ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
లక్ష్మణుని నిర్యాణము
తనుఁ జూచి యెడల నాస్థానంబు వెడల
చని కృతస్నానుఁడై సరయువునందు
వినుతనిశ్చలయోగవిజ్ఞానదృష్టి
తన పూర్వభాగంబు తగిలి గైకొనిన
వరుస దివ్యులు పుష్పవర్షముల్‌ గురియ
సురనాథుఁ డారాజసుతు మేనితోడ
గొని నాకమున కేగె కూడి దేవతలు
మునులును నేతెంచి ముదమారఁ గాంచి
విష్ణు నాలవపాలు వేంచేసె ననఁగ
విష్ణులోకమునకు వేంచేసె నచట
నంత రాముఁడు వసిష్ఠాదులఁ జూచి
వింతయైయున్నది విశ్వంబు నాకు
ధరణి యేటికి నాకుఁ దనువేటి కింక
భరతు నయోధ్యకుఁ బట్టంబు గట్టి
సౌమిత్రి వెనుకను జనియెద ననిన
నామాటలకు యోడి నారాజసుతుఁడు
రాజేంద్ర నరలోకరాజ్యంబె గాదు
రాజిల్లు సురలోకరాజ్య మేనొల్ల
మిముఁ బాసి యేనుండ మీపాదసేవ
సముచితస్థితి నాకు సకలరాజ్యంబు
తిరముగాఁ గోసలదేశంబు గుశుఁడు
గురుకీర్తి నుత్తరకురుభూమి లవుఁడు
సరి నేల పనుపుడు శత్రుఘ్నుఁ బిలువ
నరనాథ బుధుఁడు నావసిష్ఠుండు
రాముఁ గనుగొని రఘుకులాధీశ
నీమాట విని యట్లు నిర్విణ్ణులైన
ధరణీజనుల దీర్పఁదగునన్నఁ జూచి
నరులార యే మేలొనర్తు మీకనుఁడు
నందఱు ముకుళితహస్తులై నిలిచి
యెందును మాకు నేయెగ్గును లేదు
మీరు విచ్చేసిన మిముఁ బాసి యిచట
నేరుతుమే రిత్తనేలపై నిలువ
పడతులతో నిష్టబంధులతోడఁ
గొడుకులతోఁ గూడ గొల్చి వచ్చెదము
కరుణించవలయు నాకాలుని పలుకు
లరసి యల్లన నవ్వి యౌగాక యనుచు
కొడుకుల నీక్షించి కుశునకు నందు
నడగొండలన నొప్పు నాగముల్‌ వేయు
నిరవొంద నరదము లిరువదివేలు
నరుదార దురగంబు లరువదివేలు
గణన కెక్కుడు గాఁగ గలధౌతహేమ
మణిభూషణాదులు మనసార నిచ్చి
లవునకు నట్లకా లలి నొప్ప నిచ్చి
ప్రవిమలమతి రాజ్యపట్టముల్‌ గట్టి
మీదేశములకింక మీరేగుఁ డనిన
నాదాశరథికి వారర్థిమై మ్రొక్కి
చనిరంత రాముఁడు శత్రుఘ్ను కడకు
బనిచె నొక్కని వాఁడు పయనమై వెడలి
మరునాఁడు వేగంబె మధురకు నరిగి
తెఱగొప్ప లక్ష్మణు తెఱఁ గెఱిఁగించి
జననాథు ప్రతినయు జననాథు తోడ
జననున్న యాపురజనుల సంతసము
జెలువారి పట్టాభిషేకముల్‌ జేసి
లలి భూములకుఁ గుశలవులఁ బంచుటయు
నొప్పెల్లఁ జెడి పురమున్న చందంబుఁ
జెప్ప శత్రుఘ్నుండు చిత్తంబు గలఁగి
కడుదైన్యమునఁ గాలగతి విచారించి
తడయక యున్నచో దా నేగుదేర
నింతుల మంత్రులఁ బురోహితుల రావించి
యతివేగమున వారి కావార్తఁ జెప్పి
పరుషవిక్రముఁడు సుబాహుండు మధుర
బరమధర్మంబునఁ బాలింపనిమ్మ
యని పల్కి తన పుత్రుఁడైన సుబాహు
ననురాగమున బట్ట మర్థితోఁ గట్టి
శత్రులు భీతిల్ల జనులఁ బాలింపు
శత్రుఘాతికి వైదిశాపురం బమర
నని పల్కి బలముల నఖిలవస్తువుల
జనుల మంత్రుల నొక్క సరి గాఁగఁ బంచి
పరిపాటితో నిచ్చి పట్టముల్‌ గట్టి
వరుస వీట్కొని యెల్లవారినం దునిచి
రథమెక్కి యెక్కుడు రయముతో వచ్చి
పృథివీశునకు మ్రొక్కి ప్రియమారఁ బలికె
కరమొప్పఁ బట్టముల్‌ గట్టిరి సుతుల
పరిణతనీతిమైఁ బ్రజలఁ బాలింప
యేనిట మిముఁ గొల్చి యేతెంచువాఁడ
నానతి యిండన్న నంగీకరించి
నంత ఋక్షాదులు నఖిలదానవులు
సర్వగంధర్వులు సంయమీశ్వరులు
నురుతేజుఁడగు రాము డూర్ధ్వలోకమున
కరుగుట కనుగొందమని వచ్చినారు
యని రాముఁడెంతయు నర్థి తమ్మునకుఁ
గొనకొని చూపిన కోర్కెతో వారు
వసుధీశ నీవెంట వచ్చెదమనఁగ
నెసగంగ సుగ్రీవుఁ డేతెంచి మ్రొక్కి
యచ్చోట నంగదు నభిషిక్తుఁ జేసి
..........
యనుమతి గైకొన నట విభీషణుండు
సమ్మదంబున మ్రొక్క జననాథుఁ డనియె
ఘనులు చంద్రార్కులు గలయంతఁదాక
ననుపమస్థితి లంక నమరంగ నేలు
నక్తంచరోత్తమ నాయాజ్ఞ గాన
నుక్తు లేమియుఁ జెప్పకుండు నీవనుచు
ననుకంపితాత్ముఁడై యంజనాతనయుఁ
గనుగొని నాకథల్‌ గలుగునందాక
నిత్యుండవై వీర నీవుండుమనుచు
నత్యంతమధురంబులైన వాక్యముల
వారింపుచును జాంబవంతు నీక్షించి
నీరజాసనపుత్ర నీవుండుమనుచు
తోన మైంద ద్వివిదులఁ జూచి యమృత
పానంబుఁ జేసిన బల్లిదుల్‌ మీరు
గారవంబున నుర్విఁ గలుగునందాక
కోరి మా సంతతిఁ గొలిచియుండుఁడు
చనుదెండు తక్కిన జనులెల్ల ననుచు
మనమున మరునాఁడు మనుజేంద్రుఁ డలరి
యనఘు తేజోమూర్తి నమరు వసిష్ఠు
గనుగొని యిటమీఁదఁ గదలంగవలయు
నతిరాత్రవాజపేయాశ్వమేధాది
వితతనామంబుల వెలయు జన్నములు
నియతాగ్నిహోత్రముల్‌ నిజమూర్తు లమర
గయికొని ముందటఁ గదలిపోనిండు
ప్రమదంబుతో మహాప్రస్థానకర్మ
మమరఁగఁ జేయింపుడన్న నమ్మునియు
నామహానుష్ఠాన మమరఁ జేయించి
కనకాంబరంబులు గట్టి యావిభుఁడు
జననుతంబగు బ్రహ్మచర్యవ్రతంబు
మనమారఁ గైకొని మానంబుతోడ
కలితదర్భాంకురకరపద్ముఁడగుచు
నొలసిన వేట్క నయోధ్య వెల్వడఁగ
లలితాబ్జహస్తయౌ లక్ష్మి డాపలను
వలపట హ్రీయను వామలోచనయు
ముందటను ధ్యానమును వెన్క విండ్లు
పొందుగా నమ్ముల పురుషులై కొలువ
సావిత్రియును మునుల్‌ సకలదేవతలు
దౌవారికులు భృత్యదాసవర్గములు
దాసీజనము లంతఃపురాంగనలు
భూసురోత్తములును పురిమంత్రిజనులు
ధరణీసురాకృతుల్‌ ధరియించి రాగ
బరగు నాగమ వరప్రణవమంత్రములు
భరతశత్రుఘ్నులు బంధువుల్‌ ప్రజలు
హరినామకీర్తన మమర గాయకులు
పశుబంధములు నేఁడు బాసె మాకనుచు
పశుపక్షివాహన ప్రముఖజంతువులు
పరువడి తన దృష్టిపథమునఁ బడిన
తరులతాదులుఁ గూడి తనతోడ నడువ
నామడయును మీఁద నట సాము నడచి
కోమలమగు పుణ్యకూలదేశమున
నారయఁ జల్లనై యధ్వరశ్రమంబు
వారింపఁ బశ్చిమవాహినియైన
సరయువుఁ జొచ్చు నాసమయంబునందు
సరసిజాసనుఁ గూడి సకలసంయములు
ఇనసుధాధాములు నెల్లదేవతలు
ననిమిషాంగనలు దో నరుగుదేరంగఁ
గూడ బుష్పకములు కోటానకోటి
వేడుకతో వచ్చి వినువీథి నిలిచి
నరనాథ నీవాదినారాయణుఁడవు
పరికించి నీ మూర్తి భావింపుమనిన
వరుస పై పుష్పవర్షముల్‌ కురియ
సురదుందుభులు మ్రోయ సొరిది విన్వీథి
వసుధీశుఁ డమ్మహావాహిని నడుమ
నసమానగతి నప్పు డనుజులు దాను
వెలుఁగు మేనులుతోడ విష్ణుఁడై పొలిచె
గలిసె సుగ్రీవుండు కమలాప్తునందు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )