ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శ్రీరాముని కడకు యముఁడు మునివేషముతో వచ్చుట
కాలుఁడు మునిమూర్తి గైకొని వచ్చి
చాల గార్యముగల్గి జనుదెంచినాఁడ
సౌమిత్రి యొక మునీశ్వరు దూత నేను
రామచంద్రునకు నా రాక వినుపింపు
మనుఁడు నాలక్ష్మణుం డవనీశు కడకు
జని యొక్క మునిదూత జనుదెంచినాఁడు
వాకిటనున్నాఁడు వసుధీశ యనిన
వే కొనిరమ్మని వేట్కతోఁ బలుక
వచ్చి తోట్కొని వేగ వచ్చిన రాముఁ
డచ్చుగాఁ బూజాదు లతిభక్తిఁ జేసి
యెవ్వరు బుత్తెంచి రెయ్యది గార్య
మెవ్విధం బది నాకు నెఱిగింపుడనిన
నీకార్య మేకాంత మెవ్వరు నిటకు
నేకాంతవేళయం దేతెంచిరేని
పూని చంపెదవేని భూపాల నీకు
నేనెఱింగించెద నీకార్యమనిన
తనలోనఁ దలపోసి ధరణీశుఁడెల్ల
జనుల వీట్కొలుపుచు సౌమిత్రి బిలిఁచి
వాకిట నీవుండి వారింపు జనుల
నేకాంతమని జెప్పి యిందు రానీకు
మని పంచి యేకాంతమై యున్నయంత
మనుజేంద్రు జూచి యమ్మహితాత్ముఁడనియె
చతురాస్యు పంపునఁ జనుదెంచినాఁడ
క్షితిప ఛాయాదేవికిని యేను సుతుఁడ
కాలుండ నే నీవు గరుఁడవాహనుఁడ
వీలోకజాలంబులేలు దేవుఁడవు
యానల్వ నాతోడనన్న వాక్యములు
మానవాధిప నీవు మానుగా వినుము
క్షీరసాగరమున శేషాహిమీఁద
నారంగఁ గనుమోడ్చి యానిద్రఁ దెలిసి
పొలుపైన నీ నాభిఁ బుట్టిన హేమ
నలినంబులో మున్ను నన్ను బుట్టించి
యేను వేఁడిన నాకు నెక్కుఁడై వేచు
దానవాదులనెల్ల దండింపఁదలఁచి
యసురులు దన వీనులం దుద్భవించి
మసఁగి నాపై వచ్చు మధుకైటభులను
తునుమాడి కీకసస్తోమంబు గిరులు
నెనయ మేదఃపంక మిలగాఁగఁ జేసి
నదిమొదలుగ నాకు నఖిలలోకములు
విదితంబుగాఁ జేయ విజ్ఞానమిచ్చి
యసురులు మర్దించి యఖిలలోకముల
నెసగింప నొక్కనాఁ డెల్ల దేవతలు
లోకబాధలు తమలో విచారించి
లోకేశ మము గావు లోకముల్‌ నిలుపు
సాధుల రక్షింపు సజ్జనోత్తముల
బాధింపు దుష్టులఁ బట్టి శిక్షింపు
మొగి వర్ణధర్మంబు లొప్పుగా నిలుప
యుగయుగంబున మీకు నుదయింపఁ బ్రతిన
దేవ యిప్పుడు లంక దేవకంటకుఁడు
రావణుఁ డనియెడు రాక్షసేశ్వరుఁడు
కడుఁ గ్రొవ్వి లోకముల్‌ గాల్చుచున్నాఁడు
వడి వాని వధియింపవలయు మీరనిన
భూమిపై దశరథ భూపాలునకును
రాముఁడవైఁ బుట్టి రణములో నతని
బరిమార్చి జగములఁ బరితాపమార్చి
ధరణిఁ బాలించితి దగవుతో నింక
కాకుత్స్థరాజ్యేచ్ఛ గలదేని నిలువు
లేకున్న సురలఁ బాలింప వేంచేయు
మని పల్క నతనిచే నజుని వాక్యములు
విని యొయ్యనగుచు నవ్విభున కిట్లనియె
నవతారకార్యంబు లన్నియు నయ్యె
..........
చనుదేర మాకును సమయంబు గాగ
ననఘాత్మ వచ్చెద ననఁగ నాలోన
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )