ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
రావణుఁడు తన పతిం జంపిన శూర్పణఖ యేడ్చుట
బలములు గొలువంగ బహుజయధ్వనులు
లలి మించ నేతెంచి లంక సొచ్చుటయు
మది శూర్పణఖయును మగని చావునకుఁ
బొదివిన శోకాగ్నిఁ బొగులుచు వచ్చి
యన్నిశాచరనాథు నడుగుల కెరఁగి
కన్నీరు పాద్యంబు గావింప నతఁడు
చెలియలి వెస నెత్తి చిత్తంబులోన
నలయకు నీవంచు ననునయం బెసఁగఁ
బలికిన నందంద బాష్పముల్‌ దొరఁగఁ
తల వాలవైచి గద్గదకంఠ యగుచుఁ
బౌలస్త్యపుంగవ పదుమూఁడువేల
కాలకేయుల నీవు కడతేర్చునపుడు
మఱఁది నాచెలియలి మగఁ డితండనక
నుఱక విద్యుజ్జిహ్వు నుచితమె చంప
మొగమోట వలవదె ముందటఁ బడిన
తగునె వధింపంగఁ దన బంధులనక
నిక్కంబుగా నాకు నిర్నిమిత్తమున
నక్కట వైధవ్య మందంగవలసె
నేమందు శోకాగ్ను లేమిట నార్తు
నేమందు విధి నిన్ను నేమందుననిన
నదియేల శోకించె దేను గయ్యమున
వదలక రిపుకోటి వధియించునపుడు
పరఁగు నాశరవీథిఁ బడి చచ్చెఁగాని
పరికింప నా దృష్టిపథమునఁ బడడు
కడచినవానికిఁ గడిది శోకాగ్నిఁ
బడనేల తాలిమిఁ బాటింపుమింక
వగవకు నీకును వలయు నర్థంబు
నొగినిచ్చి ఖరునొద్ద నునిచెద నిన్ను
ఖరుఁడు నీవనుజవుగాన నీమాటఁ
పరమప్రియంబున బాటించి నడుపు
రక్కసుల్‌ దండకారణ్యంబునందుఁ
దక్కక చరియింప దానవగురుఁడు
శపియించినాఁడది సత్యంబుగాన
విపులతేజమున నావిపినదేశమును
ఖరుఁ డేలఁదగునంచుఁ గామరూపములఁ
బరఁగు నిశాచరుల్‌ బదునాల్గువేలు
మానుగాఁ గొలువంగ మహిమ దూషణుఁడు
సేనాధిపత్యంబు సేయఁ జాలించి
కోరిన ధనములు కొఱఁత లేకుండ
నారాక్షసునకిచ్చి యనుజ నీవెలమి
ఖరునొద్ద నుండుదుగాకంచుఁ బలికి
కరము గారవమార ఖరుని వీడ్కొలిపె
నతఁడును సేనతో నరిగి శాత్రవుల
తతిగొని సమయించి దండకాటవిని
భీకరగతితోడఁ బృథులతేజంబుఁ
జేకొని రాజ్యంబు సేయుచునుండె
నంత నికుంభిళ యను వనంబునకు
సంతోషమున నాదశగ్రీవుఁ డరిగి
తిరముగా నందంద దిశలు వాసించు
నురుగంధములనొప్పు హోమధూమములఁ
బెక్కు యూపంబులఁ బెక్కు వేదికల
నక్కజంబగుచున్న యజ్ఞవాటమున
బహుపవిత్రోదకభరితమై కేల
మహనీయరుచిఁ బొల్చు మణికమండలువుఁ
బొలుపాఱ దర్భయు భూరివక్షమున
నలువారు కృష్ణాజినము నోలి మెఱయ
మేఘనీలద్యుతి మేనొప్ప నొప్పు
మేఘనాదుని గాంచ మేదురప్రీతి
నడర విభీషణుఁ డర్థంబుఁ గులము
గడతేర్చు నడవడి గలిగి వర్తించి
పన్నుగా సాధులఁ బట్టి బాధించు
చున్న నీకపకీర్తి యొకటి వాటిల్లె
మన పెద్దతాతకు మాల్యవంతునకుఁ
దనయ పుష్పోత్కట తత్పుత్రి మనకుఁ
దలఁపఁ గుంభీనస ధర్మంబునందు
చెలియలు తగకీడు చెప్పెద వినుము
రావణ మధువను రజనీచరుండు
నీవు జయార్థివై నెమ్మితోఁ జనుట
నీ తనూజుఁడు యాగనిష్ఠ గైకొనుట
నాతతమతి నేను నఘమర్షణంబు
దొరకొని నియతిమైఁ దుదిముట్టుదాఁక
నిరతంబుగాఁగ నగ్నిష్టోమమఖము
గురుకొని సేయంగఁ గుంభకర్ణుండు
నెరయ నిద్రించుట నిజముగాఁ దెలిసి
తనర నీలంకలోఁ దనకడ్డువడిన
మన యమాత్యుల నెల్ల మడియంగఁ జంపి
యంతఃపురము సొచ్చి యచ్చెల్వఁ గొనుచు
నెంతయు వడినేగె నేనది వినియుఁ
దగవుతోఁ బిలిచి యాతరళాక్షియొక్క
మగనేగి వలచుట మగఁడుగా నతఁడు
తగినవాఁడగుటయుఁ దగ విచారించి
తగదింకఁ దెగనంచుఁ దమకింపనైతి
నీతితో నూహించి నీకుఁ బొందైన
యా తెఱఁ గొనరింపు మనిన రావణుఁడు
కన్నులఁ గెంపారఁ గరమల్కఁ జూచి
యెన్నఁగా మధువన నెవ్వఁడు నాకు
నరదముల్‌ బన్నుఁడు హరులఁ గట్టుండు
సరి జోళ్ళు వెట్టుఁడు సామజంబులకు
నాటోపములతోడ నలవులు మెఱసి
మేటిరక్కసులార మీవాహనముల
మీరిన జయశాలి మేఘనాదుండు
ఘోరవిక్రముఁడగు కుంభకర్ణుండు
మున్న గా నందఱు ముదముతో నడువ
సన్నద్ధులై రండు సమరంబులోన
మధువను దానవు మర్దించి పిదప
నధికసంపదలకు నావాసమైన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )