| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
“మారుతి! నీ పని మా మీఁదఁబెట్టి యూరక యున్నాఁడ; వుచితమే నీకు?[వా.రా. సర్గ 66, 67, సుందర. 1] లలితలావణ్యవిలాససంపదల వలనొప్పునప్సరోవనితలయందుఁ బుంజికస్థలయనఁబొలుచు మీ తల్లి యంజన యట తొల్లి యగ్నిశాపమున వానరవనితయై వసుధఁగేసరికి మానినియై యుండి మఱి యొక్కనాఁడు వనగిరిస్థలులందు వర్తించుచుండ ననిలుఁడాయంగన యలసయానంబు దొడలబెడంగును దోరంపుఁబిఱుఁదు నుడురాజబింబంబు నొరయునెమ్మోముఁ గలదు లేదనుకౌను గబ్బిగుబ్బలును దలచుట్టివచ్చు బిత్తరికన్నుఁగవయుఁ గనుఁగొని మోహంబు గడలుకొనంగ మనసిజశరభిన్నమానసుండగుచుఁ జేలఁబాయగఁజేసి చెలిమిమై డాసి యాలింగనముచేయ నంజన యలిగి: “నాదు పాతివ్రత్యనైపుణిఁజెఱుప నే దుష్టమతియొకో యిటు సమకట్టె?” నా విని: “యలుగ కోనాతి! నే వాయు దేవుండ; నీదు పాతివ్రత్యమునకు భంగంబు గాకుండఁబరికించి హృదయ సంగంబు సలిపితి. జలజాక్షి! దీన బలవేగవిక్రమపౌరుషధైర్య ములుగల తనయుఁడిమ్ముల నీకుఁబుట్టు నని పల్కి చనుటయు నా వధూమణియు వనమున నలరుచు మఱి వాయుదేవు ప్రవిమలకృప నిన్నుఁబడసెఁగావునను భువిని వాయువుతోడి భూరిసత్త్వుఁడవు; వేగవిక్రమకళా విస్ఫూర్తులందు నా గరుడనికంటె నధికుఁడ వీవు; వఱలుపంకజగర్భువరమునఁజేసి మఱి నీకు నాయుధమరణంబు లేదు. నీ సమానులు లేరు నిఖిలలోకముల; నీ సత్త్వమెఱుఁగుదు నిజముగా నేను; జడనిధి లంఘించి జనకజఁగాంచి కడఁకమై నిటు రామకార్యంబు సేసి కపులప్రాణములు రాఘవులప్రాణములు కపినాథుప్రాణముల్ కరుణతోఁగాచి తడయక యోజగత్ప్రాణనందనుఁడ! పడయు ముత్తమలోకపదములు నీవు.” అనవుడు హనుమంతుఁ:“డవుఁగాక,మీరు పనిచినఁజేయుదుఁబతికార్యమొప్ప. నగచరుల్, సూడుఁడు నా శక్తినేఁడు; జగదేకహితబుద్ధి జలధి లంఘించి పఱతెంచి సురలడ్డపడిన సాధింతు; నెఱసి లోకములెల్ల నీఱు గావింతు; నక్కజంబగుశక్తి నట లంక సొత్తు; స్రుక్కక వెదకి భూసుతఁజూచి వత్తు; 204నా లంకయైనను నగలించి తెత్తు; వాలాయముగ సీత వసుధేశుఁగూర్తుఁ; గాకున్న జలధులు గలఁతు నొండేని; వీకతో నమరాద్రి విఱుతు నొండేనిఁ; బుడిమి తుత్తుముఱుగాఁబొడుతునొండేని; దొడరి మృత్యువునైనఁద్రుంతు నొండేని; దీవులన్నియును శోధింతు నొండేని; 205దేవేంద్రునైన బాధింతు నొండేని; దుష్టాసురులనెల్లఁద్రుంతు నొండేని; సృష్టిఁజీకటి సేసి చెఱుతు నొండేనిఁ; |