ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శ్రీరాముఁడు సౌమిత్రికి నిలుని వృత్తాంతంబు జెప్పుట
వినుతంబుగా యున్న విన్నాఁడ నేను
ఘనబుద్ధి నీయుపాఖ్యానంబు నెలమి
నలఘుఁడు కర్దముఁడను ప్రజాపతికి
నిలుఁడనగా పుత్రుఁ డెలమి జన్మించె
దక్షులై యనిమిష దనుజగంధర్వ
యక్షరాక్షస పన్నగాదులు దన్ను
వెరపుతో గొలువంగ విశ్వభూతముల
నురువృత్తి నేలుచు నొక్క నాఁడతఁడు
జనరక్ష కొఱకునై చైత్రమాసమున
తన సేనతో గూడి తా వేట వెడలి
పెక్కుపొలంబుల భీకరాటవుల
మిక్కిలి దరుచైన మృగసమూహముల
జని జొచ్చి చంపుచు శరవణంబునకు
చనుదెంచె నటమున్న చంద్రశేఖరుఁడు
గిరిజాసమేతుఁడై క్రీడానురక్తి
చరియింపఁదలఁచి యాచపలాక్షికొఱకు
పరిచరులును దాను భామినీమూర్తు
లరుదార ధరియించి యతిలోభుఁడగుచు
చెలువంద దనకోర్కె చెల్లునందాక
తెలియకిందెవ్వ రేతెంచినవారు
వనితలై వసుధపై వర్తింతురనుట
విని యాయవస్థల వృక్షసంఘములు
వనితలై యుండుట వరస వీక్షించి
తనుమధ్యలైయున్న తన సేనఁ జూచి
ఘనకుచాదులు గల్గి కాంతయైయున్న
తన రూప మెంతయు తప్పక జూచి
పరితాపమంది భవానీసతీపతి
తిరముగా జేసిన తెరవుగా నెరిగి
వెరపుతో వచ్చియావిధుకళామౌళి
నిరుజన్ను లొగి మ్రోవ నిల జాల మ్రొక్కి
యవధరింపుము దేవ యాజ్ఞ మున్నెఱుఁగ
కవివేకమున వచ్చి యాడురూపములు
బ్రాపించినారము పార్వతినాథ
మాపాటు కృపజూచి మన్నింపవలయు
నప్పుడు శంభుండు నగసుతాసహితుఁ
డై వారి జూచి తానట్ల నగుచు
పురుషత్వ మదిదక్క బుద్ధిలో వలయు
వరము వేద్యము నీకు వరదుఁడనైతి
ననవుడు విన్ననై యగరాజపుత్రి
గని లోకజనయత్రి కరుణింపవలయు
ననుచు గీర్తించిన నద్దేవి శివుని
మనసు రా గామింప మది విచారించి
సగమీశ్వరుండును సగ మేననుట
సగమీవి దగుగాన జగములో నీవు
యువిదవై యెన్నాళ్లు యుండెదన్నాళ్లు
నవనిపై పురుషుండవై యుండగలవు
మగడవై యుందువు మగవాఁడవగుట
మగువవై యుందువు మగువయగుట
లెలియక యిటు సుఖస్థితి నుండుమనిన
నిలుఁడు భవానికి నిరుగేలు మొగిచె
తరుణినై నెలయును తదనంతరంబ
పురుషరూపంబున బొలుపార నెలయు
వరుస నీవిధమున వర్తింప నాకు
గరుణింపుమని పల్క కరుణించ గిరిజ
వనితయై యిలుఁడును వరరూపుదాల్చి
సునిశితమతి చంద్రుసుతుఁడైన బుధుని
వనితయై వర్చించె వరరూపుదాల్చె
యని చెప్ప సోదరు లాశ్చర్యమంది
భూమీశ నాతియు పురుషుండునగుచు
నేమాడ్కి చరియించె నిలుఁడు లోకములు
నాసోమసుత జన్మ మర్థితో వినఁగ
భాసురంబగు వింత ప్రభవించె మాకు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )