ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
కార్తవీర్యుఁడు రావణుని బంధించుట
దన పురంబునకు నాదశకంఠుఁ బట్టి
కొనిపోవ తెలివిఁ గైకొని ప్రహస్తుండు
పరిపంథిచేఁ బట్టువడి కట్టుఁబడిన
సురవైరి దైన్యంబుఁ జూచి కోపించి
వెస సేనతోఁ గార్తవీర్యునిఁ దాఁకి
వసుధేశ నిలు నిలు వలనుగాదింక
విడు విడు దశకంఠు విపులదర్పమున
విడువక పోరాదు వినుము నా యెదుర
నని పల్క రాక్షసులందఱుఁ గడఁగి
మునుకొని ఘనశూల ముసలాయుధముల
గనుకని వైవ నాకైదువ లొడిసి
తన వేయుచేతులఁ దగులంగఁ బట్టి
వానిన గైకొని వడి వారిఁ దోలి
యానరేంద్రుఁడు వోయె నట పురంబునకు
వింతయు సుతునిచే నెఱిఁగి పౌలస్త్యుఁ
డెంతయుఁ జింతించి హృదయంబులోన
బరికించి మనుమనిపైఁ గూర్మి కలిమి
తిరముగా మాహిష్మతీపురంబునకు
నలువార నేతెంచి నగరి వాఁకిటను
వెలుఁగు భానుఁడువోలె విలసిల్లుచుండ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )