ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
కుంభకర్ణోపదేశమును రావణుఁడు తిరస్కరించుట
మనినమాటలు విని యద్దశాననుఁడు
తనలోన నధికసంతాపాగ్నిఁగుంది
యొక కొంతతడ వూరకుండి నిట్టూర్పు
ప్రకటంబుగాఁబుచ్చి బహుచింత నొంది
వెఱచియు వెరవని విధమున నప్పు
డఱిముఱిఁగోపించి యనుజన్ముఁజూచి:
“సొలవక1132యెపుడు విష్ణుఁడు విష్ణుఁడనుచుఁ
బలికెదు; నీ కింతభయ మేలపుట్టె?
విష్ణుఁడైయున్నను వెఱవ1133ని నేను;
విష్ణుండు మానవవేషుఁడై యున్న
వెఱతునే? నన్నేల వెఱపించె దిట్లు?
వెఱచెదేనియు నీవు వెఱతుగా1134కింక
నా రాఘవుఁడు విష్ణుఁడౌఁగాక! యింద్రుఁ
డా రాఘవుని తమ్ముఁడౌఁగాక! హరుడు
నా రవినందనుండగుఁగాక; యెందుఁ
బోర వారికి విధిపో యేను దలఁప.
నెఱయంగ నీ వెల్ల నీతిశాస్త్రములు
నెఱుఁగుట నిష్ఫలం బిటు విచారింప;
నతి విరోధము గొన్న యా రాముతోడ
నతి హీనమైత్రికి నాస చేసెదవు?
సమరోర్వి మనలను సమయింప, మునుల
నమరుల రక్షింప1135నని విచారించి
యంచితదేవత్వమటు మాని వచ్చి
వంచన నిటు మానవత్వంబు నొంది
జగదేకరక్షకై సరసిజోదరుఁడు
జగతిపై రాముఁడై జనియించినాఁడు.1136
వైరంబు గొని మనవధకొఱకైన
యా రాముతో సంధి యదియేల పొసఁగు?
వాసి దూలఁగఁబోయి వానరాశ్రితుని
నీ సమయంబున నేమని కాంతు?
బలి జన్న1137మునకు నీ పంకజోదరుఁడు
పొలుచువామనమూర్తిఁబొంది తా నరిగి
ధరణి మూఁడడుగులు దానంబు వేఁడి
యరుదారఁగాఁగొని యతని బంధించె.
నొప్పార నుపకార మొనరించునతని
కప్పుడే కావించె నపకార మతఁడు;
పగగొన్నమనలను బరిమార్ప కేల
మగుడు? నెక్కడిసంధి మనకు రామునకు?
నేనును నీవు నా యింద్రలోకంబు
పైనెత్తి చని భుజాబలము లింపార
నిబిడవిక్రములైన నిర్జరేంద్రాది
విబుధులఁదోల నా విష్ణుఁడెం దరిగె?
నిను మేలు1138కొల్పుట నీతి నీ చేత
వినఁగోరియే? నీకు వెఱ పేల పుట్టెఁ?
బ్రాణభయంబునఁబలుమాట లేల?
ప్రాణంబు తీపైన బ్రదుకు నెమ్మదిని.
ఘనమైనయాయువు గరమర్థిఁగంటి;
మునుమిడి గెలిచితి మూఁడులోకములు;
ననుభవించితిఁబెక్కులగు రాజ్యసుఖము
లను1139పమంబగుతేజ మంతంత కెసగ;
నతిహీనవిక్రముఁడైన రామునకు
నితరులగతి నింక నే మ్రొక్కఁజాలఁ.
బోరికిఁజనుమన్నఁ బోనోప1140కీవు
వారక యాడెదు వక్రోక్తు లిట్లు.
నిద్రవోవనె పొమ్ము నెమ్మది నీవు.
నిద్రవోయెడువాని నిర్జింప1141రరులు.
రామలక్ష్మణులను రవితనూభవుని
భీమవిక్రములైన బిరుదువానరుల
నేనె చంపెదఁ; బెల్చ నెల్లదేవతల
నేనె చంపెద; విష్ణు నేనె చంపెదను;
నోలి యవ్విష్ణునియొద్ది శూరులను
నాలంబులోపల నధికదర్పమున
నెద్దెసఁగదిసిన నేనె చంపెదను.
బెద్దకాలము నీవు పిరికివై మనుము.1142”
అని పల్కి వెండియు నద్దశాననుఁడు
కనుఁగొని యా కుంభకర్ణుతో ననియెఁ:
“జెలువారఁగా నిటు సీతయై లక్ష్మి
1143యిలకు జనించుట యే నెఱుంగుదును;
నరయంగ రఘురాముఁ డా విష్ణుఁడగుట
పరికించి యెఱుఁగుదు భావంబులోన;
రాముచే మరణంబు రణములో నాకు
నీ మెయి సిద్ధించు టే నెఱుంగుదును.
నెలమిఁగామంబున నే సీతఁదేను;
బలిమిఁగ్రోధంబునఁబట్టి యేఁదేను;
రణములోపల రఘురాముచే నీల్గి
ప్రణుతింప విష్ణునిపరమపదంబుఁ
దక్కక పొందంగఁదలఁచి యే సీత
నిక్కంబు దెచ్చితి నీ 1144కేమి చెప్ప?”
నని పెక్కు భంగుల నాడు రావణునిఁ
గనుఁగొని యా కుంభకర్ణుఁడిట్లనియె:
“నే నీకుఁగలుగంగ నేల తూలెదవు
దానవనాథ? మోదంబున నుండు;
పగ యడంచెద.”నని పలికి యా స్థాన
మొగి నంతయునుఁజూచి యుచితవాక్యముల;
“నేఁడిందులో లేఁడు నిర్మలాచారుఁ
డేఁడి విభీషణుఁ1145డింద్రారి.”యనిన,
“మనమీఁద రామలక్ష్మణు లెత్తివచ్చి
రను వార్త విని సభ నందఱుఁగూడి
యాలోచనము సేయ నంతలో నీవు
వాలిన నిద్రవో వడి నేఁగుటయును
నిష్ఠతో రఘురామునికిఁ1146బెద్దపూని
నిష్ఠురంబులు నన్ను నెఱి నాట నాడె.
నాడినఁదన్నితి నా విభీషణునిఁ
గూడదు నాకను1147కోపంబు పేర్మిఁ.
దన్ని యంతటఁబోక తాలిమి దక్కి
“యున్నఁజంపుదు.”నని యోటలే కంటి.
ననవుడు ననుఁబాసి యా రాముకడకుఁ
జని యిప్పు డవ్విభీషణుఁడున్నవాఁడు.”
అని చెప్పుటయుఁ“గార్యమది తుదముట్టె;
ననికిఁబోవుటయుక్త.”మని విచారించి

  1. ↑యతఁడు
  2. ↑ను
  3. ↑కేమిఁ-యా
  4. ↑నటు
  5. ↑జగతీతనూభవఁజని తెచ్చినాఁడ - నగపడునే సంధి యతనికి మనకు - వైరంబు…
  6. ↑మణఁప
  7. ↑కాంచుట
  8. ↑దినంబును దేజ
  9. ↑కిపుడు
  10. ↑రొరులు
  11. ↑నెట్టన నీ బుద్ధి నేర్పునఁజేసి - యట్టుండె నామాట లవి సెప్పనేల? యని పల్కి…
  12. ↑యిలను
  13. ↑కేల దాఁప
  14. ↑డెట కేఁగె ననిన
  15. ↑గాను (ఁగఁ)
  16. ↑కనుగోపంబు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )