| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
హరిణిచందంబున నడ తొట్రుపడుచుఁ బిరిగొన్న దురవస్థఁ బ్రియుపాలి కరిగి యడుగులఁ బడి లేచి యందంద మేను వడఁకంగ వదనంబు వాంచి హారములు బెనఁగొన ననయంబుఁ బ్రిదులలోఁ జెరివి కొనిన పువ్వుల గ్రంధి క్రొమ్ముడి వీడఁ దొంగలి ఱెప్పలఁ దొరంగు బాష్పములు తుంగస్తనంబులఁ దోఁగినట్లున్నఁ గనుఁగొని యిదియేమి కాంత నీచంద మనవుడు నాలేమ హస్తముల్ మొగించి నడకుచుఁ బలుకను నాలుక రాక కడుఁ దూలి గద్గదకంఠయై పలికె యేను నీయొద్దకు నేతేర నింద్రు పై నెత్తిపోవుచుఁ బఙ్త్కికంధరుఁడు సేనతోఁ గలధౌత శిఖరిపై విడిసి తానందు ననుగాంచి దర్పాంధుఁడగుచు నేనుఁ గోడలనన నెరి నంటఁ బట్టి నానమాలఁగ బిట్టునను గాసి సేసె కావున నీతప్పు గావంగవలయు నావుడు నలిగి యానలకూబరుండు యొక కొంతదడవాత్మ నూహించి చూచి సకలంబుఁ గని కృతాచమనుఁడై కేల జలములు గొంచు నాజలజాక్షిఁ జూచి బలవంతుఁడైన యాపఙ్త్కికంధరుఁడు కొంకక నిను బట్టికొనుటఁ జూడంగఁ బంకేరుహాసను బలిమియే యౌను ఇది మొదలుగఁ బల్మి నెవ్వతెనైనఁ గదిసి యిట్లుపహతిఁ గావించెనేనిఁ బదిశిరంబులు నూఱువ్రయ్యలై దర్ప మదరంగఁ జెడుఁ గాతమని శపించుటయుఁ గరమున శాపోదకములుర్విఁ బడఁగఁ బొరి పొరి వర్షించెఁ బుష్పవర్షములు సురదుందుభులు మ్రోసె సురలు సంతోష భరితమానసులైరి పరమేష్ఠి నగియె రావణుఁ డదిమొదల్ రతికేళి బలిమి గావింపకుండె నాఘనశాపమెఱిఁగి రాజేంద్ర యాతఁడా రాత్రి వేగుటయు రాజిల్లు సేనతో రాజతాద్రి గడచి నడువంగఁ బెనుమ్రోఁత నాకంబునందుఁ గడు ఘోరమయ్యె నాకలకలం బరసి యిచ్చలోఁ దనమీఁద నెత్తి రావణుఁడు వచ్చుచున్నాఁడని వాసవుండెఱిఁగి వసువుల రుద్రుల వఱలు తేజమున నెసఁగు నాదిత్యుల నెల్లసాధ్యులను ఘనకీర్తులగు మరుద్గణముల మహిమ దనరు విశ్వేదేవతలఁ జూచి పలికె నుద్ధతి మనతోడ యుద్ధంబుసేయ బద్ధవైరముఁ గొని పఙ్త్కికంధరుఁడు చనుదెంచె నతిఘోరసైన్యంబుతోడ ననికి మీరాయత మగుఁడంచుఁ బలికె |