ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
హనుమంతుని సముద్రలంఘనము: మైనాక సందర్శనము
గాని యూరక రాను గడఁగి మీ యొద్ద
కే.” నని పూని మహేంద్రాద్రి యెక్కి
యుదధులతోఁగూడ నొగి సృష్టి మ్రింగఁ
గదిసిన లయకాలకాలుఁడో యనఁగ
వెసఁద్రివిక్రముఁడైన విష్ణునిరీతి
నసమానదేహుఁడై యందంద పెరిగి
యంగదాదులచేత ననుమతి వడసి
యంగ 206మెంతయుఁబొంగ నంతరంగమునఁ
దన తండ్రిఁబవమానుఁదలఁచి శ్రీరామ
జననాథుపదపంకజము లాత్మనిలిపి
యడుగులు 207దిరముగా నద్రిపై మోపి
మెడయెత్తి యొకయింత మెయిగ్రుంక 208నిక్కి
బొమలెత్తి కలయ నంభోరాశిఁజూచి
యమరారిపురిమీఁద నట దృష్టి నిలిపి
209వఱలంగ నటమీఁద వాల మల్లార్చి
నెఱి కర్ణములు రెండు నిక్కించి210మించి
యట యద్రిశిలమీఁద హస్తంబు లూది
పటుజవంబున దాటెఁబవమానసుతుఁడు
అల సుధాహరణార్థమై వైనతేయుఁ
డిల నుండి మును దివి కెగయుచందమున.
నారభసంబున నద్రిశృంగములు
భూరేణువులకంటెఁబొడిపొడియయ్యె
నా రావణుండు మున్నార్జించినట్టి
భూరికీర్తులపెంపు పొడియైనయట్టు.
లా యురువడి మ్రాఁకు211లతనితో నెగసి
తోయధిలోఁజొచ్చి తునియలై పడియె
భావి సేతువునకై పవననందనుఁడు
దా వచ్చి శంకువుల్‌ స్థాపించె ననఁగ.
వెసఁబేర్చి యప్పటివిషమవాయువుల
దెసలకుఁజెడి పాఱెఁదివిఱి మేఘములు
వక్రించె లంకపై వాయుజుండనుచు
శక్రాదులకుఁజెప్పఁజనినచందమున.
నా వడి నబ్ధినీరంతయు212ఁబాసి
యావలిపాతాళమటు గానవచ్చె
‘జనకజఁదెచ్చి నా జలములో దాఁపఁ’
డని మారుతికిఁజూపె నంభోధి యనఁగఁ.
దనపతిహితకార్యధైర్యశౌర్యములుఁ
దన వేగలాఘవోదాత్తసత్త్వములుఁ
జూచి యింద్రాదులు సొరిదిఁగీర్తింప
నీ చందమున దాటి యేఁగుచున్నంత;
“నీ నిత్యకృతి జగద్ధితము గాఁగోరి;
పూని యెంతయు దవ్వు పోవుచున్నాఁడు
ఇతనికి విశ్రాంతి యిచటఁగావింప
నితనిఁబుచ్చెద.”నని యిచ్చలోఁదలఁచి,
యప్పుడు మైనాకు నంబుధి పిలిచి:
“యిప్పుడు హనుమంతుఁడేతెంచె నిటకు;
నొప్పార నాతిథ్య మొసగు మీ.”వనుచుఁ
జెప్పి“పొ”మ్మనుటయు శ్రీఘ్రంబ యెగసి
యురుతరనిజపక్షయుగళసంజాత
మరుదుచ్చలద్వార్ధిమధ్యంబు వెడలి
శ్రీకర కాంచనశృంగసంకలిత
నాకమై యొప్పుమైనాకపర్వతము
ఎదుటఁదోఁచినఁజూచి:“యిది దైత్యమాయ;
కదిసి నా పనికి విఘ్నముసేయఁగోరె.
దానికినేమి? నా దర్పంబుపేర్మి
దీనిఁద్రుంచెదఁగాక తెగి.”యంచు నడరి
వర వజ్రకఠినమౌ వక్షంబుచేత
నురువడి హనుమంతుఁ డుదరి తాఁకుటయుఁ
గరువలి సుడిగొన్న కారాకువోలెఁ
దిరమేది ధృతిదూలి దిర్దిరఁదిరిగి
మనుజుఁడై పొడసూపి మైనాకశిఖరి
యనిలనందనుఁజూచి యర్థితోఁబలికె:
“ననిలజ! నీకు నే నప213రాధిఁగాను
వనరాశిపనుపున వచ్చితిఁగాని.
యమ్మహాత్ముఁడు నీకు “నాతిథ్యమొసగు
పొ.”మ్మన్న వచ్చితిఁ;బూర్వకాలమున
బర్వతంబులకెల్లఁబక్షముల్‌ గలిగి
గర్వించి మెలఁగ నాఖండలుం డలిగి
పవిధార నొక్కటఁబక్షముల్‌ దునుమఁ
బవనుఁడు నీ తండ్రి పరికించి నన్ను
నవలీల నీ లవణాంబుధిలోనఁ
గవయించి పక్షముల్‌ గాచి రక్షించెఁ.
గాన మీ వాఁడను గాని యన్యుండఁ
గాను; శీతాచలాగ్రణికుమారుండ;
నేను మైనాకుండ; నీవు నా యందుఁ
బూనిన ఫలమూలములఁదృప్తిఁబొంది
బడలికలను బాసి పవనకుమార!
కడులావు మీఱ లంకాపురంబునకు
నరుగుము నీ.”వన్న నమ్మహాబలుఁడు:
“వెరవుగాదిప్పుడు విశ్రమించుటకు;
జలనిధినడుమ నెచ్చట నిల్వ ననుచుఁ
జెలఁగి మున్ను ప్రతిజ్ఞ సేసినవాఁడ;
నిట రాముకార్యమై యేఁగుచున్నాఁడ;
నటుగాన నిల్వరాదద్రీశ! నాకు.”
నని పాణితలమున నయ్యద్రిఁదడవి:
“యనఘాత్మ! నీ పూజలన్నియు వచ్చె.”
నని పల్కి పోవుచో ననిలనందనుని
ఘనశక్తి కమరులు కడుఁజోద్యమంది
నానావిధముల నానందించి రంత.
మైనాకగిరి నింపుమై నాకవిభుఁడు
గనుఁగొని: “శ్రీరాముకార్యమై యేఁగు
హనుమంతునకుఁబ్రియంబాచరించితివి.
అటుగాన నీకు నే నభయమిచ్చితిని.
ఇట సుఖస్థితి నుండు మీ.”వంచుఁబలికె.
నప్పుడు గంధర్వు లమరులు మునులుఁ
దప్పక యంజనాతనయుఁజూచుచును
“ఇతని లా వెట్టిదో యెఱుఁగుద.”మనుచుఁ
జతురులై సురసనాఁజను214నాగమాతఁ
బనిచిన రాక్షసభావంబు వూని
యనిలసూనునకుఁదా నడ్డమై నిలిచి:
“యీ వార్ధిలోనుండి యేఁగు నిన్‌గంటి;
దైవయత్నంబునఁదా నింక మంటి;
ననిలజ! యాఁకొంటి; నటయిట జుణిఁగి
చనక నావక్త్రంబు చనుదెంచి చొరుము
నీ.”వనవుడు:“రామనృపుకార్యమునకుఁ
బోవుచునున్నాఁడఁ, బొలఁతి! రారాదు;
ధరణీశుకార్య మంతయు నెఱవేర్చి
తిరిగి యేతెంచుచోఁదీర్తు నీ కోర్కి;
పోయివచ్చెద నింతి! బొంకుగా.”దనిన
నా యింతి కోపించి 215యడ్డమై నిలిచి:
“చననీను; నినుఁబట్టిచంపుదుఁగడిమి.”
నని నోరు దెఱచిన ననిలనందనుఁడు
తనమేను వెసఁబెంచె దశయోజనంబు;
లినుమడిగాఁబెంచె నింతి యాననము;
ముప్పదియోజనంబులు వెంచె నాతఁ;
డప్పుడు నలువది యదియునుఁబెంచె;
నొండొరు లిటు శతయోజ216నావధికి
దండిమైఁబెంచిరి తనువు వక్త్రములు
నంత నా హనుమంతుఁడసమానబుద్ధి
మంతుఁడై యంగుష్ఠమాత్రగాత్రమున
నతిసూక్ష్ముఁడై వచ్చి యా యింతి వదన
మతిరయంబునఁజొచ్చి యవలీల వెడలె.
ముడిగొన్న సంసారమోహబంధములు
విడఁదన్ని సుజ్ఞాని వెడలినమాడ్కి.
“వెడలి నీ కోర్కి గావించితి; నింకఁ
గడలి దాటెద.” నన్నఁగపికులోత్తముని
బుద్ధికెంతయు మెచ్చి పొగడుచుఁ:“గార్య
సిద్ధి నీకయ్యెడు శీఘ్రంబె.”యనుచు
నట దివ్యవనితయై యా యింతి ప్రీతిఁ
బటుసత్త్వుననిలజుఁబరగ దీవించె.
నతఁడంతఁబ్రణమిల్లి యట వోవుచుండ
నతిరయంబున వచ్చి యాతనిఁగదిసి
యొలసి దేహచ్ఛాయ లొడిసి రాఁదిగిచి
చెలఁగి జీవులమ్రింగుసింహిక గడఁగి
పదియోజనంబులపఱపును మూఁడు
పదులయోజనములై పరగెడు నిడుపు
నగుచున్న తన నీడ నలమి చేపట్టి
తిగిచి మ్రింగఁగడంగ ధీరుఁడై యతఁడు
ప్రతికూలవాతూల 217పవనసంఘాత
హతుల నోడయుఁబోలి యటు పోక నిలిచి,
యెడఁద‘ఛాయాగ్రాహి యిది’ యని తెలిసి
మడపక యటమీఁద మకరివక్త్రంబు
చొచ్చివత్తు నటంచు సూచించునట్టు
లచ్చెరువంది యింద్రాదులు సూడఁ
గడుసూక్ష్మరూపుఁడై కలఁగక దాని
కడుపులోపలఁజొచ్చి కడిమిమై వ్రచ్చి
యా దుష్టరాక్షసి నబ్ధిలోవైచి
యాదట సురలెల్ల నానందమంది
వినుతించి వరపుష్పవృష్టులు గురియ
వననిధి యవలీల వడి దాటిపోయి
యా సమీరజుఁడనాయాసంబుతోడ
నా సువేలాచలం బచలుఁడై యెక్కె.
ననియాంధ్రభాషభాషాధీశవిభుఁడు
వినుత కావ్యాగమ విమలమానసుఁడు.
* * *
నసమాన లలిత శబ్దార్థసంగతుల
రసికమై చెలువొందు రామాయణమున
నవనిఁగిష్కింధాఖ్యమైన యీ కాండ
మవిరళ పదశయ్య నమరంగఁ జెప్పె.
నారూఢి నార్షేయమై యాదికావ్య
మై రసికానందమై యెల్లనాఁడు
* * *
లెందాఁక వేదంబు లెందాఁక దిశలు
నెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక నీ కథ యక్షరానంద
సందోహ దోహళాచారమై పరగు.218
  1. ↑మంతయు
  2. ↑సమముగా
  3. ↑నిలిచి
  4. ↑వఱలు నౌఁదలమీఁద
  5. ↑వంచి, పొంచి
  6. ↑లవనిపై
  7. ↑నెగసి
  8. ↑కారి
  9. ↑దేవదూత
  10. ↑అఱుక్రమ్మి
  11. ↑నాయతము. నాధికత
  12. ↑వాత
  13. ↑బాలకాండాంత ద్విపదలిక్కడఁగూర్చుకొనునది
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )