ఇతిహాసములు రంగనాథరామాయణము అరణ్యకాండము
ఋశ్యమూక గమనము
రమణీయమూర్తులు రామసౌమిత్రు
లమితబలోదగ్రు399 లచ్చోటు 400గదలి[వా.రా. సర్గ 75]
యనవరతానేకయతగుణానీక
మునిలోకమగు ఋశ్యమూకంబుఁగనిరి.
త్రైలోక్యవిభులైన తమరాకఁజూచి
యా401లోన మదిఁబొంగి యానందమంది
యనయంబు నొప్పెడునశ్రుపూరంబు
లన సెలయేఱుల నలరెడుదాని,
నిల మేరుమందరహిమశైల 402పతుల
నలిమీఱి నగియెడినగవులో యనఁగ
సాంద్రంబులై 403యుండి చదల దీపించు
చంద్రకాంతోపలచ్ఛాయలదాని,
సరసిజాసనుఁడు భూచక్రంబుమీఁదఁ
బరగఁ బర్వతరాజ్యపట్టంబు గట్టి
శిరసునఁబెట్టినసేసఁబ్రా లనఁగ
నురుశృంగము404నఁజుక్క లొప్పెడుదాని,
నురు 405భీతిఁదనుఁజొచ్చియున్న సుగ్రీవు
బరిభవించినవాలిపై మండుచుండు
గతి సూర్యకాంతముల్‌ గనకన మండ
నతులప్రతాపోగ్రమై యొప్పుదాని,
మెఱుఁగులు గొమ్ములై మెఱయ నేతెంచి
నెఱసి సానువులపై నీలమేఘములు
పొలుపొందఁ బ్రతిగజంబులు గాఁగఁదలఁచి
మలయుసామజముల మానైనదాని,
నంగజహరుమౌళి నలరు నాకాశ
గంగనా నప్పులు గరమొప్పు మిగుల
నా యెడఁ గ్రీడించు హంసమాలికలు
మాయనివిధిశిరోమాలికల్‌ గాఁగ
బహుశృంగభూరుహపల్లవచయము
విహితజటాజూటవిభవమై యొప్ప
నాసన్నులై సిద్ధులర్థి సేవింప
నా సదాశివమూర్తి యన నొప్పుదాని,
బలభేదిమొదలుగాఁ406బరగుదేవతలు
కలయ నంబుధిఁద్రచ్చి కన్నవస్తువులు
పనివడి తమలోనఁబాలువోకున్న
నునిచిరో, యమృతపానోన్మత్తులగుచు
మఱచిరో,407యిది గడుమంచితావగుటఁ
దెఱఁగొప్ప దాఁచిరో-దీనిపై ననఁగఁ
గల్పవృక్షంబులుఁ గామధేనువులు
వేల్పుఁగన్నియలును వివిధౌషధములుఁ
జింతామణులు నెందుఁజెడనిపెన్నిధులు
సంతానతరువులు సరినొప్పుదానిఁ
గని దానిమహిమకుఁగడుఁజోద్యమంది
యినవంశవల్లభుఁడెంతయుఁబొగడి.
యఱలేనిభక్తితో ననుజుఁడు గొలువ
మెఱయు నా శైలసమీపంబునందు
దఱచైన తొగల నెత్తమ్ములతెగల
వఱలు పంపాసరోవరమున కరిగి
యందిన నియతితో నా సరోవరము
నందుఁ గృతస్నానుఁడై రామవిభుఁడు
పొలుపొందఁ దనకుఁదమ్ముఁడు తెచ్చి యొసగు
ఫలమూలజలములఁబరితృప్తినొంది
తనరారు తత్తీర తరువుల నీడ
ననుజన్ముఁడును దాను నలయుచునుండె.
నారణ్యకాండ మింపార నిబ్భంగి
నా రవి తారార్కమగు నుర్విమీఁద.
నారూఢి నార్షేయమై యాదికావ్య
మై రసికానందమై యెల్లనాఁడు
నివ్వసుమతి నొప్పు నీ పుణ్యచరిత
మెవ్వరు సదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయధామరామ
నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్‌ ప్రభువిచారములు
పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు
ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లధికసంపదలుఁ
బాయక పాటిల్లుఁ; బాపక్షయంబు
వరపుత్త్రలాభంబు వైరినాశనము
సరినొప్పు; ధనధాన్యచయసమృద్ధియును,
నే విఘ్నములులేక యిండ్లలో నధిక
లావణ్యవతులైన లలనలపొందు,
నన్నలుఁదమ్ములు నభివృద్ధిఁబొంది
మన్ననతోఁగూడి మలసియుండుటయు,
సతతంబు దేవతాసంతర్పణంబుఁ,
బితృగణతృప్తియుఁబెంపొందుచుండు;
నిది మోక్షసాధనం, బిది పాపహరము,
నిది దివ్య, మిది భవ్య, మిదియు శ్రీకరము;
రమణీయలీల నీ రామాయణంబుఁ
గ్రమమొప్పఁబూజింపఁ గల్గుఁ బుణ్యములు;
వ్రాసినవారికి వరశుభోన్నతులు
వాసవలోక నివాసంబుఁగలుగు.
నెందాఁకఁగులగిరు లెందాఁక జలధు
లెందాఁక రవిచంద్రులెందాఁకఁదార
లెందాఁక వేదంబు, లెందాఁక దిశలు,
నెందాఁక భువనంబు, లేపు దీపించు
నందాఁక నీ కథ యక్షరానంద
సందోహదోహళాచారమై పరగు.
  1. ↑వెడలి
  2. ↑లోలమతిఁబొంది
  3. ↑తతుల
  4. ↑యెందుఁజ
  5. ↑లఁ
  6. ↑మతి
  7. ↑బలసి
  8. ↑యంతయు (ట)
  9. ↑
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )