ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
ఇంద్రుఁడు విష్ణుదేవునితో రావణుఁడు దాడివచ్చినది తెల్పుట
రావణు గెలువంగ రామి చిత్తమున
భావించి యట విష్ణు పాలికి నరిగి
ముకుళితహస్తుఁడై ముందట నిలిచి
సకలేశ నాతోడ సంగరంబునకు
బాహుదర్పితుఁడైన పఙ్త్కికంధరుఁడు
వాహినీసహితుఁడై వచ్చుచున్నాఁడు
వారిజాసనదత్త వరశక్తిఁ జేసి
వారిజోదర దుర్ని వారుఁడై తిరుగు
నరకాసురుని పుత్రు నముచినా బలుని
బరిమార్చుటేను నీబలిమిని గాదె
యాదినారాయణుండవు నీవు దక్క
నాదట మముఁ బ్రోవ నన్యు లోపుదురె
యిన్నిలోకములకు నేలిక వీవు
నన్నింద్రుఁ గావించినాఁడవు నీవు
దేవ మాకెల్లను దిక్కవు నీవ
కావున నసియుఁ జక్రముఁ గేలఁ బూని
దానవాంతక వచ్చి దశకంఠుఁ దునిమి
మానుగా రక్షింపు మమ్ము నీవిపుడు
ననవుడు నవ్విష్ణుఁ డమరేంద్రుఁ జూచి
విను పురందర నాకు వేళగా దలుగ
శూరపుంగవులైన సురలతోఁ గూడి
ఘోరనిశాచరకోటిమధ్యమున
ధాతవరంబున దర్పించియున్న
యాతఁడు దివిజుల కవిజేయుఁ డరయ
నేను వచ్చితినేని నెబ్భంగినైన
వానిఁ గయ్యంబున వధియింప కుడుగ
బ్రహ్మ దేవతలందుఁ బరికింప ఘనుఁడు
బ్రహ్మవరంబు నే పాటింపవలయు
నటుగాక నీదగు నభిమతంబిపుడు
ఘటియింప దిటమీఁదఁ గర్తవ్యమగుట
ననిమిషు లలరంగ నానిశాచరుని
నని నేనె చంపెద నదియు నట్లుండె
నమరులతోఁ గూడి యతనితో నీవు
సమరంబు గావింపు సకలయత్నముల
వెఱవక పొమ్మన వినతుఁడై మరలి
వఱలు తేజముతోడ వజ్రి యేతెంచె
నంత నాదిత్యాదులగు సురల్‌ వెడలి
సంతతసాయకాసారఘోషంబు
బహువిధాయుధదీప్తి బహుళంబు గాఁగ
నహమికతోడను నడర రాక్షసులఁ
దలఁపడఁగా నందు దారుణస్ఫురణ
వెలుఁగుచు నార్పుల వినువీది వగుల
మారీచుఁడను మహామాయాధికుండు
శూరముఖ్యుఁడు ప్రహస్తుఁడు మహోదరుఁడుఁ
గడునుగ్రుఁడు మహాకాయుండు నుద్ద
విడి మహాపార్శ్వుండు వెస మహాశనుఁడు
నగసన్నిభుఁడు మహానాదుండు నెన్నఁ
దగిన పోటరి మహాదంష్ట్రుఁ డన్వాఁడు
ప్రకటవిక్రముఁ డకంపనుఁడు సారణుఁడు
శుకుఁడు నికుంభుఁడు సూర్యవర్తనుఁడు
భీషణాంగులు మహాభీషణసుప్త
దూషణ దుర్ముఖ ధూమ్రకేతువులు
సరవీర దారాక్ష సంధకులనఁగ
నరిది వీరులు విరూపాక్షుఁ డన్వాఁడు
దీపించు మఖరుఁడుఁ ద్రిశిరుఁడు యజ్ఞ
కోపుండు దేవాంతకుఁడు నరాంతకుఁడుఁ
దను గూడుకొని భుజాదర్పముల్‌ జూపఁ
గనలు నిర్జరసేనఁ కణకతోఁ జొచ్చి
రామ సుమాలియన్‌ రాక్షసవీరుఁ
డామహావాహిని నలుకఁ దాఁకుటయు
వడి నప్పు డష్టమవసువు సావిత్రుఁ
డడరంగ దేవగణాన్వీతుఁడగుచు
మృత్యుదేవత భంగి మీరి రాక్షసుల
కత్యంతభయముగా నాజికిఁ దొణఁగె
నందుఁ బూష త్వష్ట లనఁగ నాదిత్యు
లందు వాలిన వీరు లందంద గడచి
యసమానగతిఁ దాఁక నవ్వీఁకఁ జూచి
యసముడింపక తారు నమ్మహాబలులుఁ
బెరసి తోమరములు భిందివాలములుఁ
గరవాలములుఁ బరిఘలు శూలములును
శరములుఁ జాపముల్‌ చక్రముల్‌ గదలుఁ
బరశువుల్‌ శక్తులుఁ బట్టసంబులును
ముసలముల్‌ సబలముల్‌ మొదలుగా నొక్క
వెస నాయుధంబులు వెరవులు మిగిలి
ధట్టనల్‌ మథనముద్ధతులుఁ బంతములు
నట్టహాసంబులు నన్యోన్యహతులుఁ
జండహుంకృతులును శస్త్రఘట్టనలు
నొండొరుగని మండు నుగ్రకోపములు
నుభయసైనికులందు నొక్కటఁ జెలఁగ
రభసంబుతోడ నారాక్షసుల్‌ దఱిమి
సురసేనఁ గెడప నాసురలు కోపించి
బిరుదుమొత్తములకుఁ బెల్లుగాఁ గదిసి
తొరఁగు శోణితములుఁ దునియు నంగములుఁ
బొరి పొరి తునియలై పొలియు కైదువులుఁ
దెగు బాహుదండముల్‌ దెఱచు వక్త్రములు
..........
నుఱుమగు నెమ్ములు నులియు నంగములు
విఱుగు నూరులు వెలివెడలు ప్రేవులును
డొల్లు మస్తకములు డుల్లు దంతములు
గుల్లల తిత్తులై కూలు బొందులును
బొడిపొడియై రాలు భూషణావళులు
నుడువక వడిమ్రోయు నుగ్రపాతములు
నిలునిలు మనుటలు నిలిచి పెన్మంట
లలుగులు చెదరంగ నంటఁ దాఁకుటలు
దారుణగతిఁ జేసి దశకంఠు సేనఁ
బోరిలోఁ గెడపిరి భూరిదర్పమున
నంత సుమాలియు నత్తెఱంగునకు
నెంతయుఁ గిన్క ననేకాయుధముల
దివిజసైన్యము నొంచి దివ్యబాణంబు
లవిరళగతిఁ బెక్కు లడరించి మించి
ఘనరాజిఁ దోలు పెన్గాలిచందమున
ననిమిషావలిఁ దోలి యచట మార్పడిన
వీరులఁ బటుశూలవృష్టిని ఘోర
నారాచవృష్టిని నలి రేఁగి ముంచె
నంత నాదిమవసువైన సావిత్రుఁ
డంతయుఁ గనుఁగొని యధికరోషమున
సేనాసమేతుఁడై చెలఁగి ప్రేరేఁప
వాని నాతనిసేన వడిఁ గుప్పగూల్చె
నారాక్షసునితోడ నఖిలాయుధములు
సారించి విడువక సరి పోరి పోరి
బలువిడి నతఁడు నప్పన్నగరథము
బలునారసములేసి భగ్నంబు చేసి
యింక నీమదమున నీయాయుధమున
కింకఁ జొప్పడ నేను గెడపెదననుచుఁ
గాలదండముఁ బోలు ఘనగదాదండ
మోలి మంటలు మింట నొండొండ నెగయఁ
గరమున నమరించి కల్పాంతసమయ
పరుషార్కపరివేష భంగిగాఁ ద్రిప్పి
యురువడి నుంకించి యురముపై వైవ
నరుదు గదాహతి నాసుమాలియును
అతిరోషనిర్ఘాతహతిని ద్రికూట
గతిఁ గూలెఁ గూలినఁ గని నిశాచరులు
వడిఁ బాఱుటయుఁ జూచి వసుధపై నేచి
మిడికి కోపముతోడ మేఘనాదుండు
పాఱు నారాక్షసభటుల నెల్గెత్తి
పాఱకుఁ డిదియేల పాఱెదరనుచుఁ
గ్రమ్మఱ మరలించి కామగంబైన
యమ్మహారథమెక్కి యమ్మహారథుఁడు
బహువిధాయుధ దీప్తిపటలంబుచేత
సహజతేజంబులఁ జాలంగ మెఱసి
వాఁడిమి దావాగ్ని వట్టిన పొదలు
మాఁడించు విధమున మార్గణావళులఁ
బొరి పొరి సేనలఁ బోరిలోన నడవ
సురలు నయ్యురువడి చూచి కంపించి
నెఱసిన భీతితో నిలువంగలేక
పఱచి రాదెసఁ జూచి పాకశాసనుఁడు
వీఁడె నాతనయుండు విక్రమోజ్జ్వలుఁడు
వాఁడిమిఁ గడుమీఱి వచ్చుచున్నాఁడు
పఱవకుఁ డొక్కింత పదిలులై నిలుఁడు
వెఱవక మగుడుఁ డీవేగ మీ రనుఁడు
నాయుధపాణులై యాసురల్‌ మగిడి
రాయతద్యుతి నప్పు డరదము మెఱయ
నాజయంతుం డుద్భటాటోపమెసఁగ
నాజికిఁ జనుదెంచె నంతపై నడరి
కింక రాక్షసులతో గెరలి దేవతలు
లంకేంద్రసుతుతోడ లలి నింద్రసుతుఁడు
వెస నాయుధంబుల విస్ఫులింగంబు
లెసఁగంగఁ దాఁకి రయ్యెడ నింద్రజిత్తు
పసిఁడిపింజల నొప్పు బాణముల్‌ దొడిగి
యసమానగతి నాజయంతుని సూతు
గోముఖుండనువానిఁ గొనికాఁడ నేసె
నామహోద్ధతిఁ జూచి యమరేంద్రసుతుఁడు
నింద్రజిత్తుని సూతు నేసెఁ బెక్కమ్ము
లింద్రజిత్తునిమీఁద నేసె నేయుటయు
భూరికోపంబున బొమలు గీలించి
యారాక్షసుండును నరుణాక్షుఁడగుచు
ధను వింద్రధనువును దాను మేఘంబు
సునిశితాయుధమరీచులు మెఱుంగులుగ
భీమాట్టహాసముల్‌ బెడిదంపు టుఱుము
గా మహోగ్రతతోడ ఘనబాణవృష్టి
సురరాజసుతు ముంచి సురసేనమీఁద
నురుతరకోదండ ముగ్రమై మెఱయఁ
బొరి పొరి పుంఖానుపుంఖముల్‌ గాఁగ
శరములు వఱపె నాశరపరంపరలు
దెసలు నాకసమును దెఱపి లేకుండ
వెసఁ గప్పినప్పుడు విశిఖముల్‌ దాఁకి
కడుభీతితో సురల్‌ గనుకని పాఱ
నడరు నాఘనసాయకాంధకారమున
నితఁడు నక్తంచరుం డితఁడు నిర్జరుఁడు
ప్రతివీరుఁ డితఁడని పరికింపరాక
తొడిబడి రాక్షసుతోడ రాక్షసుఁడుఁ
గడిమి నిర్జరుతోడఁ గడఁగి నిర్జరుఁడు
ననుపమస్థితిఁ బోర నపుడు పులోముఁ
డనియెడి దైతేయుఁ డాయింద్రతనయు
ననికిఁ దొలంగించి యంబోధికడకుఁ
గొనిపోయె బృందారకులు భయంబంద
వాసవసుతుఁ దోలి వడి మేఘనాదుఁ
డాసురగతి నేచి యఖిలరాక్షసులు
జలజభవాండంబు సందులు వగుల
నలి నార్వగా సింహనాదంబు సేసె
నప్పుడు దేవేంద్రుఁ డతని విక్రమము
తప్పకంతయుఁ జూచి తన పుత్రుఁ డనికిఁ
దొలఁగిపోవుటఁ జూచి తూలి దిక్కులకు
నిలువక పాఱెడు నిజసేనఁ జూచి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )