| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
కొనిపోయి చంపుఁ డీ క్రోఁతికీటంబు.” నని ప్రహస్తునిఁబంప నసురేశుఁజూచి[వా.రా. సర్గ 51] వినయభాషణుఁడు, వివేకభూషణుఁడు, ననఘపోషణుఁడు, మత్తారిభీషణుఁడు, ఆ విభీషణుఁడు కార్యము దీర్ఘచింత భావించి చూచి యేర్పడ విన్నవించె: “వలనొప్పఁబతి పంప వచ్చినదూత 188లలుకమై నేమైన నాడుచునుందు; రది దూతలకు ధర్మ; మది విచారించి మదిఁగోప మొక్కింత మట్టు గావింపు. తుది దూత లెందు వధ్యులుగారు గాన పొదివి యీ క్రోఁతిఁజంపుట పాఁడిగాదు. చలముఁగోపము రామసౌమిత్రులందు వెలువరింపుము; వీని విడిచి పోనిమ్ము. మగుడని కిన్క నీ మది నుండెనేని తగినదండము కొంత దండించి పుచ్చు.” మని నీతి చెప్పిన నతని వాక్యములు విని రావణుఁడు దైత్యవీరులఁజూచి:[వా.రా. సర్గ 52] |