| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
భూరిహంసావళిఁ బొలుపారు ప్రథమ మారుతస్కంధంబు మానుగాఁ గడచి యోలినక్కొలఁదిన??? యొండొంటిమీఁద గాలికిఁ బట్టైన గగనమార్గమున విలసిల్లఁగా నందు వివిధ మేఘములు గలుగు నా రెండవ కణయంబు గడచి సమ్మదంబున సిద్ధచారణుల్ గొలువ నిమ్మైన మూఁడవ యెడయును గడచి పొది వినాయకుతోడ భూతసంఘముల పదనైన నాలవ భాగంబు గడచి యలరు మందాకిని నవగాహకేళి సలిపి దిగ్గజముల సరి గొండమీఁద మదశీకరంబులు మానక కురియు కదియ నాయేనవ కణయంబుఁ గడచి పరివృతబంధుండై పక్షీంద్రుఁ డునికిఁ గరమొప్ప నాఱవ ఖండంబుఁ గడచి చూడంగ ఋషులచే శోభిల్లుచున్న యేడవ మండలం బెలమితోఁ గడచి చల్లగా మిన్నేటి జలశీకరములు చల్లు నాయష్టమ స్థానంబుఁ గడచి వెస మీద నెనుబదివేలయోజనము లసమానగతి నేగ నంతటిమీఁద సకలలోకములకు సమ్మదం బొదవ నకలంకగతి రశ్ములవి కోటి నిగుడఁ దారకావళి గొల్వు దనరి చంద్రుండు దారుణాకృతిగల దశకంఠుఁ గాంచె నానిశాచరువీరుఁ డౌదశాసనుఁడు నానిశాచరుఁ జేరునపుడు రాక్షసులు కదియఁ జాలకయున్నఁ గని ప్రహస్తుండు గదిసి రావణుఁ జూచి కరములు మొగిచి లలి నింక నిక్కడ లంకేంద్ర మేము నిలువఁ జాలము సీతు నెఱయంగఁ దాఁకెఁ గడుఁ జిత్రమిది శీతకరుఁడు గాల్పంగఁ దొడరె నోర్వఁగరాదు దొలఁగెదమనినఁ గోపించి విలు వెసఁ గొని నారసములు పైపైని జంద్రుపైఁ బఙ్త్కికంధరుఁడు పఱపంగ బ్రహ్మ సంభ్రమముతో వచ్చి యరుదారఁ గెడసొచ్చి యతనితో ననియె శశి లోకములకెల్లఁ జల్లనివాఁడు శశితోడఁ గయ్యంబు సనదు వే మరలు రాత్రించరోత్తమ రణములో నీకు శాత్రవకోటిచేఁ జావులేకుండ నొక మంత్రమిచ్చెద నొప్పారననిన ముకుళితహస్తుఁడై ముందట నిలిచి ధాత నీకృప నేను ధన్యుఁడనైతి ప్రీతుండనైతిని బెంపార నాకు నరుదార నిచ్చెదనన్న యామంత్ర మిరవంద నాకు నీవెఱిఁగింతుగాక నీమంత్రబలమున నేనజేయుండ నామించి దేవాసురాదులవలన నేభయంబును లేక యెల్లలోకముల నాభీలభుజశక్తి నధికతేజంబు గనియెదననిన నాకమలసంభవుఁడు గనుఁగొని యాపఙ్త్కికంఠుతో ననియె మృతి చేరినప్పుడు మృత్యుజయంబు మతినిల్పి చే నక్షమాలిక దాల్చి పటునిష్ఠ జపియింపఁ బ్రాపించు విజయ మటుగాక తక్కిన నని నోడుదనుచు మనమార నతని కామంత్రంబుఁ జెప్పి తనరు తేజముతోడఁ దన లోకమునకు లోలత నాచంద్రలోకంబు వెడలి యాలోకనిభుఁ డేగె నంత రావణుఁడు మరలి శత్రులనెల్ల మడియంగఁ జంపి తిరుగుడుపడుచున్న దేవకన్యకలఁ గలయంగ గంధర్వ కన్యకావళుల నలసభావముగల యక్షకన్యకలఁ గడఁగి విద్యాధర కన్యకోత్తమలఁ .......... గరమొప్పు కిన్నరకన్యకావళుల నరలోకకన్యల నాగకన్యకల నచ్చరలేమల నమరకన్యకల నచ్చుగాఁ గైకొని యందంద మఱియు మెఱుగుఁదీఁగెలువోలు మేనులు నలువు గిరిగొన్న యలినీలకేశపాశములు తరుణేందు నుపమింపఁదగు లలాటములుఁ గరివంకబొమలును గ్రాలుకన్గవయు సుధలొల్కు పల్కులు సుషుమదంతములు మధురాధరంబులు మందహాసములు చంద్రబింబమునొప్పు సరకుఁగాఁ గొనక .......... తమ్మి నెత్తావుల తలఁగింపఁ జాలు కమ్మని యూర్పులు కంబుకంఠములుఁ బసిఁడిమించులనొప్పు బాహుమూలములుఁ గిసలయంబుల నవ్వు కెంగేలుగవయుఁ గందర్పు నభిషేకకలశంబులనఁగ నొంది దర్పోన్నతి నొనరు చన్గవయు సన్నపు హరినీలసరణి చందమునఁ జెన్నైన యూరులు శిథిలమధ్యములు నాభీసరోమార్గ నవ్యసౌపాన శోభాపరంపరల్ సూచించు వళులు గంభీరనాభులు ఘననితంబములు రంభానిభాకృతి రంజిల్లు తొడలు ననువృత్తజంఘులు నరుణాబ్జకాంతి పనుపడి విలసిల్లు పదపల్లవములు హంసకంబులు మనోహరములై మెఱయ హంసశంకలఁ జేయు నలసయానములు నలి నొప్పు చెయ్వులు నవవిలాసములు నెలయు సోయగములు నెలజవ్వనములు నొప్పారు కాంతల నొగి వారివారిఁ గుప్పలుగాఁ జంపి క్రూరుఁడై గదిసి సేసముత్యములొల్క సీమంతవీథి గాసిగాఁదెగి సూసకము మణుల్ దొరఁగ రోలంబకులనీలరుచిర ధమ్మిల్ల మారుతి మల్లికామాలికల్ దూల నలకలు చెదరంగ నలికంబు చెమటఁ దిలకంబు గరఁగంగ దృష్టులు మగుడ హారముల్ బెరుఁగంగ నంగముల్ వడఁక నారంగ చరణంబులటు దొట్రుపడఁగ లేఁత కౌ నసియాడ లీలఁ జూడ్కులకు బ్రాఁతైన చన్నులపై కొంగు దొలఁగ ఘననితంబోన్నతి గలయంగఁ జాలు కనకమేఖల వీడఁ గడునొప్పు నడల ఝణఝణంకృతులతోఁ జారు మంజీర మణికంకణంబులు మహి నూడిపడఁగ బిగిచన్నుఁగవ బాష్పబిందువుల్ రాలఁ దెగువతోఁ దలపెట్టి దిగిచి పుష్పకము నెక్కించుకొనిపోవు నెడవారి మతులఁ బొక్కుచు విలపింపఁ బొడము శోకాగ్ని నొండొండ వెడలు నిట్టూర్పుల నొప్పి యుండెఁ బుష్పక మగ్నిహోత్రంబు పగిది నప్పుడు పౌలస్త్యు నతిభీతిఁ జూచి యెప్పుడు మ్రింగునో యీనిశాచరుఁడు ననుచుండ నందొక్క నలినాయతాక్షి మనమున బెగడంగ మఱియొక్క వనిత ననుఁ గ్రూరుఁడై పట్టి నక్తంచరుండు తునుమాడునో యని తొడఁగి చింతింపఁ గొందఱు మదిలోనఁ గూఱు నెవ్వగల నందంద తమవారినందఱిఁ దలఁచి యక్కటా నామీఁద నర్మిలి వొడము తెక్కలి శోకాగ్ని ధృతి నీరుగాఁగ మరణంబుఁ గోరుచు మాతల్లి యెట్టి దురవస్థఁ బొందునో తుదిలేని వగలఁ బ్రాణంబుగా నను బాటించు తండ్రి ప్రాణ మేవిధమునఁ బట్టునో యింక ననురాగ మెసగంగ నలిఁ బ్రేమఁ జేసి పెనిచిన కొడుకులఁ బెడఁబాయవలసె నెట్టు గానోఁచితి నేఁడు నాకూర్మి పట్టు లేపాటునఁ బడుదురో బెగడి నా తోడఁబుట్టువుల్ నా బంధుజనులు నీ తెఱంగునకుఁ దా మేమనువారొ పరికింప నాపాలి భాగ్యదేవతయుఁ బరమబంధుండైన పతి నన్నుఁ దలఁచి విన్ననై వదనారవిందంబు వాంచి యెన్ని చింతించునో హృదయంబు పొగుల నట్టి నా పతిఁ బాసి యందఱఁ బాసి యిట్లున్న నాకింకనేమి యాపదలు తుదలేని యిడుములఁ దూలి నేఁ జాల మదిఁ జూడ కష్ట మీమనుజలోకంబు నిను నేను వేఁడెద నీలోకమునకుఁ గొనిపొమ్ము మృత్యువ కోర్కి దీపింప నని యని కోపింప నంగనల్ గొంద ఱనదలమైతి మేమని చాలఁ దూలి విధి దూఱఁ గొందఱవ్విధమున మాకు విధియుండ నేమని విలపింతుమనఁగఁ గొందఱు మూర్ఛిల్లఁ గొందఱు దెలియఁ గొందఱు పాపాత్మ ! కూడునే యనఁగ నాఱని శోకాగ్ని నటు గొందఱులియ నాఱడిపడితిమే యని కొంద ఱలయ గుఱిలేని వగలచేఁ గొందఱు గుంద మఱియుఁ గొందఱు సతుల్ మతుల నూహించి నక్షత్రముల మాపు నలినాప్తు కరణి నక్షీణవిక్రముండైన రావణుఁడు మనవారి నందఱ మసఁగి రూపణిఁచి మనముల నిబ్భంగి మానముల్ దూలఁ బాపచిత్తంబునఁ బరకాంతలనక నేపునఁ జెఱపట్టె నీదురాత్మకుఁడు దురములోపలఁ దన దుర్మందం బణఁపఁ బరకాంత నెపమునఁ బడి పోవుఁగాక పాయని యీపాపఫలమున ననుచు వాయెత్తి పల్క నవ్వాక్యంబుతోడ ధర పుష్పవర్షముల్ దఱుచుగాఁ గురిసె సురదుందుభుల్ మ్రోసె సొరిది నాకసము నంత నాదశకంఠు నాపతివ్రతలు సంతాపమును బొంది సైరింపలేక శపియించుటయు నగ్ని సగమాఱినట్లు విపులతేజముతోడ వెలితియై తోఁప నంత నాదశకంఠుఁ డామంత్రివరులు సంతోషమునఁ దన్ను సన్నుతుల్ సేయ |