| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యెదిరి శాత్రవు గెల్వ నిదివేళ యనుచు మది నేచి తన సూతు మాతలిఁ జూచి సమరసన్నాహంబు సమకొల్పి నాకు నమరంగ రథముఁ దెమ్మని పల్క నతఁడు జవనాశ్వములఁ బూన్చి సకలాయుధములు నవిరళద్యుతులార నమరించియున్న తేరు నానారత్నదీప్తిజాలంబు ఘోరమై దీపింపఁ గొనివచ్చె నెలమి నంత రథారూఢుఁడై పురందరుఁడు సంతోషమున దేవసమితిమధ్యమున నచ్చర లాడంగ నమరులు గొల్వ నచ్చుగా వాద్యంబు లందంద మ్రోయ వరమూర్తు లెనమండ్రు వసువులు నడువఁ బరువడి రుద్రులు పదియునొక్కండ్రు కోపించి నడువఁ గైకొనక యాదిత్యు లేపునఁ బూని పన్నిద్దఱు నడువ నొనరు మొత్తంబులై యుఱుములతోడఁ బెనుమెఱుంగులతోడఁ బిడుగులతోడఁ గరము భీకరలీలఁ గాలమేఘములు కెరలుచుఁ దన కిరుగెలఁకుల నడువ నడచె నాజికి నిట్లు నలి రేఁగి నడుచు నెడనెడఁ బెనుగాలి యెదురుగా వీచె నుగ్రాంశుమండలద్యుతి చాలఁ దూలె నుగ్రంబుగాఁ గూలె నుల్క లెల్లెడల నాసమయంబున నట్లు రావణుఁడు వాసవుఁ డని సేయవచ్చుటఁ జూచి రోమహర్షణఘోరరూపంబులైన పాములచే మహాభయదమైయుండ భర్మరత్నోజ్జ్వలప్రభలొప్ప విశ్వ కర్మ నిర్మించిన ఘనరథోత్తమము వెస నెక్కి రాక్షసవీరసంఘంబు లసురసంఘంబుఁ దన్నలమి కొల్వంగఁ జనుదెంచి రణకళాచతురుఁడై మెఱయు తన యగ్రనందనుఁ దనర నీక్షించి యీనిలింపుల గెల్వ నీయింద్రుఁ బఱప నేనె చాలుదుఁ బుత్ర యితఁడెంతవాఁడు నిలువుము నీవన్న నిలువక తోన నలువున నమ్మేఘనాదుండు నడువ దిక్కులార్పుల వ్రయ్యఁ దెగువతో నడచె నక్కజంబుగ దర్పమడరఁగ నపుడు రెండుసేనలవారు రేఁగి యొండొరులఁ జండాట్టహాసముల్ సరిఁ జెల్లఁ దాఁకఁ గత్తుల విదలింప గదల నొప్పింపఁ నత్తళంబులఁ జింప నమ్ముల ముంపఁ గరవాలములఁ ద్రుంపఁ గడిది చక్రముల సరిఁ దెంప నొగిఁ బట్టసముల ఖండింప శక్తుల నదరింప శాతశూలముల రక్తముల్ దొఱఁగింప రణ ముగ్రమయ్యెఁ గడిమి నప్పుడు కుంభకర్ణుండు రెండు కడలవారికిఁ జూడఁ గడు నుగ్రుఁడగుచు భూరిభూధరములఁ బొరి మహాశిలల ఘోరంపుశక్తులఁ గ్రూరబాణములఁ గనలు తోమరములఁ గఠినహస్తముల ఘనపాదముల నొగిఁ గర మల్కతోడఁ బెక్కుభంగుల గిట్టి పెక్కండ్రుసురల నక్కజంబుగ నొంప నమ్మహోద్ధతికి రుద్రులు సాధ్యులు రోషాగ్ను లెసఁగ నద్రిఘోరాకారు నాకుంభకర్ణుఁ దలపడి శస్త్రాస్త్రతతుల నంగములు కలయంగ నొప్పింపఁగా నప్పుడతఁడు ఆయుధక్షతముల నందంద వెడలు నాయతాసృగ్ధార లవనిపైఁ దొఱఁగఁ గోపారుణానన ఘోరానలంబు దీపింప నలుగులు ద్రిప్పి యార్చుచును సలిలధారలతోడఁ జండాంశుబింబ కలితమై మెఱుఁగులు గలిగి గర్జిల్లు కాలమేఘముభంగిఁ గదియ నాలోనఁ జాలి మరుద్గణసహితులై సురలు వివిధముఖంబుల వివిధాయుధములఁ దివిరి రాక్షససేన దెరలించి పఱప నఱిమి కొందఱు చచ్చి రాహవక్షోణిఁ గొఱప్రాణములతోడఁ గొందఱు పడిరి కొంద ఱుగ్రాయుధఘోరఘాతములఁ గ్రందుగాఁగను గడికండలై పడిరి పైశాచముఖముల బహువాహనముల డాసి రథంబుల దండుల హరుల ఖరములను మొసళ్ల ఘనవాహనముల నురువిహంగంబుల నుగ్రసర్పములఁ గనుకని భీతిమైఁ గౌఁగిళ్ల నఱిమి కొనియుండి రాహవక్షోణీతలంబు చిత్రరూపంబులఁ జెలువారి యపుడు చిత్రమై కడునుల్లసిల్లెఁ జూడ్కులకు వడి నందు రక్త ప్రవాహంబు నడుమఁ బడి పాఱు బాహులు పన్న గంబులును జాల నమ్ముల నాటి చప్పుళ్ళతోడఁ గూలిన రాక్షసుల్ గూలు భూజములు బలలంబులకు గాత్రపఙ్క్తులమీఁదఁ గలయమూఁగిన కాకకంకగృధ్రములు జలవిహంగంబులు శస్త్రఖండములు జలచరంబులు నస్థిశకలంబు లిసుము విగతదంతంబులు వెల్లులై తొరఁగ నెగయు ఫేనములుగా నెత్తురుటేఱు ద్రెళ్ళిన శవములు దేల నుల్లోల కల్లోలముగఁ బాఱె ఘనశస్త్రవృష్టి యీభంగి దనరంగ నేచి గీర్వాణు లాభీలగతిఁ జంపి యార్పులతోడ విక్రమించుట చూచి వింశతిభుజుఁడు సక్రోధుఁడై దేవసైన్యసాగరము నింకింతు బాణాగ్ని నిపుడు నేననుచు నింక నీభుజశక్తి నెంతయు నేచి సురసేన వెసఁ జొచ్చి సురుల నొంచుచును సురపతి కెదురుగా శూరుఁడై నడచె కని వాసవుండును ఘనచాపమంది కొని దిక్కులద్రువంగ గుణము మ్రోయించి కడునేచి కాలాగ్నికల్పంబులైన బెడిదంపు నమ్ములఁ బెనుతెగల్ డిగిచి లక్షించి కిన్కతో లంకేశు వక్ష మక్షీణజవమున నదురంట వ్రేసె నమ్మహాబాహుండు నతనిపై మెఱుఁగు టమ్ములు నిగిడించె నాలోన మఱియుఁ బొరి పొరి పుంఖానుపుంఖముల్ గాఁగ నిరువురు నడరించు నిషుపరంపరలు గగనంబు దిక్కులుఁ గలయంగఁ గప్ప నొగినైన చీఁకటి నుభయసైనికులు చక్రగదాకుంతశక్తిశూలాదు లక్రమాటోపంబు లడరఁ గైకొనుచుఁ దలపడి తమవారిఁ దమవారిఁ గూడ నలమి చంపుచు భీకరాంధకారమున నింద్రుండు రజనీచరేంద్రుండు శూరుఁ డింద్రజిత్తుఁడుదక్క నితరులెవ్వారు నిదిరథం బిదిగజం బిదియశ్వ మితఁడు త్రిదశుఁడు వీఁడు రాత్రించరుం డనుచు లక్షింపలేరైరి లంకేంద్రుఁడపుడు నక్షీణవిక్రములైన రాక్షసులు చప్పుళ్లు తఱుచుగా సంగ్రామభూమిఁ గుప్పలుగొన సురల్ గూల్చుటఁ జూచి భూరికోపంబున బొమలు గీలించి దారుణగతి నార్చి తన సూతుఁ జూచి వరుస నీనందనవనభూమినుండి యరుదుగా నుదయాద్రి యది మేరగాఁగ సాగిన యాదైవసైన్యంబు నడుమ వేగంబె రథమున వెరవారఁ బఱపు సమరోర్వి నమరుల శస్త్రాస్త్రవృష్టి సమయించి పుచ్చెద జములోకమునకు సురరాజు నోడించి సురరాజు నగుచు వరుణలోకముఁ గొందు వరుణు నోడించి యక్షేశు నోడించి యక్షాధిపత్య మక్షీణగతినొప్ప నలకఁ గైకొందు జముని నే నోడించి జముఁడ నేనగుదు నమరుల నోడించి యమరుండ నగుదు దేవతాపురములఁ దెగువతో నొడిచి నా వారి నిల్పుదు నా మాఱుగాఁక నిజముగా దివిజుల నేడురూపణఁచి విజయంబుఁ గైకొందు వెఱవకుమనిన వాఁడును బగ్గముల్ వదలి యశ్వముల వేఁడిహుంకృతులతో వెన్నప్పళించి పన్నిన యాసేన వాయఁగా నడుమ నున్న గజాశ్వాది యూధముల్ చదియ నరుదంబుఁ దోలుడు నమ్మహారథుని సురరాజు గనుఁగొని సురలతో ననియెఁ గడిమిమై మనతోడఁ గయ్యంబు సేయ వడి దశగ్రీవుఁడు వచ్చుచున్నాఁడు ... ... ... .......... యారావణుని బట్టి యలవుమై తనదు తేరికిఁ గొనిపోయె దేవతల్ చెలఁగ నది జూచి దనుజులు నఖిలరాక్షసులుఁ జెదరి హాహా ధ్వనుల్ చేసిరాలోఁగ నత్తఱి దూరస్థుఁడగు మేఘనాదుఁ డత్తెఱంగునకుఁ దా నతికోపుఁడగుచు నరిది వేగంబున నరదంబు నిగుడ సరకు సేయక దేవసైన్యంబుఁ జొచ్చి మారారిచేఁ గొన్న మాయఁ గైకొనుచుఁ దేరుపైఁ దోఁపక తీవ్రబాణములఁ గరలాఘవంబొప్పఁ గడుబిట్టు వఱపి సురసంఘములఁ దోలి సురరాజుఁ గదిసె నప్పుడు సురనాథుఁ డమ్మహారథుఁడు గప్పిన పెనుమాయఁ గానఁ జొప్పడక తనరు రణశ్రాంతిఁ దన జోడువిచ్చి ఘనపాశముల దశకంఠు బంధింప నమ్మేఘనాదుఁడు నతని మర్మముల నమ్ములఁ గీలించి యతని సూతుండు మాతలి నొగలపై మఱపుతో నొరఁగ నా తేరు విఱుగంగ నలుకతో నేసె తేరటు విఱుగంగ దేవేంద్రుఁడప్పు డైరావతము నెక్కి యతనిపై కుఱికె మేఘవాహనుఁ డొంటిమెయి నుండఁ జూచి మేఘనాదుఁడు మాయ మిగులఁ గావించె యక్కుంజరముమీఁద నయ్యింద్రుమీఁదఁ బెక్కుబాణములేసి భీతిల్లఁ జేసి |