| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యనఘ నీ వాక్యంబు లఖిలసంయములు వినగోరియున్నారు విమలచిత్తములు నిమ్ముగ కథయెల్ల నెల్లుండినుండి సమ్మదంబున మీరు చదివింపవలయు నని పల్కి సభవార లందఱుఁ గొలువ తనయుల గొనుచు నధ్వరశాల కరిగె నంత నంబుజమిత్రుఁ డస్తాద్రి కరిగె జింతాపరంపరఁ జిత్తంబు దూలి యారాత్రి వేగించి యవనివల్లభుఁడు గారవంబున నిత్యకర్మముల్ దీర్చి యందఱఁ బిలుపించి యాసభాసదుల నందంద గూర్చుండుఁడని నియోగించి సుతులఁ జూచిన వారు స్తుతి గూడుకొనుచు చతురలీలల సభాసదులెల్ల మెచ్చ కడముట్ట నుత్తరకాండంబు చదివి రడరంగ నప్పు డయ్యాగంబు నయ్యె నంత విప్రులకెల్ల నధికదక్షిణలు సంతోషమున నిచ్చె సకలదీనులకు భూరిదానము పెట్టి భూపాలకులకు గారవంబున నెల్లకపినాయకులకు సకలరాక్షసులకు సరి కట్టనిచ్చి ముకుళితహస్తుఁడై మునుల వీట్కొలిపి శుభమూర్తియగు సీత శుద్ధాత్మయగుచు సభనున్న చందంబుఁ జనిన చందంబు తనలోన పలుమారుఁ దలపోసికొనుచు దనలోన విరహాగ్ని దనరంగ బొగిలి జానకి శూన్యమై జగమున్న గతికి నూనిన వగల నయోధ్య కేతెంచి పురి నశ్వమేధముల్ బొరిఁ బదివేలు వరుసతో నన్నియు వాజిపేయములు మఱియు నీవిధమున మఖసహస్రములు నెరయంగ గావించి నీతిమార్గమున సంతసంబున మహాజనులఁ బాలింప గొంతగాలమునకు గురుపుణ్యయైన కౌసల్య భర్తృలోకంబున కరిగె నా సాధ్వి దివమున కరిగిన పిదప దినములు పదునేను తెగిన కైకేయి తన నాథుకడ కేగె తదనంతరంబ పరువడి దినములు పదునేను చన్న నరిగె సుమిత్రయు నాత్మేశుకడకు పరగ తల్లుల కెల్లపారలౌకికము లురునిష్ఠఁ బరిపాటి నొనరించె నంత |