| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
“నోరాఘవేశ్వర! యో రామచంద్ర! ధారుణిలో నిన్ను ధర్మాత్ముఁడండ్రు; దమమును ,శమమును, దయయు, సత్యంబు, సమబుద్ధియును, నీతి, సౌమనస్యంబు మొదలైన సద్గుణంబులరాశి వగుచుఁ బొదలిన నీ పెంపు పొల్లగాఁజేసి యెనసి సుగ్రీవుతో నేను బోరాడ నను నేయఁదగునయ్య 63నడుసొచ్చి నీవు? ఏను నీ కపకార మెన్నఁడుఁజేయ; నేను నీ కొకదోష64మెపుడుఁ జింతింప; నీకు శత్రుఁడఁగాను; నీ శత్రుఁగూడ; నీకు శత్రులుసేయు నికృతు లే నెఱుఁగ; నెఱిఁగి యుపేక్షింప; నిటు సేయఁదగునె? యెఱిఁగియు నెఱుఁగవై తినవంశతిలక! శరభకంఠీరవశార్దూలకోల కరిహరిణాదుల ఖండింపఁగోరి వసుధ రాజులు వేఁటవత్తురుగాక యెసగి క్రోఁతులఁబట్టి యెందుఁజంపుదురె? యర్కసూనుండు నే నన్నదమ్ములము; కర్కశమతిఁబూని గారవంబెడలి యడరి మేమెట్లైన నైతిమిగాక కడఁగి నీ విటు సంపఁగారణంబేమి? కుందేలు నుడుమును గూర్మంబు నేదుఁ బంది యాళువయును భక్ష్యముల్ గాని పంచనఖంబని ప్లవగంబుఁదినరు. పొంచి నన్నిట్లేసి పొలియించి తేల? మనుజేశ! యింక నా మాంసరక్తముల ననుభవింపుము నీవు ననుజుండుఁగూడి. విశదకీర్తుల జగద్విఖ్యాతుఁడైన దశరథుపనుపున ధర్మంబు 65నూఁది వనములఁదపసివై వర్తించుటకును జనుదెంచి జీవహింసకు రోయవైతి. ధరణిపై మే మొక తప్పు సేసినను భరతుండు దగుఁగాక పట్టి శిక్షింప; నీకుఁగారణమేమి? నీవు భూపతివె? చేకొన కిట్లు చేసితిగాక నన్ను; నీ దేవిఁ66జెఱగొన్ననీచు రావణుని నాదట సాధింతు నని యేఁగుదెంచి నను డించి నీ వర్కనందనుఁబట్టి యనయంబు నీతి67లేవైతి లోకముల నీ వార్త నీవు నాకెఱిఁగించి తేని దేవ! నీ దేవి సాధింపనే యేను? ఆతతబలశాలియై యేఁగుదెంచి సీతామహాదేవిఁ జెఱగొనిచనిన వానిని మున్ను నావాలరోమములఁ బూని బంధించి యంబుధులెల్ల ముంచి కరుణించి విడిచితి ఘనబాహుశక్తి సొరిది లోకమెఱుంగు; సుగ్రీవుఁడెఱుఁగు బెలుకుఱ నన్నుఁజంపెడివాఁడ వకట! బలిమిమై నా దృష్టిపథమున నిలిచి ననుఁబేరుకొని పిల్చి నను ముదలించి జననాథ! కడిమిమైఁజంపలే వైతి. చలముగైకొని డాఁగి చంపితి నన్నుఁ దలపోయ నిది రాజధర్మమె?”యనిన, వాలిమాటలు విని వసుధేశుఁడనియె: “వాలి! యీ మాటలు వలవదు నీకుఁ. గపివంశమునఁబుట్టి కపులలోఁబెరిగి చపలుండవై ధర్మశాస్త్రంబు తెరఁగు తెలియక నీవు నాదెసఁదప్పులెన్ని పలికెద; విది ధర్మపద్ధతి గాదు. నీ వన్నపలుకులన్నిటికి 68నుత్తరంబు నా వాక్యములు గొన్ని నయబుద్ధి వినుము. యనుజునిఁదనుజునియట్లగ్రజుండు మనుపంగవలె నండ్రు మహిధర్మవిదులు ఆ మేర దప్పి తీ వపరాధహీనుఁ దామరసాప్తనందనుఁబురి వెడల నడిచి వావినిఁగోడలైనట్టి యతని పడఁతిని రతిఁబల్మిఁబట్టి భోగించి కామాంధుఁడెందైనఁగలఁడె? నీవంటి పామరుఁడొకఁడు దప్ప జగత్త్రయమున నది యటులుండని; మ్మతఁడును నేనుఁ గదిసి సఖ్యముసేయుకతమున నీవు జగతిపై నా మిత్రుశత్రుండ వగుట దెగి నాకు నిన్ను వధించుట 69దగవు. అకలంకులయి వేఁటలాడెడిరాజు లొకట దీమము70నొడ్డి యొకట71ఁజంపుదురు; (ఒకటితోఁబోరాడుచుండఁజంపుదురు; ఒక భంగిఁబొదరింట నుండఁజంపుదురు; ఉరులొడ్డి చంపుదు;రుఱకచంపుదురు;) ఉరుశక్తి మాటున నుండి చంపుదురు; తెరలు బోనులు నొడ్డి తెగువఁజంపుదురు పరికింప దీనఁబాపము లేదు నాకుఁ; గావున శాఖామృగంబగునిన్ను 72 నీవిధిఁ జంపిన నెగ్గేల కలుగుఁ? జతురబాహాశక్తి జగతి కంతటికిఁ బతియైన భరతుని పనుపున వచ్చి దుష్టమృగంబుల దుష్టరాక్షసుల సృష్టిపై నెపుడు శిక్షించుచుండుదుము. నీ తమ్ముఁడగు వానినెలఁతఁ గైకొన్న పాతకుఁడవు; గాన పట్టి చంపితిమి. రాజదండితుఁడు నారకబాధఁబొరయఁ డోజమైఁగాన నా యుగ్రాస్త్రనిహతి మనికితపడక నిర్మలుఁడవై యింక ననిమిషరాజ్యసౌఖ్యముఁబొందు మీవు.’ అనియొప్ప రఘురాముఁడాడు వాక్యములు విని వాలి కనుమూసి వివశుఁడై యుండి కొంతసేపునకు 73నెక్కొన రామచంద్రుఁ74 గాంతిరాకాచంద్రుఁగనుఁగొని పలికె: “నోరామ!75శుభనామ! యుగ్రాంశుధామ! తారాధిపానన! తార నాదేవి దేవరశౌర్యంబుఁదెలిపి‘76నీవనికిఁ బోవల.”దన్న దుర్బుద్ధిఁబాటించి విధివిహితంబున వినక నే వెడలి యధికవైరమున నిట్లవనిపైఁబడితిఁ; బడిన 77కోపమున దుర్భాషలు గొన్ని జడమతిఁబలికితి; సైరింపవయ్య! తనపాటు చింతింపఁ;దారకు వగవఁ; దనయుఁడంగదునకై తలఁకెద నధిప! యింతకేమగుదురో యింతియు సుతుఁడు! నింతటిదురవస్థ యే వచ్చు టెఱుఁగ!” నని శోకమోహంబులను పయోరాశి మునిఁగి మూర్ఛిలియుండె78మూఁగచందమున నంతఃపురంబున కావార్తవోవ నంతలోఁదారాదులైన కామినులు[వా.రా. సర్గ 19-26] వాలి గూలినమాట వజ్రమై తమదు వాలుగుండెలు నాట వసుధపైఁగూలి యంతలోఁదెలియుచు నట సొలయుచును వంతలోఁ దాఱుచు వాలిఁజీఱుచును “‘ఓయంగదా! నేఁడయో! వాలి దివికిఁ బోయెంగదా!”యంచుఁబొగులుచు,నడలు నంగదుఁదోకొని యతులశోకమున, 79బ్రుంగియుఁబొంగి యేడ్పులు నింగి ముట్టఁ (బదములు దొట్రిలఁబయ్యెదల్ జాఱ వదలి కొప్పులు వీడ వాతెఱల్ వడఁకఁ గన్నుల బాష్పాంబుకణములు దొరుగ నన్నువ గౌఁదీగ లటునిటు బెణఁక, వేవేగఁగిష్కింధ వెడలి రా నపుడు త్రోవ వారల నెదుర్కొని కపు లనిరి: “వాలి రాఘవుచేత వసుధపైఁగూలె; నేల పోయెదరు? పోయినఁబ్రమాదంబు రాకమానదు సుమీ! రామసుగ్రీవు లేకమై యుంట మీ రెఱుఁగరే మొదల. నీ యంగదునిఁబట్టి యేమిసేయుదురొ? దాయలమది నమ్మఁదగ; దటుగాన యితనిచేఁ గపిరాజ్య మేలింత మింక; మతిమంతులగుకపుల్ మనకు నున్నారు; |