| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నట కేకయాధీశుఁడగు యుధాజిత్తు పటుబుద్ధినూహించి పని యెఱింగించి నూత్నభూషణములు నూత్నరత్నములు రత్నకంబళములు రమ్యవస్తువులు పదివేల హయములు పార్థివేంద్రునకు ముదముతో నిమ్మంచు మునిముఖ్యుఁడైన తన పురోహితు గార్గ్యు తగఁ బనుచుటయు చనుదెంచుటయు రామచంద్రుండు నెఱిఁగి యెదురేగి యాగార్గ్యు నెలమిఁ బూజించి పదిలమే కేకయపతికంచు నడిగి కానుకల్ గైకొని గార్గ్యుండుమున్ను తానుసిఱుందునై దశరథాత్మజుఁడు మనమారగా సభామంటపంబునకుఁ జనుదెంచి యుత్తమాసనముఁ బెట్టించి యేమికార్యము రాక యెఱిగింపుఁడనిన భూమీశ మీమామఁ బుత్తెంచె నన్ను కన్నుల కధికమై గంధర్వలోక మున్నది సింధువు యుభయపార్శ్వముల నరుఁదైన గంధర్వులందు ముక్కోటి పొరి నేచి శైలూషపుత్రులున్నారు సమరార్థులగువారి సమయించి భూమి గొమరార నేలు నీకొడుకులలోన నిరువురఁ బుత్తెంచుటిదె కార్యమనిన కరములు మొగిచి యా గార్గ్యుతో ననియె తన కొడుకులునైన దక్షు బుష్కరుని గొని భరతుఁడు మిమ్ము గొలిచి రాగలఁడు శైలూషపుత్రుల సమయించి యందుఁ బొలుపుగా పట్టణంబులు రెండు గట్టి యిరువుర నందుంచి యేతెంచు భరతుఁ డరుదార నని రాముఁ డానతియిచ్చి నలువొంద శుభవేళ నక్కుమారకుల జెలువార పట్టాభిషేకంబు లెలమి జేయించి భరతుని సేనాసమేత మై యిరువురుసుతులతో నని వీఁడుకొలిపి కరమర్థిఁ బూజించి గార్గ్యు వీట్కొలుప భరతుఁడు సేనతోఁ బయనమై వెడలి |