ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
వాలిసుగ్రీవులయు ఋక్షవిరజునియు వృత్తాంతము
యాఋక్షవిరజుండు నతడెట్టివాఁడు
గారవంబు నన్నఘటజన్ముఁడనియె
నావనంబున నొక్కనాఁడు నారదుఁడు
భూవర వచ్చిన పూజఁ గావించి
వాలిసుగ్రీవుల న్వారిజన్మంబుఁ
బోలంగ వినఁ బ్రీతి పుట్టెడుననుచుఁ
దప్ప కేనడిగినఁ దాపసోత్తముఁడు
చెప్పిన కథ నీకుఁ జెప్పెద వినుము
అఖిలనిర్జరసేవ్యమగుచున్న మేరు
శిఖరేంద్రి మధ్యమశిఖరంబునందు
జానుగా యోజనశతయాత్రభూమి
మానితంబుగ సభామండపం బమరు
నచట యోగాభ్యాస మరవిందగర్భుఁ
డచలితుఁడై సేయునప్పు డాతనికి
వెలువడు కన్నీరు వెసఁ గేలఁ బుచ్చి
యిలమీఁద విడుచుడు నెసఁగు తేజమున
వినుతింపఁ దగ ఋక్షవిరజుఁడనంగ
వనచరుఁడయ్యె నవ్వానరోత్తముని
వనజసంభవుఁడును వాత్సల్యమొప్పఁ
గనుఁగొని కారుణ్యకలితుఁడై పలికె
నిఖిలదేవతలకు నిలయమై యునికి
సుఖతరంబైన యీసురభూధరంబు
పొలు చు నిందలి వనంబుల కందమూల
ఫలభోజులై మమ్ముఁ బన్ను గాఁ గొల్చి
కొడుక నీవుండుము కొంతకాలంబు
కడుమేలు సిద్ధింపఁగలదు నీకనిన
నెలమి నీయానతి నెడపక చేయఁ
గలవాఁడ నేనును గడుభక్తి మ్రొక్కి
దివిజాద్రి కలయంగఁ దిరిగి పక్వంబు
లవు ఫలంబులు దిని యతితృప్తుఁడగుచుఁ
బరిపక్వఫలములుఁ బరువంపువిరులుఁ
బరువడిఁ గొనివచ్చి పంకజాసనుని
ననిశంబు సాయంతనార్చనవిధుల
మనమారఁ గ్రోలుచును మఱియొక్కనాఁడు
అంగదుఁ డుదకపానార్థ ముత్తరపు
శృంగంబునకు బోయి చెలువొందుచుండు
నీరజోత్పలముల నెనయు గంధముల
వారక దిక్కులు వాసించుదాని
కలహంస సారస కారండవాది
జలపక్షిరవముల సరిఁ జెల్లుదానిఁ
బదతలంపుల కెంపు ప్రకటంబు గాఁగఁ
ద్రిదివాంగనలచేతఁ దేఱినదాని
మధుపానమదలోల మధుకరావళుల
మధురగానంబుల మావైనదాని
రంగత్తరంగల రాలు పుప్పొళ్లు
బ్రుంగుఁడై వెలయంగఁ బోలు పారుదానిఁ
గడునొప్పుగల యొక్క కమలాకరంబుఁ
బొడఁ గని చేరంగ బోయి తిరమున
నాపోవఁ బ్రక్షాళితాంగుఁడై జలము
లోపినయటు గ్రోలి యుదకమధ్యమునఁ
దన నీడఁ బొడఁగని తన్నుఁ గైకొనిన
వనచరుఁడెవ్వఁడో వైరి గాఁబోలు
వీనిఁ బట్టెదనంచు వెసఁ జొచ్చి యలుక
మానసంబునఁ బుట్టి మడువులో నుఱికి
మునిఁగి లోపలనెల్ల మునిమిడి వెదకి
తన నీడ గానక తప్పెఁ బొమ్మనుచు
జలజాకర స్త్రీకి జంగమత్వంబు
గలిగెనో యన నొక్క కాంతయై వెడలె
మెఱుఁగు నిల్చిన భంగి మెఱయు నంగమును
నెఱులొగి గిరిగొను నీలకేశములు
పొడవైన ముక్కును బొలుపారు బొమలు
నిడువాలు గన్నులు నిద్దంపు నుదురు
మెరుగారు చెక్కులు మెల్లని నగవు
బరిపోని మించుల బాహుమూలములు
తియ్య కెమ్మోవియు దృష్టుల మెరుపు
నొయ్యని చెయ్వులు నొప్పారు మెడయు
నెక్కొన్న చన్నులు నిరుపేద నడుము
పిక్కటిల్లెడి వల్దపిఱుఁదు చెన్నారు
లసితగళంబును లలితాంఘ్రియుగము
కిసలయంబుల నవ్వు కెంగేలు గవయు
ననఁటిబోఁడియలట్లు నమరు పెందొడలు
వనజసోదరమైన వదనంబు గల్గి
సకలాంగలావణ్యసౌభాగ్యములను
సకలలోకములందు సరి చెప్పరాక
కొలని తీరంబునఁ గొమరారుచున్న
యెలదీఁగె పగిది నయ్యెలనాఁగ యొప్పె
నంత పద్మజుఁ గొల్చి యందు నాఁడింద్రుఁ
డెంతయు ముదముతో నేగుదేరఁగను
జలజాప్తుఁడును శరచ్చంద్రికావిమల
జలపూర్ణమైన యాజలజాకరంబు
నుపరిభాగము చేర నొగి సురేంద్రుండు
తపనుఁడు నప్పుడాతన్వంగిఁ జూచి
దర్పకావేశంబు దనరు చిత్తముల
దర్పించి కదియంగఁ దమకించు నెడను
స్ఖలితరేతస్కులై కాంక్షలు దీరి
సలుపనొల్లక నంగసంగసౌఖ్యములు
బలభేదివలన వెల్పడిన వీర్యంబు
చెలువొంద నయ్యింతి శిరముపై నుఱికి
వాలంబు దడియంగ వడి నొల్కెఁగాన
వాలినా నుదయించె వ్రాలు తేజమున
నంచితమతి నింద్రుఁ డాతనూజునకుఁ
గాంచనమాలికఁ గడుబ్రీతినిచ్చి
సురలోకమునకేగె సూర్యవీర్యంబు
పరికింప గ్రీవంబు పయినొల్కెఁ గాన
నుగ్రాంశునకు నత్తలోదరివలన
సుగ్రీవుఁడనియెడు సుతుఁడు జన్మించె
నంత నాతని జూచి హనుమంతుతోడ
సంతసంబున నిష్టసౌఖ్యంబు జేసి
వినుతతేజంబున విలసిల్లుచుండు
తనయుఁడ వీవంచు దయతోడఁ బలికి
తపనుండు కందర్పదర్పోపహతికి
నపరాబ్ధిఁ గ్రుంగక నరిగి నట్లరిగె
భానుఁ డమ్మఱునాఁడు ప్రథమాద్రికరుగ
మానుగాఁ దన తొంటి మగరూపు గలుగ
విగ్రహోగ్రుఁడు ఋక్షవిరజుఁ డావాలి
సుగ్రీవుఁలనియెడు సుతులఁ దోట్కొనుచుఁ
గాయరూపంబులు గైకొననేర్చు
నామహావానరులగువారుఁ దాను
దేవత లమృతంబు దృష్ణవోఁ ద్రావు
కైవడిఁ దేనియల్‌ కడుఁ బ్రీతిఁ ద్రావి
చనుదెంచి మ్రొక్కిన చతురాననుండు
తనయులతో నొప్పు తన పుత్రుఁ జూచి
వీనుల కింపయిన విమలవాక్యముల
మానసం బలరింప మది విచారించి
యింక రక్షణదక్షుఁ డితఁడంచు నొక్క
కింకరు నీక్షించి కృపతోడఁ బలికె
నిర్మాణనిపుణత నెఱయంగ విశ్వ
కర్ముని పంపునఁ గడునొప్పుఁగాక
యకలంకమణికాంచనాదులఁ బొల్చు
మకరతోరణములు మహితసాధనములు
మేడలు మాడువుల్‌ మించు బుట్టించు
క్రీడావనంబులుఁ గృత్రిమాద్రులును
సురుచిరకాంచనసోపానపంఙ్త్కు
లరుదైన వాకిళ్ళు నమరు వీథులును
ఘనమణిమయమగు కడిఁది శిల్పములు
అనువందఁ గిష్కింధయను పట్టనంబు
వెరవున నిర్మించి వీరవానరులం
బొరినం దనేకులఁ బుట్టించినాఁడ
నప్పురంబున కితఁడధిపతియైన
నొప్పార రక్షించు నొగిఁ దరుచరుల
నటుగాన నతనితో నటకు నీవరిగి
పటుపరాక్రములైన ప్లవగపుంగవులఁ
బ్రియమున నందఱఁ బిలువంగఁ బంచి
నయమున మన్నించి నాపల్కుఁ జెప్పి
యద్రిచరశ్రేష్ఠు లనుమతింపంగ
భద్రకిరీటాతపత్రాదు లమర
విపులపీఠంబున విలసిల్ల నునిచి
కపిరాజ్యపట్టంబుఁ గట్టు మీతనికి
గిరిచరాధీశుఁడై కిష్కింధ కితఁడు
పరిపాలనప్రౌఢిఁ బరగుఁ గాకనుచుఁ
బనిచె నాతండును బ్రహ్మవాక్యంబు
విని తనూజులతోడ విలసిల్లుచున్న
యాఋక్షవీరుని నతిభక్తిఁ గొలిచి
గారవంబున నేగి కపిపుంగవునకు
నజువాక్య మెఱిఁగించి యాతఁ డాతఁడని
ప్రజలొప్పఁ గిష్కింధఁ బట్టంబుఁ గట్టెఁ
బట్టాభిషిక్తుఁడై బ్రహ్మనందనుఁడు
పట్టె సిరులతోడఁ బట్టనం బమర
సంతసంబునఁ దన్ను సకలవానరులు
నెంతయుఁ గొలువంగ నెల్లకార్యములు
నోజ మంత్రులతోడ నొగి విచారంచి
రాజనీతిజ్ఞుఁడై రక్షానురక్తి
నెల్లదిక్కులయందు నెప్పుడు నాజ్ఞ
చెల్లంగ రాజ్యంబు సేయుచునుండెఁ
గమలాప్తకులవర్య ఘనతేజులైన
యమరేంద్రసుతునకు నర్కపుత్రునకు
వినుతికెక్కిన ఋక్షవీరుఁడు మొదల
జననియై యటమీఁద జనకుఁడైనాఁడు
ఈపుణ్యకథఁ ద్రితి నెవ్వఁడు సెప్పె
నాపుణ్యునకు విన్నయట్టి పుణ్యునకు
మానుగా సిద్ధించు మహితపుణ్యములు
గాన రాఘవ నీకుఁ గళ్యాణమనిన
సౌమిత్రిసహితుఁడై సంతోషమంది
యామునీశ్వరునితో నవనీశుఁ డనియె
వాలిసుగ్రీవులు వాసవార్కులకు
భూలోకవినుతులై పుట్టిన తెఱఁగు
పరికింప నురుబాహుబలపరాక్రమము
లిరువురందును గల్గు టేమి యచ్చెరువు
మునినాథ యీకథ ముదమార నీవు
వినుపింప నీచేత వింటి నేననిన
నింకొక్క కథ నీకు నెఱిగింతు వినుము
లంకేంద్రదమన యా లంకేశ్వరుఁడు
పరమపావన సీతఁ బట్టిన దాని
కరయంగ గారణం బది యొండుగలదు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )