ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
సుతీక్ష్ణాశ్రమాది గమనము
వారి వీడ్కొని ఘోరవనసీమ దూరి
యారూఢమతి సుతీక్ష్ణాశ్రమంబునకు[వా.రా. సర్గ 7, 8]
వచ్చి యమ్మునిచంద్రు వలగొని పేరు
గ్రుచ్చి సద్భక్తి నెక్కొన మ్రొక్కుటయును
25వారలఁ దోడ్కొనివచ్చి సుతీక్ష్ణుఁ
డా రాముఁబూజించి యక్కునఁజేర్చి:
“యనఘాత్మ! చిత్రకూటాద్రికి నీవు
మునివృత్తి వల్కలంబులు గట్టి వచ్చి
యునికి యాకర్ణించి యుల్లంబులందుఁ
గొనకొని నీ రాకఁగోరుచు26ండుదుము;
నీవు విచ్చేసితి; నినుఁజూడఁగంటి;
మే విధంబున నింక నేము ధన్యులము.
ఆయతభుజసత్త్వులైన రాక్షసులు
మా యాశ్రమంబులున్మత్తులై చొచ్చి
హోమవేదులగల్చి యూపముల్‌ గూల్చి
సోమపానము గ్రోలి సురలఁబోఁద్రోలి
తపములు సెఱిచి పాదపములు విఱిచి
జపమాలికలు ద్రెంచి శాటికల్‌ సించి
ఫలములు డుల్చి పుష్పములెల్లరాల్చి
కొలఁకులు27డాసి 28దిక్కులు గాసిసేసి
పెక్కండ్రమునులఁజంపిరి దురాత్మకులు
దిక్కులే;దిప్పాటు దీర్పవే దేవ!
యేచినదనుజుల నేము గోపించి
చూచిన నీఱుగాఁజూడ29ఁజాలుదుము.
నెలకొని మహిమీఁద నీయట్టి రాజు
గలుగుటఁజేసి యెక్కడ నల్గ మేము.
కావున దుష్టరాక్షసుల మర్దించి
నీవు మా తపములు నిష్ఠఁబాలింపు.”
మనిన రాముఁడు:“రాక్షసాధీశ్వరులను
ననిలోనఁజంపెద.”నని యూఱడించి
శరభంగునాశ్రమస్థలమున మునుల
కిరవొంద నభయంబు లిచ్చుట 30దెలిపి
రక్కసులను జంప31రాముండు ప్రతిన
లక్కజంబుగఁ బట్టి యా రాత్రి గడవ
మఱునాఁడు వెక్కండ్రుమౌనులు వచ్చి
మఱి తమతమ యాశ్రమములకై పిలువ
దిననాథకులుఁడు సుతీక్ష్ణు వీడ్కొనుచు
మునులపుణ్యాశ్రమంబులు సూడఁగోరి
చనుచోట రఘురాము జానకి సూచి:
“యనఘ!రాజ్యము మాని యడవికి వచ్చి[వా.రా. సర్గ 9]
32సముచితవృత్తిమై జడలును వల్క
లములు ధరించి మెలంగుచు నుఱక
యసురులపై నీకు నలుగ నేమిటికి?
పొసఁగ వీ మాటలు బుద్ధిఁజింతింప.
మునులతో“రాక్షసముఖ్యులఁద్రుంతు.”
నని యూఱడించినయంతనుండియును
గలఁగుచున్నది మది కాకుత్స్థతిలక!
వలవ దీ తెఱఁగులు; వర్జింప33వలయుఁ.
బ్రాణులఁజంపఁబాపము34రాదె; తొల్లి
ప్రాణేశ! యొక ముని బహుతపోనిష్ఠ
నుండుచో భటరూపయుక్తుడై యింద్రుఁ
డొండుఖడ్గము మౌనియొద్ద దాఁచుచును
“ఇదె పోయివచ్చెద.”నే నని చనియె.
దదనంతరమున నాతఁడు ఖడ్గమంది
యూరకుండక తీవ లొకట వృక్షములు
సారె35ద్రుంచుచును హింసారతుండగుచు
జడమతియై తపశ్చర్యకుఁ బాసి
కడపట నతఁడు దుర్గతిఁగూలెఁ;గాన
దపమేడ? మఱి రాజధర్మంబు లేడ?
విపులాయుధము 36లేడ? విడువవే దేవ!”
యనవుడు విని నవ్వి యధిపతి సీతఁ
గనుఁగొని: “37యిట్లౌట గలదు. నీ పలుకు[వా.రా. సర్గ 10]
క్షత్త్రధర్మము గాదు; సాధ్వి! నా వలని
మైత్రిఁబల్కెదవు నా మతమెఱింగియును.
38తరుణి! యుత్తమరాజధర్మైకపరులు
శరచాపములు వూని చరియించుటెల్ల
శరణాగతులఁ గావఁ జర్చించికాదె?
పరికింప39వేల యీ పరమధర్మంబు?
నమ్మహామునులతో నాడిన ప్రతిన
నెమ్మెయిఁగావింతు; నిదియ నిశ్చయము
విడుతుఁబ్రాణమునైన; విడుతు నిన్నైన;
విడుతుఁదమ్మునినైన; విడుతునే ప్రతిన?”
ననిన నూరకయుండె నవనిజ యపుడు;
విని లక్ష్మణుఁడు సాలవిస్మయంబందె.
నటమీఁద నొక్కొక్క యాశ్రమంబునను
పటుధర్మనిధి రామభద్రుఁడు ప్రీతి[వా.రా. సర్గ 11]
40మూఁడేసినెలలు నిమ్ముల41నాల్గునెలలుఁ
బోఁడిమి నిలుచుచుఁబుణ్యాశ్రమముల
ధీయుక్తిఁజూచుచుఁ దెరువున యోజ
నాయతంబైన మహాతటాకంబుఁ
గని గీతవాద్యమంగళ నినాదములు
దనర నయ్యుదకమధ్యమున42 మ్రోయుటయుఁ
గడుఁజోద్యపడి తటాకము సేరి దాని
కడ ధర్మభృతుఁడుండఁగని చేరి మ్రొక్కి:
“యిదియేమి? మునినాథ! యీ తటాకమున
నుదకంబులో ఘోషముబ్బుచున్నదియుఁ
గడుఁజిత్ర.”మనుడు రాఘవుఁజూచి పలికె
నడరెడు వేడుక నా ధర్మ43భృతుఁడు:
“కదలక మును మాందకర్ణి యన్‌మౌని
యుదకమధ్యంబున నురునిష్ఠ నిలిచి
యెనసిన మహిమ ననేక వర్షములు
తనియక యత్యుగ్ర తపమాచరింప
నా తపంబునకు నింద్రాదిదేవతలు
భీతిల్లి మునిపతిపెంపెల్లఁ 44గలఁప
నమ్ముని కడ కేవు రప్సరఃస్త్రీల
నిమ్ములఁ బుత్తేర నేతెంచి వార
లతనికి భార్యలై యంబుమధ్యమున
నతఁడు నిర్మించిన 45హైమసౌధముల
మునినాథుముందట ముదమొప్పనిలిచి
యనురక్తి వా రిప్పు డాడుచున్నార.
లదిగాన కొలను పంచాప్సరంబయ్యె;
నిది వారి బహువాద్యహృద్యశబ్దమ్ము.”
లన విని రఘురాముఁ డతిభక్తితోడ
ఘనపుణ్యుఁడగు మాందకర్ణికిఁమ్రొక్కి
మఱియు మహాటవీమార్గంబునందు
నెఱసిన కడిమిమై నెఱి నేఁగునపుడు
మునులకు మ్రొక్కుచు, మును లున్న పుణ్య
వనులకుఁ జొక్కుచు, వనజకహ్లార
సరసులఁ దేలుచు, సత్కథాలాప
సరణులఁ46గ్రోలుచుఁ జల్లనిగాలి
రాకలఁ బొగడుచు, రణితఝిల్లికల
జోకలఁ దెగడుచు, శుక మయూరాది
ఖగములఁ బట్టుచుఁ, గరివరాహాది
మృగములఁ గొట్టుచుఁ, మేఘాస్త్రమేసి
47తాపంబు లడఁచుచుఁ,దముఁజూచువారి
48పాపంబు లుడుపుచుఁ,బరువంపులతలఁ
బువ్వులు సిదుముచుఁ,బొదలుతుమ్మెదల
నవ్వలఁగదుముచు, నభమంటఁ దాఁకు
శైలంబు లెక్కుచు, జానకి49యలయ
మేలంబు దక్కుచు, మృదుగతి గుహల
మెల్లనఁ దార్పుచు, మెలఁతకు నెక్కు
డల్లన నేర్పుచు, నచటి చెంచెతల
బీరముల్‌ మెచ్చుచు, భేదింపరాని
యీరముల్‌ సొచ్చుచు, నినరశ్మి లేని
కోనలఁగానలఁ గ్రుమ్మరు, చిట్లు
50జానకి దాను లక్ష్మణుఁడుఁగొన్నేండ్లు
పుణ్యతీర్థంబులుఁ బుణ్యవాహినులుఁ
బుణ్యతపోవనభూములు గలయఁ
దిరుగుచుఁ బదియేండ్లు దీరినపిదప
మరలి సుతీక్ష్ణాశ్రమమునకు మఱియు
వచ్చి 51యమ్మౌనిక్రేవను గొన్నినాళ్లు
మచ్చిక నుండి రామక్షితీశ్వరుఁడు
ఒకనాఁడు ఘను నగస్త్యునిఁజూడఁగోరి
యకలంకభక్తి సంయమి కిట్టులనియె.

  1. ↑వారల దీవించి వలనొప్ప నతఁడు - గారవం బలరారఁ గౌఁగిటఁజేర్చి, యారూఢమతితోడ నర్థి సుతీక్ష్ణుఁ- డా రాముఁగొనిపోయి యలరిపూజించి, యనఘాత్మ…
  2. ↑నుండ
  3. ↑గలఁచి
  4. ↑పెక్కులు
  5. ↑నోపు
  6. ↑ఁజేసి
  7. ↑ప్రతినలు వలికి- యక్కడ సుఖగోష్ఠి నా రాత్రి దీర్చి (నిలిచె)
  8. ↑సమచిత్తవృత్తిని
  9. ↑వయ్య
  10. ↑గాదె
  11. ↑ఖండించి
  12. ↑లేల
  13. ↑యిట్లెడగాదు, విప్రమార్గంబు
  14. ↑ధరణి నుత్తమ
  15. ↑వెయ్యేల పరమధర్మములు
  16. ↑పదియువాసరములు పదునేనుదినము - లదిగాక నెలనెల యట రెండు నెలలు మూడేసి నెలలు…
  17. ↑నాఱు
  18. ↑మించుటయు
  19. ↑రతుఁడు
  20. ↑గలఁగ
  21. ↑యమల
  22. ↑నానుచు
  23. ↑దపముల నడఁచు
  24. ↑భవముల నుడు
  25. ↑యలర
  26. ↑జానకీజాని
  27. ↑యమ్ముని చంద్రువద్దఁగొన్నాళ్లు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )