ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
అగస్త్యుఁడు రామునకు రావణు చరితంబుఁ జెప్పుట
రావణాంతక విను రణశూరుఁడైన
రావణుసుతు వింటి రావణు వినుము
భయదసైన్యముతోడఁ బఙ్త్కికంధరుఁడు
జయకాముఁడై మంత్రి సేనలు గొల్వ
నసమానగతిఁ బశ్చిమాంబుధికడకు
వెస నేగునతఁడు తద్ద్వీపమధ్యమునఁ
దప్తకాంచనదీప్తిఁ దనరి కల్పాంత
దీప్తాగ్ని విధమునఁ దేజరిల్లుచును
అమరులయం దింద్రుఁ డంచితద్యుతుల
నమరుగ్రహంబులం దబ్జబాంధవుఁడుఁ
గరమొప్పు గిరులందుఁ గాంచనాచలము
నరదుగా నిభములం దైరావతంబుఁ
బాదపంబులయందుఁ బారిజాతంబు
వేదంబులందు ఋగ్వేదంబుఁ బోలి
యెల్లమూర్తులయందు నేమూర్తి వెలుఁగు
తెల్లంబుగా నందు దీపించువాని
విపులనాసంబును విశదదంతములుఁ
జపలంబులైన పిశంగనేత్రములు
నాజానుబాహులు నరుణాంబుజంబు
యోజఁ జెన్నగు మోము నురుతరాంగములుఁ
గంబుసోదరమైన కంఠంబు నఱుతఁ
???బంబినరుచినొప్పు పద్మదామకముఁ
బద్మరాగారుణప్రభ లుర్విఁ బర్వ
బద్మాంకముల నొప్పు పాదపద్మములు
మణిపుంఖదేదీప్యమానాశుగములు
రణితఘంటాభీకరములైన దొనలు
వాచాలకింకిణీవలయంబులైన
వీచోపులును గల్గి విలసిల్లువానిఁ
దలఁపంగ నూరుల ధర్మంబుఁ దపము
విలసిల్లు కటియందు విశ్వదేవతలుఁ
బూని మేహనమునఁ బుష్పసాయకుఁడు
దాని రంధ్రంబునఁ దగు ప్రవాహములుఁ
బెనుపాఱు వీఁపునఁ బితృసమూహంబు
మొనయు నస్థిస్థానమున మరుద్గణము
నసమానగతిఁ గుక్షి నబ్ధులు నదులు
వసువులు ప్రక్కల వరుస దిక్కులును
గన్నుల రవిశశుల్‌ ఘనతరాస్యమునఁ
జెన్నొందు రుద్రులుఁ జెవుల నశ్వినులు
భాతిగా నతిచండ బాహుదండముల
ధాతవిధాతలు దైవతాగ్రణులు
మణిబంధయుగమున మహితవజ్రంబుఁ
బ్రణుతహస్తంబుల భగుఁడుఁ బూషణుఁడు
భాసురనఖపఙ్త్కిఁ బరఁగు శేషుండు
వాసుకియును నహీశ్వరుఁ డశ్వతరుఁడు
ఘనుఁ డిలావంతుండుఁ గర్కోటకుండు
ఘనులు విశాలాక్ష కంబళాదులును
నక్షీణవిషదీప్తుడగు ధనంజయుఁడుఁ
దక్షకుండును నుపతక్షకాహ్వయుఁడు
రోమజాలంబుల రుచిర గోహోమ
భూమిదానాదిక పుణ్యదానములు
మేదురు ద్యుతులొప్పు మేనఁ గానమ్ము
వేదవేదాంగాది వివిధవిద్యలును
నేతెఱంగున నెందు నెప్పు డెవ్వరికి
ధాత వరం బెట్లు తప్పింపవచ్చు
మున్నుఁ బుట్టినవాఁడు ముందటఁ బుట్ట
నున్న వాఁడును దేవయోనులయందు
నిరవద్యసిద్ధులు నిఖిలాధ్వరములు
వరమూర్తులొప్పార వర్తించువానిఁ
గనుఁగొని యతిచిత్రగతి నంజనాద్రి
కనకాద్రి నిమ్ముల గదిసెనో యనఁగఁ
బట్టిన యలుగుల పటుదీప్తులడర
నట్టహాసముతోడ నవ్వీరుఁ గదిసి
కడు వాఁడికత్తులఁ గనలు శూలముల
బెడిదంపుటీఁటెల బెనుపట్టసముల
నరుదార నొప్పింప నప్పుడవ్వీర
వరుఁడునుఁ బులిచేత వడి వ్రేటువడిన
కరివైరివిధమునఁ గరభంబుచేత
సరి దాకువడిన కుంజరముచందమున
ఘోరవారణముచేఁ గోరాడఁబడియు
గారవం బెడలని కనకాద్రిభంగి
నంబువేగంబున నాహతంబైన
యంబుధిచాడ్పున నతికృద్ధుఁడగుచు
నోరి రావణ నీ మదోద్ధతి యెల్ల
వారించి పుచ్చెద వడి నిల్వుమనుచుఁ
గల్పాంతనిర్ఘాతకల్పమై తాఁక
నల్పపీడితముష్టి నలవోకఁ బొడిచెఁ
బిడికిటఁ బొడిచినఁ బెల్లు మూర్ఛిల్లి
పడిన యాదశకంఠు బలము వే తోలి
మలయుచుఁ బాతాళమార్గమైయున్న
బిలములోపలఁ జొచ్చెఁ బృథులవేగమున
నంత దశగ్రీవుఁ డామూర్ఛఁ దెలిసి
యంతలోనన లేచి యసురులఁ జూచి
పటుముష్టి నన్నాజి పరవశుఁ జేసి
యెటపోయె నవ్వీరుఁ డెఱిఁగింపుఁడనిన
రావణమంత్రు లారావణుఁ జూచి
దేవ పోరాని యా తెరువులేమిటికి
దేవాసురాదులఁ దీవ్రదర్పమున
వావిరి గెలువంగ వలఁతి యాఘనుఁడు
భావింపఁ బోఁ బోలుఁ బాతాళమునకు
నావీరుఁడిందుగా నరిగె నీబలము
ననవుడు మగఁటిమి నమ్మహాబలుఁడు
ఘనఖడ్గపాణియై గరుడవేగమునఁ
దక్కక యాబిలద్వారంబుఁ జొచ్చి
యక్కడఁ జని చని యందొక్కచోట
మేటిమేనుల మించు మేచకద్యుతులు
కాటుకకొండల గతి నుల్లసిల్ల
మహనీయకేయూరమణిముద్రికాది
బహుభూషణంబులుఁ బ్రణుతవస్త్రముల
రక్తగంధంబుల రక్త మాల్యముల
రక్తిమైఁ గైసేసి రాజిల్లు ఘనులు
వెండియు నొకచోట వివిధమండనము
లొండొండ వెలిఁగెడు నుజ్జ్వలాకృతులఁ
బోఁడిగా ధరియించి పొలుపారుచున్న
మూఁడుకోటుల సదా ముదితమూర్తులను
మఱియు నొక్కెడ భాసమానవర్గముల
మెఱసి యగ్నుల భంగి మేనులు వెలుఁగ
లీలమైఁ దెలిపించు లేజవ్వనముల
నోలి వినోదించుచున్న యంగనల
వేఱొక్కచోఁ దన విపులప్రతాప
మాఱించి వచ్చిన యవ్వీరుతోడ
సమవర్ణ సమరూప సమబాహుబలులు
సమపరాక్రములు నాఁ జను చతుర్భుజులఁ
బొడఁగాంచి భయజాత పులకాంగుఁడగుచుఁ
దడయక తద్బిలద్వారంబు వెడలె
వెలువడి మఱియు నవ్వింశతిభుజుఁడు
బిలబహిస్థలి నొక పృథులతల్పమున
దివ్యభూషణములు దివ్యాంబరములు
దివ్యగంధంబులు దివ్యమాల్యములు
ధరియించి చంద్రికాధవళమై పొలుచు
మురిపెంపు వెలిపట్టు ముసుఁగు రాఁ దిగిచి
నిదురవోవుచునున్న నిరుపమాకారు
నుదితతేజోనిధి నొక్కని గాంచి
యావీరు చేరువ నభినవరూప
లావణ్యములఁ బుణ్యలక్షణంబులనుఁ
బరమపాతివ్రత్య భవ్యశీలముల
నిరవంద నుతిగన్న యిందిరాదేవి
కుసుమగంధాదుల కొమరారి యఱుతఁ
బసిఁడితామరపేరు పస నారవైచి
మణికంకణోత్కర మధురఝంకార
రణితహస్తంబున రమణీయలీల
ధవళ చామరమొప్ప ధరియించి సకల
భువనైకభూషణస్ఫూర్తి నొప్పుటయు
నటఁ జూడ్కి సుడివడ నాజగజ్జననిఁ
గుటిలాత్ముఁడై పట్టుకొన విచారించి
యందఱు మంత్రుల నవులఁ బోఁ బనిచి
కందర్పవశగుఁడై కడక నొక్కరుఁడ
యోలి విషజ్వాలలొల్క నిద్రించు
కాలసర్పముఁ జేరు గతిఁ జేర నరిగి
ముట్టి డాయకమున్న ముసుఁగెడలించి
యట్టహాసముఁ జేసె నమ్మహాబలుఁడు
దానికి మూర్ఛిల్లి ధాత్రిపై వ్రాలి
యానిశాచరుఁడున్న యమ్మహాఘనుఁడు
నరనాథ మొదలంట నఱకుడు వడిన
తరువునట్లొరిఁగిన దశకంఠుఁ జూచి
యమరకంటక నిన్ను నంటంగఁ బొదివి
సమయింప నిప్పుడు సమయంబు గాదు
బ్రహ్మచే నీ కన్న పాపంపు వరము
బ్రహ్మకు మాఱుగా బ్రతికించె నిన్ను
బ్రహ్మ మాన్యుఁడు గాన బ్రహ్మవాక్యంబు
బ్రహ్మకుఁ బ్రియముగాఁ బాటింపవలయు
బ్రహ్మపల్కిప్పుడు పాటించి మీఁద
బ్రహ్మాదిసుర లడ్డుపడిన నిన్నణఁతు
నెట్టన నాచేత నీల్గుదీవనిన
నెట్టకేలకుఁ దేఱి యెప్పటియట్లు
నిట్టూర్పు వుచ్చుచు నెసఁగు దీమములు
నిట్టులగా భీతినేత్రముల్‌ మూసి
వెఱవక పొమ్మన్న విని కన్ను దెఱచి
వెఱపుతోఁ జేతులు వెస మోడ్చి పలికె
బాహుదర్పంబున బలమున నసమ
సాహసంబున నీదు సరి యెందుఁ గానఁ
బ్రళయాగ్నిశంకకుఁ బట్టైనవాఁడ
వలఘుతేజోమూర్తి వనఘ యెవ్వఁడవు
నీపేరు వినిపింపు నిజముగా ననిన
నాపల్కువిని నవ్వి యవ్వీరవరుఁడు
ఘననాదగతిఁ గర్ణకర్కశంబైన
ఘనతరధ్వని బఙ్త్కికంఠుతో ననియె
నిప్పుడు నాపే రదేల నాచేతఁ
దప్పదు మరణంబు దశకంఠ నీకు
నెప్పుడు నాచేత నిలఁ గూలెదీవు
నప్పుడెఱింగెద వమరారి నన్ను
వనుఁడు వెండియు నాదశాస్యుఁ డాఘనుని
గనుఁగొని మదిలోన గర్వించి పలికె
యుద్ధంబులో నిన్ను నోర్వంగఁ జాలు
నిద్ధతేజుఁడు గల్గునే విచారింప
బ్రహ్మతేజంబునఁ బాటేలకల్గు
బ్రహ్మకు మనుమఁడౌ పఙ్త్కికంఠునకు
నట్లైన నీచేత నగునట్టి మరణ
మెట్లును గీర్తి నా కెల్లలోకముల
నని పల్క మఱియును నమ్మహామహుని
తనువునఁ బితృదేవతలు మరుత్తులును
వసువులు రుద్రులు వఱలు తేజమున
నెసఁగు నాదిత్యులు నెల్లదేవతలు
వెలుఁగు మూఁడగ్నులు వివిధరూపములు
నెలకొన్న విద్యలు నిఖిలవేదములు
సర్వపర్వతములు సర్వవారిధులు
సర్వసరిత్తులు సర్వసంయములు
సర్వగంధర్వులు సకలచారణులు
సర్వసిద్ధులు సర్వసాధ్యసంఘములు
గ్రహములు నక్షత్రగణములు నభము
నహిపతుల్‌ గరుడుఁడు నశ్వినుల్‌ సురలు
నసురవర్గంబులు నఖిలరాక్షసులు
నసమానగతిఁ దోఁప నన్నిలోకములు
నరుదారఁ బొడఁగని యతిభీతుఁడయ్యె
సురవైరియని కుంభజుండు చెప్పుటయు
నామునీంద్రునితోడ నవనీశుఁ డనియె
నీమహామహిమ నాకెఱిఁగింపవలయు
దాననాదులఁ బట్టి దర్పంబు లణఁచు
పూనికగల దివ్యపురుషుఁడెవ్వాఁడు
పరికింప బిలభూమి భామలుఁ దారు
వరుస వినోదించువా రెవ్వరనిన
మును దశాస్యుని నల్పముష్టిఘాతమున
వెస మూర్ఛఁ బొందించి బిలములోఁ జొచ్చి
యందు నాతఁడు వచ్చి యందున్నవారి
చందంబుఁ గని నిల్వ శంకించి వెడలి
వెలి ద్రోచి క్రమ్మఱ వెస నట్టహాస
కులిశపాతంబునఁ గూల్చిన యతఁడు
ఘనుఁడైన కపిలుండు కపిలుఁడు ననఁగ
మనుజేంద్ర నీవు నీమహిమ యంతయునుఁ
జక్రగదాఖడ్గశార్ఙ్గముల్‌ గేల
విక్రమక్రీడల విలసిల్లువాఁడు
నభవుఁడు శాశ్వతుం డసమానుఁ డనఁగఁ
ద్రిభువనాధీశుఁడై దీపించువాఁడు
భూతకోటులనెల్లఁ బుట్టింపఁ బెంపఁ
బ్రాతి యడంగింపఁ బ్రభుఁడైనవాఁడు
కారణభూతమై కర్మజాలముల
మేరల సకలంబు మెలఁగించువాఁడు
వేదముల్‌ గనువాఁడు విష్ణుండు కపిలుఁ
డాదినారాయణుండైన యాఘనుఁడు
జిహ్వలు శిఖలుగాఁ జెలువారుచున్న
గహ్వరవాసులు కపిలనందనులు
నట్టి యాకపిలుచే నవలీలఁ దనరు
గట్టి మానము దూలి కడు విన్నఁ బోయి
మరలంగ నేతెంచి మంత్రులుఁ దాను
బురికి నారాక్షసపుంగవుం డరిగె
నన విని రఘురాముఁ డటఁగొల్చియున్న
వినుతవిక్రములైన వీరపుంగవులు
వెరగంది రమ్మహావృత్తాంతమునకు
మఱియు నగస్త్యుఁ డామనుజేంద్రుఁ జూచి
భూలోకనాథ యీభూరివిక్రముఁడు
నాలోక సురలోకుఁ డౌనింద్రజిత్తు
కైలాసచాలనక్షమబాహుఁడైన
త్రైలోక్యకంటకు దశకంఠు వింటి
యాయిరువురకంటె నధికవీరుండు
వాయుతనూజుఁడీ వానరోత్తముఁడు
నాతతసత్త్వంబు నతులవిక్రమము
నీతియు బుద్ధియు నిఖిలవిద్యలును
మహితప్రభావంబు మారుతికరయ
సహజంబు లతనికి సరియె తక్కొరులు
జానకి వెతకంగ సకలవానరులు
నే నేన యని పూని యేపుతో నడరి
రంగదుత్తుంగతరంగమై పొంగి
నింగితో రాయు నానీరధిఁ జూచి
వెలవెల నగుటయు వెఱవకుండనుచు
నలఘువిక్రమశాలియైన యాఘనుఁడు
జవమున లవణాబ్ధి శతయోజనంబు
లవలీల లంఘించి యట లంకఁ జొచ్చి
జనకజఁ బొడఁగాంచి సకలంబుఁ జెప్పి
వనపాలకులఁ జంపి వనమెల్లఁ బెఱికి
లంకేంద్రుతనయులఁ లలి మంత్రివరుల
గింకరకోట్లను గీటణంగించి
బంధనముక్తుఁడై పలుకులఁ బఙ్త్కి
కంధరుఁ గెరలించి కడు మేను వెంచి
వాలిన యాలంక వడి నీరుచేసి
పౌలస్త్యుఁ నగరెల్లఁ బయలుగాఁ జమరి
సీతకంతయుఁ జెప్పి సేమంబుఁ గొనుచు
నేతెంచె నింతవాఁ డెవ్వఁడు గలఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )