ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
తార శోకించుట
పోవల.”దన్న నప్పుడు తార దగవు
భావించి వెస వారిఁబలుమాఱు దూఱి
“యేటి కంగదుఁడు? మీరేటికి? రాజ్య
మేటికి? నాకుఁబ్రాణేశ్వరుఁడైన
వాలిఁజూడక” యంచు వారి వారించి
యాలోనఁ దార తారాధిపవదన
తనమదిలో వాలిఁదలపోసి పోసి
ఘనశోకమునఁజనుఁగవ చూచి చూచి:
“యమరేంద్రసుతురాక నల్లంతఁగాంచి
సమకట్టి డాయుచు సత్క్రీడగోరి
రాసిగఁదా సురరాజేంద్రసుతునిఁ
బాసితి; రింక నా ఫలము చేసేతఁ
గుడువుఁడింతటనుండికుచములా!”రనుచు
గడునల్క వెసనుగ్రగతి మోఁదుకొనుచుఁ
బుడమి గంపింప నద్భుతశోకమడర
నెడపక యిబ్భంగి నే తేరఁదార
హారముల్‌ దెగిరాల నలివేణి దూలఁ
భారంపుఁ జనుగవఁబయ్యద జాఱ
నీరజంబునను దేనియ గాఱినట్లు
తోరమై కన్నీరు దొరుగ నందంద
బలువడి నే తెంచి పవనవేగమున
లలిఁదూలిపడు పుష్పలతికయుఁబోలి
యా వాలిపైఁబడి యందం80దపొగుల
లా వేది తార ప్రలాపింపఁదొడఁగెఁ:
“గపికులాధీశ్వర! కపిరాజచంద్ర!
కపిరాజశేఖర! కపిసార్వభౌమ!
సకలసురాసురసంఘంబులందు
నకలంకసత్త్వుఁడ వధినాథ! నీవు;
అఱిమురి వింధ్యాదులగు మహాగిరులఁ
బెఱికి వేటాడిన బిరుదవు నీవు;
బలియుఁడై త్రిభువనపాలుఁడై వెలయు
కులశైలభేదికిఁ గొడుకవు నీవు;
కోలంబుఁడను పేరి క్రూరగంధర్వు
నేలఁగూల్చిన రణనిపుణుండ వీవు;
నీవు మానవునిచే నీచతఁబొంది
యీ విధిఁబడి తింక నేమనఁగలదు?
ఇనతనూజుఁడు నిన్ను నెదిరి లావేది
యనిలోన నినుఁ81గూల్తునని రాముఁదెచ్చె.
“రాముని నని గెల్వరా; దుండు.”మంటి
నా మాట వినవైతి; నా మన్కి గొంటి;
“వా మహాత్ముఁడు విష్ణు; వటుపోకు.”మంటి
“భీమశౌర్యుఁడతండు బిరు82దుడ్గు”మంటి;
నినుఁజంప వచ్చిన నీ పాలిమృత్యు
వనక రాముని83చేత నాఱడి వడితి.
వొలసి దేవాసురులొగిఁద్రచ్చి త్రచ్చి
బలమఱి84 మఱి పాయఁబడియున్నఁ85జూచి
యడరి వాసుకి మందరాద్రికిఁజుట్టి
వడి సముద్రము ద్రచ్చి వరశక్తిపేర్మిఁ
ద్రిజగంబులందు నుద్దీపించు నీదు
భుజములు పెంధూళి బ్రుంగెనే నేఁడు?
అతి సత్త్వుఁడగు రాక్షసాధీశుఁ86గిట్టి
ధృతిఁదూలి వగవ నీ దృఢముష్టిఁ87బట్టి
మునుకొని వార్ధులఁ88ముంచెత్తునీదు
ఘనవాల మిటు ధూళిఁగలసెనే నేఁడు?
కఱకంఠు శ్రీపాదకమలంబుమీఁదఁ
దెఱఁగొప్ప నీ మౌళి తేఁటియై వ్రాలు
నట్టి నీ మస్తకంబకట! యిచ్చోట
వట్టినేలను గూలవలసెనే నేఁడు?
హృదయేశ! నినుఁబాసి యే నిల్వఁజాలఁ;
గదిసి నీవున్న లోకమున కేవత్తు;
వేదన నిటమీఁద వేఁగఁబాలైతి
నా దిక్కులేమికి నా89కును వగవ;
గోత్రారినందన! కోరి నీకన్న
పుత్త్రు నంగదుఁజూచి పొక్కెదఁగాని.
ధూళితోఁదోఁగి నీ తొడలపైఁబొరలు
బాలు నంగదు 90నేల పాలింప 91వయ్య?
యురముపైఁదొడలపై నుంచి మన్నించి
శిరము మూర్కొని ముద్దుఁజెక్కులు వుణికి
కరము ముద్దా92డి నీ గారాపుఁబట్టి
వరుస నంగదు నేల? వారింప వధిప!”
యని ప్రలాపించుచు నతివ సుగ్రీవుఁ
గనుఁగొని పలికె శోకము వెల్లివిరియఁ
“దలకొని వాలిముందఱ నిల్వలేక
93బలమఱి పలుమాఱు పందవై పాఱి
గతిమాలి పోయి రాఘవుఁదోడి తెచ్చి
కృతకంపుజయమునఁగిష్కింధఁగొంటి.
నీ కోరినట్లయ్యె; నీ పగ దీరెఁ.
గైకొని94పాలింపు కపిరాజ్యపదము.
నెడమాట లాడి యా యినవంశ్యుఁదేరఁ
95గడుహనుమంతుండు గలిగెనే నీకుఁ?
బలుమాఱు బుద్ధులు పరికించి చెప్ప
నల నీల తారు లున్నారులే నీకు.”
నని పల్కి రఘురాము నబ్జాక్షి సూచి:
“జననాథ! యీవాలిఁజంప నేమిటికి?
మెఱసి నిన్నిటు సేయ మీ తండ్రితోడఁ
గఱపెనే? రఘురామ! గణుతింప వాలి
వెరవున నీ రాజ్యవిభవంబుగొన్న
భరతుఁడే? రఘురామ!పరికింప వాలి
చెనఁటియై నీ దేవిఁజెఱగొనిచనిన
దనుజుఁడే? రఘురామ! దలపోయ వాలి
వాలి నకారణవైరంబు వూని
యేలయ్య! తెగటార్చి తిబ్భంగిఁబేర్చి?
నీయట్టి సుకృతికి నీయట్టి పతికి
నీయట్టి కారుణ్యనిధి కిట్లు దగునె?
జనకజతోఁగూడఁజనియెనే యెఱుక?
ఘనమైన విరహాగ్నిఁగ్రాఁగెనే యెఱుక?
భూమీశ! నేఁడు నా పుణ్య96మిట్లయ్యె
నేమిసేయుదు నింక? నేమందు 97విధికి?
నీ వాలి నెడఁబాసి యే నుండఁజాల?
దేవ! నన్నును బట్టి తెగటార్పవయ్య!”
యని యురంబును మోము నందందమోఁది
కొనుచువాలినిఁబేరుకొని యేడ్చుచుండె.
నా వేళ హనుమంతుఁడట తారఁగదిసి:
“నీ వెఱుంగని ధర్మనీతులు గలవె?
యాజి వీరస్వర్గ మందినవాలి
కీజాడ శోకింప నేల? యీ పనులు
దైవయత్నము.”లంచుఁ దాఁబలుమాఱు
ధీవిచక్షణుఁడిట్లు తెలుపుచునుండె.

  1. ↑ఱుఁ
  2. ↑గెల్తు
  3. ↑దేలయంటి
  4. ↑నమ్మియా
  5. ↑యట
  6. ↑చోట
  7. ↑బట్టి
  8. ↑గట్టి
  9. ↑ముంచిముంచెత్తు
  10. ↑కేమి
  11. ↑నేలి
  12. ↑వకట
  13. ↑డు
  14. ↑పలుమాఱు దెసచెడి
  15. ↑భోగించు
  16. ↑కడఁక వాయుసుతుండు
  17. ↑ట్లుండె
  18. ↑నిన్ను
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )