| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
కమలాక్షి విను తొల్లి గరళకంధరుఁడు విమలమై తన మది వేడ్కలింపొందఁ దన వినోదారామధరణీస్థలమున కొనరఁ బార్వతితోడ నురువేడ్క వచ్చి తరుల నీడల వినోదం బాడియాడి యిరువురుఁ దమలోన నేపు దీపించి కొలఁకులఁ గ్రీడించి కొమరు దీపించి యళులు మ్రోయఁగ మించునపు డుల్లసించు బహుపుష్పముల సౌరభము గ్రోలి క్రోలి మహనీయహర్షాబ్ధి మదిఁ దేలి తేలి చందమై సంపూర్ణచంద్రుఁడుగాను మందవాయువు వీవ మది సంతసిల్లి గొనకొని మర్కటకూటంబుఁ గాంచి మనమునఁ బ్రియమంది మగువ యీశునకు వినిపించి వేడ్క నీవిధము వుట్టెడిని ననవుడు హరుఁ డంతనౌఁగాక యనుచు నెనసిన వేడ్కతో నేర్పడఁ బలికి పూనిన వేడ్క నిర్వురుఁ దారు నట్లు వానరరూపులై వరుసఁ గ్రీడించి జానొప్ప నెంతయు సౌఖ్యంబుఁ గాంచి తమ తొంటిరూపముల్ దాల్చి నిల్చుటయుఁ గ్రమమొప్ప గౌరికి గర్భమెంతయును దొరకొని బరువైనఁ దుదిఁ దాల్పలేక పరమేశుతో వ్రేఁగుపడుచు నిట్లనియె నీ వరగర్భంబు నే మోవఁ జాల దేవర దీని నెందేనియు నిడుము కాదేని మీరైనఁ గైకొని ప్రేమ తో దీని ధరియింపుదురు గాక ప్రీతి ననుడు పార్వతిఁ జూచి హరుఁడు నవ్వుచును నొనర నాగర్భంబు నుర్విపైఁ బెట్టెఁ గొంతకాలము మోచికొనియుండి ధాత్రి కాంత శంకరునకుఁ గడుభక్తి మ్రొక్కి యవధారు కులగిరు లంబుధులేడు వివిధంబులగు మహావృక్షముల్ నదులు స్థావరంబులు మణిజంగమాదులును మోవంగ నోపుదు మోదంబుతోడఁ దగు గర్భమిది యేను దాల్పంగఁ జాల నగసుతాధవ దయ ననుఁ గావుమనుడుఁ జిఱునవ్వు మోమునఁ జింది దైవాఱ నఱిముఱి నాగర్భమందుక శివుఁడు వేయేండ్లు ధరియించి వెస దాని బుఁచ్చి నాయతి నాకిచ్చె నట నేను వేయు వరుసముల్ ధరియించి వారకయున్న తఱి నీవు పుత్రసంతానేచ్ఛ నన్ను గుఱిచి వేఁడితిగాన కోర్కి దైవాఱ ధరియింపుమనుచును దన చేతనున్న వరగర్భఫలమును వాయుదేవుండు గురుదయాంచితబుద్ధిఁ గోమలి కొసఁగి చనిన పిమ్మట సంతసమ్మంది యింతి తన మందిరమునకుఁ దా నేగుదెంచి ద్వాదశమాసముల్ తగఁ జన్న పిదప నాదట సుతుఁ గాంచె ననురాగలీల ఘనతపోమహిమచేఁ గన్న యాత్మజుని గనుచాటుగా నుండఁ గనుజాటు వెట్టి యంతఁ బండులుదేర నంజనాదేవి కాంతారమున కేగఁగా వేడ్క నతఁడు శరభంబు గర్జించు చందంబు దోఁప వరుసఁ బేరాఁకట వాపోవుచుండి భూరిజపాపుష్పపుంజంబు కరణి నారంగ నుదయాద్రియం దొప్పుచున్న చండాంశుఁ బొడఁగని చటులవేగమునఁ బం డనువేడుకఁ బట్టంగ నెగసి యర్కున కభిముఖుండై మింట నరుగఁ దర్కించి సురసిద్ధదనుజసంఘములు వైనతేయునకును వాయుదేవునకు మానసంబునకు నీ మారుతాత్మజుఁడు నింతవేగముగలఁ డితఁడు బాల్యమున నింతవాఁ డిటమీఁద నెంతవాఁడగునొ యిట్టి సత్త్వంబును నిట్టి ధైర్యంబు నిట్టి శౌర్యముగాన మెవ్వరియందు వినము గానమునంచు విస్మయంబంది కనుఁగొనుచుండంగఁ గడకతో నపుడు కొడుకును నర్మిలిగూడి వెన్దగిలి వడి వచ్చుచున్న యా వాయుదేవుండు వీఁక నుష్ణాంశుని వేఁడిమి నడుమ దాఁకి శరీరంబు దపియింపకుండ గమనవేగంబునఁ గలయంగఁ బొడము చెమట చిత్తడి పొడిసేయుచుఁ బొలయ లీల నవ్వీరుండు లెక్కింపఁ బెక్కు వేలయోజనములు వెస నాక్రమించి యవిరళగతి రశ్ము లడరఁ గైకొనక రవి చేర నరిగె నారవియు వీక్షించి బాలుండు గావునఁ బఱతెంచెఁగాని పోల నీతఁడు దుష్టబుద్ధి రాఁడనుచు నార విచారించి యంశుజాలముల మారుతసుతు మేను మాఁడింపఁడయ్యె నాభీలగతి నప్పు డంజనాతనయుఁ డాభానుబింబంబు నరుదారఁ బట్టె గ్రహణపర్వము నాఁడె కావున రాహు వహిమాంశుఁ గబళింప నట కేగుదెంచి దినకరుండున్న యాతెఱఁగెల్లఁ జూచి హనుమంతుఁ డదలింప నతిభీతుఁడగుచుఁ జంద్రార్కభయదుఁడై చలియించు రాహు వింద్రలోకమునకు నేగి కొల్వున్న బురుహూతుఁ గనుఁగొని బొమలు గీలించి పరుషవాక్యంబులఁ బల్కి రోషమున రాకాసుధాకరు రవి నమావాస్య నాకాఁకటికి నీవు నాఁడిచ్చి నేఁడు నానోట కడివుచ్చి నాకేంద్ర యొరున కీ నీకు నుచితమె యిపుడొక్క రాహు నాకంటె మునువోయి నలినబాంధవుని గైకొనియున్నాఁడు కడిమితో ననిన నాపల్కులకు మండి యాఖండలుండు కోపరక్తాక్షుఁడై కొలువు చాలించి కీలాకరాళమై కేలవజ్రంబుఁ గ్రాలంగ సంచితగాత్రుఁడై పొలిచి పన్ని తెచ్చిన తన భద్రసామజముఁ బన్ను గాఁ గరిరాజపట్టంబు దాని కైలాసగిరిఁ బోలు గాత్రంబు దాని నాలుగుకొమ్ముల నలినొప్పు దాని ఘనతరోన్నతి మింటఁ గడచిన యట్టి యనువైన యౌన్నత్య మమరెడు దాని మదములొల్కెడుదాని మదగంధములకు ముదముతోఁ దుమ్మెదల్ మొగి మ్రోయుదానిఁ బొందిన రవిచేతఁ బూర్వాద్రిభంగి సిందూరతిలకంబుచే నొప్పుదానిఁ గనకరశ్ములఁ బొల్చు ఘంటలదాని ఘనతరోన్నతి మిన్ను గడచినదాని నైరావతమునెక్కి యధికతేజమున నారాహు మున్నుగా నాదిత్యుకడకుఁ జనుదేర నప్పుడా సైంహికేయుండు ననతిదూరంబున హనుమంతుఁ గాంచి వడిమీఁద బఱతేర వనజాప్తు విడిచి కడిమి నతఁడు వానిఁ గనిపెట్ట నెగసె నంత కంఠీరవ మలుకతో నెగయ నెంతయు వడిఁ బాఱు నిభముచందమున నింద్ర యింద్రా యంచు నెసఁగిన భీతిఁ జంద్రారి పఱతేర జంభారి చూచి సైంహికేయా భీతి సంచలింపకుము సంహరించెద వీని సమరోర్వి ననుచుఁ గమకింప మిక్కి లగ్గలికతో నతఁడు నమితవిక్రమశాలియై సంభ్రమించి యీపండు కడు దోర యిది సారమనుచు నేపున నయ్యింద్రు నిభమున కెగసి ప్రళయకాలమునాఁటి పావకు భంగి బలువిడిఁ గవయు నప్పవనుని భంగి వజ్రమహోజ్జ్వలజ్వాలలు నిగుడ వజ్రంబుఁ గొని పూన్చివైచె వైచుటయు నది దాఁకి దాపలి హనువెల్ల విఱిగి యుదయాద్రిపైఁ గూలె నురుమూర్ఛతోడఁ బుత్రు దైన్యముఁ జూచి పొడము నయ్యలుక వృత్రారిపై నల్గి వెస గంధవహుఁడు ప్రజలనందఱ యాగపశువులభంగి నిజగతి నూర్పులు నిగుడంగనీక యుగ్రుఁడై తనుసంధు లొండొండ విఱుగ నిగ్రహించినవారు నిశ్చేష్టులైరి జగములన్నియు ననుష్ఠానముల్లేక నిగమశాస్త్రంబులు నెరపంగ లేక నిత్యకర్మంబులు నెరిఁ జేయలేక యత్యంతశూన్యంబు లైయుండిరంత ఫలములు వెసఁ గొంచు బద్మాయతాక్షి యలరెడు వేడుక నాశ్రమంబునకుఁ జనుదెంచి పల్లవశయ్యపైఁ గూమిన్ తనయుండు లేమికిఁ దద్దయు వగచి యెక్కడఁ బోయెనో యీకుమారకుఁడు అక్కటాయంచు నాయడవిలోనెల్లఁ ద్రిమ్మరి కానక ధృతి దూలి తూలి క్రమ్మిన శోకాగ్ని గడు వేగుచుండ భద్రేభగామిని పతియైనయట్టి యద్రిచరశ్రేష్ఠుఁడైన కేసరియుఁ తన మనోవీథి నెంతయుఁ గాంచి చూచి యనిలవరాత్మజుం డాయుదయాద్రిఁ గందుకచంద్రికాగతి నొప్పు భాను నందంబు గని ఫలంబను కాంక్షఁ జేసి యాఁకటిపెల్లున నట నీవు లేమి సోఁకోర్వలేక నాసూర్యబింబంబు బండని తలఁచి దోర్బలశక్తి నెగసి చండాంశుకడ కేగి జంభారిచేత హతుఁడయ్యెనని మఱి యటమీఁద నడుచు కతయంతయును బ్రియకాంతకుఁ జెప్పి యూరార్చి నెమ్మదినుండె నున్నంత మారుతిచేతను మానముల్ దూలిఁ బంధురతేజముల్ పరివోయి దివిజ గంధర్వయక్షరాక్షసముఖ్యులెల్లఁ గడుభీతితోఁ గూడి కమలసంభవుని కడకేగి వినతులై కరములు మొగిచి మొగి బహుస్వేదజంబులు నండజములు నొగి జరాయుజములు నుద్భిజ్జములును ననఁగ నాలుగుజాతులైన జంతువులు మును మమ్ము నిర్మించి ముదముతో మాకు నాయువు లొగినిచ్చి యాయుష్యములకు వాయుదేవుని నధీశ్వరుఁ జేసి తెలమి నాతండు మీయాజ్ఞ నఖిలజంతువుల భాతిగా నదిమొదల్ పాటించుచుండి యే వెంటనో మాకు నింతనిగ్రహము గావించె నిప్పుడా గంధవాహుండు దేహగేహద్వారదేహళీసీమ నూహింప లోపడియుండుటఁ జేసి యవరోధముననున్న యంతఃపురంబు నువిదల యెలుఁగులు నూర్పుల నలవె దేవ ప్రజానాథ దేవ లోకేశ మా విన్నపము విని మమ్ము రక్షింపు వాయుపీడితులమై వచ్చిన మాకు నీ యుగ్రనిగ్రహ మిప్పుడు వలదు అని విన్నవించిన నా వాక్యములకు వనరుహగర్భుండు వారితో ననియె వినుఁడు మీరిట్లైన విధమెల్లఁ దెలియ ననిలున కంజన యనుదాని వలనఁ గలిగెఁ దనూజుఁ డాకపిబాలకుండు ఫలకాంక్ష నాదిత్యుఁ బట్టెఁ బట్టుటయుఁ గని రాహు దేవేంద్రు కడకు వేగంబె చని నేఁడు నూతన స్వర్భానుఁ డొకఁడు భానుఁ బట్టినవాఁడు పర్జన్య వచ్చి వాని నివారింపవలయు నీవనిన గాసిల్లి యతఁడున్న కడ కేగుదెంచి వాసవుఁ డురుఘోరవజ్రఘాతమునఁ బరవశుఁగాఁ జేయఁ బవనుఁడా తెఱఁగు బరికించి తనయునిపైఁ గూర్మిగలిగి బలసూదనుఁడు లోకపాలుఁడుగాన బలభేది కెగ్గుగాఁ బ్రజలఁ బీడించి యశరీరియై చొచ్చె నఖిలజంతువుల వశగతిఁ బవనుండు ప్రాణముల్ బలము పవనుండు ధాతుసంబంధకారణము పవనప్రభావంబుఁ బరికింప నరుదు భువనత్రయాధారభూతమయుండు పవనుండు లేకున్నఁ బడు శరీరములు కావునఁ బవనుఁడు కలుషించినపుడు జీవులకే వెంట సేమంబు గలుగు మీరిప్పు డూర్పుల మెలఁకువ లేక యూరక నిలు వెండియున్న భూజముల గతినున్న గతి సదాగతి గానఁ బాసి గతిఁబడు తొల్లింటిగతి నెల్లగతులు మనమందుఁ బోవుట మతి విచారింప ననువైన తెఱఁగంచు నప్పుడు కదలి సర్వగీర్వాణులు సర్వగుహ్యకులు సర్వగంధర్వులు సర్వరాక్షసులు సర్వయక్షులు మఱి సర్వసంయములు సర్వప్రజలుఁ గొల్వ జలజసంభవుఁడు పవను పాలికి నేగఁ బవనుఁడు నచటఁ బవి ఘాతమునఁ జాలఁ బరవశుఁడైన కొడుకును దా నెత్తుకొని విషాదమునఁ గడుఁ గలంగుచు బ్రహ్మ గతిసంభ్రమమునఁ జక్కంగ నెదురుగాఁ జనుదెంచి మ్రొక్కె మ్రొక్కిన నాచతుర్ముఖుఁడు మోదించి యనిల లెమ్మని పల్కి యతఁడెత్తుకొనిన వనచరార్భకు పారవశ్యంబుఁ జూచి యినమయూఖములకు నిందురశ్ములకు ఘనతరస్నే హంబు గలిగెనో యనఁగ నవముద్రికారుచుల్ నఖరచంద్రికలు నవిరళిస్థితినొప్పు హస్తాంబుజమున నంగసమ్మార్జన మల్లనచేయ సంగతప్రాణుఁడై చయ్యన నతఁడు నలువ యంటుటఁ జేసి నలిఁదేఱి పొలిచె జలముచేఁ బొదలిన సస్యంబు కరణి నంత నందనుఁ జూచి యంతరంగమున వంత యంతయుఁ బాసి వాయుదేవుండు ముదమార జగములు మునుపటియట్ల వదలక ప్రజలందు వర్తింపఁ దొణఁగెఁ బ్రజలు నాదురవస్థఁ బాసి మోదించి రజుఁ డప్పు డనిలజు నలరింపఁదలఁచి సురల నందఱఁ బిల్చి సురరాజ యముడ వరుణుఁడ యీశాన వైశ్వానరుండ ధనదుఁడ చెప్పెదఁ దగుహితంబొకటి వినుఁడు మీరందఱు విమలచిత్తములఁ గడక నీశిశువొక్క కార్యంబు మనకుఁ గడుఁ బ్రియంబున మీఁదఁ గావింపఁగలఁడు గాన నందఱము నీకపికుమారునకు మానుగా వరములు మనమిత్త మనియె ననవుడుఁ బ్రియమంది యంజనాతనయుఁ గనుఁగొని తన వజ్రఘాతంబువలన హనువట్లు విఱుగుట నఖిలలోకముల హనుమంతుఁడనుపేర నధికుఁడై పరఁగ వావిరి వరమిచ్చి వజ్రఘాతమునఁ జావులేకుండంగ శతమఖుఁడపుడు దండహస్తుఁడు కాలదండంబుచేత దండి మృత్యువుచేత దండింపఁబడక యెన్నఁడు రోగంబులెవ్వియు లేక యున్నతశుభమూర్తి నుండంగనిచ్చె దయతోడ వరుణుండు తన ఘోరపాశ చయముచే జలముచేఁ జాకుండ నిచ్చెఁ దనచేతఁ దన యాయుధంబులచేత మొనసి చావకయుండ ముక్కంటి యిచ్చెఁ గరమొప్ప నగ్నియుఁ గనకకుండలము లరుదైన కచ్చడ మర్థితో నొసఁగెఁ దన గద తాఁకున ధర గూలకుండ నని నసాధ్యుఁడుగాఁగ యక్షేశుఁ డిచ్చె మునుమిడి నేర్పుతో మును విశ్వకర్మ తన యొనర్చిన యాయుధంబులచేత మరణంబు లేకుండ మన్నించి యిచ్చెఁ గరువలి బిట్టల్కఁ గడువేడ్కతోడ నితఁడు విద్యాభ్యాస మెన్నఁడు సేయ మతిఁగోరు నాఁడు సమస్తశాస్త్రములు ననుపమగతి వచ్చునట్లుగా నిచ్చెఁ దనతోడి తేజంబుఁ దగ భానుఁడిచ్చె మఱియుఁదక్కిన సురల్ మారుతికపుడు వరము లీరీతిని వరుసనిచ్చుటయుఁ బాయని మునిశాపభయము లేకుండ నాయు వగ్గలముగా నజుఁడిచ్చె నిచ్చి యనిలుని గనుఁగొని యనఘ నీసుతుఁడు వనచరశ్రేష్ఠుండు వరకీర్తిఘనుఁడు నసహాయశూరుండు నసమానబలుఁడు పస గల్గువాఁడు విద్వాంసుండు మఱియు ననివార్యసత్త్వుండు నని నజేయుండు ననుపమతేజుండునై వ్రాలఁగలఁడు కామరూపము కామగమనంబు నెపుడు కామించునప్పుడు కల్గునీతనికి రామచంద్రుఁడు లోకరక్షకుఁ బూని యామినీచరుల రూపడఁగించునాఁడు జయము రామునకును సమరంబులోన భయము రావణునకుఁ బాటించునితఁడు కడు నద్భుతములైన కడిదికార్యములుఁ గడిమిమైఁ బెక్కులు గావింపఁగలఁడు విజయంబు లితనికి వినుమంచుఁ బలికి నిజలోకమునకేగె నీరజాసనుఁడు నమరులు తమ తమ యావాసములకు నమరంగఁ జనిరంత నాసమీరణుఁడు నందనుఁ గొని యంజనాదేవికడకు నందితహృదయుఁడై నలి నేగుదెంచి సుతునిచ్చి వరములు సురలు నీసుతున కతిమోదమున నిచ్చిరని యెఱిఁగించె నంత శైశవమున నంజనాతనయు డంతంతఁ జని తాపసాశ్రమంబులకు మునుల కృష్ణాజినంబులు వల్కలములుఁ గొని వృక్షశాఖలఁ గ్రుమ్మరుచుండి హోమాగ్ను లార్పుచు నొగి సృక్సృవాది హోమసాధనములు హోమగుండముల నొండొండ వైచుచు హోమవేదికలఁ గుండల ఘృతములు కూలఁద్రోయుచును జినరాళ్ళ భాండముల్ చిల్లులు వుచ్చి చనుచు నివ్విధమున సంయమీశ్వరుల వారక వారింక వారి చిత్తముల వారిజాసను దివ్యవరశక్తిఁ జేసి తమ ఘోరశాపముల్ దాఁక లేకున్కిఁ తమలోనఁ బరికించి తాల్మి సేయుటయు దానికి మదిలోన దాఁకి కేసరియు మానుగాఁ బవనుండు మాత యంజనయుఁ దనయుఁడ వలదంచుఁ దగు బుద్ధిఁ జెప్పఁ వెనుకఁ బల్మఱు నిట్లు వేసరించుటయుఁ గినిసి భార్గవులు నాంగీరసు లనఁగ ననఘ తపోమూర్తులగు మహామునులు నీవెఱుంగకయుండు నీలావు ననుచు నీవీరు శపియించి రీతఁడు నంత నాయాశ్రమంబుల నతిశాంతవృత్తిఁ బాయక మునులకు భక్తుఁడై యుండె నంత నాయంజన యాత్మజుఁ జూచి యెంతయు ముదముతో నింపారఁ బలికె ననఘ నీమామలు నతిబలోన్నతులు నెనయఁ గిష్కింధ దామేలుచున్నారుఁ గొనకొని నీవేగి కోర్కె నందుండి యినతనూభవునకు హితమంత్రి వగుచు వారక వర్తింపు వాలిసుగ్రీవు లారయఁ దమలోన నరమరలైన సుగ్రీవునకుఁ బూని శూరత మెఱసి యగ్రజు నావాలి నుర్వి గూల్పకుము అరయంగ వారు నీకర్థి నిర్వురును సరియె కావున వల్దు సమరయత్నంబు ననపుడు నౌఁగాక యని కేలుమొగిచి మనమున నతిభక్తి మాత కిట్లనియె బ్రాతిగా నాకు నీబ్రహ్మచర్యంబు ధాతయు నొసఁగెను దక్క నాచేత మ్రొక్కించుకొనఁదగు మూర్తి యెవ్వాఁడు అక్కజంబుగ దయ నానతిమ్మనుఁడు ఓపవనాత్మజ యొనర నీమేన దీపించుచున్న యీదివ్యభూషణము లరుదారఁ గాంచిన యతఁడు నీకొడయఁ డరయ నీవసుమతి ననఘాత్మ యంచుఁ తనతల్లి వలికిన తథ్యంబ యనుచు మనమున హర్షించి మహనీయశీలుఁ |