| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
అది నీకుఁ జెప్పెద నాతెఱంగెల్ల విదితంబుగా నీవు విను మొక్కనాఁడు కృతయుగంబున దశగ్రీవుండు జగము నతిభీతిఁ జెంద నెల్లందుఁ గ్రుమ్మఱుచు నారంగ బ్రహ్మజుఁడైన సనత్కు మారుఁ డున్నెడ కేగి మహనీయశాంతి నకలంకగతినున్న యతనికి మ్రొక్కి ముకుళితహస్తుఁడై ముందట నిలిచి వినయంబుతోఁ బల్కె విశ్వలోకముల ననఘ నీవెఱుఁగని యర్థంబులేద యకుటిలబుద్ధి నేనడిగెదఁ గాన సకలంబు నెఱిగింపు చతురాస్యతనయ యమరులకంటె సత్త్వాధికుం డెవ్వఁ డమరు లెవ్వనిశక్తి నడఁతురు రిపుల నిమ్ములను జనంబు లెవ్వనిఁ గూర్చి నెమ్మిఁ గావింతురు నిఖిలభూసురులుఁ బరమయోగీంద్రులుఁ బరిపూర్ణబుద్ధి పరఁగంగ నెవ్వని భావింతు రెలమి యనుఁడు నాదశకంఠు నందుఁ దలంపు మనమున నెఱిఁగి యమ్మహితాత్ముఁ డనియె బ్రహ్మార్థవిదులైన పరమయోగులకు బ్రహ్మాదిసురలకుఁ బరికించి చూడ నెవ్వని యుత్పత్తి యెఱుఁగరాకుండు నెవ్వఁడు లోకంబులెల్లఁ బాలించు ననిశంబు దేవాసురాదు లెవ్వనికి వినతు లెవ్వనినాభి వేధ జన్మించె సచరాచరములైన జగము లాబ్రహ్మ రచియించు నెవ్వాని రమణీయశక్తి నమర నెవ్వని జెంది రఖిలదేవతలు నమృతంబుఁ ద్రావుచు నధ్వరంబులను నతఁడు నారాయణుం డావిష్ణుమహిమ మతిని దర్కింప సమర్థుఁ డెవ్వాఁడు పరతత్త్వవేదులై పాంచరాత్రాది పరమాగమంబుల బహుపురాణముల సకలవేదంబుల సకలశాస్త్రముల సకలయోగీంద్రులు చర్చింతురతని నమరాభియాతులౌ నఖిలరాక్షసుల సమరంబులోపల సమయించుకొఱకుఁ గరముల నసిగదాఖడ్గాదు లమర ధరియించియుండు నాదానవాంతకుఁడు నన విని దశకంఠుఁ డావాక్యములకు మనమున నరుదంది మఱియు నిట్లనియెఁ జక్రిచే రణభూమిఁ జచ్చినవారి విక్రమంబుల వేఱె వినుతింపనేల మధువైరిచే నాజి మరణమై చన్న యధిపుఁడేగతిఁ బొందునది యెఱిఁగింపు నావుడు విని యాసనత్కుమారుండు రావణు వీక్షించి రజనీచరేంద్ర యితరుచే రణభూమి నీల్గినయట్టి ధృతి మంత్రులకుఁ గల్గుఁ ద్రిదివసౌఖ్యములు త్రిదివోపభోగముల్ దీరిన పిదపఁ దుదలేని జన్మాదిదుఃఖముల్ గల్గు విష్ణుచేఁ జచ్చిన వీరోత్తములకు విష్ణులోకము నిత్యవిభవమై చెల్లుఁ బుండరీకాక్షుండు భూరికోపంబు నొండొక్కవరమును నూహింప సరియె దనుజారి కోపంబుఁ దపము శత్రులకు వినుమంచుఁ జెప్పిన వింశతిభుజుఁడు వారక యాదైత్యవైరితో వైర మేరూపమునఁ గీర్తిహేతువు నాకు నిటుమీఁద నాతెఱం గేయుపాయముల ఘటియించునోయని కడు విచారింప నామహాయోగియు నాతలం పెఱిఁగి యామినీచరనాథ యనుమాన ముడుగు కమలనాభుఁడు నిన్నుఁ గయ్యంబులోన సమయింపఁగలఁడన్న సంతోషమంది యెట్టివాఁ డసురారి యెఱిఁగింపుమనిన నిట్టినాఁడని చెప్ప నెవ్వరి కలవి యైన నే నెఱిఁగినయంత చెప్పెదను వీనులారఁగ నీవు విందుగాకనుచు నాదినారాయఁణు నాద్యంతరహితు వేదవేద్యుని సర్వవిభుఁ జెప్పఁ దొణఁగె దేవదేవుఁడు సర్వదేవతారాధ్యుఁ డావిష్ణుఁ డప్రాప్యుఁ డప్రమేయుండు నవ్యక్తుఁ డసమానుఁ డవికారుఁడభవుఁ డవ్యయుఁ డతిసూక్ష్ముఁ డధికాధికుండు పుణ్యుఁ డగణ్యుండు పురుషోత్తమాది పుణ్యనామంబులఁ బొలుపారువాఁడు దేవియై యిందిరాదేవి గొల్వంగ శ్రీవత్సలాంఛన శ్రీచెన్ను మిగులఁ బీతాంబరంబొప్పు పృథులనీరదము భాతిమై యమరంగ భాసిల్లువాఁడుఁ బొరి భూతకోట్లను బుట్టింపఁ బెంప విరియింప నొక్కఁడె వెరవైనవాఁడు పుణ్యాశ్రమంబులఁ బుణ్యదేశములఁ బుణ్యవనంబులఁ బుణ్యవృక్షములఁ బుణ్యపురంబులఁ బుణ్యశైలములఁ బుణ్యసరిత్తులఁ బుణ్యతీర్థములఁ బుణ్యకాలమ్ములఁ బుణ్యదానములఁ బుణ్యవ్రతంబులఁ బుణ్యకర్మములఁ బుణ్యయాగంబులఁ బుణ్యభాగములఁ బుణ్యయోగంబులఁ బుణ్యభావములఁ బుణ్యతంత్రంబులఁ బుణ్యమంత్రములఁ బుణ్యసత్కథల నెప్పుడు నుండువాఁడు ఆ పుండరీకాక్షుఁ డధ్యక్షుఁ డతఁడు రూపింపఁ దేజస్స్వరూపమై యుండు ఫాలాక్షుఁడై యుండు బ్రహ్మయై యుండుఁ గాలాగ్నియై యుండు గగనమై యుండు వాయువై యుండును వటభూజపత్ర శాయియై తానుండు శరధిమధ్యమునఁ బావకుఁడై యుండుఁ బ్రణవమై యుండు సావిత్రియై యుండు సత్యమై యుండుఁ దపములై యుండుఁ దత్ఫలములై యుండు జపములై యుండుఁ దొల్చదువులై యుండుఁ బుడమియై యుండుఁ బైపొడవులై యుండుఁ బుడమికి నాధారభూతుఁడై యుండు నొడలు గైకొనకుండు నొడలిలో నుండు నొడయఁడై బ్రహ్మాదులొగిఁ గొల్వ నుండుఁ గడు బెక్కులగు బ్రహ్మకల్పముల్ గడవఁ గడపట నొక్కటఁ గడలేక యుండు నింద్రుఁడై యుండు దినేంద్రుఁడై యుండుఁ జంద్రుడై యుండును శమనుఁడై యుండు లోనుండు వెలినుండు లోకజాలముల జానుగా వ్యాపించి సందులేకుండు భక్తిభావము దక్క పద్మజాదులకు యుక్తి నప్పరమేశు నూహింపరాదు తర్కంబు గెలుపును తత్త్వంబు విడిచి కర్కశమతులైన కాతరాత్ములకు హరిపదం బతిదూరమై యుండు భక్తి పరులైనవారికిఁ బ్రాపింపవచ్చుఁ దరళభావము దక్కి తనువుఁ బ్రాణములు భరితవిజ్ఞానాగ్ని భస్మంబు సేయు భాగవతోత్తముల్ పరమవైష్ణవులు యోగతృష్ణల గాంతు రోలి నవ్విష్ణు యామినీచరనాథ యాజగన్నాథు తామసివై పొందఁదలఁచితే వినుము అనఘుఁడు త్రేతాయుగాది నిక్ష్వాకుం డను రాజపుంగవు నన్వయంబునను దశరథుఁడను పేరి ధరణీశ్వరుండు విశదోరుకీర్తులు వెలయ జన్మించు నాసత్యసంధున కాజానుభుజుఁడు భాసురాకారుఁడు పటుపరాక్రముఁడు నూర్జితసత్త్వుఁ డత్యుగ్రతేజుండు దుర్జయుండును వైరిదుర్నిరీక్షుండు నతిగభీరుండును నధికశూరుండు మతిమంతుఁడును సత్యమధురవాక్యుండుఁ గోదండచతురుండు ఘోరదివ్యాస్త్ర వేదియు జగదేకవీరుండునైన రాముఁ డయ్యాదినారాయణమూర్తి భూమండలంబునఁ బుట్టంగఁ గలఁడు సిరియును భూపుత్రి సీతనాఁ బుట్టి గురుమతి జనకుని కూఁతురై పెరిఁగి రూపలక్షణగుణరుచిరతేజముల దీపించి యారాము దేవి గాఁగలదు అటమీఁదఁ దన కూర్మియనుజన్ముఁడైన చటుల విక్రమశాలి సౌమిత్రి గొలువ పరమపాతివ్రత్యభవ్యశీలముల నిరుపమస్థితిఁ దోడునీడయుఁ బోలె నామహీసుతతోడ నరుగుదేఱంగ రాముఁడు దండకారణ్యంబునందుఁ దన తండ్రియయియున్న దశరథు నాజ్ఞ సముచిత మునివృత్తిఁ జరియింపఁ గలఁడు అన విని రఘునాథ యంతరంగమున ననురాగమును బొంది యారావణుండు మదగర్వ మెసఁగంగ మసలి నీతోడఁ గదన మెప్పుడు సేయఁగలుగునో యనుచు సర్వలోకములందుఁ జరియింపుచుండె సర్వేశ్వరుఁడ వీవు సమయించి తతని ననిన నాధరణీశుఁ డావాక్యములకుఁ దనలోన వెఱగంది తలయూఁచి పలికె విజ్ఞానసంపన్న విశ్వలోకముల నజ్ఞాతమగు ధర్మమది నీకు లేదు పదపడి పౌలస్త్యపతి యేమిచేసె నదియుఁ జెప్పుదుగాక యన నిట్టులనియె జననాథ నీ చేత సమరంబులోనఁ దునియలై పడి ముక్తి దొరకొందుననుచు ఘనబాహుడగు పంఙ్క్తికంఠుఁడు సీత గొనిపోయెనని చెప్పి కుంభసంభవుఁడు నరనాథు నీక్షించి నగరాజమైన సురమహీధరముపై సురలు సిద్ధులును మునులు గంధర్వులు ముదమంది వినఁగ ననిమిషమునిముఖ్యుఁడైన నారదుఁడు నాకుఁ జెప్పిన కథ నరలోకనాథ నీకుఁ జెప్పెద నీవు నెమ్మితో వినుము |