ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
రావణుఁడెక్కి వెళ్లు పుష్పకము నిలిచిపోవుట
సచివులఁ జూచి యాశైలంబుమీఁద
నిచట పుష్పకమాఁగె నెవ్వఁడో యనఁగ
మదిలోన నూహించి మారీచుఁడనియె
నిదియొక్కనెపము లేకిట్లేల నిలుచు
ధనదుఁ డాఁగెనో యొండె ధనదునిఁగాని
తనర నన్యుల నిదిదాల్పదో యనఁగఁ
గుఱుచచేతులతోడ గుజ్జురూపంబు
మెఱయ నందీశుఁ డామృడునకుఁ బ్రియుఁడు
పౌలస్త్యుఁ గిన్కతోఁ బల్కె నీవిచటి
కేలవచ్చినవాఁడ విటుశంకలేక
నిది మహాదేవుని యేకాంతభూమి
కదియరా దీయద్రి కడువేగ దిగుము
గరుడోరగామరగంధర్వయక్ష
వరనిశాచరభూతవర్గంబులందు
నెందును నెవ్వరు నీపొంతఁ బోరు
నిందు నీవేతేర నెవ్వఁడవనిన
నిందుశేఖరుఁ డెంత యీకొండయెంత
నిందు నన్వారింప నెవ్వఁడు గలఁడు
త్రిణయణుతోఁ గూడఁ దృణలీలఁ గేల
బెనసి యీశైలంబుఁ బెఱికివైచెదను
అని పుష్పకము డిగ్గి యచలంబు మొదలి
కనుపమభుజబలం బరుదారఁ జేరి
గిరిచరాననముతో గిరిజేశు కెలన
నిరవంద నున్న నందీశ్వరుఁ జూచి
మేఘ ముఱిమిన భంగి మిన్నెల నద్రువ
నాఘనభుజుఁ డట్టహాసంబు సేయ
మృడునకు మాఱట మృడుఁడైన యతఁడు
కడునల్క నాపఙ్క్తికంఠుతో ననియె
నగచరాననుఁడని ననుఁ జూచి పెలుచ
నగితి గావున దశానన నీవు నింక
నాయతభుజములు నరుదుకోఱలును
నాయుధంబులుగాఁగ నతిశూరులగును
నడగొండ లనఁదగు నగచరోత్తములు
కడిమిమై నీ కులక్షయముఁ గావింపఁ
బుట్టెద రిటమీఁద భువనంబు లలరఁ
బుట్టి నీగర్వంబుఁ బుచ్చివైచెదరు
నీవు సేసినయట్టి నిష్ఠురపాప
మీవిధి నినుఁ జంపు నే నినుఁ జంప
నని పల్క నామాటలివి లెక్కగొనక
తనరిన కిన్కతో దశకంఠుఁడనియె
నిచట నీపుష్పకమెవ్వని శక్తిఁ
బ్రచలింపకున్నది ప్రభువునుబోలె
నీయద్రి లీలమై నెవ్వఁ డున్నాఁడు
పాయక నాగర్వపర్వతారూఢు
మన్నింపఁదగువారి మన్నింప నేర
కున్న ధూర్జటి దంబుడిపెద ననుచుఁ
బృథుశక్తిరజతాద్రి బిగియారఁ బట్టి
పృథివి వేయఁగ నూఁచి పెల్లగించుటయు
నాకొండ కంపించె నందున్న ప్రమథు
లాకంపమును బొంది రాకంపమునకు
శైలేంద్రపుత్రియుఁ జంద్రశేఖరుని
నాలింగనముచేసె నతిభీతితోడ
నంత మహాదేవుఁ డాదేవదేవుఁ
డంతయు నెఱిఁగి పాదాంగుష్ఠమునను
లఘులీల నది భూతలంబున కొత్త
రఘునాథ యంత నారాక్షసేశ్వరుఁడు
చండంబులగు శిలాస్తంభోరుబాహు
దండముల్‌ గదియంగ ధరతోడఁ గదియ
నాకొండ వడినొత్త నటమీఁది కెత్త
లేక చేతులు దీయలేక వాపోయి
పిడుగులు వడునట్టి పెనుమ్రోఁత గాఁగ
విడువక యుబ్భంగి వేనోళ్లు నొరల
నతని మంత్రులు వెఱఁగంది చింతింప
నతిభీతి చలియించె నఖిలలోకములు
నింద్రాది దివిజుల హృదయముల్‌ గలఁగెఁ
జంద్రసూర్యుల గతుల్‌ చలియించె నంతఁ
జిత్తంబుఁ దయఁ బెంది చిత్తజారాతి
యొత్తి యాయంగుష్ఠ మొక్కింత వదల
ఘనభీతిఁ జేతులు గ్రమ్మునఁ దిగిచి
కొనియున్న యమరారిఁ గొమరారఁ జూచి
విను దశగ్రీవ నీ విక్రమంబునకుఁ
బెనుపైన ధృతికిని బ్రీతుండనైతి
భువనంబులన్నియఁ బోరి భయంబంద
రవముచేసితి గాన రావణాహ్వయము
నీకు సార్థకమయ్యె నిఖిలలోకముల
నీకారణంబున నీపేరఁ బరఁగు
నని ప్రీతుఁడై పల్కి యమ్మహాదేవుఁ
డనురాగమునఁ జంద్రహాసంబునిచ్చి
యరయంగ ముమ్మాఱు నతిసత్త్వవృత్తిఁ
బరఁగంగ బనిసేయుఁ బ్రతివీరులందు
నింతనుండియు నీకు నీ సాధనంబు
పంతమెడలఁ బోవుఁ బౌలస్త్య యింకఁ
బొమ్మెందువలసినఁ బుష్పకంబెక్కి
సమ్మదంబున ననుజ్ఞాతుండవైతి
నాచేత ననుడు నానాగభూషణున
కాచేతులటు మోడ్చి యతిభక్తి మ్రొక్కి
యలరుచు నవ్విమానాధిరాజంబుఁ
బొలుపారఁగా నెక్కి భూమిఁ గ్రమ్మరుచు
రాజుల కొందఱ రణభూములందుఁ
దేజంబు లలరంగఁ దివిరి భంగించుఁ
బరిమార్చుఁ గొందఱ బలసమేతముగ
శరణన్న గొందఱ సైఁచి మన్నించు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )