ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
వాలిసుగ్రీవుల జననప్రకారము
నీవపేక్షించిన నీకును నీక
పావనచారిత్రభరితుఁడైనట్టి
గౌతముకడకు నాకళ్యాణశీలఁ
బ్రీతిమైఁ గొనిపోయి పెక్కేండ్లు నిలుపఁ
గామవికార మాఘనుని చిత్తమున
నేమియు లేకుంట నెఱిఁగి యాధృతికి
నాతపోమహిమకు నాత్మలో మెచ్చి
నాతన్వి నిచ్చిన ననురాగ మెసఁగఁ
బత్నిగా నతఁడు చేపట్టి యయ్యువతి
రత్నంబు నందనురక్తుఁడై యుండెఁ
గామవికారంబు గదియ నీవంత
నామునిపుంగవు నాశ్రమంబునకుఁ
జని హుతాశనపటుజ్వాల చందమున
గనుపట్టియున్న యాకమలాక్షిఁ గదిసి
తీవ యోలమునకుఁ దివిచి యావెంటఁ
గావించి చనుచోట గౌతముండెఱిఁగి
కనలుచు నతిఘోరగతి నిన్నుఁ జూచి
యొనరిన రోషాగ్ను లొండొండ నిగుడఁ
బరసతియని యంత భావింప కెగ్గు
దొరకొని చేసితి దుష్టాత్మ నీదు
నొడలెల్ల నొక వెయ్యియోనులైయుండి
యెడునంచు శపియింప నింద్ర నీవాత్మ
నెంతయు బెదరు చొప్పెఱిఁగి దేవతలు
నింతట గౌతము నెలమిఁ బ్రార్థించి
యప్పురందరునకు నభయమిమ్మనిన
నప్పుడు గర్హించి యమ్మునీశ్వరుఁడు
తనకుఁ జూడక యెట్లు దప్పద యొరులు
కనుఁగొన నవివేయి కన్నులయ్యెడును
ననవుడు నౌఁగాక యనుచు నాసురలు
జనిరని యట నబ్జసంభవుఁ డెలమి
నఱలేని దయతోడ నదియును గాక
మెఱసి యిట్లనియె నామేఘవాహునకు
నాతి నీకంతట నట గర్భమగుచుఁ
బ్రీతితో నుండంగఁ బెంపేది మౌని
సతిని నీఱుగఁ జూచు సంజ్ఞ నేనెఱిఁగి
యతివేగమున వచ్చి యమ్మునిఁ గాంచి
యతివలు నజ్ఞాన లవిచారమతులు
నతిపాప లతిచంచలాత్మలు గాన
నది విచారింప కీ వనఘ యీవనిత
నదయతఁ జూడంగ నట్లొప్ప దుడుగు
మనఘాత్మ కరుణించి యర్థి‌ మన్నింపు
మినుమాఱు లీతప్పు లీలేమ కనిన
నవుఁగాక మీపల్కు లాత్మఁ జింతించి
యువిద మన్నించితి నుచితోక్తు లెసఁగ
నని గౌతముఁడు పల్క నతని వీడ్కొనుచుఁ
గొనకొని యే నేగఁగోరి యొక్కెడను
నంత నహల్యయు నర్థిఁ బెంపొంది
సంతసంబున నతిసత్త్వసంపన్నుఁ
ద్రిదశేంద్రసముఁడని త్రిదశులు వలుక
విదితవిక్రముఁ గాంచె వేడ్కతో సుతుని
నత్తఱి గౌతముం డాయింతివలన
నత్తలోదరియగు నంజనఁ గాంచి
యేపారియున్నచో నిలయెల్లఁ దిరిగి
యాపద్మబాంధవుం డాయుదయాద్రి
కేతెంచియున్నచో నింతి యహల్య
యాతాపసోత్తము నాశ్రమంబునను
ఋతుమతియై సుచరిత్రయైయున్న
గతిఁ గనుంగొని దివాకరుఁ డంతలోన
నింపార సొంపుతో నిలకు నేతెంచి
తెంపుతోఁ దన యంశుదీపంబు లణఁచి
ఘనతిగ్మరోచుల కడకలు మాని
చనుదెంచి యమ్మునిసతితోడఁ గూడి
యున్నచో గౌతముం డొనర వీక్షించి
యన్నలినాప్తున కలిగి యిట్లనియె
నమృతంబువలన నీ కారాహువునకు
సమరంబు గల్గు నాసైంహికేయుండు
మిడుకంగ నినుఁ బట్టి మ్రింగెడు ననుచు
వడిశాపమిచ్చె నవ్వనజాప్తుఁ డంత
ఘనమైన భీతితోఁ గరములు మొగిచి
మునికులోత్తమ శాపమోక్షంబు నాకుఁ
గరుణించి యీతప్పు గావుమ యనినఁ
బరమేష్ఠిసముఁడైన బ్రహ్మర్షివరుఁడు
పరమకృపారసభరితుఁడై యప్పు
డరయంగ నిది కారణంబునఁ జేసి
యక్కజంబగు శక్తి నట్లొక్కమాఱు
వెక్కసంబుగ రాహు వేడ్క మ్రింగుచును
విడుచుచు నుండెడు విశ్వంబునందు
నుడుగక నిబ్భంగి నుండని పలుక
నంత సూర్యుఁడు వోయె నానాతి యంత
సంతసంబున నొక్క సత్పుత్త్రుఁ గాంచి
యనయంబు హర్షించి యట్లున్న యంత
మునివరుఁ డప్పుడా మువ్వురఁ జూచి
వారికి నామముల్‌ వరుసతో నిడఁగఁ
గోరి విచారించి కోర్కు లింపార
వాసవు వీర్యంబువలన నట్లౌట
జేసి వాల్యాఖ్యచేఁ జెన్నొందు నతఁడు
నుగ్రాంశునకుఁ బ్రేమ నుదయించెఁ గాన
సుగ్రీవుఁ డనుపేర శోభిల్లు నితఁడు
నా మనోరథమార నాకు జన్మించె
నీముగ్ధ కంజనానామమ్ము నయ్యె
నని యిట్లు మునివల్క నలరుచు వారు
గొనకొనియున్న చోఁ గుటిలమార్గమున
మఱియును నొకనాఁడు మౌని యాశ్రమము
చరణాయుధమునట్ల చని నడురేయిఁ
గుయ్యిడ నటు మేలుకొని గౌతముండు
చయ్యన నది కనుష్ఠానార్థ మరుగ
నమ్మునివేషమై యలరి యహల్య
నెమ్మన మలరంగ నీకోర్కి దీర్చు
కేగుచో నంజనయే నిన్నుఁ జూచి
వేగుచున్నంత వేగ వేగుటయు
నత్తఱి నీకుఁగా నాయింతివలన
నుత్తముండగు సూనుఁడొకఁ డుద్భవించె
భీదయారాగముల్‌??? పెనఁగొని యాత్మ
లోఁదలఁ జూపంగ లోలాక్షి యుండ
నట మునియుఁ దన కృత్యంబులుఁ దీర్చి‌
పటుగతి నేతెంచి భవనంబునందు
నున్నచో నంజన యొయ్యన చేరి
విన్నవించిన నీదు వృత్తాంతమెల్లఁ
దన మదినూహించి తాపసోత్తముఁడు
కనుఁగొని రోషాగ్నికణములు దొరఁగ
నడర మున్ని టిదోషమది చాలకిట్లు
చెడుబుద్ధి పరకాంతఁ జెఱిచిన నీదు
నండముల్‌ దెగియు మేషాండుఁడ వగుచు
భండనంబునఁ బట్టువడు శత్రుచేత
నిల నింక నరులందు నీపాప మొదవఁ
గలదందు నర్థంబు గానిమ్ము నీకు
నింద్రత్వపదమును నింతకుఁ దెగుట
యింద్రత్వహానియు నెల్లయింద్రులకు
నరుదుగాఁగల్గు గాకని పల్కి కిన్కఁ
బరుషముల్‌ వల్కుచుఁ బత్ని నీక్షించి
యీతపోవనమున నింతి నాయొద్ద
నీతిమాలిన నీవు నిలువంగఁ దగదు
చతురయౌవనరూపసౌందర్యమదము
కతమున నీవిట్లు గానక నేఁడు
ధృతి చెడి పరుఁ గూడితిటు మహాపాప
మతిఁ బూని నన్నవమానంబుఁ జేసి
కడుఁదప్పుసేసితి గాన నొప్పెల్ల
నెడలలోకము జేర కీవనాంతమున
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )