ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
ఇంద్రుని విడిపింప బ్రహ్మ రావణునొద్దకు వచ్చుట
తమ్ములుఁదనయులుఁ దగువారుఁ దన్ను
నిమ్ములఁ గొల్వంగ నెమ్మినట్లున్న
యాదశానననుచేత నర్హసత్కార
మాదటఁ గైకొని యతనితో ననియె
రావణ నీపుత్రు రణకౌశలంబు
భావింపఁ జిత్ర మీపరుషవిక్రముఁడు
నీతోడ సరి యొండె నీకంటె నెక్కుఁ
డాతఁడు భుజశక్తి నాజిరంగమున
నింద్రుని గెల్చుట నితఁడిటుమీఁద
నింద్రజిత్తను పేర నెల్లలోకముల
చేతను వినుతుఁ డజేయుండు నగుచు
నీతఁ డుజ్జ్వలకీర్తి నేపారఁగలఁడు
సురవైరి నీవు నీ సుతునితోఁ గూడి
సురరాజు గెలిచితి సురసేనఁ దోలి
నరలోక సురలోక నాగలోకముల
సిరులెల్ల నినుఁ జెందెఁ జెల్లె నీప్రతిన
నిను వేఁడికొన వేఁడి నెమ్మి నావెనుకఁ
జనుదెంచినారు నీసభకు దేవతలు
వీరికిఁ బ్రియముగా వీరి మన్నించి
ధీరవిక్రమ నీవు దేవేంద్రు విడచి
మేలు గైకొనుమన్న మేఘనాదుండు
పౌలస్త్యపతి వినఁ బంకజాసనుని
నమరేంద్రు విడుచుట కమరత్వ మడిగె
నమరత్వ ముర్వి నాయజుఁడు లేదనిన
నాజిఁ బూర్ణాహుతి యగునంత దాఁక
నోజతో వేల్చిన హోమాగ్ని వలన
నుత్తమాశ్వములతో నొక తేరువడసి
యత్తఱిఁ బోవుచో నమరత్వమిమ్ము
హోమంబు తుదిముట్టకున్న నాశస్త్ర
సామగ్రి చెడి పరాజయము గానిమ్ము
దారుణంబగుచున్న తపముచేఁ దక్కు
నేరూపమును బొంద దెప్డు నెవ్వరికి
నమర నీయమరత్వ మధికసత్యమున
సమరోర్వి గల్గినఁ జాలు నాకనిన
నతనికిఁ బ్రియముగా నావరంబొసఁగి
శతమఖు విడిపించి జలజసంభవుఁడు
తను గొల్చుకొని వచ్చు దశకంఠు ననిచి
యనిమిషావలితోడ నటు లంక వెడలి
వాడిన మాల్యముల్‌ వదలిన వలువ
వ్రీడానతంబైన విన్నని మోము
గలిగి తన్నొందిన కష్టదుర్దశకు
నలయునట్లున్న యయ్యమరేంద్రుఁ జూచి
చింతింపనేల నీ చేసినపాప
మంతరంగమున సహస్రాక్ష తలఁపు
మేపాపమంటేని యేనెల్లఁ బ్రజల
రూపింప నవవయోరూపాదు లమర
నేజీవజంతువు లేమిటివలన
భాజనంబై యోని బడి మగ్నులగునొ
యని యేనుజీవుల నర్థి‌ వీక్షించి
మనసులు చూడంగ మది విచారించి
యందంద నిర్మించి యందఱు నొక్క
చందమై తోఁచినఁ జాలఁ జింతించి
కనుఁగొన సతి కోర్కి గడవంగ మిగులఁ
దనరిన కోర్కి లేదని తెల్సి చూచి
యది హరియించెడి యత్తన్విగాఁగఁ
మదిఁ గోరి యేనొక్క మానినీరత్న
మన్ని యొప్పులు గొని యందఱికంటె
సన్నుతసౌందర్యసామగ్రి మెఱయ
నభినవనైపుణం బమరంగ నొక్క
సుభగాంగి నిర్మించి చూచెదననుచు
నతిరూపవతిని నహల్యనాఁ బరఁగు
నతివ నిర్మించితి నధికయత్నమున
నేకాంతబుద్ధి నాయింతి నిర్మించి
యే కాంతునకు నిత్తు నింక నీకాంత
నింతికిఁ దగు వరుండెవ్వఁడో యనుచు
నెంతయు మదిలోన నే విచారింపఁ
గనుఁగొని యఖిలదిక్పాలురు సురలుఁ
గొనకొని యుక్తతన్‌ గోర్కి నేతెంచి
నీభామ భార్యగా నిమ్ము నాకనుచు
నాభంగి సురలడ్గ నట వారికీక
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )