ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శక్రాదులు శత్రుఘ్ను నుతించుట
శక్రాగ్నులాదిగా సకలదేవతలు
విక్రమోదగ్రులై విలసిల్లుచున్న
శత్రుఘ్నునొద్దకు జనుదెంచి లోక
శత్రువు మధుపుత్రు జంపితివీవు
మాకెల్ల భయములు మనుజేంద్రతనయ
నీకారణంబున నేటితో బాసె
వరమిచ్చెదము నీకు వాంఛితంబెద్ది
నిరవార మది మాకు నెఱిఁగింపుమనిన
చేదోయి మొగిడించి శిరమున జేర్చి
యాదేవతలతోడ ననియె నాఘనుఁడు
మధువేలు నగరంబు మఱి దొంటికంటె
నధికంబు జేసెదనని యున్న వాఁడ
నది మీరు సిద్ధించునట్లుగా తలఁపు
డిదియె నాకోర్కెనా యెల్లదేవతలు
మధురన నవ్వీడు మహి నంతకంత
కధికమౌ నీచేతనని పల్కి చనిరి
నిజనివాసములకు నిర్జరుల్‌ జనగ
విజయసూచకభేరి వేయింపఁ బనిపె
తన సేనతోగూడ దను నెల్లవారు
వినుతింప నగరప్రవేశంబుచేసె
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )