ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
వాలి రామాస్త్రహతుఁడగుట
“యీలోన వాలి నే నేయకయున్న
వాలి సుగ్రీవుని వధియించు.”ననుచు
జలనిధు లేడును జగము లీరేడుఁ
గలఁగ భూతములెల్లఁ61 గడఁగి కంపింప
గుణనాద మొనరించి కోరి మైవెంచి
తృణముగా 62నవ్వాలి దృష్టించి పొంచి
వెస నమోఘాస్త్రంబు వింట సంధించి
యసమానబలశాలియగు వాలి నేసె.
నేయుడు నబ్బాణ మినవహ్నిరుచుల
మాయించి వడి నభోమండలి నిండ
నురుతరానలకీల లొలుక నొండొండ
గరుడోరగామరగంధర్వులదరఁ
దన పుత్త్రు రక్షింప దాయ శిక్షింప
నినుఁడిట్టి యస్త్రమై యేతెంచె ననఁగఁ
దపనపుత్త్రుఁడుగాన దండధరుండు
కృపఁదమ్ముఁడైన సుగ్రీవునిఁబ్రోవఁ
దనకాలదండ ముద్ధతి వాలిమీఁదఁ
బనిచెనోయన మహాపవనవేగమున
నురువడిఁజనుదెంచి యురము గాఁడుటయుఁ
దరుచరపతి గూలె దర్పంబు గంపింప.
కెరలి దిక్కరులతో గిరులతోఁ బెలుచఁ
దరులతో నందంద ధరణి గంపింప.
నురము గాఁడినబాణ మురువడి వెడలి
ధరఁగాఁడె. నత్తఱిఁ దరుచరేశ్వరుఁడు
నవిరళరక్తసిక్తాంగుఁడై, గాలి
నవనిఁద్రెళ్లిన పుష్పితాశోక మనఁగఁ[వా.రా. సర్గ 17, 18]
బ్రళయకాలంబునఁబ్రభలెల్ల మాసి
యిలమీఁద వ్రాలిన యినునిచందమున
నవశుఁడై ధరణిపై నటు పడియున్న
నవనీశుఁడగురాముఁడటు చేరవచ్చె.
వచ్చినరఘురాము వాలి వీక్షించి
యిచ్చలోపలఁగోప మెసగ నిట్లనియె:

  1. ↑గంపింప నపుడు
  2. ↑దృష్టించి తెగఁదీసిపోసి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )