| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యమరలోకముమీఁద నరిగి కయ్యమున నమరేంద్రు నోడించి యతనిచే నేను నీవాఁడ ననిపించి నిర్వైరమునను నేవచ్చి నెమ్మది నీలంకలోన వలసిన భోగముల్ వరుసఁ గైకొనుచుఁ జెలువొంద రాజ్యంబుఁ జేసెదననుచు నున్న యుద్భటబాహుయుగరోచు లెసఁగఁ బన్ని యక్షోహిణుల్ పదివేలు గొలువ నంత నందఱఁ జూచి యాదశాననుఁడు సంతోషమున విభీషణు లంక నునుచి వడి మేఘనాదుఁ డన్వాఁడు పెన్మొనకుఁ గడఁగి ముందటఁ గుంభకర్ణుఁడు నడువ వెనుకమై దానును వేదండఘటలుఁ గనుపట్టు రథముల ఘనఘోటకములఁ గాసిల్లు ఘోరోరగముల నుష్ట్రముల వేసడంబుల నెక్కి వెస నిశాచరులు తెఱపి లేకుండంగ దిక్కులు నిండి తఱుచు వాద్యములతో దళములతోడ విడువక సురలతో వేరంబుఁ గొన్న కడిది దానవులును గడఁక నీక్షించి తన వెన్కఁ జనుదేఱ దర్పరోషములు మనమారఁ జని చొచ్చె మధువు పట్టనము నంత కుంభీనస యదియెల్ల నెఱిఁగి చింతించి భయమునఁ జిత్తంబు గలఁగి పఱతెంచి యడుగులఁ బడిన రావణుఁడు వెఱవక లెమ్మని వెసఁ గేల నెత్తి యేమి ప్రియంబైన నేఁ జేయువాఁడ నేమిటిఁ దరుణి నీవెఱిఁగింపుమనిన నాకొఱకై దేవ నా భర్త మధువు గైకొని ప్రాణముల్ గావంగవలయు నభయంబు నీవిప్పు డానతియిచ్చు టభిమతంబిది నాకు నని పల్క నతఁడు కరుణ గుంభీనసఁ గనుఁగొని నీకుఁ బురుషుండు గాన నాబుద్ధి నూహించి మధువుఁ గాచితి నేను మధువేల రాఁడు మధువుఁ దోడ్కొనిరమ్ము మధువుతోఁ గూడ జంభారి గెలువంగఁ జనియెద ననినఁ గుంభీనసయు నేగి కొమరొప్పఁ గదిసి నిదురవోవుచునున్న నిజనాథు మధువు మృదుక రాంబుజముల మెల్లన తెలిపి యధికుఁడు మాయన్న యగు దశగ్రీవుఁ డధికసైన్యముతోడ నమరేంద్రపురికిఁ జనుచుండి నినుఁ బిల్వఁ జనుదెంచినాఁడు మనకు బంధువుగాన మైత్రివాటించి నీవు తోడేగుట నెరయఁ గార్యంబు నావుడు నలరి యానక్తంచరుండు వచ్చి రావణుఁ గాంచి వరుసతో వాని నచ్చుగాఁ బూజింప నాదశాననుఁడు మధువీట నాఁడుండి మఱునాఁడు గదలి మధువుతోఁ గొల్చి రా మహిమతో నరిగి కలధౌతగిరి మీఁదఁ గలయంగఁ సేన నలవడ విడియించి యందుఁ దానమర భానుప్రభాజాలపరితప్తభువన మానందమును బొంది యలర నంబోధి నిక్కంగ విరహుల నిట్టూర్పు లెసఁగ దిక్కులఁ బొదివిన తిమిరంబు విరియ నెలమిఁ జకోరంబు లెదురులు సూడఁ గలువలు నవచంద్రకాంతముల్ గరఁగ నలఁతమై కనుమోడ్చు నాసేనతోడ జలజముల్ నిద్రింపఁ జంద్రుండు వొడిచె నప్పుడు దశకంఠుఁ డన్నగాగ్రమున నొప్పంగ నేకాంత మొకచోటనుండి మందాకినీముఖ్యమహనీయనదుల నందంద కమలకల్హారమాలికలు నలువారఁ బట్టుచు నవకర్ణికార ములతోడ నళికులముఖరఝంకార నవపుష్పగంధముల్ నలువొప్పఁ దెచ్చి సవరిల్లఁ బుప్పొడిఁ జల్లుచునుండ నుల్లంబు వికసింప నొయ్యన వీచు చల్లనిగాలికిఁ జాల మెచ్చుచును విత్తేశు కొలువన వీనుల కింపు లొత్త నచ్చరలేమ లొగిఁ బాడ వినుచు నిటమీఁదఁ దనమీఁదనే వెల్లివచ్చు పటుభంగి మరు నంపపదువుల మాఁడ్కి మారుతాహతి లతల్ మువ్వంపు విరులు సూరెలఁ జల్లగా సుఖము గైకొనుచు రేఁగిన నవపుష్పరేణువుల్ దొప్ప దోఁగి పూఁదేనియల్ దొరఁగ గైకొనుచుఁ గ్రందుగా బహుపుష్పగంధముల్ చల్ల మందమారుతముచే మానంబు దూలి కాముఁ డీవిభవంబు కడుమించి తన్నుఁ గామమోహితుఁ జేయఁగా వెచ్చనూర్చి |