూఁతయు
న్మెడ నలు పెద్దు వారువము మిక్కిలి కన్నును గల్గు దేవరా!
107
క.మిత్తియుఁ బితరుల ఱేఁడున్‌
మత్తిలి తిరుగంగఁ జూచి నలిఁ బొగరడఁగ
న్మొత్తిన తెల గిత్తరవాల్‌
తత్తడి నెఱ రౌత! నల్దలలదొర తాతా!
108
మాలినిజగముల యెకిమీఁడా! జాళువా వింటివాఁడా!
తిగ కొటికల గొంగా! దిట్ట జేజే బొజుంగా!
పొగడిక గను వేల్పా! పూప జాబిల్లి తాల్పా!
సొగసుల నెఱ దంటా! జోగి బార్నోము పంటా!
109
గద్యముఇది శ్రీమదుమారమణ కరుణాకటాక్ష నిరీక్షణ సంలబ్ధ సరసకవితా సామ్రాజ్యధురంధర ఘనయశోబంధుర కౌండిన్యసగోత్ర పవిత్ర కూచిమంచి గంగనామాత్య పుత్ర బుధజనవిధేయ తిమ్మయనామధేయ ప్రణీతంబయిన యచ్చతెలుఁగురామాయణ మహాకావ్యమందుఁ గిష్కింధాకాండము సర్వ మేకాశ్వాసము. 
AndhraBharati AMdhra bhArati - Achcha Telugu Ramayanamu - AchchaTelugu Ramayanamu - Kuchimanchi Timmakavi - rAmAyaNamu - ( telugu andhra )