ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
మారీచాదులు కుబేరుతోఁ బోరుట
అని పల్క మారీచుఁ డాదిగా నప్పు
డనికి రావణమంత్రులందఱుఁ గడఁగి
పొరిఁ గుబేరునితోడఁ బోరి వీఁగుటయుఁ
బరుషవిక్రముఁడైన పఙ్క్తికంధరుఁడు
నట్టహాసముతోడ యక్షేశుఁ గదియఁ
గట్టల్క నాతఁడు గదఁ ద్రిప్పి వేసెఁ
దలఁకక దారుణద్వందయుద్ధంబు
బలువిడిఁ జలిపి రప్పౌలస్త్యు లపుడు
నెలకొని ధనదుఁ డాగ్నేయాస్త్రమేయ
లలి వారుణాస్త్రంబు లంకేశుఁ డేసె
నొలసి రారాజు వాయువ్యాస్త్రమేయ
నలి నిశాచరపతి నాగాస్త్రమేసె
మఱియును బహుదివ్యమార్గణావళులు
పరఁగ నేయుచును నప్పౌలస్త్యవరులు
పైపైని మాయలు పన్ని శార్దూల
మై పోరి సూకరమై యాక్రమించి
జలదమై శలభమై జలధియై తోచి
యలుకతో నర్కుఁడై యట దైత్యుఁడగుచు
నేపున వడి నిట్లనేకంబులైన
రూపముల్‌ గైకొని రోషంబుతోడ
నడరి విజృంభించి యతనిచే వేటు
పడి యాకుబేరుండు బలుమూర్ఛఁ గదిసి
నిండి పైపైఁ గ్రమ్ము నెత్తుట దోఁగి
ఖండితాశోకవృక్షము భంగిఁ బడియె
నెలకొని తొమ్మిది నిధులును ధనదు
వలతురై నందనవనములోపలికిఁ
గ్రమ్మరఁ గొనిపోవఁ గదిసిన మూర్ఛ
నిమ్ముల నట తేర్ప నిట రావణుండు
అక్షీణభుజబలం బచ్చెరువార
యక్షాధిపతిఁ గూర్చి హర్షంబుతోడ
నసమానజయకరానల్పశిల్పముల
పసను గాఁదీర్చిన పసిఁడికంబములఁ
బ్రచురప్రభాజాల బహువిధరత్న
ఖచితంబులగుచున్న లగుతోరణములు
కలితముక్తాదామకము లొప్పు కామ్య
ఫలదంబులగు దివ్యపాదపంబులును
లసితోర్వుమాణిక్యలలితంబులైన
పసిఁడి సోపానముల్‌ పసిఁడివేదికలు
మానుగాఁ జూడ్కికి మానసంబునకు
నానందమొనరించు నరుదుచందములఁ
గలయ నొండొంటికిఁ గడువింతలగుచుఁ
జెలువొంద నానావిచిత్రచిత్రములు
ఘనమనోవేగంబుఁ గామరూపంబు
ననవద్యమహిమయు నాకాశగతియుఁ
గలిగి దివ్యుల మోవఁగా నొప్పుఁ గలిగి
నెలకొని బ్రహ్మచే నిర్మింపఁబడిన
తనదు పుష్పకము నుద్దామదర్పంబు
తనరఁ గైకొని యెక్కి తారాద్రి డిగ్గి
ఘనమైన కాంతితోఁ గార్తికేయుండు
జననంబునొందిన శరవణంబునకు
నరిగి పుష్పకరశ్ము లడరి వెలుంగ
నరవిందబంధుఁడో యన నద్రినెక్కి
యొక్కవనంబట నొప్పారఁ గాంచి
యక్కడఁ బుష్పకం బరుగకుండుటయు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )