ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
అహల్యకు గౌతముఁడు శాపమిచ్చుట
వే పోయి పాషాణవేషంబునొంది
యాపదఁ బడుచుండుఁమని శాపమిచ్చె
నంత నహల్యయు నావాక్యములకు
నెంతయు భీతి మునీంద్రుతో ననియెఁ
గపటియై నీరూపుఁ గైకొని యింద్రుఁ
డపరాధ మొనరించు టదియు నేనెఱుఁగ
నజ్ఞానకృతమైన యన్యాయమగుట
విజ్ఞానమయమనోవీథి నీక్షించి
మన్నింపఁదగునన్న మది విచారించి
యన్నాతిపలుకుల కనియె గౌతముఁడు
వసుమతి నిక్ష్వాకువంశంబునందుఁ
బొసఁగంగ రాముఁడై పుట్టి విష్ణుండు
సమ్మదంబున లోకసంరక్షకొఱకు
నిమ్ములఁ జనుదెంచు నీవనంబునకు
సుభగి యాతనియంఘ్రి సోఁకినయపుడు
శుభమూర్తి వగుదీవు శుద్ధాత్మవగుచుఁ
గ్రమ్మఱ నెలమి నా కడకు నేతేర
నెమ్మిఁ గైకొనియెద నిన్నంచుఁ బలుక
నత్తన్వి మఱియు నిట్లనియె నాతాప
సోత్తముఁ గనుఁగొని సురుచిరాకారుఁ
డైన యీబాలుని యాముగ్గురట్లుఁ
గనుఁగొని దయతోడఁ గరమర్థి పెంపు
మనవుడు విమలాత్ముఁ డట్లగుఁగాక
యనుచు నెయ్యముతోడ ననియెఁ బెంపొంద
నీతఁడు శతమన్యు నింద్రియంబునకుఁ
బ్రీతితో జన్మించెఁ బెంపెసలార
నటుకాన నితఁడు శతానందుఁడనఁగఁ
బటుకృపామూర్తియై పాటిల్లుఁగాక
ఇయ్యింద్రసుతునకు నీయర్కజునకు
నయ్యెడు దేహాంతమందు సహస్ర
లోచనకిరణుల లోలీయ మెసఁగ
నాచతురాత్ములే యవనిలో నుగ్ర
వనచరరూపులై వాలిసుగ్రీవు
లనెడు నామములతో నతిపరాక్రమము
సేయుచు నొకయింతిఁ జెలువారఁ బొంది
యాయింతికై వాలి యనిలోనఁ బరుని
చేత నీల్గెడునని చెచ్చెర వాలి
కాతతంబుగ శాప మట్లిచ్చె నంత
భ్రామకభరిత సంప్రాప్తులై వారు
నామహామునినాథు నర్థిఁ బ్రార్థించి
క్షమియింపు మనవుడు సంయమీశ్వరుఁడు
కమలాప్తతనయ సంక్రందనసుతుల
వినయోక్తులకు మెచ్చి విబుధసన్నిభుఁడు
తన మది కరుణ యెంతయుఁ దోఁపఁ బలికె
నిద్ధతేజంబుల నిట్లొప్పి మీరు
శుద్ధాత్ములగుచును సురపతిసూర్య
వరుల కత్తెఱఁగును వారక చెప్పి
కరమొప్ప బలపరాక్రమములు మెఱయ
వారికి నుదయించి వరకపిమూర్తు‌
లారంగఁ దాల్పుఁడ యభినవంబొదవ
ననుచు నమ్ముని వారి నంతటఁ బాసి
చనిన వా రంజనఁ జాలఁ గోపించి
నీకతంబున మాకు నీఘోరశాప
మీకర్మఫలము దా నిటుసంభవించెఁ
గన్నియరో నీవు కపివీరుఁడైన
యన్నగచరవరు నర్థి‌ వరించి
యతివ జగత్ప్రాణుఁడైన యాపురుషు
కతమున శివవర్యకలితుఁడైనట్టి
సుతుని వానరవరశూరుని గనుము
వితతంబుగా నంచు వెస శాపమీయ
సుగ్రీవుఁడెంతయు శోకించి యపుడు
అగ్రజు వాలి నహల్యను జూచి
యక్కట యీకన్య కలుగంగనేల
పెక్కు కర్మంబులఁ బెంపేది మనము
విధినియుక్తంబు గావింపనట్లగుచుఁ
బదపడి కర్మంబు ప్రాప్తించుచోటఁ
దొలఁగినఁ బోవునె తుది నీశుఁడైనఁ
లలి మీర నేనైన లక్ష్మీశుఁడైన
దన కర్మమునకును దాఁ గర్తగాక
కనుకని పరులకు గారణంబేమి
యని దూర వగచి తా నంజనఁ జూచి
వినయంబు దైవాఱ వేడ్కనిట్లనియె
నతిముగ్ధమతివైన యతివ నీకిట్టి
యతిదుష్కృతంబు దాన వని వాటిల్లె
నతిసత్త్వుఁ గాంచెద వఖిలసంగ్రామ
చతురవిక్రముఁడైన శాఖామృగేంద్రు
నతఁడు నాకిష్టుఁడు నగునట్లు గాఁగ
మతితోడ నిచ్చి న న్మన్నింపవలయు
ననవుడు నౌఁగాక యని ప్రభాకరుని
తనయుని వీక్షించి తరుణి యిట్లనియె
నా తనూభవునకు నరయంగ మీరు
మాతులుల్‌ గారె మమ్మరసి రక్షింప
నే తెఱంగునఁ గర్త లిందెవ్వరింక
నీతలం పిటమీఁద నెఱయ నెట్లగునొ
యనవుడు సుగ్రీవుఁ డౌఁగాక యనుచు
ననయంబు హర్షించి యవ్వాలిఁ గూడి
చనిరి వా రింద్రుని సన్నిధి కంతఁ
జని తమకైనట్టి శాపప్రకార
మును దమకయ్యెడు మోక్షంబు తెఱఁగు
వినిపించి వానరవీరుల రూపు
ధరియించినారు ముందట మేను విడిచి
పరమాత్ములై వారు వసియింతు రెలమి
నంత నహల్యయు నటఁ దన శాప
మంతయుఁ గైకొని యాసమీపమున
శిలభావమైయుండెఁ జెచ్చెఱ నంత
సలలితానుష్ఠానసంపన్నుఁడైన
గౌతమఋషి తనకైన పత్నీత్వ
వితథంబునకుఁ జాల విహ్వలుఁడగుచు
నంజన నాశతానందుఁ దోడ్కొనుచు
రంజిల్లు మిథిలేశు రాష్ట్రంబు చేరి
మెలఁగుచునున్న నామెయి జనకుండు
వలనొప్ప నేతెంచి వరమునీశ్వరుని
గనుఁగొని ప్రార్థించి ఘనశతానందు
నినసముఁ దోడ్కొంచు నేగె నేగుటయు
నంత నాగౌతముం డంజనఁ జూచి
సంతాపచిత్తుఁడై సౌభాగ్యలీలఁ
దనరెడు నీయింతిఁ దరుచరునకును
గొనకొని మూర్ఖతఁ గోరి యెట్లిత్తు
హా దైవమా యంచు నతిదుఃఖమంది
మేదినిపై విధి మీఱంగరామిఁ
దలపోసి తన బుద్ధిఁ దగ విచారించి
యలయక ఘనగిరులందుఁ గ్రుమ్మరుచుఁ
జని చని యా మేరుశైలంబు పొంత
ఘనుండు కేసరియను కపివరాగ్రణిని
విదితంబుగాఁ జూచి విమలవర్తనము
సదమలగుణయుక్తి సంతతాచార
చరితంబు వినయంబు సద్భక్తి యుక్తి
భరితంబు గని మెచ్చి భార్యగా నిచ్చి
సలలితచిత్తుఁడై సంతోష మొదవ
నెలమితోఁ గనకాద్రి కేగె నమ్మౌని
నాఁ డంత గావించినాఁడవు గాన
నేఁడు శాత్రవుచేత నీకింత వచ్చె
నది గాన వైష్ణవయాగంబు చేసి
పదపడి సకలపాపంబులఁ బాయు
నీలోకముననందు నీ తనూజుండు
నాలంబులోఁ జిక్కఁ డభియాతిచేతఁ
దాత పులోముండు దప్పించి తెచ్చి
యాతని దాఁచినాఁ డబ్ధిమధ్యమున
నని పురందరు చిత్త మలరంగఁ బలికి
తన లోకమునకేగెఁ దదనంతరంబ
పాకశాసనుఁడును బ్రహ్మ వాక్యంబు
గైకొని నియతి నాక్రతువుఁ గావించి
యనఘాత్ముఁడై యుండె నమరలోకమున
నని యింద్రువృత్తాంత మంతయుఁ జెప్పి
యమరేంద్రు గెలిచిన నతని నన్యులకు
సమరంబులో గెల్వ శక్యమే యనిన
మేఘనాదుని లావు మిగుల మేలనుచు
రాఘవుల్‌ పలుకంగ రవిసుతాదులును
వెఱగంది రాతని విక్రమంబునకు
మఱియు నగస్త్యుఁ డమ్మనుజేంద్రుఁ జూచి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )