| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
శ్రీరాముకార్యంబు సేయంగఁబూని వారిధిఁ బిల్లకాల్వయుఁబోలె దాటి[వా.రా. సర్గ 1] చారుశృంగంబుల సానుదేశముల భూరి భూరుహలతాపుంజకుంజముల కైరవబంధూక కహ్లార కుముద సారస జలచరచయతుంగభంగ చలిత డోలాకేళిఁ జరియించుహంస కలకలస్వరములఁ గ్రౌంచనాదముల, రాజీవ రసమత్తరణిత సద్భృంగ రాజిచేనొప్పెడు రమ్యదీర్ఘికల కలిమిచే నొప్పులంకాపురియొద్ద వెలయు సువేలాద్రి వేడ్కమై నెక్కి యంత నా హనుమంతుఁ డా యద్రిమీఁద నెంతయుఁబదిలుఁడై యేపుమై నిలిచి యటు దక్షిణము సూచి యపుడిటుల్గనియె: నట త్రికూటాద్రిపై నమరెడుదానిఁ,[వా.రా. సర్గ 2] గదలక ధర్మార్థకామముల్ మూఁడు పొదిగొన్న సిరివోలెఁబొలుపొందుదానిఁ, దనరారుమెఱుఁగులఁదారాద్రిఁబోలి వినువీథితో రాసి విలసిల్లుదాని, ఘనతర వజ్ర సత్కాంతులఁదనరి యనిమిషచయముచే నలరారునట్టి యమరావతీపురం బబ్ధిమధ్యమునఁ గమనీయముగ నొప్పుగతిఁదోచుదాని, సలలిత మకరకచ్ఛపపద్మ నిధులఁ జెలువొంది యంచితస్థితిఁదనరారు నలక కుబేరుతో నలుకమై నచట నెలకొన్న కైవడి నెగడెడుదానిఁ, గలకాలమును నధోగతి నుండలేక తెలివిమై భోగవతీనగరంబు జలరాశి వెలువడి సరిఁద్రికూటమున వెలసినకైవడి విలసిల్లుదాని, నంబుధి యావరణాంబువుల్ గాఁగఁ బంబినప్రభ నొప్పుబంగారుకోట బ్రహ్మాండవిధముగాఁ బరికింప దనరి బ్రహ్మాద్యభేద్యమై పరగెడుదానిఁ, దురగ సామజ రథస్తోమారి భీమ వరభటానేక దుర్వారంబు నగుచుఁ బొలుపొందు బహుదివ్యభోగసంపదల లలితమై యొప్పెడు లంకాపురంబుఁ గని చాల వెఱఁగంది కనుఱెప్పవెట్ట కనిలతనూభవుం డందంద చూచి: “యెల్లలోకంబులు నెక్కటి గెలిచి బల్లిదుండై పేర్చుపంక్తికంధరుఁడు ఇట్టి సంపదలచే నెసగు నీ లంకఁ బట్టాభిషిక్తుఁడై బ్రదుకఁబాలేది? సకలేశుఁడగు రామచంద్రుని దేవి వికలుఁడై కొనితెచ్చి వీఁడేల పొలిసె?” నని వాని దూషించి యట లంకఁ జొరఁగ ననువు విచారించి యా సత్త్వధనుఁడు తగ లంక యుత్తరద్వారంబుఁజేరి తగవును నీతియుఁదలపోసి 1మఱియు: “నీ సముద్రముఁ గపు లెట్లు దాటెదరు? వాసి దాటిననైన వాసవాదులకు సాధింప మిగుల నసాధ్య మీ లంక; సాధింప నలవియే సకలయత్నముల? భీమసాహసమునఁ బేర్చు రావణుని రాముఁడెట్లు జయించు 2రణభూమి నిలిచి?” యని ముహూర్తము దన యాత్మఁజింతించి: “యెనలేని పొడవైన యీ మేనితోడఁ బగటున నీ పురిఁబగలు సొచ్చినను బగయగు రాక్షసభటులకు నాకు. జానకిఁబొడగానఁజాల నేనట్లు; కాన సూక్ష్మాకృతిఁగైకొని పోయి యీ లంక దైత్యులనెల్ల వంచించి వాలాయముగఁగాంతు వైదేహి.”ననుచు మదిలోన సూర్యాస్తమయ మొప్పఁదలచి పదిలుఁడై యెంతయుఁబరికించుచుండ “నవిరళసత్త్వుఁడై యవనీశుదేవి నవనీతనూభవ నరసిపో వచ్చె; నే నున్న ననువుగా దీ లంకఁజొరఁగ వీనికి.”నన్నట్లు వెసఁగ్రుంగె నినుఁడు. అనిలనందనునకు3నను విచ్చి దైత్యు ఘనపాపములు పూని 4కనుకనిఁబర్వె ననఁబర్వె5దిశల ఘోరాంధకారంబు. ఘనమైన దైత్యుల కలకలంబడఁగె. నంత నా కలకలంబడఁగుట నాత్మ నంతయుఁబరికించి యనిలనందనుఁడు మార్జాలమాత్రుఁడై మఱి లంకఁ6జొరఁగఁ గర్జ మూహించుచు ఘనుల రాఘవులఁ |