ఇతిహాసములు రంగనాథరామాయణము సుందరాకాండము
మధువనమందు వానరులు విహరించుట
“మనమింక సుగ్రీవుమధువనంబునకు
నెనసినకడఁకతో నేఁగి యందఱముఁ
దనివోవఁదేనియల్‌ ద్రావకయున్న
మనదప్పి పోదని మది విచారించి:
“యినకులాధిపుపనులెల్ల సాధించి
చనియెద.మటుగాన జలజాప్తసుతుఁడు
మనమీఁదఁగోపించి మర్దింప వెఱచు.”
నని నిశ్చయముసేసి యందఱుఁగూడి
హనుమంతు204నంగదు నపుడు ప్రార్థించి
యనుకూలముగ వారి యనుమతి వడసి
యాతతబలులు మధ్యాహ్నంబుకొలఁది
కేతెంచి మధువనంబేపుమైఁజొచ్చి
దిక్కుల వెదచల్లు తేనెతావులకు
గ్రుక్కిళ్లుమ్రింగుచు గునిసియాడుచును
గొనసెవుల్‌ ఱిక్కించి కొక్కిరింపుచును
గినిసి యొండొరులఁదర్కించుచు వేడ్క
లెనయంగఁదమతమ కిష్టంబులైన
వనభూములకుఁబాఱి వనచరాధిపులు
ధీనిధుల్‌ మఱి పూవుఁదేనియల్‌ జుంటి
తేనియలును బుట్టతేనె మున్నైన
పలుదేనియలు గ్రోలి ఫలములు నమలి
కలయఁబూవులు రాల్చి కాయలు డుల్చి
తలిరుఁగొమ్మలు ద్రుంచి తరుకోటి వంచి
మలయుచుఁగొమ్మకొమ్మకు దాటిదాటి
యొలసి పూఁదీగల నుయ్యల లూఁగి
కొలఁకులఁగ్రీడించి కూడి వర్తింప
నా లోన దధిముఖుండనఁగ నా వనము
పాలించుచుండెడుప్లవగుఁ డొక్కరుఁడు
అసమానకోపుఁడై యందఱఁగినిసి
వెసఁదమ్ముభర్జించి“వెడలిపొం.”డనుచు
వనపాలకులచేత వరుసఁద్రోయింప
వనచరుల్‌ వెసఁబాఱ వారి వారించి
వడి నంగదుండును వాయునందనుఁడుఁ
దడయక దధిముఖు ధరణిపై లీలఁ
గెడపి బెట్టుగ మోము క్రిందుగా నీడ్చి
పొడిచి త్రోచుటయును బొలుపేది వాఁడు
కోపించి మొఱవెట్టుకొనుచును బోయి
భూపాలుపదపద్మములకు లక్ష్మణుని
శ్రీపాదములకు సుస్థిరభక్తి మ్రొక్కి
యా పద్మహితసూనునడుగుల కెఱఁగి:
“దేవదానవులకు దృష్టింపరాదు
దేవ! నీ వనమెల్లఁ; దేజంబు205మెఱసి[వా.రా. సర్గ 61, 62]
పెనఁగొని వనచరుల్‌ పెక్కండ్రతోడఁ
జనుదెంచి యసమానసత్త్వులై కూడి
యా మరుత్తనయుండు నా వాలిసుతుఁడు
నీ మధువనములోనికి నేఁడు వచ్చి
తగిలి మ్రాఁకులు వ్రాఁకి తరుశాఖ లలమి
తిగిచి పండులు దిని తేనియల్‌ గ్రోలి
యిది రాచవనమని యిచ్చ భీతిలక
కుదియక యింత గైకొనకున్నఁ జూచి
యెడపక జంకించి యేను మీ యాన
పొడిచి త్రోచుటయును బొడిచిరి నన్ను.”
ననివాఁడు మొఱయిడ నలిగి సుగ్రీవుఁ
డెనసి మర్దింప నూహించినఁ జూచి
యంత నా వృత్తాంత మంతయు నెఱిఁగి
సంతతజయశాలి సౌమిత్రి వలికెఁ:
“దొలఁగక యంగదాదులు మహాకపులు
నెలకొని సుగ్రీవ! నీ యాజ్ఞ వ206నము
తలఁకింతయును లేక తమయంతఁ జొచ్చి
నలిఁదేనె ద్రావుచున్నారేని వినుమ!
యాతతభుజశక్తులగు వారిచేత
సీతాధిపతి పనుల్‌ సిద్ధింప నోపుఁ;
గాకున్న నీ యాజ్ఞ గడవ నోపుదురె?
కైకొని పిలిపింపు కడఁకతో వారి.”
నని బుద్ధిసెప్పిన నర్కనందనుఁడు
తన బుద్ధిఁగైకొని దధిముఖుఁ జూచి
“శ్రీరాముకార్యంబు సేసిరి; కాన
వారిచేసినచేఁత వారికిఁ జెల్లె.
నూరక యీ శోక ముడిగి నీ వింక
వారిఁబుత్తె.” మ్మన వాఁడంత నరిగి
హనుమంతు నంగదు నా జాంబవంతుఁ
గని మ్రొక్కి:“తన తప్పుఁగాచి మన్నించి
వనచరోత్తములార! వడి నేఁగుఁడింక;
వనములోపల నుండవలవదు మీరు;
మిమ్ముఁబుత్తెమ్మని మిహిరతనూజుఁ
డిమ్ముల నా కానతిచ్చి పుత్తెంచె.”
ననువార్త సెప్పిన నందఱు నుబ్బి
యినసూనునాజ్ఞకై యెడఁ గొంకువాలి
తనయుని నూరార్చి తడయక పేర్చి
వనచరాధీశులు వనభూమి వెడలి
యుప్పొంగుకడఁకల నుప్పరంబెగసి
యప్పుడు మేఘంబులట్ల మ్రోయుచును
వారక చనుదెంచువారి చిహ్నములు
దూరంబునందె సంతోషించి చూచి
యినజుండు గపిసేన నెదురుగాఁబంచి
యనురక్తి రప్పింప నర్థితో వచ్చి[వా.రా. సర్గ 63, 64]

  1. ↑నుతియించి య
  2. ↑సెఱచి
  3. ↑లన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )