ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
రాక్షసులను హనుమ మడియించుట
నావుడు మండి దానవలోకవిభుఁడు
రావణుఁడుగ్ర నిగ్రహ దృష్టిఁజూచి
దీపాగ్ర నిర్గళద్దీప్త తైలంబు
లై పావకజ్వాల లక్షులఁదొరుగఁ
దనకింకరులఁబంచె దండిరాక్షసుల
నెనుబదివేవుర నిద్ధ విక్రములఁ.
బనిచినఁబనిపూని బలియురై వారు
ధనురస్త్ర శూల ముద్గర భిండివాల
ఘనగదాకరవాలకలితులై పేర్చి
యనికి సన్నద్ధులై యార్చుచు వెడలి.
రంత సూర్యోదయంబయ్యె; నౌటయును
నెంతయుఁ గడఁకతో నే పగ్గలించి
యకలంక గతిఁబర్వతాకారుఁడగుచు
మకరతోరణమెక్కి మారుతాత్మజుఁడు
తనుఁదాఁకి శస్త్రాస్త్రతతుల నొప్పించు
దనుజవీరులఁజూచి దర్పించి పలికె:
“నోరి రాక్షసులార! యుర్విపై నేను
శూరత విలసిల్లు సుగ్రీవు 135బంట;
రామునిదూత నా రాముసేమంబు
భూమిజతోఁ జెప్పి పోవుచున్నాఁడ;
హనుమంతుఁ డనువాఁడ;నతిబలాధికుఁడ;
వినుతవిక్రమకళావిభవ శూరుండఁ;
బూని లంకాపురంబున నున్నమగల
కే నంతకుండనై యిట వచ్చినాఁడఁ;
జెడఁగోరి నన్నేల చెనకెద?”రనుచు
వడిఁబేర్చి యాభీలవాల136ంబునందుఁ[వా.రా. సర్గ 43]
బదుల నూఱుల వేల బలియుఁడై పట్టి
త్రిదశారిభటుల బంధించి బంధించి
యారూఢ విక్రమాహవకేళిఁ దేలి
తోరణస్తంభంబుతో వ్రేసి వ్రేసి
పూని యొక్కరునైనఁబోరిలో బ్రదికి
పోనీక నిశ్శేషముగఁజంపి వైచె.
నంతలోఁబణిహారు లమరారికడకు
నెంతయు భీతులై యేతెంచి మ్రొక్కి:
“దనుజేశ! విను క్రోఁతి తనదువాలమున
నెనుబదివేపుర నేపుమైఁజంపి
మలయుచునున్నాఁడు మకరతోరణము
తలదన్ని రణబలోదగ్రుఁడై.”యనుడు
నా పంక్తిముఖుఁడు కాలాంతకుపగిదిఁ
గోపించి పింగళాక్షుని దీర్ఘజిహ్వు
వక్రనాసుని నశ్మవక్షుని వైరి
చక్రభీకరుఁడైన శార్దూలముఖుని
వేవేగ పిలిపించి:“వీరులై మీర
లా వానరునిఁదెగటార్చిరం.”డనుడుఁ
బనిపూని యేవురుఁబ్రబలసైన్యములఁ
గొని రథారూఢులై క్రూరత వెడలి
పరువడి నార్చుచుఁబవనజుఁదాఁకి
శరవృష్టిఁబొదివినఁజలియింప కాతఁ
డా తోరణంబుపై నార్చుచుఁ బేర్చి
వాతూలసుతుఁడేచి వాల మంకించి
రథముల విఱిచి సారథుల నుగ్గాడి
రథతురంగంబుల రణవీథిఁద్రుంచి
వారణంబులఁగూల్చి వాజులఁగెడపి
యా రాక్షసులసేన లట రూపుమాపి
ధరణికి లంఘించి 137తనదువాలమున
నురుశక్తి గళమున కురిగా బిగించి
యురువడిఁ గన్నుగ్రుడ్లుఱుకంగఁద్రిప్పి
సురుఁగక వక్రనాసుని వ్రేసి చంపెఁ.
జంపి యంతటఁబోక సమయనికినుకఁ
దెంపుసొంపును బెంపు దీపింపఁగదిసి
138పెడపెడ నార్చుచుఁబిడుగున కంటె
139బెడిదమై కనుపట్టు పిడికిటిచేతఁ
బుడమిపై నురురక్తములు గ్రక్కి కూల
వడి నశ్మవక్షుని వక్షంబు వొడిచెఁ.
బొడిచి బాహాగర్వమున మాఱులేని
కడఁకఁ దన్‌ గనుఁగొని కలఁగురాక్షసుల
మొగిఁద్రుంచి శార్దూలముఖు లలాటంబు
పగులంగ వడిఁద్రిప్పి పడవైచి చంపె.
నటు చంపి క్రోధాగ్ను లందంద నిగుడఁ
గుటిల రాక్షసకులక్షోభంబు 140గాఁగఁ
గ్రూరుఁడై పింగళాక్షునిఁ దోఁకఁగట్టి
కారాకు సుడిగాలి గడువడిఁద్రిప్పు
తీరున వాని దిర్దిర మింటఁ ద్రిప్పి
తోరణస్తంభంబుతో వ్రేసి చంపె.
వాని నిమ్మెయిఁజంపి వరశక్తియుక్తిఁ
బూని దానవసైన్యములు141సొచ్చి కలఁచి
యురువడి దీర్ఘజిహ్వుని వచ్చి తాఁకి
యురుముష్టిసంహతి నుర్విపైఁ గూల్చి
యాలోనఁబవనజుఁడసమానవిజయ
లోలుఁడై వాని నాలుక పీఁకి చంపి
తోరణారూఢుఁడై తొలఁగకయున్న
మారుతిఁగనుఁగొని మది భీతులగుచు
నంతఁజిక్కినదైత్యులట పాఱిపోయి
యంతయుఁజెప్పిన నద్దశాననుఁడు[వా.రా. సర్గ 44]
సోమించి నిజమంత్రిసుతులైన రక్త
రోముని142శతజిహ్వు రుధిరలోచనుని
స్తనిత143హాసుని శూలదంష్ట్రు దుర్ముఖుని
ఘనసత్త్వుఁడగు వ్యాఘ్రకబళునిఁబిలిచి:
“యిది యొక్క వానరుండేచి రాక్షసులఁ
బొదివి పెక్కండ్రఁజంపుచునున్నవాఁడు
ఆ మర్కటునిఁజంపుఁ.”డని పూని పనుప
నా మహాబలగర్వు లార్చుచు వెడలి
చతురంగబలము లసంఖ్యముల్‌ గొలువ
నతులరథారూఢులై వచ్చి పేర్చి
మకరతోరణముపై మాఱులే కిచ్చ
నకలంకుఁడైయున్న హనుమంతుఁ బొదివి
వరదివ్యశస్త్రాస్త్ర వర్షముల్‌ గురియఁ
బరమ144సాహసుఁడైనపవమానసుతుఁడు
జలదసంవేష్టితశక్రునిపగిదిఁ
బొలుపొంది యెంతయుఁబొలివోనికడిమి
నప్పు డా దైత్యుల యస్త్రశస్త్రములు
దప్పించుకొనుచును దనుఁదాఁకకుండఁ
దన నఖాగ్రంబుల దంతకుంతముల
ఘనపాదకూర్పర కర ఘట్టనములఁ
జెలరేఁగి వడి మహాశిలలవృక్షముల
బలముల నలుగడఁబఱపి నుగ్గాడి
కంఠీరవమువోలె గజములపై 145కిఁ
గుంఠితేతరశక్తిఁ గుప్పించి తాఁకి
పటుమాంసమౌక్తికప్రకరముల్‌ సెదరఁ
గుటిలోగ్రనఖములఁ గుంభముల్‌ వ్రచ్చి
లేళ్ల146కుఁబులి చౌకళించినకరణిఁ
ద్రుళ్లుగుఱ్ఱములఁదోడ్తో రూపుమాపి
జంతుపారణసేయు జమునిచందమునఁ
బంతంబుతోఁగాలుబలము మాయించి
కులశైలములఁదాఁకి కులిశాయుధంబు
పెళపెళధ్వనులతో భేదించినట్లు
బలువిడి రథములపైకి లంఘించి
పొలుపార రథరథ్యముల నేలఁగలపి
రథులఁజెండాడి సారథుల నుగ్గాడి
పృథుసత్వయుక్తుఁడై 147పేర్చి లంఘించి
మునుమున్న రక్తరోముని నేలఁగూల్చి
స్తనితహాసునిఁద్రుంచి 148శతజిహ్వునణఁచి
రుధిరాక్షుఁజంపి దుర్ముఖు విదారించి
149క్రధనవిక్రము వ్యాఘ్రకబళు ఖండించి
శూలదంష్ట్రు వధించి శూరత మించి
కాలపాశాభీలఘనవాలుఁడగుచు
నురువడి నిబ్భంగి నొక్కొక్క తెగువఁ
దరమిడి పెలుచ నుద్దండ రాక్షసుల
బలములతోఁగూడ భస్మంబు సేసి
150తలఁగక మారుతాత్మజుఁడున్నఁ151దలఁకి
పోరిలో నిలువక పోయినవారు
వారిచావులు చెప్ప వడిఁగోపమెత్తి
యట ప్రహస్తునిపుత్త్రుఁడగు జంబుమాలిఁ
జటులప్రతాపసంచలితాంశుమాలిఁ
గుటిలారిపర్వతక్రూరదంభోళిఁ
బటుబాహుబలశాలిఁబనిచె రావణుఁడు.
