ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
సౌమిత్రి శ్రీరామునితో వృత్రాసురుని కథయు, అశ్వమేధయాగ మహిమయుఁ జెప్పుట
మఖము జేసెదరేని సుఖరాజమదియు
నఖిలాధ్వరములందు నశ్వమేధంబు
యాయజ్ఞ మొనరింపు డఖిలయత్నముల
నీయర్థమున కొప్పు నితిహాసమొకటి
విన్నవించెద తొల్లి వృత్రుండు నాగ
నున్నతాకృతిగల యొక్క దానవుండు
యొడమడ్డముగ శతయోజనంబగుచు
పొడవు తద్ద్విగుణమై పొలుచునాతనికి
వసుధ యెండక పండ వైరంబు లేక
వసుధ పాలింపుచు వాఁడొక్కనాఁడు
ధరణి పాలింపంగ తనయ శంబరుని
పరిణతబుద్ధిమై బట్టంబు గట్టి
వైరాగ్యమున తపోవనమునకేగి
దారుణంబగుచున్న తపము గావింప
ననిమిషుల్‌ భీతిల్లి యసురారి గాంచి
వినతులై హస్తారవిందముల్‌ మొగిచి
యవధరింపుము దేవ యఖిలలోకముల
యవలీల గొనియెదనని విచారించి
దేవతల్‌ బెదరంగ తివిరి వృత్రుండు
గావింపుచున్నాఁడు కడునుగ్రతగాను
తొడఁగిన తపమిట్లు తుదముట్టెనేని
యొడయఁడై లోకంబు లొగి నేలునతఁడు
కడముట్ట లోకముల్‌ గలుగునందాక
పరిచారకృత్యంబు పాటిల్లు మాకు
మాకు శరణ్యులు మరి మీరె గాన
మీకటాక్షముగోరి మిముఁ గంటి మేము
మిత్రేందులోచన మీరల్గినపుడ
వృత్రుండు భస్మమైఁ బోవంగగలఁడు
నావుఁడు నంబుజనాభుఁ డాసకల
దేవతాగణము నుద్దేశించి పలికె
వరదుండనైనాడ వానికి మొదల
సురలార యటుగాన చొప్పుగా దలుగ
నేచందమున మీకు హితవుగావింప
జూచి తేనొక్కట సుగమమార్గంబు
తిరముగా మీకు మీతేజంబులందు
పొరి మూఁడుభాగముల్‌ పోల గైకొనుఁడు
నరుదార ప్రథమాంగ మమరేంద్రునందు
వరుస రెండవపాలు వజ్రంబునందు
నొంద మూఁడవభాగ ముర్వీతలంబు
నందు వసింపుడు యటమీద వాఁడు
శక్రునిచే జచ్చు సమరోర్విననుచు
చక్రాయుధుఁడు బల్క సంతోషమంది
విష్ణుపాదములకు వినతులై యమర
జిష్ణులాదిగ యుద్ధజిష్ణులై సురలు
చనుదెంచి వసుధపై సకలభూతములు
గనుగొని భయమంద కడునుగ్రతబొంది
గావించు నతిభయంకరమూర్తియైన
యావృత్రుఁ బొడగని యంత నింద్రుండు
వెస వజ్రమున నెత్తి వ్రేసె వ్రేయుటయు
వసుమరి వాఁడుర్వి వడి బోలిజచ్చె
నంత నింద్రుఁడు బ్రహ్మహత్య వాటిల్ల
యెంతయు భయమంది యంత యేగుటయు
జగములు భయమంది సకలభూతములు
మొగిదప్పి జనులెల్ల మూఢాత్ములైరి
యిలఁగల సస్యంబు లెండె పెన్నదులు
సలిలప్రవాహముల్‌ సరి నింకిపోయె
మడుఁగులు గడువట్టె మణిగె లోకములు
నిడుములుఁ దరుచయ్యె నెల్లవారలకు
నదిజూచి పావకుండాదిగ సకల
దివిజులు నేతెంచి దివిజారిఁ??? గాంచి
దేవ మీయానతి దేవేంద్రుఁ డరిగి
దేవారి నావృత్రుఁ దెగటార్చినంత
నానెపంబున బ్రహ్మహత్య వాటిల్లె
హీనుఁడై పొడచూడ కింద్రుఁడున్నాఁడు
భావింప నింద్రుఁ డాపాపంబువలన
నేవెంట నెడవాయు నెఱిగింపుడనిన
నని గూర్చి సురరాజు నది నశ్వమేధ
మొనరింప బాయున యుగ్రపాపంబు
సనుఁడు మ్రొక్కుచు నంత సకలదేవతలు
సనుదెంచి మునిగణసహితంబు గాగ
శతమఖు దర్శించి సంతోష మెసఁగ
???దివిజారితోడ నాతెరగు జెప్పుటయు
నమరేంద్రుఁ డేతెంచి యశ్వమేధంబు
సమకొని కావించి సకలసామగ్రి
యాగంబు నిండంగ నట బ్రహ్మహత్య
వేగ నింద్రునిఁ జూచి బెగడియు నిలిచి
సురలార యింక నెచ్చోట నాయునికి
తిరముగా ననుఁడు నద్దివిజు లూహించి
పాపంబు నీవెల్ల పరగ నీవెక్కు
డోపునే నిను దాల్ప నిఖిలలోకములు
నాల్గునంశంబులై నాలుగుచోట్ల
నోలి గైకొని నీవు నుందువు గాక
యనవుడు వాంఛయైన పెనమున
నొనర వర్తించెద నొక్కభాగంబు
నవనీజముల బంక యందొక్క భాగ
ము విదల రసము నందొకట నుండెదను
వారిజాక్షులు పుష్పవతులైనమీద
నారయ నాల్గునా ళ్ళతిపాపవతులు
పోడిగా నెవ్వఁడు పొందినట్లయిన
వాఁడు గోబ్రాహ్మణవధ చేసినాఁడు
కాన చతుర్భాగంబు యెలమి
వాని ప్రాపించెద వారింపఁబడక
ననుఁడు నాసురలెల్ల నగుగాక యనుచు
ఘనవీథి జని రట్లకాకంచు దివికి
ననవుడు సౌమిత్రి యావృత్రుకథయు
ననఘతరంబగు నశ్వమేధంబు
మహిమయు నీచేత మానుగా వింటి
మహనీయమైన యామఖము పెంపెల్ల
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )