| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“దనుజాధినాథుఁడుద్దండకోపమునఁ దను సభలోపలఁదన్నె న246న్మాడ్కి నఖిలంబు నెఱుఁగంగ నాడె నీ యసుర నిఖిలేశ! యా మాట నిజము గానోపు. నుడుగక మనలకై యుచిత మాడుటయుఁ వెడలఁద్రోచిన వాని విడిచి వచ్చుటయు గలుగనోపునుగాని కపటంబు గాదు. వలవదు శంకింప వసుధేశ! యితనిఁ. గపటమానుసు లెట్టి క్రమమున నున్నఁ గపట మింతటిలోనఁగానంగవచ్చు. నితనిమాటలలోన నేమాటయైనఁ గృతకమై తోపదు; కీడనరాదు. మనుజేశ! దనుజులమర్మజ్ఞుఁడితఁడు; మనదెస నుండుట మానైననీతి. నను రావణుఁడు వట్టి నాఁడు బంధించి యెనలేని బాధల నేఁచుట సూచి యితడు నాకై పెక్కుహితవులు వలికె. నితనిచిత్తస్థితి యెఱుఁగుదుఁగొంత.” యనినమాటలు దనయాత్మకు నెక్క వనజాప్తసుతుఁజూచి వసుధేశుఁడనియె: “నర్కజ!247యితఁడు మేలౌట గీడౌట తర్కింప నేటికి? ధర్మంబుత్రోవ[వా.రా. సర్గ 18] శరణనివచ్చిన శత్రువునైనఁ బరికింపఁగా రాచపాఁడి రక్షింప. నొక కపోతము డేగ యుద్ధతిఁదఱుమ వికలభావంబున వేగంబ వచ్చి శిబిమాటు సొచ్చెఁ; జొచ్చిన డేగ యడుగ శిబి తను విచ్చి చెచ్చెర గువ్వఁగాచె. నపకీర్తిఁజెందక యార్తుఁజేకొన్న కృప యశ్వమేధ248సత్కృతిఫలంబిచ్చు. నీ విభీషణుఁడేల? యింక సుగ్రీవ! రావణుఁడైన గర్వము దక్కి వచ్చి శరణన్నఁగాతు నే చందంబు249నందు; మరియాద యిట్టిది మా కులక్రమము అభయ మిచ్చితి వేగ యర్కజ! పోయి సభయుని న వ్విభీషణుఁదోడితెమ్మ.” యనవుడు సుగ్రీవుఁడా రాముకృపకుఁ గను వ్రాల్చియటు శిరఃకంపంబు సేసి “పరికింప నీవలెఁబగవానితమ్ము శరణన్నఁగైకొను సత్కృపారసము నీకుఁగాకెందు నే నృపులకుఁజెల్లుఁ? గాకుత్థ్సతిలక! నిక్కము ధాత్రిలోన” నని పల్కి సుగ్రీవుఁడాకాశమునకుఁ దన సేనతో సముద్ధతగతి నెగసి: “చేకొని యభయంబు శ్రీరాముఁడిచ్చె నీకు విభీషణ! నిక్కంబు నమ్ము; ర.”మ్మని కపిరాజు రాక్షసరాజు నిమ్ములఁగౌఁగిట నెనయంగఁజేర్చి[వా.రా. సర్గ 19] తోడ్కొనివచ్చి సంతోషంబుఁగృపయు వేడ్కయు నెసగ నవ్విభుఁగానుపింప నిండ నానందించి నృపుఁజూచి యతఁడు దండప్రణామంబు దగఁజేసి నిలిచి |