ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శ్రీరాముఁడు భరతలక్ష్మణులతో అంగద చంద్రకేతులకు పట్టంబు గట్ట నియమించుట
శూరులు సౌమిత్రి సుతు లంగదుండు
చారువిక్రముఁడైన చంద్రకేతుండు
కరమొప్పఁ బట్టంబు గట్టెద వీరి
కీరికి దేశంబు లెరిగింపుమనిన
నంగదేశమునొప్పు నయ్యంగదునకు
నంగదీయంబన నమరు పట్టణము
చంద్రకేతువునకు జనలోకనాథ
చంద్రవక్త్రంబన జన పురోత్తమము
నిరువురసుతులకు నినవంశవర్య
పరికింపనన్న నాభరతు మాటలకు
నలరుచు రఘురాముఁ డక్కుమారులకు
చెలువొంద పట్టాభిషేకోత్సవములు
సన్నుతంబుగఁ జేసి సౌమిత్రిఁ జూచి
మన్ననఁ బలికె నమ్మనుజేశుఁడపుడు
పొలుపొంద పశ్చిమభూమి నంగదుని
నిలుపుము లక్ష్మణా నీవేఁగి భరత
తెరువొప్ప నుత్తరదేశంబునందు
నెరి జంద్రకేతుని నిలుపుఁ బొండనిన
భూపాలు నానతిఁ బోయి నందనుల
నాపురంబుల నిల్పి యందేడు నిలిచి
సర్వకార్యంబులు సమకొల్పి వచ్చి
యుర్వీశు లవ్వీరు లొగి గొల్చియుండ
ముదమార జన్మాబ్దములు దాశరథికి
పదునొకండవవేయి పరిపూర్ణమైన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )