ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
వానరు లసురవీరులతోఁ దలపడుట
నటు దానవానీక మాకోట వెడలఁ
బటు భయంకరవృత్తిఁబ్లవగ 1329వల్లభులు
భూ నభోంతరము లాస్ఫోటనధ్వనులు
పూని యొక్కట నిండ భూరిసత్త్వములఁ
దలకొని గిరులను దరువులు వైచి
చెలఁగించి రప్పుడు సింహనాదములు.
చలమున దైత్యులు చటులబాణములు
బలువిడిఁగురిసిరి ప్లవగులమీఁద.
నసురావలికిమున్న యా కపివరులు
నసురులఁజంపంగ నడరి పెల్లార్చి.
కపులకు మున్న రాక్షసు లుగ్రవృత్తిఁ
గపులఁజంపుదమని కడఁక వాటించి,
యసమునఁజలము పెంపార నొండొరుల
వసుమతిపైఁబడవైతురు కినుక.
నసురులచేతి శస్త్రాస్త్రంబు లొడిసి
వెసఁబుచ్చి 1330పెళ్లన విఱుతురు కపులుఁ;
గపికోటిచేతివృక్షంబులు గిరులుఁ
గుపితులై విఱుతురు క్రూరదానవులుఁ;
గపులకాళ్ల1331నుబట్టి 1332కడఁగి రాక్షసులు
కపులతోడనె మహోగ్రముగ వ్రేయుదురు;
అసురులకడకాళు లలమి వానరులు
నసురులతోడన యడుతురు 1333బెట్టు.
అటు1334పోరి జర్జరితాంగులై నేలఁ
గుటిలదైత్యులుఁగపికోటులుఁ1335ద్రెళ్లి
దురములోఁబడియు నెత్తురులు గ్రక్కుచును
బొరిఁబొరి మూర్ఛలు పొంది. రంతటను
దెలిసి వానరులును దేవశాత్రవులుఁ
గలసి కయ్యము సేయఁగా నందుఁగపులు
దానవుతో నెత్తి దానవు వ్రేసి
యేనుఁగుతోనెత్తి యేనుఁగు వ్రేసి
తురగంబు తోనెత్తి తురగంబు వ్రేసి
యరదంబుతో నెత్తి యరదంబు వ్రేసి
యరదంబుఁగొని కరి నదరంట వ్రేసి
కరి నెత్తికొని తురంగముఁబడవ్రేసి
తురగంబు నెత్తి దైత్యుని డొల్లనేసి
యురు1336సత్త్వులై పేర్చి యుగ్రత నార్చి
తరుచరవీరులు దర్పంబు మెఱసి
పొరిఁబొరి నిబ్భంగిఁబొరివుచ్చుటయును
రయమునఁగోపంబు రంజిల్ల దైత్య
చయమును వానరసమితిపైఁగవిసి
ప్రదరంబు లేసి చక్రంబులనేసి
గదల నొప్పించి ఖడ్గంబులఁద్రుంచి
భిండిపాలమ్ములఁబీచమ్ము లణఁచి
ఖండించి సురియలఁగండలు బరులుఁ
గుంతశూలమ్ములఁగ్రుచ్చి వానరుల
నింతలింతలు సేసి యెసగ నార్చుటయు
నంతటఁబోవక యగచరులార్చి
యంతంత కడరి దైత్యావళిఁగిట్టి
తరుషండములుఁ బర్వతప్రకరములు
నురువడి నెత్తి యత్యుగ్రత వైవఁ
బడియెడి దైత్యులుఁ బాఱు దైత్యులును
నుడుగక యందందయొరలు దైత్యులును
గలయంగ నెత్తురు గ్రక్కు దైత్యులును
బొలుపఱి నేలపైఁబొరలు దైత్యులును
నందంద యట్టలై యాడు దైత్యులును
మ్రంది ప్రత్యర్థు1337ల1338మఱచు దైత్యులును
నెక్కిన1339దైత్యులు నిటయట పడఁగ
లెక్కసేయక కరాళించు గుఱ్ఱములుఁ
బక్కెర లూడంగఁబఱచు గుఱ్ఱములు
దిక్కులు సుడివడఁదిరుగు గుఱ్ఱములుఁ
గీలెడలిన క్రియఁగెడయు గుఱ్ఱములుఁ
గూలి కాళ్లను దన్నికొనెడు గుఱ్ఱములు
వికలంబులై నోరు విచ్చు గుఱ్ఱములు
నొకరూపు నేర్పడకుండు గుఱ్ఱములుఁ;
గరములు దునిసినఁగంపించు కరులు
వెరవారఁగొమ్ములు విఱిగిన కరులు
మరలి లంకకు వెస మగిడెడుకరులుఁ
దిరమేది దిర్దిరఁదిరిగెడు కరులుఁ
గొండలకైవడిఁగూలెడు కరులుఁ
గండతుండంబులై క్రాలెడు కరులు
మదములు దిగజాఱి మ్రగ్గెడు కరులు
సదమదమయి నేలఁజదిసిన కరులు;
రథికసారథిరథరథ్యయుక్తముగఁ
బ్రథితంబుగాఁభువిఁబడు రథంబులును
దోరగండ్లుగఁబడ్డఁ 1340దునియురథములు
నారంగఁ దల1341క్రిందులగు రథంబులును
గీళ్లెల్లఁ1342దప్పి మ్రగ్గిన రథంబులును
ద్రాళ్లెల్లఁద్రెవ్వఁబొందని రథంబులును
నాలీల నుగ్గునూచగు రథంబులును
నాలంబులోఁదఱచగుటయుఁజూచి
సురఖేచరాదికస్తోమంబు‘చోద్య
తర’మని యాత్మలఁదద్దయు మెచ్చ;
నప్పుడు కినిసి నరాంతకుండార్పు
లొప్ప నిజాశ్వంబు నురువడిఁబఱపి
యసురుల‘నోడకుం’డనుచు వానరుల
నసమునఁగిట్టి బిట్టదలించి తాఁకి
నెలకొని యొక్కొక్క నిమిషంబులోన
నిలఁగూల్చె నేడునూఱేసివానరుల.
సురపతి శౌర్యంబు సొంపారుచుండ
గిరుల ఖండించి యేఁగిన త్రోవవోలెఁ
దరుచరకోటులు దఱచుగాఁబడుట
నిరవొంద వాఁడు వోయినత్రోవ యొప్పె.
నే వానరుండైన నేచి కోపమున
భావంబులోఁదన్నుఁబరిమార్పఁదలఁచు
నంతరంగముఁజొచ్చి 1343నట్టిచందమున
నంతకమున్న తా నతనిఁగీటడఁచు.
నే కపియైనఁద1344న్నెదురంగఁదలఁచి
భీకరుఁడై గిరి పెఱుకంగఁజూచు
నంతలోననె చేరి యధికరౌద్రమున
నంతకమున్న తా నతనిఁగీటడఁచు.
నే బలీముఖుఁడైన నే పగ్గలించి
తా బెట్టుగాఁగఁ బాదప మెత్తఁదలఁచు
నంతంత డగ్గఱి యధికశౌర్యమున
నంతకమున్న తా నతనిఁగీటడఁచు.
నంతటఁబోవక హయముఁబైఁబఱపి
యంతంతఁబెనుగుంపులైన వానరుల
ప్రేవులు1345దొబ్బలుఁబెల్లుగా నుఱుము
గా వివిధములైనగతులఁద్రొక్కించి
గుండెలు వగులంగఁగోలెమ్ములగల
నొండొంటఁదాఁకించి యుర్వరఁగూల్చి
యలుకతోఁబ్రళయకాలా1346నిలుపగిదిఁ
దలకొని యెందునుఁదానయై1347యుండి
వానరవరసైన్యవనములు విఱుగ
మాన కుగ్రతఁబలుమాఱుఁజరించె.
వాని శౌర్యంబును వాని శక్తియును
వానరులెల్ల నోర్వఁగ1348లేక యపుడు
వికలులైయుండిరి విస్మితులగుచు;
సకలదేవతలును జలియించి రపుడు.
పటుభీతిఁబొందినప్లవగసైన్యముల
నటు వేఁచుచున్న నరాంతకుఁజూచి
యనయంబుఁగోపించి యంబుద పటల
మున నుండుసూర్యుండు మొనసినమాడ్కిఁ
గపిరాజతనయుఁడంగదకుమారుండు
కపిసేనలో నుండి కడఁగి యేతెంచి:

  1. ↑సంఘములు
  2. ↑పెల్లుగా
  3. ↑ళ్లొగిఁ
  4. ↑కఱకు
  5. ↑గిట్టి
  6. ↑పోర
  7. ↑ద్రెళ్లు - దురుపలు మాఱు
  8. ↑సత్త్వధీరులై
  9. ↑లై
  10. ↑సురలు, మడీయు
  11. ↑రౌతులు
  12. ↑దొఱఁగురథంబు - లారంగ
  13. ↑కెడవగు
  14. ↑ద్రెవ్వ
  15. ↑యరయు
  16. ↑న్నేపడఁగింప
  17. ↑ద్రొబ్బలు
  18. ↑నలు
  19. ↑నిండి
  20. ↑రాక
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )