| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యెల్లభూములమీఁద నేగి భూపతుల నెల్ల సాధించుచు నేపున మఱియు బలవైరిపురముతోఁ బాటియై ధరణిఁ బొలుచు మాహిష్మతీపురమున కరిగి కార్తవీర్యునితోడఁ గయ్యంబుఁ జేసి కీర్తనీయంబగు గెలుపుఁ గైకొనఁగ నే వచ్చినాఁడ మీరింత వేగమున నీవార్తయతనికి నెఱిఁగింపుఁ డనిన నారాజమంత్రులు నావాక్యములకు నారావణునిజూచి యతనితో ననిరి విటపివాటికలొప్పు వింధ్యాద్రిచెంత నటదూర్మియగుచున్న నర్మదలోనఁ దరుణులతోఁ గూడఁ దగిలి మారాజు సరి జలక్రీడలు సలుపుచున్నాఁడు ఆహవోద్యోగంబు నతనితో నేల బాహుపరాక్రమభవ్యుఁ డాఘనుఁడు తెలియ నేరవు మృత్యుదేవతయైన వెలువడునే కార్తవీర్యుని దొడరి వలవదాతనితోడ వైరంబు నీకుఁ దొలఁగి బ్రతుకుమిట్లు దొల్గవేనియును ఇంతకువచ్చు నొక్కింతయు నిలుము యంతకు సైఁచ వే నచటికిఁ జనుము అనవుడు నామాటకప్పుడె కదలి తనరిన కిన్క నాదశకంఠుఁ డరిగె నింగితో నొరయుచు నిబిడోరుమేఘ సంగతి శృంగముల్ సరి వేయు మెఱయ మదగంధములఁ బెక్కు మరగింపు కరులు వదలక చరియించు వనవీథులొప్పఁ పరుషకంఠీరవ భైరవారావ భరితంబులై గుహాభవనముల్ మెఱయఁ బొలుచు సానువులపైఁ బొడవున నుండి చెలఁగుచుఁ బఱతెంచు సెలయేఱు లమర లీలమై నచ్చరలేమల తోడఁ గేళిసల్పుచు నోలి కిన్నరోత్తములు ఘనులైన సురలును గంధర్వవరులుఁ దనుజపుంగవులు విద్యాధరాదులును ననువార నుండుట నాకలోకమున కెనవచ్చు పెంపున హిమగిరిఁ బోలి వినుతింపఁదగిన యావింధ్యాచలంబుఁ గనుఁగొంచు వింధ్యోపకంఠదేశమున బహువిహంగాకుల పంకజాకరము మహనీయతర పశ్చిమప్రవాహంబు నగుచు దుప్పులు లులాయములు సింహములు మొగిఁ బులుల్ భల్లూకములు గజంబులును గట్లెండతాఁకునఁ గదుపులై చొచ్చి మట్టాడి కలఁచిన మడువులు గలిగి వర్ణింప నెత్తమ్మి వదనమై కలువ కర్ణావతంసమై కదియు జక్కవలు కుచములై బొదిగొన్న కొదమతుమ్మెదలు కచభారమై చారుకైరవస్ఫురణ దరహాసమై తుంగతరసైకతంబు భరితనితంబమై పరఁగు ఫేనంబు వెలిపట్టుపుట్టమై వెరవార మెఱయఁ గలహంసమాలిక కాంచియై పొలుచు నధికారుణద్యుతి నమరు బంధూక మధరమై సుడి నాభియై తరంగములు భ్రూలతలై లీలఁ బొలియు మీనంబు లాలోలనయనంబులై తావులెసఁగు హల్లకంబులమీఁద నందంద తిరుగు నొల్లని తనువాయు వూర్పులై కవియ రోలంబములచే సరోరుహవళుల రాలు పుప్పొడి యంగరాగమై మెఱయఁ బైకొన్న కేసరపఙ్క్తులు తొడవు లై కనుఁగొన నుత్తమాంగన భంగి వివిధవిలాసముల్ వింతలై మెఱయు నవపద్మగంధి నానర్మదఁ గనియెఁ గని పుష్పకము డిగ్గి కదియ నేతెంచి తనరారు ముదమునఁ దత్తీరభూమిఁ జెన్నొంది బహుపుష్పసేవితంబగుచు నున్న సైకతవేది నొప్పఁ గూర్చుండి యతినిర్మలంబగు నంబుప్రవాహ మతులపావనలీల నమరంగఁ జూచి మంత్రులతోడను మనకిందు వలయు మంత్రపూతములైన మహితకర్మములు నచలైకనిష్ఠతో నంగజారాతి నిచట నారాధింప నేను గోరెదను దన వేయురశ్ములఁ ధరణి పంపంగ నినుఁడు నభోమధ్య మిదె చేరవచ్చెఁ దెల్లంబుననుఁ జూచి తీవ్రత మాలి చల్లనై యున్నాఁడు చంద్రుఁడుఁ బోలె దళమైన మకరందధారలఁ దోఁగి పొలుపారఁ బవనుండు పొలయుచున్నాఁడు ఆలోలగతి వీచు లాడంబరంబుఁ జాలక మీనప్రచారంబు లేక మది భీతిఁ బొందిన మగువ చందమున యిది చూడుఁడున్నది యిమ్మహాతటిని బెక్కండ్రు రిపులతోఁ బెక్కుకయ్యముల నక్కజంబుగఁ బోరి యాతతక్షతులఁ దొరఁగు పెన్నెత్తుట దోఁగి యుద్ధూత ధరణి రజోలిప్తతనులైన మీరు నీపుణ్యజలముల నెలమిఁ గ్రీడించి వే పోయి కొనిరండు వివిధపుష్పములు మనసున కింపుగా మహనీయలీలఁ దనరారు నీసైకతంబుపై నమరఁ జంద్రబింబమునకు సరి వచ్చుఁ నేఁడు చంద్రశేఖరుఁడు ప్రసన్నుఁడై నన్నుఁ గరుణించునని పఙ్క్తికంఠుండు వలుక సొరిది మారీచుండు శుకుఁడు సారణుఁడు ధూమ్రాక్షుఁడును ప్రహస్తుఁడు మహోదరుఁడు తామ్రలోచనరుచుల్ దట్టమై నిగుడ దివిరి మందాకిని దిక్కుంజరంబు లవగాహ మొనరించునట్టి చందమున బూతనిర్మలవారిపూరంబునైన యాతరంగిణిఁ జొచ్చి యనురాగ మెసఁగ సరి జలక్రీడలఁ జల్పి నల్గడలఁ బరికించి పరమేశ! భరితంబులైన మవ్వంపు మధువులు మధుపముల్ గొనని క్రొవ్విరుల్ గొనివచ్చి కొండగాఁ బోయ నర్మదానదిఁ గృతస్నానుఁడై వెడలి నిర్మలమతి రజనీచరాధిపుఁడు సముచితంబగుచున్న సైకతంబునకు నమర నేతెంచి రమ్యప్రదేశమునఁ జెన్నైన బహురత్నచిత్రపీఠమునఁ బన్నుగాఁ దాఁ గొల్చు పసిఁడిలింగంబు నలువొంద నిడి గంధనవపుష్పదీప విలసిత ధూపనైవేద్యాది విధులఁ బాటల నాటల బహువాద్యగతులఁ బాటించి పార్వతీపతి భక్తితోడఁ పూజింపఁ దొణఁగెఁ దత్పూజాకలాప మోజతోఁ బరిపూర్తి నొందించెనేని యాజి నెవ్వనినైన నవలీల గెల్చుఁ బూజకు విఘ్నంబు వుట్టిన నోడు నతఁడు మదోన్మత్తుఁడౌట నీతెఱఁగు మతి విచారింపక మదనారిఁ గొలువ నామహానదిలోన నట పశ్చిమమునఁ గామినీజనులతోఁ గార్తవీర్యుండు జలకేళి సలువుచుఁ జటులదర్పమున మెలసిన తన సత్త్వమెఱుఁగఁగఁ దలఁచి సేతువు చందమై చేతులు వేడ్క నాతతంబుగ నీటికడ్డము సాఁప మడువుల గల గంధమకర నక్రాదు లెడలు దప్పఁగఁ బూర మెదురు దొట్టుటయుఁ బులినముల్ మునుఁగంగఁ బొరిఁ బొరిఁ బక్షి కులములు నెగయంగఁ గూలముల్ గూల వానకాలమునాఁటి వడువునఁ బేర్చి ఫేనమాలికలతోఁ బెనుప్రవాహంబు పూజ దీరకమున్నె పుష్పగంధాది పూజోపకరణముల్ పూజలతోడ వడి నెత్తుకొనిపోవ వాసవారాతి కడువిస్మయంబంది క్రమ్మఱ లేచి పూజకు మునుకొని ఫుల్లప్రసూన రాజి దక్షిణహస్తరాజి రాజిల్ల వామహస్తంబున వడిఁ బట్టి విడచు నామహావాహిని నలుకతోఁ జూచి కరమొప్పఁ బశ్చిమగామిని యగుచుఁ బరఁగ నన్నది తూర్పువాఱంగఁ దొణఁగె నిది యేమిచిత్రమో యీతెఱంగెల్ల విదితంబుగాఁ జూచి వేగ రండనుచు శుకసారణుల దిక్కు చూచి పంచుటయు నకుటిలచిత్తులై యాసహోదరులు వరుణదిగ్భాగంబు వదల కాకసము నరయోజనంబేగి యనతిదూరమున వాహినివేగంబు వారించుచున్న బాహాసహస్రంబు భయదమై మెఱయ లోనేచు మదమున లోచనాంతంబు లీనిన కెంజాయ లొగి పెల్లు నిగుడ రామాకుచాఘాత రంగత్తరంగ కోమలక్రీడల క్రొమ్ముడి వీడఁ దామసగుణ మేచి తమకంబుతోడఁ గామాతురుండునై కాంతల నడుమ కరిణీగణాన్విత గజరాజలీల సరి జలక్రీడలు సలుపుచునున్న యానరేంద్రుని జూచి యచ్చెరువారు మానసంబులతోడ మరలి యేతెంచి రావణుఁ బొడఁగని రజనీచరేంద్ర యీవిధంబంతయి నెఱిఁగి వచ్చితిమి అతివలతో నొక్కఁ డనురాగలీలఁ జతురుఁడై జలకేళి చలిపెడు కొఱకు భీకరంబగుచున్న పృథుబాహుసంఘ మాకులంబుగ నేటి కడ్డంబు సాఁప నొదిఁగి పోఁ జాలక నుదకప్రవాహ మెదురు గ్రమ్మిన చంద మీచందమనిన నాతఁడు కార్తవీర్యార్జునుండగుట భాతిగా నెఱిఁగి యాపఙ్క్తికంధరుఁడు కలహంబునకుఁ బన్ని కడకతో నడువఁ బ్రళయమేఘధ్వని భంగి మిన్నద్రువఁ బరిగొని భూరేణుపటలంబు లెగయ విరిగాలి యెదురుగా వీవంగఁ దొణఁగె నంత నాదశకంఠుఁ డతఁడున్న యెడకు నెంతయు బలగర్వ మెసఁగంగ నేగి వనితలతో గీతవాద్యనృత్యంబు లనుభవించుచు నధికానురాగంబు నర్మోక్తులెసఁగ నానర్మదలోనఁ బేర్మిమై జలకేళిఁ బెంపొందుచున్న నక్షీణతేజు నయ్యర్జునుఁ గాంచి రాక్షసేంద్రుఁడు క్రోధరక్తాక్షుఁడగుచు మది నేచి యారాజుమంత్రులతోడ నొదవంగ నోరెత్తి యోమంత్రులార యిదె వచ్చినాఁడఁ దన్నెదిరింప నేఁడు కదనంబునకుఁ బఙ్క్తికంఠుండ నేను మీరెఱిఁగింపుఁడు మీరాజుతోడఁ బోరాదు నాతోడఁ బోరక తనకు ననిన నాయుధపాణులగుచు వారనిరి వినిపింప నిప్పుడు వేళగాదతఁడు జలకేళినున్నాఁడు సతులతోఁ గూడి యలరి యిప్పుడు గయ్యమడగ నీకగునే నేఁడింత సైరించి నిలుతు గాకెల్లి వేఁడిమి యార్చిన వేడ్క సల్పెడిని అదిగాక నేఁడు నీకాహవక్రీడ మదిఁ బ్రియంబగునేని మాతోడఁ బోరు మము గెల్చి మఱికదా మారాజుతోడ సమరంబు నీకన్న సైరింప కడరి యారాజుమంత్రుల నమరారిమంత్రు లారంగఁ దొడఁగి శస్త్రాస్త్రఘాతములఁ బరువడిఁ గెడసి తత్పలలరక్తములఁ బరితుష్టిఁ బొంది రాబలిమిఁ గన్గొనుచు నసమానగతి నాదశాస్యుడు సేచి ముసలగదాశూలముద్గరంబులను బలువిడి నొప్పించి బహుళమై కదిసి హలహల శబ్దంబు లందంద మెఱయ సర్వసేనల నోలి సమయింప నతని దుర్వారవేగంబు దూరస్థులెఱిఁగి వెసఁ బోయి యాకార్తవీర్యునితోడ వసుధేశ సేనతో వచ్చి రావణుఁడు మడియించుచున్నాఁడు మన సేననెల్లఁ గడక నాలింపుమా కలకలం బనిన కెలఁకులఁ బరికించి కేళి చాలించి మెలఁతల వెఱవక మీరుండుఁడనుచు నతులమదాటోప మదరంగ నుగ్ర గతి విరుద్గంగావగాహంబుఁ జేసి వెడలు నైరావతద్విరదోత్తమంబు వడువున నమ్మహావాహిని వెడలి వెడఁదకన్నుల రోషవిస్ఫులింగములు వెడలంగఁ గాలాగ్ని విధమున మండి కనకవేష్టితమైన ఘనగదాదండ మనువారఁగ గేల నమరించి మించి యోలిఁ జేతులనెల్ల నుజ్జ్వలాభరణ జాలాంశు లడరంగఁ జండాంశుఁ బోలి పటువీరరాక్షసబల మహాతిమిర పటలంబుఁ దోలుచుఁ బౌలస్త్యుఁ జూచి గద కేలఁ ద్రిప్పుచు గరుడవేగమునఁ గదియంగ నేతేరఁ గని ప్రహస్తుండు రయమార వింధ్యంబు రవి కడ్డువడిన క్రియ దోఁప నెడసొచ్చి కిన్కతో నిల్చి పూనిక ముసలంబుఁ బూన్చి వైచుటయు దాని గదాహతిఁ దప్పంగ జడిసి కడువడిఁ బఱతెంచి గద మీఁదికెత్తి బెడిదంపు లావున బిట్టు వ్రేయుటయుఁ గులిశభగ్నాచలకూటంబువోలె నలమిన మూర్ఛతో నతఁ డుర్విఁ బడియె నంత మారీచాదు లప్పాటుఁ జూచి గంతులై రణభూమిఁ గడచి పాఱుటయు నాహవక్రీడకు నడరి సహస్ర బాహుఁడు వింశతిబాహునిఁ గదిసె నుప్పొంగి లయవేళ నుజ్జ్వలమగుచు నొప్పారు సాగరయుగళంబు భంగి నడగొండలోయన నలి మదావేశ ముడుగని దిగ్దంతియుగము చందమునఁ దగ వెల్గు దినకరద్వంద్వంబు నోజ నొగి మండు దావాగ్నియుగ్మంబు భంగిఁ గవియు దర్పంబునఁ గడునేచి జెనయఁ దివురు కంఠీరవద్వితయంబు కరణి నిరువురు దమలోన నేపు దీపింప నురుబలాటోపంబు లొండొంటిఁ దొరయ నుద్దండభుజబలు లురుగదాపాణు లుద్దామగతులొప్ప నొండొరుల్ దాఁకి మండలీకృతగతుల్ మలఁగిపోవుటలు మండిపట్టుట లొడ్డి మాఱువ్రేయుటలు తప్పించుకొనుటలు దాఁటి పైఁ బడుట లుప్పరం బెగయుట లుత్తరించుటలు పాయుటల్ డాయుటల్ ప్రతిహతుల్ చెలఁగ వేయుటల్ జడియుటల్ వ్రేటులిచ్చుటయు వారక చెల్లంగ వడిఁ బోరిరిట్లు దారుణగతి సమద్వంద్వయుద్ధంబు వర్తించునప్పుడు వాసవారాతిఁ గార్తవీర్యుఁడు గదఁ గట్టల్క వ్రేయ మేఘంబుపై నొప్పు మెఱుఁగు చందమున నాఘోరగద యొప్పె నతని వక్షమున వెస దశగ్రీవుండు వ్రేయ నగ్గదయు వసుమతీనాయకు వక్షంబునందుఁ బరపైన కొండపైఁ బడిన మహోల్క వరుసను దీపించెఁ బరువడి మఱియు మేదిని చలియింప మెట్టిన ధూళి మేదురగతి నెక్కి మిన్నందుకొనఁగ లాఘవమెసగంగ లాగించు గతుల మేఘముల్ చెదరంగ మేటి యగ్గలిక దిగ్గజంబులు మ్రొగ్గఁ దివిరి భూతంబు లగ్గులమగు భీతి నందంద పఱవ దృగ్గోళకంబులఁ దివురు కోపమున నగ్గులు వెడలంగ నట్టహాసములు భగ్గంచు వెలుఁగులు భయద హుంకృతులు నగ్గించు పలుకులు నార్పులుఁ బెరయ బలుఁడు నింద్రుఁడు బోరు భంగి నిభంగి నలయక పోరుచో నయ్యర్జునుండు భీకరగతి బోని పృథుగదాదండ మాకసంబున మంట లంట నంకించి యానిశాచరు వైవ నతని పేరురము తో నది దాఁకి తుత్తనియలై పడఁగ నుఱక యాపాటున కుల్లంబుఁ గలిగి పిఱిదికి నొక వింటిపెట్టోసరించి పొదివిన మూర్ఛతోఁ బుడమిపై నతఁడు చదికిలఁబడుచోట సయ్యనఁ గదిసి పక్షీంద్రుఁ డురగమ్ముఁ బట్టిన కరణి నక్షీణబలమున నమరారిఁ బట్టి బలి నేచి విష్ణుండు బంధించునట్లు బలిమి బంధింప నా పటుశౌర్యమునకు మోదించి సురసంఘములు పుష్పవృష్టి మేదినిఁ గురియుచు మేలుమేలనఁగఁ |