పనిచిన నా దైత్యపతికి మ్రొక్కుచును
ననురక్తి రక్తమాల్యాంబరోదగ్ర
సమరోగ్రశస్త్రాస్త్రసన్నద్ధుఁడగుచు
నమితరథారూఢుఁడై వచ్చి యతఁడు
శింజినీటంకారసింహనాదములఁ
గంజజాండము హల్లకల్లోలముగను
హరిఁదాఁకు నున్మత్తహస్తి చందమున
నరుదైనకడిమిమై హనుమంతుఁదాఁకి
కెరలి మేఘము మహాగిరిమీఁదఁ బోలె
శరవృష్టి గురిసినఁజలియింప కతఁడు
పెనుశిల దైత్యుపైఁబెఱికివైచుటయుఁ
గని దాని శర దశకంబుచేఁదునిమి
హనుమంతు వదనాబ్జ మర్ధచంద్రాస్త్ర
మున నొంచి పదిబాణముల బాహు152లురము
నాటించి యొక శక్తి నడునెత్తి వగుల
మేటియై యేసిన మిగుల రోషించి
పవమానతనయుండు బాహుదర్పమున
నవలీల నొకసాల మగలించి వైవ
నాలుగమ్ముల దాని నడుమనె త్రుంచి
వాలిన కడిమి నా వనచరవరుని
శిరమొక్క నిష్ఠురశితసాయకమునఁ
దరమిడి వక్షంబు దశ విశిఖములఁ
బొరి భుజంబుల నైదు భూరి భల్లములఁ
గరము నొప్పించి రక్కసుఁడేపు మెఱయఁ
గాలునిపగిదిఁగన్గవ నిప్పు లురల
నా లోన హనుమంతుఁడా దైత్యురథముఁ
బదములఁబడఁదన్ని పట్టి దంష్ట్రములఁ
గదిసి విదారించి గర్జించి వ్రేసి
పొదివి మహా153సాలమున రథ్యసమితిఁ
జదిపిన విరథుఁడై జంబుమాలియును
154బలకయు నడిదంబు బలువిడిఁగొనుచు
నలవుఁబెంపును గూడ నార్చుచు వచ్చి
పవమానతనయుని ఫాలంబు వ్రేయ
నవశుఁడై మూర్ఛిల్లి యంతలోఁదెలిసి
పిడుగుతో సరియైన పిడికిటఁ155బలకఁ
బొడిచి భగ్నముసేసి పోనీక కదిసి
యొడిసి కైదువు గొని యుగ్రుఁడై కడిమిఁ
దడయక దైత్యుని తల ద్రెవ్వనేయ
ధృతిదూలి యతఁడుర్విఁద్రెళ్లెఁ;ద్రెళ్లుటయు
(నతులసత్త్వమున దైత్యావళిఁదఱిమి
వితతవిక్రమజయవృద్ధిఁబెంపొంది
చతురుఁడై తోరణస్థలి నున్నఁజూచి
యతిభీతచిత్తులై యందఱుఁబఱచి)
హతశేషు లతనిపాటంతయుఁజెప్పఁ
గడుఁజోద్యమంది రాక్షసమంత్రివరులఁ
దడయక పిలిపించి తగఁగొలువిచ్చి
దనుజనాథుఁడు గొంతదడవు సింతించి
యనిమిషేంద్రునినైన నాజిఁగైకొనని[వా.రా. సర్గ 45]
యలఘువిక్రము విరూపాక్షుఁయూపాక్షు
గలహదుర్ధరు భాసకర్ణాఖ్యుఁ బ్రఘసు
నద 156యులఁబంచసేనాగ్రనాయకులఁ
గదనకర్కశుల నొక్కటఁ జూచి పలికె:
“నే లోకముననైన నిటు మర్కటులకు
నీ లావు గలదె? వీఁడెవ్వఁడో తెలియ
రాదు? మీరేవురు రణబలోదగ్రు
లై దర్ప మేర్పడ నాత్మ నేమఱక
యగణితసైన్యసహాయులై వానిఁ
దెగువమై నిట157పట్టితెండు పొం.”డనిన
రావణునాజ్ఞ శిరంబునఁబూని
పావకాదిత్య ప్రభాభాసులగుచు
వారలు బహురథవారణతురగ
వీరదైత్యులతోడ వేవేగ కదలి
ప్రాగ్గిరిపై నుండు భానుండువోలె
దిగ్గగనాంతరోదీర్ణ తేజమునఁ
దోరణంబెక్కి బంధురదైత్యవరుల
తో రణంబొనరింప దొరకొనువాని
ననిలసూనునిఁదాఁకి యవనియు దిశలుఁ
158జినుఁగంగఁజేయుచు 159సింహనాదముల
నందఱు దివ్యశస్త్రాస్త్రముల్‌ గురియ;
నందులో దుర్ధరుండను పేరివాఁడు
ఐదు బాణంబుల ననిలజు160శిరము
భేదించుటయు రోషభీషణుండగుచుఁ
గపివీరుఁడార్చి యాకసమున కెగయ
నపుడు దుర్ధరుఁడును నతనితో నెగసి
విలునారి సారించి విలయకాలోగ్ర
జలదంబుకైవడి శరవృష్టి గురియ
నా యుగ్రశరవృష్టి నణఁచి వాయుజుఁడు
నా యెడఁ బొడవుగా నట మింటికెగసి
వడి161విడిఁబఱతెంచి వానిపైఁబడినఁ
బొడిపొడియై కూలెఁబుడమి రక్కసుఁడు.
అది సూచి యా విరూపాక్షయూపాక్షు
లదయత ముద్గరహస్తులై యెగసి
యాకసంబున నిల్చి యార్చి పేర్చుటయు
నా కరువలిపట్టి యట తాను నెగసి
వారితోఁబోరాడ 162వారును నతని
ఘోరముద్గరములఁగొని వ్రేయుటయును
జగతిపైఁబడి లేచి సాలభూరుహము
నగలించి మఱియును నార్చుచు నెగసి
చిక్కనిభుజశక్తిఁ జిఱచిఱఁద్రిప్పి
యొక్క దెబ్బన వారి నుర్విపైఁగూల్చె.
భాసకర్ణుండును బ్రఘసుండు నంత
నా సమీరాత్మజు నదరంటఁదాఁకి
పటుశూలముద్గరప్రహతుల నొంప
నటురక్తసిక్తాంగుఁడై వాయుసుతుఁడు
కోపించి మిక్కిలి కులశైలసదృశ
మౌ పర్వతంబెత్తి యసురులమీఁద
స్రుక్కక వైచినఁజూర్ణమై పడిరి
కొక్కులు బడిగుంటఁగూలుచందమున.
వాయునందనుఁడంత వారి సైన్యముల
నా యంతకుఁడువోలె నడఁగించునపుడు
పడుకరుల్‌ చెడుహరుల్‌ పఱచుకాల్బలములఁ
గడతేఱు తేరులుఁగలఁగుశూరులును
మడియుమహారథుల్‌ మ్రగ్గుసారథులుఁ
బొడియైనశస్త్రముల్‌ పొలియునస్త్రములుఁ
గూలెడు163 మావతుల్‌ క్రుంగురావుతులు
దూలెడు గొడగులుఁద్రుంగుపడగలుఁ
బఱచునెత్తురుటేర్లు బహుమాంసములకు
నఱు గ్రమ్ముభూతంబులై రణంబొప్ప
క్షణమాత్రమున వారిఁజంపి వాయుజుఁడు
రణకాంక్ష మఱియుఁదోరణమెక్కియుండెఁ.
బంచసేనాగ్రగుల్‌ పంచత్వమంది
రంచును హతశేషు లయ్యెడఁదెలుప[వా.రా. సర్గ 46]

  1. ↑మంత్రి
  2. ↑మంకించి
  3. ↑తఱిమి
  4. ↑పెళపెళ
  5. ↑బెళిదమై వెస
  6. ↑సేసి
  7. ↑ద్రుంచి
  8. ↑శర
  9. ↑హస్తుని
  10. ↑పావనుఁడైన
  11. ↑కుంఠితవరశక్తి
  12. ↑పైఁబు
  13. ↑పెరిగి వాలమున, పెఱికి పేటాడి
  14. ↑శర
  15. ↑కథిత
  16. ↑మలయుచు
  17. ↑జూచి
  18. ↑యుగము
  19. ↑శైలము, వాలము
  20. ↑బలుక
  21. ↑బలుక
  22. ↑యత
  23. ↑కట్టి
  24. ↑దనుకంగ
  25. ↑దారుణధ్వనుల
  26. ↑నురము
  27. ↑తోడ
  28. ↑వడి వారు
  29. ↑మావుఁతుల్‌
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )