| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అరణ్యకాండము |
|
ఖరుని143నివాసంబు 144కడకు వచ్చుటయు ఖరుఁడును దానియాకారంబుఁజూచి[వా.రా. సర్గ 19] వెఱఁగంది:“యిదియేమి వెలఁది! నీ రూపు వెఱవక యెవ్వఁడీ వికృతంబు సేసె? నెవ్వఁడు కాలాహి నెఱిఁగియుఁద్రొక్కె? నెవ్వఁడు మృత్యువు నిత్తఱిఁజెనకె? వాని నా కెఱిఁగింపు; వానిరక్తములు వాని మాంసంబులు వడి నీకు నిత్తు.” నని పేర్చి ఖరుఁడు దన్నడిగినఁజూచి వినుటకు వ్రేఁగైన వికృతస్వరమున మునుకొన్నసిగ్గున మో మరవాంచి వినుపింపఁదొడఁగె నవ్వెలఁది యేడ్చుచును: “విను మరణ్యములందు విపులసాహసులు మునివేషధారులు మోహనాకృతులు రామలక్ష్మణులను రాజనందనులు కామించి యేను డగ్గఱుటయుఁజూచి పటుశక్తి నన్నంటఁబట్టి నా వేష మిటుసేసి విడిచిన నేను దుఃఖించి నినుఁగానవచ్చితి. నీ వింకఁబోయి యెనసినకడిమి నయ్యిరువురఁ జంపి వారి మాంసంబులు వడి నాకుఁబెట్టి వారని నాలోనివగలార్పు.”మనుడు: “నింతమాత్రమునకై యే నేల?వారి పంతమదెంత? నా పంపు145గొంపొమ్ము.” అని పదునలుగుర నంతకోపముల ననలోగ్రతేజుల నప్పుడు పిలిచి: “యీ శూర్పణఖ వెంటనేఁగి యా నరుల నాశంబు నొందించి నా సహోదరికి వారి శోణితముఁద్రావఁగఁజేయుఁ”డనిన వారును దుర్వార వారివాహములు[వా.రా. సర్గ 20, 21] గాలితో వచ్చినకరణి నాజంత తో లోలశూలకాంతులు మెఱుపులుగఁ జనుదెంచి రామలక్ష్మణ సూర్యచంద్రు లను గప్పి గర్జితాలాపముల్ సూప దినకరకులుఁడంత దేదీప్యమాన ధనురాదిసాధనోద్దాముఁడై యెదిరి వారును దనమీఁద వైచిన యశని దారుణశూలముల్ ధారుణిఁగూల్చి వారినందఱి భూరివజ్రానుకారి నారాచములఁగంఠనాళముల్ 146దునుమఁ బరిపక్వఫలశిరోభాగముల్ వాసి నిరుపమాశుగహతి 147నిట్టఱాళ్లనఁగఁ బుడమిపైఁగెడసి.రప్పుడు చుప్పనాతి 148మడమెత్తుపరుపున 149మఱియును బాఱి ఖరునకు లోకభీకరునకు వారి మరణంబు రఘురాముమహితరణంబు నుగ్గడించుటయు నాహుతివెగ్గలమున బగ్గుబగ్గన మండుపావకుఁ డనఁగఁ[వా.రా. సర్గ 22, 23] గోపించి ఖరుఁడు మిక్కుటమైనకడిమి దీపింప దూషణత్రిశిరులు మొదలు వీరులు పదునాల్గువేలరాక్షసులు ఘోరసత్వులు గొల్వఁగొమరు దీపించి తెరలినసురలతో దివి తల్లడిల్లఁ బొరలి గిరులతో భువి పెల్లగిల్ల రణభేరి వ్రేయించి రత్నశైలాభ గణనీయ శబలాశ్వకలితవైడూర్య మణికూబరసువర్ణమయచక్రదశక రణజయప్రద ధనుర్బాణాసిపూర్ణ రణితకింకిణియైన రథమెక్కి వెడలె. రణబలోదగ్రుఁ150డై రఘురాముమీఁదఁ. ద్రిశిరుండు కంకపత్త్రిశరుండు విలస దశనికల్పుఁడు దిక్కు లగల నార్చుచును 151వాసరవల్లభోజ్జ్వలభాసమాన భాసుర రాసభప్రకర సంభరిత హాటక స్థగితశతాంగంబు నెక్కి మేటికయ్యమునకు మే నుబ్బి వెడలె. బర్హిణవర్ణనిబర్హణపవన గర్హణచణ కాంతిఘనవేగతురగ సందోహసంభృత స్యందనోత్తమము ముందుగాఁదోలించి ముద మగ్గలింప సేనాముఖంబునఁజెలఁగి దూషణుఁడు నానా 152విధంబుల నలువొప్ప నడచెఁ. బ్రేమతో మఱి పృథుగ్రీవుండు శ్యేన గామియు నవ్విహంగముఁడును మేఘ మాలియుఁదగు మహామాలియుఁబ్రళయ కాల కాలానల కల్పుఁడౌ సర్ప ముఖుఁడును గాలకార్ముకుఁడు దుర్జయుఁడు మఖశాత్రవుండును మఱి పరుషుండు కారుణ్యదూరుఁడౌ కరవీరనేత్రుఁ డా రుధిరాశనుండన నొప్పువాఁడు ద్వాదశదైత్యు లత్తఱి ఖరుఁగొల్చి ద్వాదశాదిత్యప్రతాపులై చనిరి. త్రిశిరుండు మఱిప్రమాథియు రణోదగ్ర యశమునఁబేర్చు మహాకపాలుండు స్థూలాక్షుఁడును రణోద్యోగులై సేన నాలుగుముఖముల నడచి రేమఱక. భీషణకరిఘటా బృంహిత తురగ హేషా రథస్వ నానేక పదాతి పటుతరహుంకారపటహభాంకార పటకేతుపటపటస్ఫారనాదములఁ గ్రుంగె భూతలము; దిక్కులువ్రక్కలయ్యె. బొంగెఁబయోధులు;భూతముల్ వడఁకె. బలములపెంధూళి భానుమండలము గలదులేద 153నఁగప్పె గగనంబునిండ. ఖరుని కేతనముపై గ్రద్దలు వ్రాలెఁ. దురగముల్ 154మ్రొగ్గె; నెత్తురువాన గురిసె; నక్కలు155సేనలో నడచి వాపోయెఁ; జుక్కలు డుల్లెఁ; బక్షులు చుట్టు నఱచె. మఱియు నుత్పాతముల్ మహినాకసమునఁ దఱచుగాఁదోప 156నెంతయు భీతి లేక ఖరుఁడీ తెఱంగునఁ గడఁకమై నడచి యరుదుగా నా దండకాటవిఁజొచ్చె. ననుపమాకృతి రాముఁడక్కలకలము విని పర్ణశాలకు వెలుపల నిలిచి యవనిపై దివముపై నపశకునములు వివిధముల్ గనుఁగొంచు వెసఁ దమ్ముఁబిలిచి: “సౌమిత్రి!సమరసూచకనిమిత్తములు భూమిపైఁబెక్కులుపుట్టుచున్నవియు;[వా.రా. సర్గ 24, 25] రట్టడిముక్కిఁడిరక్కసి మఱియు దిట్టయై బలములఁదెచ్చెఁగావలయు. నదె సైన్యఘోషణంబట్ల కానొప్పు; నదె మహాబలధూళి యఖిలంబుఁగప్పె; నవమైనరణ మబ్బు నా;కట్లుగాన యవహితమతిఁబూని యాలస్య ముడిగి జనకజ యిందుండఁజనదు; నీ వింకఁ గొనిపోయి పర్వతగుహనుండు.”మనిన: “నినవంశవల్లభ! యే నెట్లుపోదు నినుడించి; యటుగాన నీవు సీతయును బర్వతగుహఁజేరి పరికింపుఁ; డేను దుర్వారదనుజులఁద్రుంతు నీ కృపను.” ననవిని:“వీరితో నాలంబు సేయ నినిచె వేడుక నాకు; నీ వుండవలదు. జనకజ దలఁకెడుఁజను.”మన్న సీతఁ గొనిపోయి పర్వతగుహఁజొచ్చియుండె. నంత రాముఁడు ప్రళయాంతకుపగిది నెంతయుఁగోపించి యేపు దీపింప నవితమునిప్రాణమగు కృపాణంబుఁ గవచంబు 157ఘనవైరికవచంబుఁబూని శరశరాసనములు చతురుఁడై తాల్చి యురుతరతూణీరయుగళంబుఁ158బూని కొండ159విల్లుగ వంచు కుండలికుండ లుండన విల్లు వెల్లుగ నెక్కువెట్టి యగణితధ్వనుల మిన్నంతయుఁబగులఁ దగిలి చాపము గుణధ్వని సేయుచుండె. నింద్రాది దిక్పతు లెల్లదేవతలు సాంద్రరత్నవిమానసహితులై యపుడు చదలెల్లనిండి: “యెంచఁగ రాముఁడొకఁడు పదునాల్గువేల నప్రతిమవిక్రముల ఖరదూషణాదిరాక్షసుల నే రీతిఁ బొరిగొనునో చోద్యముగఁజూత.”మనుచుఁ గనుఁగొనుచుండిరి.“కపటదానవుల ఘనుఁడు రాముఁడు ద్రుంచుఁగా.” కంచు సారె దేవర్షిగణములు దివి నుండి రాము దీవించుచుండిరి 160తివిఱి పల్మాఱుఁ. బదివేలకోటులభానుతేజములు పొదిగొని లోకముల్ పొదివినయట్లు రామునితేజ మరణ్యభూజములు భూమియు నభము నబ్ధులుఁగప్పుటయును జడమతులై సర్వసంభ్రమంబుడిగి మిడుకుచుఁగన్నులు మిఱుమిట్లు గొలుపఁ గడు 161దీనులైన రాక్షసకోటిఁ జూచి కడఁకతోఁబలికె నా ఖరుఁడు దూషణుని: “నిది యేమి దూషణ! యీ సేన నడవ; దెదిరెనో పరసేన? 162యే ఱడ్డపడెనొ?” యనిన దూషణుఁ163డు దా నంతయుఁదెలిసి: “దనుజేశ! రామునుద్దండ తేజంబు కలయఁబర్వుటయును గతి దప్పె.”ననుడు నలుకమై ఖరుఁడు సైన్యములఁదిట్టుచును అరద మత్యుగ్రత నట దోలుకొనుచు నరుగుచో రాక్షసులందఱుఁ గూడి భుజబలాటోప విస్ఫురితప్రతాప 164గజ రథ భట వాజికలితులై యొకట మండుకార్చిచ్చుపై మలయుచు మిడుత తండంబు లొక్కటఁ దార్కొన్నకరణిఁ గడునుగ్ర165 వేగులై కాకుత్స్థరాము వడిఁజుట్టుముట్టి దుర్వారులై కదిసి శరజాల పట్టిస శక్తి త్రిశూల కరవాల కుంత ముద్గర భిండివాల పరశు తోమర గదా పాశ చక్రములు గురిసి యార్చిరి దేవకోటి భీతిల్ల. నప్పుడు రఘురాముఁడంబుదపంక్తి గప్పినచండాంశుగతిఁగానఁబడక కొంతసేపునకు రక్షోగణముక్త కుంతాదిబహుశస్త్ర కుటిలాస్త్రతతుల నన్నియు మాయించె నైంద్రజాలికుని చెన్నునఁదను సురశ్రేణి 166గీర్తింప. మఱియుఁదోడ్తో దైత్యమండలి గురియు తఱుచుశస్త్రములనస్త్రములఁద్రుంచుచును ముందట నిరుపార్శ్వములఁబిఱుందటను సందడించిన దైత్యసైన్యంబుమీఁదఁ గరలాఘవము మీఱఁ167గా దొనలోని శరములన్నియు నొక్కసారి సంధించి పదియు నూఱును వేయుఁబదివేలు లక్ష పదిలక్ష పదికోట్లుఁబదినూఱుకోట్లు మండితపరివేష మధ్యందినార్క మండలపరివేషమహితానుకారి కుండలీకృతచండకోదండదండ భండనాత్యుత్సాహ బాహుఁడై వ్రేయఁ దునియుగంభీరవేదులును జోదులును తునియలై పడెడు వీతులును రౌతులును త్రుంగెడు బహుపదాతులును హేతులును ముంగలఁబడు శిరంబులు శరంబులును మ్రొగ్గెడు యోధాంగములు రథాంగములు మ్రగ్గెడు సగుణధర్మములు వర్మములు తూలెడు రథికజాతులును సూతులును గూలెడు వెలిగొడుగులుఁబడగలును నలియైనమాంసఖండములు ముండములు గలిగి లోకైక భీకరమయ్యె రణము. అంత భానునిదీప్తి నంధకారంబు పంతమంతయుఁబటాపంచలైనట్టు లతులవిక్రమధాముఁడగు రామునకును హతశేషమగు సైన్యమంతయు విఱిగి ఖరునకు‘శర’ణన్న ఖరుఁడును వారిఁ బురికొల్పి దూషణుఁబోరికై పనుప వాఁడును హతశేషవాహినుల్ దాను వేఁడిమిఁజూపుచు వేవేగ పొదివి తాలసాలశిలావితాన నానాస్త్ర జాలవర్షము రామచంద్రుపైఁగురిసెఁ: గురిసినఁ దనమేనఁ గ్రొన్నెత్తురొలుక నరుణారవిందాక్షుఁడై రాముఁడలుక గాంధర్వశరము రాక్షసులపై నేయ సైంధవ సింధుర స్యందన సుభట వీరుల కమ్మహావిశిఖ రాజంబు తేరిచూడఁగ రాక దేదీప్యమాన ధారాకరాళమై దనుజవర్గములఁ గారించి 168మించి చీకాకు గావించి దండించి ఖండించి తల లుత్తరించి చెండాడుచో రణక్షితియెల్ల నిండి యెందుఁజూచినఁదురంగేభఖండంబు, లెందుఁజూచిన నింగి కెగయుముండములు నెందు,జూచినఁబ్రేవు లెఱచియు మెదడు నెందుఁజూచిన నెత్రుటేఱులైయుండె. శాకినీ భూతపిశాచ భేతాళ ఢాకినుల్ దండతండంబులై యప్పు “డేనుఁగుతలకాయ లెసగుకుండలుగఁ బూనియందలిముత్యములు తండులముగ దండి రామునిరణధర్మసత్రమున వండినా రిదె రండు వరుస భుజింప.” నని వేడ్కమైఁగొన్ని యధికారముద్రఁ గొని రొద గాకుండఁగూర్చుండఁబెట్టి రక్తచందన నవరక్తాక్షతములు రక్తసంకల్ప పూర్వంబుగాఁ దాల్చి పదరక చర్మరంభాపలాశములు పదనైన పునుకదొప్పలు చుట్టమర్చి శరవహ్నిపక్వమాంసంపుటన్నమును చొరలెడు మెదడుపప్పును గ్రొవ్వులందు వఱదలౌనాజ్యప్రవాహముల్ కండ లెఱచి కారిజము లనేక శాకములు పాలప్రేవులు సేవెపాసెముల్ మేలి వాలుగుండెలు పిండివంటలు క్రొత్త నెత్తురు తీయనినీరుగాఁ దలఁచి యత్తఱి విప్రయోగ్యాహార 169మనుచు నా కంఠతృప్తులై యధికసమ్మదము సేకొని సభగూడి” శ్రీరామచంద్ర తే విజయో”స్తని దీవించి కొన్ని యావలఁగొన్ని “తథా”స్తని పలుక నింతలో మఱికొన్ని యేనుఁగు జీవ దంతముల్ చేత లాతములుగాఁ బూని పొలసుటెమ్ములసంకుపూసలపేర్లు కళుకు 170కామాక్షులుగా ధరియించి కరిఘంటికాతాళగతుల కుబ్బుచును దరిబేసికోపులత్తఱిఁదనవంటి యోధులను విజయశీలుర నైదువేలఁ బంపుటయుఁ ద్రిజగముల్ వడఁక నెదిర్చి వా రపుడు చాపవిద్యాప్రౌఢి సకలంబుఁజూపఁ జూపులఁగోపంబు సూపుచు నృపుఁడు నొక్కొక్కశరమున నొక్కొక్కదనుజుఁ దక్కక నొంచి విదారించి వైచెఁ గొందఱ నందంద గుదులుగాఁగూర్చి యందఱఁదెగటార్చి యార్చినఁజూచి171 దూషణుఁడప్పుడత్యుగ్రుఁడై పరుష భాషణుండై రాముపైఁదేరు వఱపి దశదిగంతంబులు దట్టంబుగాఁగ నశనికాలాహితుల్యంబులై యొప్పు నమ్ములు నిగుడింప నవి ద్రుంచి నాలు గమ్ముల నరదంబు హయములఁగూల్చి వెరవొప్పనొకకోల విలుద్రుంచుటయును దురమున విరథుఁడై దూషణుం డలిగి దారుణప్రాణవిదారణ విజయ కారణాంతక గదాకల్పమై యొప్పు పరిఘంబుఁద్రిప్పుచుఁబఱతేర రాముఁ డురుశరద్వయమున నురుబాహుయుగము నరుదుగాఁదెగనేసి యామ్యబాణమున నుర మేయుటయుదైత్యుఁడొఱలుచుఁగూలె దంతముల్ విఱిగిన దారుణ భద్ర దంతావళేంద్రంబు ధరఁగూలుపగిదిఁ. గూలినఁజూచి ముగ్గురుదండనాథు లాలోఁబ్రమాథి మహాకపాలుండు స్థూలాక్షుఁడును బరశువుఁ172గృపాణంబుఁ గేలఁబట్టిసము లంకించి వైచుటయు వారిశస్త్రంబుల వారిమస్తముల శ్రీరాముఁడొక్కటఁజెండు 173బెండాడె. నప్పుడు ఖరుఁడు సేనాధినాయకుల ముప్పిరిగొను క్రోధమునఁబురికొలుప వారు పన్నిద్ద ఱవార్య శౌర్యమున వీరు రాఘవుఁదాఁకి వేర్వేఱ పోరఁ గులిశధారాకార ఘోరబాణముల కలిమిఁజూపుచు శ్యేనగామి నుక్కణఁచి కాలకార్ముకుఁద్రుంచి కరవీరనేత్రుఁ దూలించి సర్పాస్యు త్రుళ్లడఁగించి యా విహంగముఁద్రుంచి యజ్ఞశాత్రవుని చేవ యడంచి శిక్షించి దుర్జయునిఁ గేలి మహామాలిఁ గెడపి యా మేఘ మాలిని వధియించి మర్దించి పరుషు పృథుకంఠుకంఠంబుఁబృథివిపైఁ గూల్చి రుధిరాశనునిఁజంపి రోషంబు మిగుల దిక్కేది ఖరుఁడును ద్రిశిరుండుఁదక్కఁ దక్కినవారి నందఱ నేలఁ గూల్చె. నీ లీల రాముచే నెల్ల సైన్యములు గాలిచేఁ దూలినకారాకులట్ల[వా.రా. సర్గ 27] కూలినఁగోపంబుగొని కాలఁద్రిశిరుఁ డా లోన రాముపై నరదంబు వఱపి సింహనాదము సేసి సింధురోత్తమము సింహంబు నెదిరిన చెలువున నెదిరి గుణనాద మెసగ రక్షో174వీరుఁడొకట గణనాపరంపరల్ గడవ నందంద నతులబాణము లేయ నలిగి రాఘవుఁడు ప్రతిబాణతతులేసి బలువిడిఁ ద్రుంచె. వాఁడును దనపేరువాఁడి 175వాఁడిమిని మూఁడుబాణముల రాముని భాలమేసె. నవ్వాఁడిబాణంబు లలికంబు దాఁక నవ్వుచు 176నలుకమై నలినాప్తకులుఁడు త్రిశిరుని నేసినఁద్రిశరముల్ కుసుమ దశఁదాల్చె.“నిఁకఁజతుర్దశభువనములు దూరిన నినుఁబట్టి తునుమాడునట్టి దారుణతర చతుర్దశసాయకముల నే నేయువాఁడ సహింపుమీ.”యనుచుఁ దా నేసెఁబదునాల్గుదారుణాస్త్రముల. నవి రొమ్ముఁగొని కాఁడి యవ్వల వెడలి యవనీస్థలము గాఁడె.నంత రాఘవుఁడు నరదమ్ము మఱినాలుగమ్ములఁజదిపి యురువడిఁ బదియింట నుర మేయు టయును సురవైరి కోపించి శూలంబువైవ నరనాథుఁడది ద్రుంచె నాలుగస్త్రములఁ. ద్రుంచి మూఁడమ్ములతో మూఁడుదలలు ద్రుంచినఁద్రిశిరుండు దురమునఁగూలె మూఁడుగొమ్ములతోడ మొదలంటఁద్రెవ్వి పోఁడిమి సెడి కూలుభూజంబుకరణిఁ ద్రిశిరుఁడు గూలుట దృష్టించి ఖరుఁడు దశరథరాముచేఁతకుఁ జోద్యమంది[వా.రా. సర్గ 28] మఱిచాలఁగోపించి మహనీయరథముఁ దఱిమి యుగ్రాస్త్రసంతతులేయఁ జూచి శరలాఘవము 177పేర్చి జానకీవిభుఁడు ఖరునిపైఁబ్రతిసాయకము లేయుటయును ఖరుని బాణములు రాఘవునిబాణములు ధరణీతలము వియత్తలమును 178నిండె నప్పు179 డర్కుని దీప్తులన్నియు మాసెఁ; గప్పెను నిబిడాంధకారంబు దిశల. ఖరుని రాఘవుఁడు రాఘవుని నా ఖరుఁడు సరకుఁగాగొనకాజి జయకాములగుచుఁ 180గాసరయుగళంబుఁ గలభద్వయంబుఁ గేసరియుగళంబుఁగెరలి యొండొండ పోరెడుగతి దోప భుజబలాటోప భూరిప్రతాపులై పోరాడుచోట ఖరుఁ181డంత నల్గి రాఘవుచేతివిల్లు సరిద్రుంచె వెస నర్ధచంద్రబాణమునఁ. ద్రుంచి జోడును ద్రుంచి తోడ్తోన మఱియు ముంచె రామునిదేహమును నంపవెల్లి. నా యంపతండంబు 182నాతని సరకు సేయక తను సురశ్రేణి గీర్తింప నుష్ణాంశుకులుఁడగస్త్యునిచేతఁగొనిన వైష్ణవచాపంబు వడి నెక్కు వెట్టి శింజిని మ్రోయించి శితసాయకముల భంజించె రాక్షసప్రవరు కేతనము. మఱివాఁడు రాముమర్మము లుచ్చిపాఱఁ గఱకుటమ్ములు నాల్గు183కడిమి నేయుటయు రక్తసిక్తాంగుఁడై రాఘవుఁడంత నక్తంచరుని నొంచి184నానాస్త్రనిహతి పటు185బాణ మొకటఁజాపముఁద్రుంచివైచి యటనాలుగిట వానిహయములఁగూల్చి సారథిఁ బడనేసి సాయకవహ్ని నా రథమపుడు పూర్ణాహుతి 186సేయ విలుఁగోలుపడి యట్లు విరథుఁడై ఖరుఁడు ప్రలయకాలాంతకప్రతిముఁడై కేలఁ[వా.రా. సర్గ 29] జలమునఁ గదఁగొంచుఁజనుదెంచుటయును జలియించె గిరులతో జగతియంతయును. నప్పుడు రఘురాముఁ డా దుష్టదైత్యుఁ దప్పక కనుఁగొని దర్పించి పలికె: “నోరి రాక్షస! వినరోరి నీచాత్మ! శూరత నీ కేలచొప్పడు నింక? నీ బలంబులు 187సచ్చె; నీ వారు దెగిరి; నీ బాణసంపద నిర్మూలమయ్యె; నరుదుగా నీ దండకాటవిఁ దొల్లి పెరిగి సన్మునులఁజంపినపాపఫలముఁ గుడువఁగాలము వచ్చెఁ; గుడుతుగా కింక; నడరి వధింతు ఘోరాజిలో నిన్ను.” ననవుడు ఖరుఁడప్పుడారాముఁజూచి కనలుచుఁబలికె దోర్గర్వంబు మెఱసి: “యేలరా188రాఘవ! యింతగర్వంబు? నాలంబులోఁగొందఱల్పులఁ జంపి కెలయుచు నిను నీవ కీర్తించుకొనెదు! కులజుండు తనుఁదానె కొనియాడుకొనునె? యిదె గదాధరుఁడనై యేతెంచినాడఁ; గదిసి పోరాడు; నా కడిమియుఁజూడు; దేవాసురులకైన 189దృష్టింపరాదు నీవు నా ముందఱ నిలువ 190శూరుఁడవె? యొండొండ కడఁగి నీ యొడలిమాంసంబు చెండాడి నేఁడు నా చెలియలికిత్తు.” నని 191తనగదఁద్రిప్పి యడరివైచుటయు ననిలునివేగంబు నర్కుతేజంబు ననలునివేఁడిమి యశనిబెట్టిదము ఘనగదారూపమై కదిసినయట్లు చనుదేర నుద్దండచండకాండముల గనెలుగా రాముఁడాగదఁద్రుంగ నేసి “యోరి! నీ గర్వోక్తులుబ్బును మదముఁ దీరెనే.”యనుడు గద్దింపుచు వాఁడు[వా.రా. సర్గ 30] గ్రక్కన వృక్షమొక్కటి పెల్లగించి చిక్కనిభుజశక్తి జిఱజిఱఁ ద్రిప్పి “చావు”మంచును వైవ సరభసవృత్తి నా వృక్షమునుద్రుంచి యపుడు రాఘవుఁడు ఖరునిపై 192ఖరకరకరసహస్రాభ శరసహస్రము లేసి చాల నొప్పించె. నొచ్చియు వాఁడు తనువు రక్తధార పిచ్చిలఁదెచ్చికోల్‌బీరంబు మీఱ నెదురుగాఁజనుదేర నీక్షించి రాముఁ డదయుఁడై భువనంబులన్నియుఁగలఁగ నురువడి నైంద్రాస్త్ర మొనర సంధించి యుర మేయుటయు దైత్యుఁడుబ్బెల్లఁబొలిసి పిడుగడిచినకొండ పృథివిపైఁగూలు వడువున ఖరుఁడంత వసుధపైఁగూలె. నని ముహూర్తము ముహూర్తార్ధంబులోనఁ దను నెదిర్చినచతుర్దశసహస్రముల ఖరదూషణాదిరాక్షసుల నీ రీతిఁ బొరిగొనుటయు రాముఁబొగడిరి సురలు; మునులు దీవించిరి; మొగిఁబుష్పవృష్టి యనిమిషుల్ గురియించి రా రాముమీఁద. ఘనశైలగుహనుండి 193కడువేగమునను జనకజఁగొనివచ్చి సౌమిత్రి మ్రొక్కి యభినుతులొనరించి యా రామభూమి విభునిచే శోభిల్లు విల్లందుకొనియె.194 నూనినసంతోష ముల్లంబు నిండ జానకీపతి పర్ణశాల కేతెంచి 195కలనిలోఁదెగినరాక్షసుల భూమిజకుఁ దెలియఁజెప్పుచు వినోదించుచునుండె. |