| ఇతిహాసములు | రంగనాథరామాయణము | సుందరాకాండము |
|
జగతీశుఁడగు రామచంద్రునంఘ్రులకు నగచరుల్ దండప్రణామముల్ సేసి తదనంతరము సుమిత్రాతనూజునకుఁ బిదప నర్కజునకుఁబ్రీతితో మ్రొక్కి యందఱుఁగొనివచ్చి హనుమంతు నపుడు ముందఱ నిడికొని ముదము దీపింప శ్రీరామచంద్రుని సింహాసనంబు చేరువ నోలి నాసీనులైయుండ; వలనొప్పఁదమపోయివచ్చిన తెఱఁగు దలకొని వినఁగోరు ధరణీశుతలఁపు హనుమంతుఁడెంతయు నాత్మలో నెఱిఁగి ఘనమైన భక్తితోఁగరములు మొగిచి: “కమలాప్తకులనాథ! కంటి వైదేహిఁ బ్రమదాశిరోమణిఁ బరమకల్యాణి ధరణీశ! నీ యాజ్ఞఁదల మోచికొనుచు నరుదైన దేశంబులన్నియు వెదకి చిరశక్తి సంపాతిచేఁద్రోవ యెఱిఁగి యరిగి సముద్ర మే నవలీల దాటి యొనర దక్షిణవార్ధి నున్నతమహిమఁ దనరు త్రికూటాద్రిఁదద్దయు నొప్పి దానవకులపాలితంబైన లంక యే నొక్కరుఁడఁజొచ్చి యెల్లచో వెదకి ధరణిజఁగానక తద్దయు వగచి యరిగి రావణునియుద్యానంబుఁజొచ్చి పరికించి రాక్షసభామలు దన్నుఁ దిరిగి చుట్టును నుండ, దేవ! మీ దేవి యుపవాసములఁగ్రుస్సి యొక మ్రానిక్రింద విపులదుఃఖంబులవెల్లిలో మునిఁగి చెక్కిటఁజేయూఁది చిత్తంబులోన నెక్కొన్నవగలతో నినుఁదలంచుచును దనుజుఁడు సనుదెంచి 207దండించు తెఱఁగు తన దిక్కులేమికిఁ దలపోసి పోసి యుడుగక కన్నీళు లోరంతప్రొద్దు వడియ నిట్టూర్పులు వడిఁ బుచ్చి పుచ్చి మాసినచీరతో మలినయై ధూళి ధూసరితాంగియై తూలి కైవ్రాలి తలయూఁచి తలయూఁచి తలకొన్నవగలఁ బలుమాఱు వ్రేఁగుచుఁ బలవింపఁ జూచి మీనాక్షి చిహ్నముల్ మీరు నాతోడ నానతిచ్చిన జాడలన్నియుఁ జూచి క్రమమున మఱి సీతగా నిశ్చయించి కమలాక్షిఁబిదప డగ్గఱిపోయి మ్రొక్కి తామరసాక్షితోఁ దగుమాటలాడి లేమకు మీ యంగుళీయకం బిచ్చి మగువశిరోమణి మఱి పుచ్చుకొనుచు జగతీశ! యే నిట జలధి లంఘించి వచ్చితి నే.” నని వసుధాధిపతికి నచ్చుగా సతివియోగాగ్నికీలలకు మ చ్చిదియన నొప్పు మాణిక్యమిచ్చె నిచ్చిన నా రత్న మేర్పడఁజూచి[వా.రా. సర్గ 65] యనురాగమున దాని నల్లనఁబుచ్చు కొని డెందమునఁజేర్చుకొని మూర్ఛఁబోయి యొకకొంతప్రొద్దున కొయ్యనఁదెలిసి ప్రకటధైర్యంబునఁబ్రాణముల్ నిలిపి నృపతిబాష్పాకులనేత్రుఁడై చూచి కపినాథు సుగ్రీవుఁ గరమర్థిఁబలికె: “భానుజ! నా ప్రాణపదమైన యట్టి మానినీమణి శిరోమణి చూచినపుడె నా మది కరఁగుచున్నది లక్కవోలె. నీ మణి మా మామ కిచ్చె నింద్రుండు యాగసంతృప్తుఁడై యాత్మలో మెచ్చి; యా గుణనిధి జనకావనీవిభుఁడు నట్టి యా మణి సీతయౌఁదల వేడ్కఁ గట్టి పెండిలి సేసెఁగరమర్థి నాకు; నన్ను లతలమిన్న యైన యా సీత నెన్నఁడు నెడఁబాయ దీ208మణి; నేఁడు నాతిని నన్ను మన్ననఁగూర్పవచ్చు దూతిక యన సిరుల్ దులకింప వచ్చె,” ననియని యందందయక్కునఁ జేర్చి హనుమంతు మఱియును నట చూచి పలికెఁ “బరమపుణ్మాత్మక! పవనజ! నీవు మరలి యేతెంచుచో మగువ యేమనియె[వా.రా. సర్గ 66] జెప్పుమేర్పడ.”నన్న శ్రీరాముఁజూచి చెప్పంగఁదొడఁగె నంచితసత్త్వధనుఁడు: “ఎడపనివగలతో నే నొక్కభంగిఁ గడపితిఁబదినెలల్ కాకుత్థ్సుఁ బాసి. చలమూఁది రెండుమాసములకుఁ బిదపఁ బెలుకుఱ నన్నుఁ జంపెదనన్నవాఁడు రావణుఁ;డటు గాన రామభూపతికి నే విధిఁ దన జీవమిటమీఁద నిలువ దని విన్నపము సేయు మనియె;మా తండ్రి తను సత్యధనుఁడని తగ నిచ్చినపుడు విలసిల్లుకల్యాణవేదిపై నుండి వలనొప్ప నగ్ని దేవర సాక్షిగాఁగఁ గరమర్థి నన్నెల్లకాలంబు విడువ కరసి రక్షించెద నని తెచ్చె; నన్ను నరయకుపేక్షించె; ననదఁగాఁజేసెఁ బరికింపఁడని విన్నపముసేయు మనియెఁ. దక్కక చనుదెంచి తన ధర్మపత్ని నొక్కఁడెత్తుకపోవ నూరకయునికి మహిలోన వీరధర్మము గాదుగాన విహితమంతయు విన్నవించితిఁగాని, వలనొప్ప నా మనోవాక్కాయకర్మ ములు పూని తనయందె పొంది వర్తించు నెనయంగ నా యొడలెందుండెనే 209ని నని విన్నపము సేయు మనియె నద్దేవి. తనుఁజిత్రకూటాద్రిఁదగ నొక్కకాకి చెనకుటయును, మనశ్శిలచేత మీరు లీలతో మకరికల్ లిఖియించుటయును, శీలించి గుఱుతుగాఁజెప్పి నన్ననిచె.” నని లక్ష్మణునితోడ నర్కజుతోడ జనకజపలుకులు సకలంబు సెప్పెఁ. జెప్పినఁగపివీరసింహంబులెల్ల నప్పుడు దమలోన హర్షించి రంత.[వా.రా. సర్గ 67, 68] నని యాంధ్రభాష భాషాధీశనిభుఁడు వినుతకావ్యాగమవిమలమానసుఁడు * * * నసమానలలితశబ్దార్థసంగతుల రసికమై చెలువొందు రామాయణమునఁ బరగనలంకార భావనల్ నిండఁ గరమొప్పుసుందరకాండంబు సెప్పె. నారూఢి నార్షేయమై యాదికావ్య మై రసికానందమై యెల్లనాఁడు * * * లెందాఁక వేదంబు లెందాఁక దిశలు నెందాఁక భువనంబు లేపు దీపించు నందాఁక నీ కథ యక్షరానంద సందోహదోహళాచారమై పరగు. |