| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
దలకొని సాష్టాంగదండంబు పెట్టి యెలమి సద్భక్తితో నెరఁగి మాతకును మనమున హర్షించి మహనీయశీలుఁ వలగొని నిల్వ నవ్వనిత దీవింప నలరుచుఁ గిష్కింధ కట వేగ నేగి నలరు చచ్చటి కపులంతఱు మ్రొక్కి వాలిసుగ్రీవుల వరుసతోఁ గాంచి చాలంగ వారిచే సత్కృతుల్ వడసి యరమరికయు లేక నందఱిలోన నిరవంద సుగ్రీవు నిష్టుఁడై యుండె క్షితినాథ వాలిసుగ్రీవుల తండ్రి వితతతేజుఁడు ఋక్షవిరజుఁ డన్పేర గపిరాజు కడుఁ బెద్దకాలంబు నీతి నిపుణుఁడై రాజ్యంబు నెమ్మితోఁ జేసి యమరలోకమునకు నరిగిన పిదప నమరంగ మంత్రజ్ఞులగు మంత్రివరులు వానరరాజ్యంబు వలనొప్పఁ జేయ భానుతేజుని వాలిఁ బట్టంబుఁ గట్టి రాతఁడు గావించు నధికారమునకు భాతిగా సుగ్రీవుఁ బతిఁ జేసిరంత నగ్గికి గాలికి ననుకూలవృత్తి నగ్గలంబుగ నెయ్యమైన చందమున వనజాప్తసుతునకు వాయుపుత్రుండు మనమున నరలేని మంత్రియై యుండ వారక తమలోన వైరంబు పుట్టె శూరుఁడౌ వాలికి సుగ్రీవునకును వ్రాలిన గడిమిమై వాలి సుగ్రీవు నాలంబులోపల నదిమొదల్ గాఁగఁ బరిభవింపఁగఁ జూచి భానుపుత్త్రునకుఁ పరమాప్తుడయ్యు నీపవననందనుఁడు నీతఁడు నిజశక్తి యెఱిఁగి మార్కొనిన నితనితోఁ బోరగఁ నెవ్వరు గలరు వనములఁ గలఁగించు వాయువుభంగి కనలి లోకము లేర్చు కాలాగ్ని కరణి నొగి ప్రజాసంహార మొనరించు జముని పగిదిఁ చేర్చిన యప్డు పావనితోడ వాలినా నెవ్వఁడు వాయుపుత్రుండు ఫాలాక్షునైనను బంధింపఁగలఁడు బాహుబలోత్సాహ పటువిక్రమాదు లూహింప నితనికి నొప్పు లోకముల జలజబాంధవుచేత శబ్దశాస్త్రంబు వెలయంగ నీతఁడు వినియెడునాఁడు ఉదయాస్తనగముల నుగ్రాంశు తేరు వదలక కనకాద్రి వలఁగొని తిరుగ నాతేరు ముందట నాభీలరశ్ము లాతతగతిఁ దాఁక నభిముఖుం డగుచు సైరించి రవితోడఁ జరియించువాఁడు ఘోరంబుగా నభోగోళమధ్యమున హితబుద్ధిఁ దపముల నెల్లశాస్త్రముల ప్రతివాఁడు విను బృహస్పతియు నాతనికి హనుమంతు వర్తన యది చెప్ప నరుదు మనుజేంద్ర రావణు మర్దించుకొరకు యనిమిషు లూహించి యవనిలో భాను తనయుండు నింద్రుండు తారుండు నలుఁడు గజుఁడు గవాక్షుండు గంధమాదనుఁడు విజితవిరోధులు ద్వివిద మైందువులు శూరాగ్రగణ్యుండు జ్యోతిర్ముఖుండు వీరాదిగా కపివీరులై రనిన భూలోకపతి మునిపుంగవుఁ జూచి వాలిసుగ్రీవులే వనిత నందనులు |