ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
శ్రీరామచంద్రుఁడు వసిష్ఠాదులతో కాలుని వృత్తాంతమును, దూర్వాసుని యాగమనమును జెప్పుట
యనఘు వసిష్ఠుని యఖిలార్థవిదుల
జననాయకుల మంత్రిజనుల రప్పించి
వారితోఁ గాలుఁడు వచ్చిన పనియు
నారయ నతనితో నాడిన ప్రతిన
యప్పుడు దూర్వాసుఁ డరుగుదెంచుటయుఁ
జెప్పిన విని యావసిష్ఠుండుఁ బలికె
ననఘాత్మ సత్యవాక్యము విచారింపు
మనుజుఁడు సౌమిత్రి యని విచారించి
విడువఁ జాలక యున్న విధమెల్లఁ గాన
బడియెడు నీమనఃపరితాప మరయ
నిర్మలమౌ గాలనియతి చింతించి
ధర్మంబు నిక్కంబు దక్కెల్లఁ బోయి
గైకొన్న పలుకవు గావింపకున్న
కాకుత్స్థ ధర్మంబు కడతేరిపోవు
సుచరిత్ర ధర్మంబు శూన్యమైనపుడు
సచరాచరములైన జగములు గ్రుంగు
జగములుఁ బొలియంగ సౌమిత్రి యేల
జగదీశ విడువుము సత్యంబు పూని
తన వాక్యనిష్ఠకై దశరథేశ్వరుఁడు
నినుఁ బుచ్చఁడే మున్ను నిష్ఠురాటవికి
యదిగాన సౌమిత్రి నవనీశ విడిచి
పదిలుండవై కీర్తిఁ బాలింపుమనిన
నావాక్యములు విని యాస్థానమెల్ల
దైవంబు దూరగఁ ధైర్యంబు నూని
నీయట్టి యుత్తము నిర్మలాచారు
నేయెగ్గు వచ్చిన నేఁ జంపఁ జాల
ననఘాత్ములకుఁ బరిత్యాగంబు చావు
నిను నేఁడు విడిచితి నీవేగు మనిన
నడలుచు సౌమిత్రి యన్న పాదములఁ
బడిన సభాసదుల్‌ పార్థివేశ్వరుఁడు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )