| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యువనాశ్వపుత్రుం డయోధ్యకు రాజు భువనైకనుతకీర్తి భూరివిక్రముఁడు మాంధాత యను రాజు మహి నెల్లనృపుల బంధుల దోర్బలప్రౌఢిమై గెలిచి యమరేంద్రు నిరసించి యతని సింహాస నమునందె గూర్చుండి నాక మేలుటకు నింద్రలోకంబుపై నెత్తిపోఁ బెరిగి యింద్రాదిసురలెల్ల నెదురుగా వచ్చి వసుధీశ వలదంచు వారింప దనకు వశము గాకున్నెడ వాసవుండనియె నిలలోన గ్రూరులనెల్ల మున్నీవు గెలిచిన మఱికదా కిన్క మామీద ధరణి రాజులనెల్ల తగ మున్ను గెలచి సురలోకరాజ్యంబు సుఖలీలఁ జేయు మని కుపితాత్ముఁడై యమరేంద్రుఁడనిన జననాథుఁడనియె నాశక్రు నీక్షించిఁ యని నన్ను నెదురించు నతఁడెవ్వఁ డుర్వి వినుపింపుమనిన నవ్విబుధేంద్రు డలరి రాజేంద్ర మధువను రాక్షసేంద్రునకు భూజనద్రోహియై పుట్టెను కొడుకు లవణుండునా పాపలాలసుండగుచు నవనిపై వర్తించు నధికదర్పమున నాతనికి మధువనం బది యున్కిపట్టు జితశత్రుఁడగు నిన్ను జీరికి గొనఁడు వానిని తలవంచి నరనాయకుండు దేవేంద్రు వీట్కొని తీవ్రకోపమున మరలి సేనలతోడ మధువనంబునకు నురువడిఁ జనుదెంచి యొక్కచో నిలిచి లవణునొద్దకు దూతలను బంప వారు జవమున జని వేగ సంగరంబునకు వడి జని మాంధాత వచ్చినాఁడనిన నొడిచి గ్రక్కున మ్రింగె నుగ్రకోపమున నిదియేల తడసిరో యీదూతలనుచు మది విచారించి యామాంధాత వచ్చి యోరోరి నాతోటి యుద్ధంబు సేయ వే రమ్ము నావుఁడు వెడనవ్వు నవ్వె కడు నల్క బరతెంచి కడిదిశూలంబు వడినెత్తి యుంకించి వైచె వైచుటయు మిడుగుర్లు మంటలు మింట నందంద నడరంగ భటవాహనాదులతోడ బలువిడి మాంధాత భస్మంబు చేసి వెలుగుచు బరతెంచె వెస పురంబునకు నని చెప్పి యాశూల మట లేక వాడు మనుజేంద్రనందన మడియు నీచేత శూలంబు చేనున్న శూలికినైన నాలంబులో గెల్వ నలవిగాదతని నని చెప్పెఁ జెప్పిన నౌగాక యనుచు నినుఁడు పూర్వాద్రికి నేగుతెంచుటయు |